ఎం.ఎన్.రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
M. N. Roy
মানবেন্দ্রনাথ রায়
మానవేంద్రనాథ రాయ్
మానవేంద్రనాథ రాయ్
జననంనరేంద్రనాథ్ భట్టాచార్య
(1887-03-21)1887 మార్చి 21
చాంగ్రిపొట, 24 ప్రాంగణాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1954 జనవరి 26(1954-01-26) (వయసు 66)
జాతీయతభారతీయుడు
విశ్వవిద్యాలయాలుబెంగాల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ (జాదవ్పూర్ విశ్వవిద్యాలయం), కమ్యూనిస్ట్ యునివర్సిటీ ఆఫ్ ది టాయిలర్స్ ఆఫ్ ది ఈస్ట్
సంస్థJugantar, Communist Party of India, Communist Party of Mexico,
రాజకీయ ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమము, భారత్-జెర్మన్ కుట్ర, కమ్యూనిజం

ఎం. ఎన్. రాయ్ గా ప్రసిద్ధిచెందిన మానవేంద్ర నాథ రాయ్ (మార్చి 21, 1887జనవరి 25, 1954) హేతువాది, మానవవాది. రాజకీయ సిద్ధాంతకర్త, రచయిత,, 20వ శతాబ్దపు ప్రముఖ తత్వవేత్తలలో ప్రముఖులు. రష్యా తరువాత ప్రపంచంలో మొదటగా మెక్సికోలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించిన వ్యక్తి రాయ్. మొట్టమొదటి కమ్యూనిస్ ఇంటర్నేషనల్కి మెక్సికో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. రష్యాలో లెనిన్ మరణానంతరం స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాయ్ కార్యశీలక కమ్యూనిస్టు రాజకీయాలనుండి తపుకుని భారతదేశం వచ్చి రాడికల్ డెమొక్రాటిక్ పార్టీని స్థాపించారు. వారు తీసుకు వచ్చిన మానవవాద ఉద్యమం పలువురు మేధావులను ఆకర్షించింది. మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[1] భారతదేశంలో మార్క్సిస్టు ఉద్యమ పితామహుడు. కాంగ్రెస్ పార్టీ కోరుతున్న స్వాతంత్ర్యానికి దీటుగా, రాజ్యాంగం రావాలని, సంఘం మారాలని, పునర్వికాసం వైజ్ఞానిక ధోరణి ప్రబలాలని ఎం.ఎన్. రాయ్ చెప్పాడు. బ్రిటిష్ వారు ఎలాగు దేశం వదలి పోతారు, రెండో ప్రపంచ యుద్ధానంతరం అది జరిగి తీరుతుందని ఎం.ఎన్. రాయ్ కచ్చితంగా చెప్పాడు. ఆలోగా ఫాసిస్టులు, నాజీ నియంతలు, మన దేశంలో బలపడకుండా జపాన్ తిష్ఠవేయకుండా చూడాలన్నారు. తాత్కాలికంగా బ్రిటిష్ వారికి యీ రంగంలో చేయూత నివ్వాలన్నారు[2].రాయ్ బహుభాషా ప్రావీణ్యం కలవారు. 17 భాషలు వారికి తెలుసు. ఆంగ్లము, జర్మన్, ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ మొదలగు భాషలలో వ్రాయడం, మాట్లాడడం, చదవడం వారికి వచ్చు.

రాజకీయ రంగం

[మార్చు]

భారతదేశంలో 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో జరిగిన సాయుధ విప్లవాల్లోనే కాక ఎం.ఎన్.రాయ్ మెక్సికో, చైనాల్లో జరిగిన విప్లవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ వేత్తలైన లెనిన్, ట్రాట్‌స్కే, స్టాలిన్ తదితరులతో కలసి పనిచేశారు. 1920 నాటి నుంచీ జాతీయోద్యమంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా రాయ్ తాత్త్వికత వేరుగానే ఉండేది. ఆయనకు గాంధీజీ ప్రజా సమీకరణ, పోరాటం పట్ల ఉన్న నిబద్ధత వంటివి నచ్చినా, తక్కువ హానికలిగే ఆయన విధానాలు తిరోగమనమైనవని భావించేవారు. జాతీయ విప్లవం ద్వారానే వర్గ సమాజం, సామాజిక అంతరాలు నశిస్తాయని మొదటినుంచీ భావించేవారు. ఆ క్రమంలోనే దేశంలో కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు దృక్పథం బలపడేందుకు కృషిచేశారు.[3]

తెలుగువారిపై రాయ్ ప్రభావం

[మార్చు]

