Jump to content

నార్ల వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
(నార్ల వెంకటేశ్వర రావు నుండి దారిమార్పు చెందింది)
నార్ల వెంకటేశ్వరరావు
జననం(1908-12-01)1908 డిసెంబరు 1
మరణం1985 ఫిబ్రవరి 16(1985-02-16) (వయసు 76)
మరణ కారణంగుండెపోటు
ఇతర పేర్లువీ.ఆర్. నార్ల
వృత్తిపాత్రికేయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆంధ్ర జ్యోతి సంపాదకుడు
పదవీ కాలంరాజ్య సభ సభ్యులు 1958 - 1970
జీవిత భాగస్వామిసులోచనా దేవి
పిల్లలుఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు
తల్లిదండ్రులు
  • లక్ష్మణ రావు. (తండ్రి)
  • మహాలక్ష్మి. (తల్లి)

నార్ల వెంకటేశ్వరరావు (డిసెంబర్ 1, 1908 - ఫిబ్రవరి 16, 1985) తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు, హేతువాది, రచయిత. వీ.ఆర్.నార్లగా కూడా వీరు ప్రసిద్ధులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు, కొన్ని కథలు రాసారు. రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు.

జననం, విద్య

[మార్చు]

నార్ల వెంకటేశ్వరరావు మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో డిసెంబర్ 1, 1908 న నార్ల మహాలక్ష్మమ్మ, లక్ష్మణరావు దంపతులకు జన్మించాడు. వీరి పుర్వీకులు ఆంధ్రా కృష్ణా జిల్లా కౌతవరం నుండి అక్కడికి వ్యాపార రీత్య వెళ్ళారు. కాని నార్ల విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగింది.

కుటుంబం

[మార్చు]

వీరికి సులోచనా దేవి తో1938 లో వివాహం జరిగింది. వీరికి శారద, చంద్రకళ, మీనాక్షీ, ఉమాదేవి, రమాదేవి అనే ఐదుగురు కుమార్తెలు, మోహన్ దాస్, దుర్గా దాస్, లక్ష్మణ దాస్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతా రావు వీరి సోదరుడే. వీరి పెద్ద కుమార్తె కొల్లి శారద గారు గుంటూరు నగర పాలక సంస్థకు మేయరుగా పనిచేసారు.

పత్రికా రంగ ప్రవేశం

[మార్చు]

1928లో మద్దూరి అన్నపూర్ణయ్య ప్రచురించే “కాంగ్రెస్ ” అనే పత్రికకు రాసిన  ఉత్తరమే, ఆయన తొలి పత్రికా రచన. ఉపేంద్ర, రవీంద్ర అనే పేర్లతోనూ అనేక వ్యాసాలు రాశారు. 'స్వరాజ్య', 'జనవాణి', 'ప్రజామిత్ర' పత్రికల్లో మెరుపులు మెరిపించారు. 1938లో ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్ గా చేరి 1942 ఎడిటర్ గా భాద్యతలు చేపట్టి 1959 వరకు పనిచేసారు.

ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల సంపాదక బాధ్యతలను చేపట్టి వాటిని తీర్చిదిద్దారు. సంపాదకుడిగా పనిచేసిన ముప్ఫై మూడేళ్ల కాలంలో ఛాందస విశ్వాసాలతో రాజీలేని పోరు సాగించి, నిజంపట్ల నిబద్ధత, జనశ్రేయంపట్ల నిజాయతీ, వృత్తిపథంలో తిరుగులేని నిర్భీకతలను పాత్రికేయుడి ప్రధాన లక్షణాలుగా నార్ల విశ్వసించారు.ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు.

సంపాదికీయాలు

[మార్చు]

సంపాదకీయాలను పత్రికకు ప్రాణదీపాలుగా మార్చడంతోపాటు, సామాజిక సంస్కరణకు వాహికలుగా వాటిని నార్లవారు ఉపయోగించారు. సంపాదకీయాలకు కావ్యగౌరవం కల్పించిన ఘనత వీరిదే.

మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు ఆయన రాసిన సంపాదకీయం ఆంధ్రదేశాన్ని పట్టి కుదిపింది. వేటూరి ప్రభాకరశాస్త్రి స్థాయి వ్యక్తి వారికి సాష్టాంగ నమస్కారం' అన్నారు. ప్రజలకు అర్థమయ్యే జీవభాషలో సంపాదకీయాలను రాశారు. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభను నిషేధించినా రజాకార్ల దురాగతాలపై ఎత్తిన కత్తి దించకుండా కలం చేసిన యోధుడాయన.[2]

జైల్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు తమకు ఇస్తున్న ఆంధ్రప్రభ దినపత్రిక నానా కత్తిరింపులతో సెన్సారు చెయ్యబడి వస్తున్నదేమిటీ అని నార్ల గారికి ఉత్తరం రాశారు. తన సంపాదకత్వంలో వస్తున్న పత్రికని ప్రభుత్వం కత్తిరింపులతో రాజకీయఖైదీలకు అందిస్తున్నందుకు నిరసనగా ఒక రోజు పత్రిక మొదటి పేజీ నిండా నల్లగా తారుపూసి విడుదలచేసారు. అది పత్రికా ప్రపంచంలో చాలా ఘాటైన నిరసన. దానితో, ప్రభుత్వం సెన్సారు చెయ్యడం మానుకున్నది.

త్రిపురనేని గోపీచంద్ మానవ వాదం నుండి దూరమై, వారితో అభిప్రాయ భేదాలు ఉన్నా గోపీచంద్ చనిపోయినప్పుడు “ఎంత గుండె గలవాడికీ గుండె పోటు” అంటూ గొప్ప సంపాదకీయం రాశారు.

నార్ల ఏ రాజకీయ వాదినీ విమర్శించకుండా వదలలేదు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కళా వెంకటరావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఆయన విమర్శకు గురైన వారే. రాజగోపాలాచారిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్ముడు నిర్ణయించినప్పుడు దానికి నిరసనగా నార్ల పరంపరగా సంపాదక శస్త్రాలను ప్రయోగించారు. `నచ్చని నాయకుడిని ఎన్నుకోవాలని  చెప్పే హక్కు గాంధీజీకి  సహా ఎవరికీ లేదు`అని తెగేసి చెప్పారు. ఇందిరాగాంధి నిరంకుశ పాలనను, కుటుంబ వారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు. పౌరహక్కులు, మానవ విలువలు కావాలనేవారు. ఆ విషయంలో జయప్రకాశ్ నారాయణను మెచ్చుకునేవారు.

నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసి పత్రికా రచయిత ఆయన.

ఆంధ్ర జ్యోతి

[మార్చు]
ఆంధ్రజ్యోతి మొదటిపేజీ 1961, ఆగస్టు, 1

ఒకానొక సంపాదకుడి కోసం పత్రికను నెలకొల్పిన ఒకే ఒక సందర్భం ఆంధ్రజ్యోతి ఆవిర్భావం. ఆంధ్రప్రభ నుంచి వైదొలిగి ఖాళీగా ఉన్న నార్ల కోసం కె.యల్.ఎన్. ప్రసాద్ ఆధ్వర్యంలో కొందరు ముఖ్యులు పూనుకొని ఆంధ్రజ్యోతి పేరుతో ఒక దినపత్రికను స్థాపించారు. ఈ పత్రికను 1960 జూలై 1న విజయవాడలో ప్రారంభించారు.

”పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో… ” అని చెప్పిన పత్రికా సైన్యాధ్యక్షుడు నార్ల వెంకటేశ్వరరావు. పత్రికను పైకి తేవడానికి నార్ల అనేక కొత్త ఒరవడులు ప్రవేశపెట్టారు. సంపాదకీయాలు టెలిప్రింటర్ ద్వారా పంపేవారు.

'కాగడా', 'జనవాణి'తో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల ఆంధ్ర ప్రభ, ఆంధ్రజ్యోతి ద్వారా సమర్థంగా కొనసాగించారు. తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగు వారిలో మనం కదలిక పుట్టించగలం' అని ఆయన తోటి జర్నలిస్టులకు ఉద్బోధించారు.

సంపాదకుడు అనే మాటను నార్ల ఉపయోగించేవారు కాదు. ఎడిటర్ అనే రాసుకునే వారు, పిలిపించుకునేవారు. ఎడిటర్ అనే ఇంగ్లీషు మాటకు సంపాదకుడు అనే తెలుగు అనువాదాన్ని ఆయన ఆమోదించలేదు. సంపాదకుడు అంటే ఏమిటో, సంపాదకుడి స్థానం ఏమిటో యాజమాన్యాలకూ, సమాజానికీ తెలియజెప్పడానికి ఆయన శత విధాలుగా ప్రయత్నించారు.

ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా' అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధుడు నార్ల. ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయతీగా, నిర్భీతిగా ఉండాలని కోరే మేటి పాత్రికేయుడు నార్ల. "నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా" అని కుండ బద్దలుగొట్టినట్లు చెప్పడం నార్లవారికే చెల్లింది. నండూరి రామమోహనరావును గుమస్తా సంపాదకుడు అని పిలిచేవాడు. “ఏ ఎండకు ఆ గొడుగు పట్ట నేర్చినవాడు ఏమైనా కావచ్చునేమో కానీ, నిజమైన ఎడిటర్ కానేకాడు.” అని నిష్కర్షగా చెప్పేవారు.

గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పినవాడు' నార్ల.

'విరామమెరుగని రాక్షసుడు నార్ల' అని ప్రఖ్యాత సంపాదకుడు ఖాసా సుబ్బారావు అభివర్ణించారు.

రచయిత

[మార్చు]

నార్లవారు కేవలం జర్నలిస్ట్ కాదు. సాహిత్యవేత్త, కవి, రచయిత, ఉద్యమకారుడు. తెలుగు, ఇంగ్లిష్ భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది. ఇంగ్లిష్ లో వి ఆర్ నార్లగా ప్రసిద్ధులు. కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు నార్ల స్ఫూర్తి ప్రదాత. బెర్నార్డ్ షా, గురజాడ, కందుకూరి, వేమన, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి నార్లకు ఇష్టమైన రచయితలు.

సంస్కృత భాషను విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప మన సంస్కృతి విస్తరించదన్న వాదనను ఆయన తుదికంటా వ్యతిరేకించారు. సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధ విశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ సీతజోస్యం రాశారు. రామాయణాన్ని, రామ రావణ యుద్ధాన్ని ఆయన ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య సంఘర్షణగా వ్యాఖ్యానించారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్య భావజాలానికి సవాలు విసురుతూ శంబూక వధ రాశారు.

బాలలకూ సాహిత్యాన్ని పరిచయం చేయాలని అనుకొనేవారు. అందుకే వారి కోసం నీతి పద్యాలు రాశారు. ‘వాస్తవమ్ము నార్ల మాట’ మకుటంతో రాసి, దానిని తర్వాత ‘నవయుగాల బాట నార్ల మాట’గా మార్చి ఆ మకుటంతో 700కుపైగా సందేశాత్మక పద్యాలు ఆటవెలిది లో రాశారు. 16 ఏకాంకికల సంపుటి వెలువరించారు. కవితా ఖండికలు, పద్య సంకలనాలు, సాంఘిక, పౌరాణిక నాటకాలు, వ్యాసాలు ఎన్నో రాశారు. ఏవి రాసినా అందులో సామాజిక ప్రయోజనం ఉండేది.

కేవలం తెలుగులోనే కాకుండా ఆంగ్లంలో కూడా పలు రచనలు చేశారు నార్ల. ఇంగ్లీషులో భగవద్గీతపై విమర్శనాత్మక రచన చేయగా అది పలు విదేశీ జర్నల్స్‌లో కూడా ప్రచురితమైనది. కలకత్తాలోని సుశీల్‌ముఖర్జీ అనే సంపాదకుడు నార్ల వారి ఆంగ్ల రచనలు కొన్ని వెలువరించారు.

నార్ల వెంకటేశ్వర రావు వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా, మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు.[3]

నార్లవారు ఎన్నో కొత్త మాటలు, పదబంధాలు సృష్టించారు. మాండలీకాలకు పెద్దపీట వేశారు. ఇంగ్లీష్ పదాలకు సమానార్ధకాలు నిర్దేశించే క్రమంలో, తిరోగమనం, ఐక్య రాజ్య సమితి, దిగ్బంధనం మొదలైనవాటిని ఎన్నింటినో ఉదాహరణగా చెప్పవచ్చు. భాషాపరమైన అంశాల్లో ప్రయోగాలు ఆయన సొత్తు. వారు ఒక కదిలే విజ్ఞాన భాండాగారం.

హేతువాది

[మార్చు]

1954లో ఎం.ఎన్. రాయ్ చనిపోయినప్పుడు దేశంలో అన్ని పత్రికల సంపాదకీయాలు రాసినా, నార్ల ఆ పని చేయలేదు. ఎవడో అనామకుడు చనిపోతే “తారరాలింది, వటవృక్షం కూలింది” అని రాసే నార్లకు ఎం.ఎన్. రాయ్ ఎవరో తెలియదా అని ఆవుల గోపాలకృష్ణ మూర్తి గుంటూరు ఏకాదండయ్య హాలులో సభా ముఖంగా విమర్శించగా వెంటనే గుత్తికొండ నరహరి ద్వారా ఎం.ఎన్. రాయ్ రచనలు తెప్పించుకొని చదివారు. నార్ల అప్పటి నుండి రాయ్ అభిమానిగా, క్రమేణా హేతువాది గా, మానవవాది గా జీవించారు. నవయుగాల బాట నార్ల మాట లో వారి హేతువాద భావజాలం మనకు కనపడుతుంది.

