Jump to content

వాలి

వికీపీడియా నుండి
రామునిచే చంపబడిన వానర రాజు వాలి.
వాలి మరణ సమయంలో రాముని ఉపదేశం - సుమారు 1595 నాటి చిత్రం. LACMA నుండి

రామాయణం కావ్యంలో వాలి (Vali) ఒక వానర రాజు. సుగ్రీవునకు అన్న. మహా బలవంతుడు. కిష్కింధ కాండలో వాలి కథ వస్తుంది.

వాలి సుగ్రీవుల జననం

[మార్చు]

వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు (ఋక్షరజుడు?) అనే గొప్ప వానర రాజుకి పుట్టిన ఔరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలో స్నానం చేస్తాడు, ఆ తటాకంకి ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగం లోను, కంఠభాగం లోను వీర్యాన్ని విడిచి పెడతారు. దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములో బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు. వాల భాగములో వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగం లలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు.

వాలి పరాక్రమం

[మార్చు]

వాలి పరాక్రమాన్ని గురించి సుగ్రీవుడు రామునితో ఇలా చెప్పాడు - వాలి మహా బలవంతుడు. పెద్ద పెద్ద కొండ శిఖరాలను బంతుల్లాగా విసిరేయడం అతనికి ఆటగా ఉండేది. దృఢమైన చెట్లను ఇష్టమొచ్చినట్లు పీకి పారేశేవాడు. ఒకమారు దుందుభి అనే రాక్షసుడు సముద్రుడు, వాయువు వంటి వారితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. వారు అతనితో పోరాడలేమని చెప్పి వాలిదగ్గరకు వెళ్ళమన్నారు. తన రణ కండూతి తీర్చుకోవడానికి పెద్ద దున్నపోతు ఆకారంలో కిష్కింధకు వచ్చి పెడబొబ్బలు పెట్ట సాగాడు. అనవసరంగా ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని ఆ రాక్షసునికి వాలి నచ్చచెప్పబోయాడు గాని వాడు వినిపించుకోలేదు. దాంతో వాలి కోపించి ఆ రాక్షసుడి కొమ్మలు పట్టి మెలిద్రిప్పి విసిరేశాడు. రక్తం కారుతూ ఆ రాక్షసుడు మరణించాడు. అయితే ఆ రక్తం ఋష్యమూక పర్వతంపై తపస్సు చేసుకొనే మతంగముని ఆశ్రమంలో చెల్లా చెదురుగా పడింది. దానితో కోపించిన ముని వాలిని శపించాడు - ఆ పర్వతం మీదకు వస్తే తల పగిలి చస్తాడని. అందువలన వాలి ఆ పర్వతం పరిసరాలకు వెళ్ళడు.

తనను మించిన వీరుడు లేడని విర్రవీగే రావణుడు కూడా వాలితో యుద్ధానికి తలపడి, వాలి చేతిలో ఓడిపోయి అతనికి మిత్రునిగా సంధి చేసుకొన్నాడు. ఇంద్రుడిచ్చిన కాంచనమాల వర ప్రభావం వలన వాలికి ఎదురుగా పోరాడే వారి బలంలోంచి సగం వాలికి సంక్రమిస్తుంది.

వాలి, సుగ్రీవుల మధ్య వైరం

[మార్చు]

సుగ్రీవుడు అన్నకు విధేయుడైన సేవకుడు. ఒకమారు మాయావి అనే రాక్షసుడు (దుందుభి కొడుకు) వాలిపై యుద్ధానికి వచ్చాడు. వాలి, మాయావి యుద్ధం చేస్తూ ఒక కొండ గుహలోకి వెళ్ళారు. సుగ్రీవుడిని బయటే కాపలా ఉండమని వాలి చెప్పాడు. నెల కాలం గడచినా వారు బయటకు రాలేదు. పెడ బొబ్బలు ఆగిపోయాయి. వాలి మరణించి ఉంటాడని సుగ్రీవుడు భయపడ్డాడు. రాక్షసుడు బయటకు రాకుండా గుహకు పెద్ద బండరాయి అడ్డంగా పెట్టి, దుఃఖిస్తూ కిష్కింధకు తిరిగి వచ్చాడు. మంత్రుల కోరికపై రాజ్యానికి రాజుగా అభిషిక్తుడయ్యాడు.