1937 జూలైలో మద్రాసు యువజన సభలో పాల్గొన్న ఎం.ఎన్. రాయ్ ఆగస్టు 1న తొలిసారి ఆంధ్రలో అడుగుపెట్టారు. నెల్లూరులో వెన్నెల కంటి రాఘవయ్య ఆధ్వర్యాన జరిగిన వ్యవసాయ కార్మికుల మహాసభకు ఎం.ఎన్. రాయ్ ప్రధాన వక్తగా వచ్చారు. అక్కడ జబ్బుపడ్డారు. ములుకుట్ల వెంకటశాస్త్రి, ఎం.ఎన్. రాయ్ ను కాకినాడకు తీసుకెళ్ళారు. విశాఖపట్నం నుండి అబ్బూరి రామకృష్ణారావు (యూనివర్శిటీలో లైబ్రేరియన్, థియేటర్ నిపుణులు) వచ్చారు. ఎం.ఎన్. రాయ్ ను వారిరువురూ ఆంధ్రకు పరిచయం చేశారు. వీరితో కలిసిన వెన్నెలకంటి రాఘవయ్య సాంఘిక విప్లవ బీజాలు నాటారు. గుర్రం జాషువా, గోరా, త్రిపురనేని రామస్వామి పురాణాల తిరోగమనాన్ని వ్యతిరేకిస్తుండగా స్త్రీ స్వేచ్ఛకై చలం సాహిత్య పోరాటం చేశారు. ఎం.ఎన్. రాయ్ శాస్త్రీయ ధోరణి, సాహిత్యం చాలా మందిని ఆకట్టుకున్నాయి. సినిమా రంగంలో గూడవల్లి రామబ్రహ్మం సంస్కరణ చిత్రాలు తీసి కొత్త వెలుగు చూపారు. ప్రజా మిత్ర పత్రిక ద్వారా ఎం.ఎన్. రాయ్ వ్యాసాలు, ఆయన అనుచరుల సాహిత్యాన్ని జనానికి అందించారు. అబ్బూరి రామకృష్ణారావు స్జేజి నాటక రంగంలో కొత్త దారులు చూపారు. పి.హెచ్. గుప్తా విశాఖపట్నం నుండి రామాయణ విమర్శ అందించారు. గుంటూరులో బండారు వందనం దళితుల మధ్య పునర్వికాసానికి నాంది పలికారు. కార్మిక రంగంలో పెమ్మరాజు వెంకట్రావు నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మికులతో ఆరంభించి, కార్మిక పత్రిక నడిపారు. ఎలవర్తి రోశయ్య విద్యార్థులకు భావ విప్లవ సాహిత్యాన్ని పరిచయం చేశారు. పాములపాటి కృష్ణచౌదరి రాడికల్ విద్యార్థి పత్రిక నడిపారు. గుత్తికొండ నరహరి, బండి బుచ్చయ్య ములుకోల సాహిత్య ప్రచురణలు, కోగంటి రాధా కృష్ణ మూర్తి తెనాలి నుండి నలంధా ప్రచురణలు, ప్రజా సాహిత్య గ్రంథాలు వెలికి తెచ్చారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి వ్యాసోపన్యాసకుడుగా ఎం.ఎన్. రాయ్ భావ ప్రచారం చేసి, లౌకిక వివాహాలు జరిపాడు. 1954లో ఎం.ఎస్. రాయ్ చనిపోయినప్పుడు దేశంలో అన్ని పత్రికల సంపాదకీయాలు రాసినా, నార్ల ఆ పని చేయలేదు. ఎవడో అనామకుడు చనిపోతే “తారరాలింది, వటవృక్షం కూలింది” అని రాసే నార్లకు ఎం.ఎన్. రాయ్ ఎవరో తెలియదా అని ఆవుల గోపాలకృష్ణ మూర్తి గుంటూరు ఏకాదండయ్య హాలులో సభా ముఖంగా దెప్పి పొడిచారు. అది బాగా ఆయనకు గుచ్చుకున్నది. వెంటనే గుత్తి కొండ నరహరి ద్వారా ఎం.ఎన్. రాయ్ రచనలు తెప్పించుకొని చదివారు. అవి కళ్ళు తెరిపించగా, నార్ల అప్పటి నుండి రాయ్ అభిమానిగా, క్రమేణా మానవవాదిగా పరిణమించి ఇంగ్లీషులో గీతపై విమర్శ గ్రంథం తెచ్చారు. ఎం.ఎన్.రాయ్ 1936 లో ప్రారంభించిన ఇండిపెండెంట్ ఇండియా పత్రిక చదివి ఆంధ్రా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ కట్టమంచి, లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణారావు మానవవాదులయ్యారు. ఎం.ఎన్. రాయ్ మానవ వాద ధోరణి శ్లాఘిస్తూ సంజీవ దేవ్ రాశారు. పాలగుమ్మి పద్మరాజు పుంఖాను పుంఖంగా మానవ వాద రచనలు చేసి రెండో అశోకుడి ముణ్ణాళ్ళ పాలన రచనతో పార్టీ రహిత ప్రజాస్వామ్యం చూపాడు. కూచిపూడిలో కోగంటి సుబ్రమణ్యం కోగంటి రాధాకృష్ణమూర్తి లీగాఫ్ రాడికల్ కాంగ్రెస్ మెన్ స్థాపించారు. 1940లో తెనాలి రత్నా టాకీస్ లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ మొదటి సభ జరిగింది. త్రిపురనేని గోపీచంద్ రాయ్ రచనలు అనువదించారు. ఆవుల సాంబశివరావు తొలినాళ్లలో, సమాజంలో బానిసత్వం, పేదరికం, వెనకబాటుతనం, అంధ విశ్వాసాలు ఇవన్నీ రూపుమాసిపోవాలంటే కమ్యూనిస్టు భావజాలమే శరణ్యం అని భావించినా, ఎం.ఎన్. రాయ్ స్ఫూర్తితో నవ్య మానవవాదాన్ని అవలంబించారు. 1952 తెనాలిలో ఆవుల గోపాలకృష్ణమూర్తి జరిపిన హ్యూమనిస్టు సభకు ఎం.ఎన్.రాయ్ ప్రారంభోపన్యాసాన్ని పంపారు. మల్లాది వెంకట రామమూర్తి 1967లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎం.ఎన్.రాయ్ భావాల ప్రకారం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గము నుండి పార్టీ రహిత అభ్యర్థిగా పోటీ చేశారు.