ఏల ఏప్పు డెవ్వడిత్యాది ప్రశ్నలే

పశువు నుంచి వెరుపరిచె నరుని

ప్రశ్నతోనే నరుడు పరిణామమొందెరా

నవయుగాల బాట - నార్ల మాట!

ప్రకృతినే జయించి, పరమాణువును చీల్చి

శాస్త్రవేత్త కూర్చే సకల సిరులు,

రాజకీయ వేత్త రణమును కూర్చెరా!

నవయుగాల బాట - నార్ల మాట !

విశ్వనాథ సత్యనారాయణ, వడ్లమూడి గోపాలకృష్ణయ్య వంటి వారి ఆస్తిక, ఛాందస భావజాలాన్ని, మూఢ విశ్వాసాలను నార్ల తీవ్రంగా విమర్శించేవారు.

కళాభిమానం

[మార్చు]

నార్ల కళాభిమాని, బౌద్ధ కళల పట్ల ప్రత్యేక అభిరుచి, విదేశాలలో సేకరించిన బౌద్ధ మినీ విగ్రహాలు, కళాఖండాలు అట్టి పెట్టేవారు. శివుడు, కృష్ణుడి పరంగా వచ్చిన కళాఖండాల్ని కూడా సేకరించారు. మ్యూజియంలో, శిల్ప సౌందర్యాలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వాటి విశేషాలు చెప్పేవారు. బౌద్ధానికి చెందిన కళాఖండాలు, మినీ విగ్రహాలు నార్ల సేకరించి ఇంట్లో పెట్టుకున్నారు. బిర్లా సంస్థ అడిగినా వారికి యివ్వలేదు.

వీరు పుస్తక ప్రియులు. తనకు కావలిసిన పుస్తకాల కొరకు తరచు ఆదివారాలు పేవ్ మెంట్స్ పై పాత పుస్తకాలు కొరకు వెతికేవారు. నార్ల వారు సేకరించిన 20,000 పైగా పుస్తకాలు తో ఒక పెద్ద సొంత గ్రంథాలయం ఉంది. వారి మరణాంతరం ఈ పుస్తకాలను హైదరాబాదు లోని అంబెద్కర్ ఒపెన్ యూనివర్శటీకి ఇచారు.

బౌద్ధమతాన్ని నమ్మి ఆచరించి; స్వచ్ఛమైన హేతువాదిగా జీవించారు.

హాస్య ప్రియులు

[మార్చు]

నార్ల వేంకటేశ్వరరావు గంభీర స్వభావులన్న సంగతి చాలామందికి తెలుసు. కానీ సంభాషణా చతురులనీ, హాస్య కుశలురనీ తెలిసినవాళ్లు కొద్దిమందే. నార్ల వారి ఉత్తరాల్లో ఆయన హాస్య చమత్కారాలు మబ్బుల చాటున మెరుపుతీగల్లాగా మెరిసిపోతుంటాయి.

నార్ల ఎప్పుడూ ఏదొక రుగ్మతతో బాధపడుతుండేవారు. మధురాపుట్ అని కాలికి జబ్బు. గుండెపోటు రెండు సార్లు వచ్చింది. విపరీతంగా సిగరెట్లు తాగే అలవాటును వదిలేసారు. కొన్నాళ్ళు చెవుల్లో రొదతో సతమతమయ్యారు. వీటిని గురించి ఇతరులు అడిగినప్పుడు ‘‘నాకు ఐదుమంది కొడుకులు. ఐదుగురూ డాక్టర్లే. ఐదుమంది కోడళ్లు కూడాడాక్టర్లే. వీళ్లంతా విదేశాల్లో స్థిరపడ్డారు. నా ముగ్గురు కుమార్తెలూ, అల్లుళ్లూ డాక్టర్లే. ఒక్క కూతురూ, అల్లుడు మాత్రమే ఇక్కడ వున్నారు. మరి నాకేమో రెండు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. మా కుటుంబంలో నా భార్య తప్ప మిగతావారంతా డాక్టర్లే. ఆమెకు కూడా ఏ విశ్వవిద్యాలయమైనా గౌరవ డాక్టరేట్‌ ఇస్తే బావుంటుంది. అప్పుడు మా ఇంట్లో అందరూ డాక్టర్లే అవుతారు. కాని ఇంతమంది డాక్టర్లున్నా నేనెప్పుడూ పేషెంటునే. తల నుంచి కాలు దాకా నేనో రోగాల పుట్ట.’’ నార్ల వారి అరుదైన చమత్కార మాటలివి.

