కాసు బ్రహ్మానందరెడ్డి

వికీపీడియా నుండి
(కాసు బ్రహ్మానంద రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాసు బ్రహ్మానందరెడ్డి
కాసు బ్రహ్మానందరెడ్డి

2011 లో విడుదలైన పోస్టు స్టాంపుపై కాసు బ్రహ్మానందరెడ్డి


పదవీ కాలం
21 ఫిబ్రవరి 1964 – 30 సెప్టెంబరు 1971
ముందు నీలం సంజీవరెడ్డి
తరువాత పి.వి.నరసింహారావు

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 28, 1909
గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపాన తూబాడు గ్రామం
మరణం మే 20, 1994
రాజకీయ పార్టీ కాంగ్రెసు పార్టీ
నివాసం హైదరాబాదు, తెలంగాణ
మతం హిందూమతము

కాసు బ్రహ్మానందరెడ్డి (జూలై 28, 1909 - మే 20, 1994) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. గుంటూరు జిల్లాకు చెందిన ఈ రాజకీయ నాయకుడు కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రి పదవులతో పాటు అనేక పార్టీ పదవులను నిర్వహించాడు. 1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఫిరంగిపురం నియోజక వర్గం నుండి ఎన్నికై, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోనూ సభ్యుడిగా కొనసాగాడు. కాంగ్రెసు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పార్టీలో చీలిక వచ్చినపుడు ఒక వర్గానికి తాను నేతృత్వం వహించి, రెడ్డి కాంగ్రెసును ఏర్పరచాడు.

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించాడు. మదరాసు పచ్చయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నాడు.

స్వాతంత్ర్య సమర పోరాటం

[మార్చు]

పన్నెండటవ ఏట విజయవాడ కాంగ్రెస్ సదస్సుకు విచ్చేసిన మహాత్మా గాంధీని సందర్శించాడు. వారి బోధనలో ప్రభావితుడై శాకాహారిగా ఉంటానని ప్రమాణం చేసాడు. జీవితాంతం ఖద్దరు ధరించాడు. టంగుటూరి ప్రకాశం పంతులు సాహచార్యం, బోధనలు అతనిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపాయి. లా ప్రాక్టీసును పక్కనబెట్టి బ్రిటిషు వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలాడు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాడు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1942లో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

జిల్లాబోర్డు సభ్యునిగా ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం. మొదటి సారిగా 1946 లో మద్రాసు ప్రెసిడెన్సీ శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1952 లో మద్రాసు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పల్నాడు నియోజకవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి, సీపీఐ అభ్యర్థి కోలా సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఫిరంగిపురం నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెసు కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఆంధ్ర రాష్ట్ర శాసన సభ్యులంతా ఆంధ్రప్రదేశ్ లోనూ సభ్యులుగా కొనసాగారు. ఆ విధంగా బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడై, నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో పురపాలన శాఖ మంత్రిగా చేరాడు. ఆ తరువాత దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలో వాణిజ్య శాఖ, ఆర్థిక శాఖలు నిర్వహించాడు. ఆర్థిక శాఖను అతడు అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు. 1964 వ సంవత్ఫరం ఫిబ్రవరి 29 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో అతడు 1971 సెప్టెంబరు 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టి, కమ్యూనికేషన్, హోం, పరిశ్రమల శాఖలను నిర్వహించాడు.

ఆయన తలపై టోపీని అటూ ఇటూ మార్చితే అమోఘ మైన రాజకీయ ఎత్తు వేసినట్టే అనే పేరు ఉండేది.

ఎఐసీసీ సారథ్యం

[మార్చు]

1977లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. కాంగ్రెసు పార్టీ ఓడిపోవడం అదే ప్రథమం. ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పశ్చిమబెంగాల్ కు చెందిన సీనియర్ కాంగ్రెసు నేత సిద్ధార్థ శంకర్ రే పై పోటీచేసి విజయం సాధించాడు. అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగి, అలా ఎన్నికైన అతి కొద్ది మంది అధ్యక్షులలో ఆయన ఒకడు. ఓటమి పిమ్మట, పతనావస్థలో ఉన్న పార్టీని పునరుజ్జీవంపజేసేందుకు శాయశక్తులా పనిచేసాడు. తదనంతరం ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఆమెను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో కాంగ్రెస్ నిట్టనిలువునా చీలింది. ఒక వర్గానికి ఇందిరాగాంధీ నాయకత్వం వహించగా, మరో వర్గానికి కాసు సారథ్యం వహించాడు. ఆయన నేతృత్వంలోని పార్టీ రెడ్డి కాంగ్రెస్ గా రూపాంతరం చెందింది. 1978లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆయనలో ఆత్మ పరిశీలన మొదలైంది. ఫలితంగా రెడ్డి కాంగ్రెసును 1980లో ఇందిరాకాంగ్రెసులో విలీనం చేశాడు.

రాష్ట్రప్రగతి కి సోపానాలు

[మార్చు]

బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు పరిచాడు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల పనులను పూర్తి చేయించాడు. బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ పనులు కాసు హయాంలోనే పూర్తయ్యాయి. సాగర్ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. నాగార్జునసాగర్ మొదటిదశ పూర్తి కాగానే, 1966 ఫిబ్రవరి ఆగస్టు 3న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. రాయలసీమ ప్రాంతానికి వరదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు హైలెవల్ కెనాల్ ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్సుల మంజూరు, నిధులు సమకూర్చడానికి కాసు బ్రహ్మానంద రెడ్డి కృషి చేసాడు. పోచంపాడు ప్రాజెక్టుకు రూపకల్పన చేసాడు. అప్పట్లో ఎల్.ఐ.సి.నుంచి పది కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని బలహీనవర్గాల వారికి ఇళ్లు నిర్మించాడు. ఆయన హయాంలో పంచాయతీ చట్టం అమలులోకి వచ్చింది. సికింద్రాబాదు కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే మండలం ఏర్పాటు కావడం వెనుక ఆయన కృషి ఉంది.

మరణం

[మార్చు]

బ్రహ్మానందరెడ్డి 1994 మే 20హైదరాబాద్లో మరణించాడు.

స్మృతి చిహ్నాలు

[మార్చు]

ఇతని జ్ఞాపకార్థం హైదరాబాదు నగరంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని చిరాన్ పాలెస్ ప్రాంతాన్ని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనంగా నామకరణం చేశారు.

బ్రహ్మానందరెడ్డి పాస్

[మార్చు]

బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 6,8,9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలను రద్దు చేసాడు. నామమాత్రంగా పరీక్షలు జరిగినప్పటికీ, వాటి ఫలితాలతో సంబంధం లేకుండా, విద్యార్థులు పై తరగతికి వెళ్ళేవారు. దీన్ని "బ్రహ్మానందరెడ్డి పాస్" అని పిలిచేవారు.


ఇంతకు ముందు ఉన్నవారు:
నీలం సంజీవరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
29/02/1964—30/09/1971
తరువాత వచ్చినవారు:
పి.వి.నరసింహారావు