తార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Lakshmana Meets with Tara, Sugriva, and Hanuman in the Palace of Kishkinda

తార వానర రాజైన వాలి భార్య. కిష్కింధ కాండలో వాలిసుగ్రీవులతో తార పాత్ర చిత్రించబడినది. వీరి కుమారుడు అంగదుడు.

సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని రెండవసారి యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలుదేరిన వాలిని తార వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి రామలక్ష్మణుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు. అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.

తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు. పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచియే మరణించాడు.

తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడూ, యువరాజుగా అంగదుడూ అభిషిక్తులయ్యారు.

"https://te.wikipedia.org/w/index.php?title=తార&oldid=3878431" నుండి వెలికితీశారు