అయితే కొంత కాలానికి వాలి తిరిగి వచ్చాడు. దుర్బుద్ధితో సుగ్రీవుడు కొండ బిలాన్ని మూసివేశాడని దూషించి అతన్ని రాజ్యంలోంచి తరిమేశాడు. తన అనుచరులైన హనుమంతుడు, మరి కొద్ది మంది పరివారంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తల దాచుకొన్నాడు.

శ్రీరాముడు, సుగ్రీవుల మైత్రి

[మార్చు]
శ్రీరాముడు, సుగ్రీవుల మైత్రి

సీతాన్వేషణలో శ్రీరాముడు, లక్ష్మణుడు ఋష్యశృంగ పర్వత ప్రాంతానికి వచ్చారు. మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయం చెందాడు. వారిని గురించి తెలిసికోమని హనుమంతుని పంపాడు.

హనుమంతుడు తన మృదువైన మాటలతో వారిని గురించి తెలిసికొన్నాడు. లక్ష్మణుడు తమ రాకకు కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్ధులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు. హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిన బూనాడు.

రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకూ తన అన్నకూ వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.

సుగ్రీవుడు, వాలి పోరాటం

[మార్చు]

రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీకొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు.

అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి అయోధ్యా రాకుమారుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.

వాలి, సుగ్రీవుల యుద్ధం. చెట్టు చాటు నుండి వాలిని సంహరించుటకు సిద్ధంగా ఉన్న రాముడు

అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.

శ్రీరాముని వాలి దూషించుట

[మార్చు]
వాలి మరణం

కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ కనుపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--

రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చేసిన ఈ నీచమైన పని వలన నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, వీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా న్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. నీవు క్షుద్రుడవు, మహాపాపివి.

నా చర్మం, గోళ్ళు, రోమాలు, రక్తమాంసాలు నీకు నిరుపయోగం కనుక నన్ను మృగయావినోదం కోసం చంపావనే సాకు కూడా నీకు చెల్లదు. నీ కపటత్వం గ్రహించే నా ఇల్లాలు తార నన్ను ఎన్నో విధాలుగా వారించింది. కాని పోగాలం దాపురించిన నేను ఆమె హితవాక్యాలను పెడచెవినబెట్టాను.

నా యెదుటపడి యుద్ధం చేసే లావు నీకు లేదు. మద్యపాన మత్తుడై నిద్రపోయేవాడిని పాము కాటు వేసినట్లుగా చెట్టుమాటునుండి నాపై బాణం వేశావు. ఇందుకు నీకు సిగ్గు కలగడంలేదా! నా సహాయమే కోరి వుంటే క్షణాలమీద రావణుడిని నీ కాళ్ళవద్ద పడవేసి నీ భార్యను నీకు అప్పగించేవాడిని.

నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? నా గొంతు ఎండుకు పోతోంది. ఈ బాణం నా ప్రాణాలు హరిస్తున్నది. నిస్సత్తువలో ఎక్కువ మాట్లాడలేను. కాని నీ సమాధానాన్ని వినగలను. – అని వాలి అన్నాడు.

రాముని సమాధానం

[మార్చు]
వాలిని సంహరించి, అతనికి మోక్షాన్ని ప్రసాదించిన శ్రీరాముడు.

వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.

నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స అనవుసరం. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.

ఇక చెట్టుమాటునుండి చంపడం గురించి. నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు. ఇక నీవు శిక్షార్హుడవు గనుక నీతో నేను నా కార్యాలు సాధించుకో దగదు. అన్యుల సహాయం పైని ఆధారపడేవాడిని కానని నా చరిత్రే చెబుతుంది. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాననుకోవడం అవివేకం.

నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కాని నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే మిత్ర ద్రోహివవుతావు. రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలిసికొని చిత్త క్షోభను వర్జించి శాంతిని పొందు.

వాలి చివరి కోరికలు

[మార్చు]

వాలి ఇలా అన్నాడు– రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు.

తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.

పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచియే మరణించాడు.

అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు కిష్కింధకు వెళ్ళలేదు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వాలి&oldid=4311951" నుండి వెలికితీశారు