రాయ్ వర్గ వ్యవస్థపై వ్రాసిన గ్రంథాన్ని జి.వి.కృష్ణారావు మన వర్గవ్యవస్థ అన్న శీర్షికతో తెలుగులోకి అనువదించారు.[4]

మరణం, వారసత్వం

[మార్చు]

యునైటెడ్ స్టేట్స్‌లో ఉపన్యాస పర్యటనకు వెళ్ళాల్సుండగా, రాయ్ 1954 జనవరి 25 న మరణించారు.

1987 నుండి, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఎం.ఎన్ రాయ్ యొక్క ఎంపిక చేసిన రచనల ప్రచురణను ప్రారంభించింది. రాయ్ జైలుపాలైనప్పుడు రాసిన రచనలను కలిపి, మొత్తం 4 సంపుటాలు 1997 వరకు ప్రచురించబడ్డాయి. ప్రాజెక్ట్ ఎడిటర్ సిబ్నారాయణ రే 2008 లో మరణించారు, రాయ్ రచనల పబ్లిషింగ్ కార్యక్రమం అకాలంగా ఆగిపొయింది.

అయన మెక్సికో నగరంలో నివసించినప్పటి ఇంట్లో ఇప్పుడు ఆయన పేరేగల ఒక ప్రైవేట్ నైట్‌క్లబ్ నడుస్తుంది.

టి.ఎం. తార్కుండే, గోవర్ధన్దాస్ పరేఖ్, వి.బి కర్ణిక్, సునీల్ భట్టాచార్య, బి.ఆర్. సుంతంకర్, సలీల్ వాగ్, వి.ఆర్ జవహైర్, డాక్టర్ నళిని తారలేకర్ వంటి ప్రముఖులు ఎం.ఎన్ రాయ్, ఆయన సిద్ధాంతాలతో ప్రభావితులయ్యారు.[5]

రాయ్ గురించి ప్రముఖుల అభిప్రాయాలు

[మార్చు]
 • నెహ్రూ తన జీవిత చరిత్రలో రాయ్ ను "మహా మేధావి"గా వర్ణిస్తూ ఆయన ముందు తానొక సామాన్య వ్యక్తిగా చెప్పుకున్నారు.[6]
 • మెక్సికో ప్రతినిధిగా రష్యాకు వెళ్ళి అప్పటి రష్యా నాయకుడు లెనిన్ ను కలుసుకున్నారు. లెనిన్ రాయ్ ని చూసి " మీరు యువకులా! మిమ్మల్ని పాక్ దేశానికి చెందిన వయసు మీరిన గడ్డంగల జ్ఞానిగా వూహించుకున్నాను." అని అశ్చర్యపోయాడు.[6]