నార్ల వారి మాటలు

[మార్చు]
  • యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు.
  • ఎంత గొప్పవాడైనా వస్తాడేకాని విచ్చేయడు.
  • సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి.
  • బడు వాడేవాడు బడుద్ధాయి.
  • నార్ల మాట నవయుగాల బాట
  • ఆశలేని ప్రాణి అణగారిపోతుంది. ఆశ చంపుకోవడం ఆత్మహత్య.
  • ఉక్కు మనిషి ఎవడో, ఊకమూట  ఎవడో కష్ట కాలమందే స్పష్టపడును. ఉత్త వేళలందు ఉత్తములందురు.
  • అవిటివానికేల అభినయశాస్త్రం? చెవిటి వానికేల  కవులగోష్టి?
  • ప్రశ్న ప్రగతికి మూలం. ప్రశ్నలేని  జగత్తు ప్రశ్నార్ధకం.
  • అస్పృశ్యులని  మనం అందరిని దూరం నెడితే మనల్ని వెనక్కి నెట్టి ప్రపంచం ముందుకు పోతుంది.

రచనలు

[మార్చు]

నార్ల వారి రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి.

నార్ల వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల కుటుంబ సభ్యులు ఆయన రచనలు అన్నీ కూర్చి "నార్ల రచనలు" పేరిట 12 భాగాలుగా వెలువరించారు.

  • నార్ల రచనలు 1 - దేశ చరిత్రలు
  • నార్ల రచనలు 2 - సాంఘిక నాటికలు, వ్యాసాలు
  • నార్ల రచనలు 3 - పౌరాణిక నాటికలు
  • నార్ల రచనలు 4 - సాహిత్య రచనలు
  • నార్ల రచనలు 5 - సంస్కృతి, సాహిత్యం, మతం
  • నార్ల రచనలు 6 - వర్తమాన సంఘటనలు
  • నార్ల రచనలు 7 - జీవిత చిత్రణలు

ఆంగ్ల రచనలు

[మార్చు]
  1. The truth about the Geetha 1988
  2. An essay on the upanishads 1989
  3. Gods and goblins
  4. East and west
  5. Intellectual poverty in India
  6. Indian culture, its caste complexion
  7. Man and his world
  8. Veeresalingam (critical study)
  9. Works of Narla 8 - Writings on Religio
  10. Works of Narla 9 - The last word on ramayana - Jabali part - 2 Seetha's Destiny
  11. Works of Narla 10 - Writings on Culture
  12. Works of Narla 11 - Writings on Literature
  13. Works of Narla 12 - Miscellaneous Writings

రాజ్యసభ సభ్యులు

[మార్చు]

వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు. పాత్రికేయుడిగా అనేక అంశాలపై సంపాదకీయాలు వెలువరించినట్లే, అనేక అంశాలు, సమస్యలపై సభలో చర్చించేవారు.

పురస్కారాలు

[మార్చు]

1981లో ఆయన సీతజోస్యం నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

1983 లో ఎన్.టి. రామారావు నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా నియమించారు.

కళాప్రపూర్ణ’ ‘పండిత’ కొత్త సత్యనారాయణ చౌదరి గారు తన రచన ‘రామాయణ రహస్యాలు’ నార్ల వారికి అంకితం ఇచ్చారు.

మరణం

[మార్చు]

పత్రికారంగంలోనూ, తెలుగు సాహిత్యంలోనూ గొప్ప శకాన్ని ఆవిష్కరించిన దిగ్గజం నార్ల వెంకటేశ్వర రావు గారు 1985 పిబ్రవరి 14న గుండెపోటు తో హైదరాబాదులో కన్నుమూసారు.

బయటి లింకులు

[మార్చు]

ఇవీ చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. India Who's Who. (1969) INFA Publications పేజీ.129
  2. ఈనాడు దినపత్రిక, తేది డిసెంబర్ 1, 2008, పేజీ 4లో ఇందిరాగోపాల్ రాసిన వ్యాసం
  3. నాగసూరి, వేణుగోపాల్. నార్లబాట, నవతరానికి నార్ల పుస్తకాలు. జనవిజ్ఞానవేదిక ప్రచురణ.