రాయ్ జీవితంలో ప్రముఖ ఘట్టాలు

[మార్చు]
 1. 1887 మార్చిలో జననం
 2. 1906 లో విప్లవోద్యమంలో చేరిక
 3. 1907 డిసంబరులో చంగ్రీపోతా రైల్వే స్టేషన్ దోపిడీ
 4. 1910 లో నేత్రాలో దోపిడీ
 5. హౌరా కుట్రకేసులో అరెస్టు
 6. 1911 నుండి 1913 వరకు దేశవ్యాప్త పర్యటన చేస్తూ విప్లవ కార్యక్రమాలలో పాల్గొంటూ, బ్రిటీషర్లను దేశం నుండి పారద్రోలుటకు జతిన్ ముఖర్జీ నాయకత్వాన వ్యూహాలు రచించటం.
 7. 1914 ఆగస్టులో మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం
 8. 1915 ఫిబ్రవరిలో గార్డెన్ రీచ్ వద్ద దోపిడీ
 9. 1915 ఏప్రిలో ఆయుధ సేకరణకు బటావియా ప్రాంతానికి చేరుకున్నాడు.
 10. 1915 జూన్ లో ఇండియాకి ఆయుధాలతో బటావియానుండి తిరిగి రావడం.
  భారతదేశపు 1987 స్టాంప్‌పై రాయ్
 11. 1915 ఆగస్టులో మరొక సారి ఆయుధ సేకరణకి బటావియా వెళ్ళి అక్కడికి చేరాల్సిన ఆయుధాలతో కూడిన ఓడ రాకపోవడంతో రెండవ ప్రయత్నం విఫలమవడం
 12. 1915 లో తమ నాయకుడు జతిన్ ముఖర్జీ పోలీసుల చేతిలో హతమవ్వడం
 13. 1915 ఆగస్టులో ఆయుధ సేకరణకు ఇండోనేషియా, మలయా, చైనా, జపాన్ దేశాలకు పయనమవ్వడం
 14. 1916 జూన్లో జర్మనీ వారినుండి ఆయుధసేకరనకు అమెరికా మీదుగా బెర్లిన్ పయనం
 15. 1916 జూన్ 14వ తేదీన్ సాన్ ఫ్రాన్సిస్కోలో అడుగుపెట్టడం
 16. 1916 జూన్ లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళీ అక్కడి సోషలిస్టులను కలుసుకోవడం. అక్కడే తన పేరును మానవేంద్ర నాథ రాయ్ గా మార్చుకోవడం.
 17. 1917 జూన్లో అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించడం.
 18. 1917 జూన్ లో హిందూ-జర్మన్ కుట్ర కేసులో అమెరికా పోలీసులు అరెస్టుచేసి పూచీకత్తు మీద కొద్దిరోజుల తరువాత బెయిలు ఇవ్వడం
 19. 1917 జూలైలో మెక్సికోకి పయనమవటం
 20. 1918 లో మెక్సికన్ సోషలిస్టు పార్టీలో చేరుట
 21. 1919 లో ప్రముఖ రష్యన్ నాయకుడు మైఖేల్ బరోడిన్ ను కలుసుకోవడం
 22. 1919 లో మెక్సికన్ సోషలిస్టు పార్టీని కమ్యూనిస్టు పార్టీగా మార్చుట ప్రపంచంలో రష్యా తరువాత రెండవ కమ్యూనిస్టు పార్టీగా గుర్తింపు పొందటం
 23. 1919 నవంబరులో రెండవ కొమింటార్న్ కాంగ్రెసులో పాల్గొనుటకు మెక్సికోను వదిలి వెళ్ళటం
 24. 1919 డిసెంబరు బెర్లిన్ చెరుకొనుట
 25. 1920 ఏప్రిల్ రష్యాకు చేరుకొనుట
 26. 1920 మే లేదా జూన్ రష్యా అధినేత వ్లాదిమిర్ లెనిన్తో మొదటి సమావేశం
 27. 1920 జూలై లేదా ఆగస్టు రెండవ కొమింటార్న్ సమావేశం
 28. 1920 ఆగస్టు ఆదేశాల మీద తాష్కెంటుకు పయనం
 29. 1920 అక్టోబరు తాష్కెంటులో ఇండియా హౌస్, మిలిటరీ స్కూల్ను స్థాపించుట
 30. 1920 అక్టోబరు 17న మొట్టమొదటగా కమ్యూనిస్టు పార్టీని తాష్కెంటులో ప్రారంభించుట
 31. 1921 చివర్లో “మారుతున్న భారతదేశం” India in transition పుస్తకం రష్యన్ భాషలో ముద్రింపబడడం 1922లో ఇంగ్లీషులో ముద్రించడం
 32. 1922లో వాంగార్డ్ సంకలనం ముద్రణ
 33. 1924 లో కాన్పూర్ కమ్యూనిస్టు కుట్ర కేసు
 34. 1927 జవవరి నుండి ఆగస్టు వరకు ఆదేశాల మీద చైనాకు పయనం
 35. 1928 తిరిగి రష్యాకు రావడం
 36. 1928 సెప్టెంబరు ఆరవ కొమింటార్న్ సమావేశంలో పాల్గొనటం
 37. 1929 మార్చి మీరట్ కమ్యూనిస్టు కుట్ర కేసు
 38. 1929 డిసంబరులో కొమింటార్న్ నుండి బహిష్కరణకు గురికావడం
 39. 1930 డిసెంబరులో రహస్యంగా భారత్కు చేరుకొనుట
 40. 1931 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలలో పాల్గొనుట
 41. 1931 జూలై ఆరు నెలలుగా అజ్ఞాతంగా వున్న రాయ్ని బొంబాయి పోలీసులు అరెస్టు చేయటం
 42. 1931 ఆగస్టు నుండి డిసెంబరు వరకు కాన్పూరులో న్యాయ విచారణ
 43. 1932 జనవరిలో బ్రిటీషు ప్రభుత్వం రాయ్కి 12 సంవత్సరాల ఖైదు విధించడం. రాయ్ పై కోర్టుకు అప్పీలు చేసుకొనగా 6 సంవత్సరాలకు తగ్గించడం.
 44. 6 సంవత్సరాల జైలు జీవితంలో మొత్తంగా 3000 పేజీలు గల వివిధ పుస్తకాలు రచించడం.
 45. 1933 జనవరిలో జర్మనీలో హిట్లరు అధికారంలోకి రావడం
 46. 1936 నవంబరులో డేహ్రాడూన్ జైలునుండి విడుదలవడం
 47. 1936 జూన్లో ఫైజ్పూర్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు సమవేశమవడం
 48. 1938 జూన్లో లీగ్ ఆఫ్ రాడికల్ కాంగ్రెస్మెన్ స్థాపన
 49. 1939 సెప్టెంబరులో రెండవ ప్రపంచ యుద్ధ ఆరంభం
 50. 1940లో రెండవ ప్రపంచయుద్ధం మీద రాయ్ ప్రతిపాదించిన యాంటీ ఫాసిస్టు ప్రతిపాదనకు కాంగ్రెసు ఒప్పుకోకపోవడంతో కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయడం
 51. 1940 డిసెంబరులో రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ స్థాపన
 52. 1944 ఏప్రిల్ లో రాయ్ రచించిన పీపుల్స్ ప్లాన్ ప్రచూరణ
 53. 1945లో భారత రాజ్యాంగ ముసాయిదాను రచించడం
 54. 1948 డిసెంబరులో రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ నాల్గవ సమావేశాలలో ఆ పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటన
 55. 1952 జూలై ముస్సోరీలో ఆక్సిడెంటుకు గురికావడం, ఆ తర్వాత మరికొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు
 56. 1954 జనవరిలో మరణం

మూలాలు

[మార్చు]
 1. This date found in the Dictionary of National Biography and accepted by Sibnarayan Ray, In Freedom's Quest: Life of M.N. Roy (Vol. 1: 1887–1922). Calcutta: Minerva Associates, 1998; p. 14. This is based on the diary of Dinabandhu. Samaren Roy in The Restless Brahmin claims that Bhattacharya was born on 22 February 1887 in Arbelia.
 2. "Manabendra Nath Roy," Archived 2011-04-17 at the Wayback Machine Banglapedia, http://www.banglapedia.org/
 3. వి.బి.కార్నిక్ (1980). ఎం.ఎన్.రాయ్. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా:.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
 4. రాయ్, ఎం.ఎన్.; కృష్ణారావు(అనువాదం), జి.వి. మన వర్ణసంబంధాలు.
 5. "El Roy y su música". vice.com. 11 June 2014. Archived from the original on 23 September 2016. Retrieved 5 May 2018.
 6. 6.0 6.1 కోగంటి రాధాకృష్ణమూర్తి (1978). యమ్ యన్ రాయ్ జీవితం-సిద్ధాంతం.

ఇతర లింకులు

[మార్చు]