నాదెండ్ల భాస్కరరావు
| నాదెండ్ల భాస్కరరావు | |||
| |||
| పదవీ కాలం 1984 ఆగస్టు 16 - 1984 సెప్టెంబరు 16 | |||
| ముందు | నందమూరి తారక రామారావు | ||
|---|---|---|---|
| తరువాత | నందమూరి తారక రామారావు | ||
| నియోజకవర్గం | విజయవాడ తూర్పు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1935 జూన్ 23 | ||
| మరణం | 2026 ఏప్రిల్ 22 (వయసు: 90) హైదరాబాద్ | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| సంతానం | నాదెండ్ల మనోహర్ | ||
| నివాసం | హైద్రాబాద్ | ||
| మతం | హిందూ | ||
నాదెండ్ల భాస్కరరావు (1935 జూన్ 23 - 2026 ఏప్రిల్ 22) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1984 ఆగస్టు 16 నుండి 1984 సెప్టెంబరు 16వ తేది వరకు ఒక నెలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశాడు.
నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గలలో పలు మంత్రిత్వ శాఖల మంత్రిగా పని చేశాడు. ఆయన 1998లో ఖమ్మం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
జననం
[మార్చు]భాస్కరరావు 1935, జూన్ 23న గుంటూరులో[1] జన్మించాడు. ఈయన తండ్రి పిచ్చయ్య. 1958లో లలిత భాస్కరరావును వివాహము చేసుకొన్న ఈయనకు ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు నాదెండ్ల మనోహర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన భాస్కరరావు ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి బి.ఏ ఎల్.ఎల్.బీ పట్టా పొందాడు.
1978 రాష్ట్ర శాసనసభ (భారతదేశం) ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రేసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ సభ్యుడయ్యాడు.
1978 నుండి 1989 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ (భారతదేశం) సభ్యునిగా కొనసాగిన ఈయన ఆ కాలములోనే మంత్రిగా, కేబినెట్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. నాదెండ్ల భాస్కరరావు, మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గములో, టి.అంజయ్య మంత్రివర్గములో మంత్రిగా పనిచేశాడు. 1998లో ఖమ్మం నియోజక వర్గం నుండి పన్నెండవ లోక్‌సభకు ఎన్నికై పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.
తెలుగుదేశం లో
[మార్చు]1982, మార్చి29న నందమూరి తారక రామారావు అంధ్రుల ఆత్మాభిమానమే నినాదముగా తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. పార్టీ, ప్రారంభించిన 9 నెలలకే 1983 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించి ప్రభుత్వం యేర్పాటు చేసింది. రామారావు ముఖ్యమంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు ఆయన మంత్రి వర్గములో కేబినెట్ హోదా కలిగిన ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- 1984 ఆగస్టు 14
- ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు టెక్సస్లో గుండెకు ట్రిపుల్ బైపాస్ శస్త్రచికిత్స చేయించుకొని 1984 ఆగస్టు 14న తిరిగి వచ్చాడు. హైదరాబాదు విమానాశ్రయంలో ఈయన్ను ఆహ్వానించడానికి ఆర్థిక మంత్రిగా ఉన్న భాస్కరరావు వెళ్లాడు
- ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ రాంలాల్ భాస్కరరావును మంత్రి పదవి నుండి తొలగించాడు.
- 1984 ఆగస్టు 15
- ఆగస్టు 15 (భారత స్వాతంత్ర్య దినోత్సవము) ఉదయం గవర్నరు పతిపక్ష కాంగ్రేసు నాయకున్ని కలిశాడు. కేంద్ర ప్రభుత్వము నుండి టెలిఫోన్ సందేశము అందుకొన్నాడు.
- రామారావు గవర్నరును కలిసి సభలో తన మద్దతును నిరూపించుకోవడానికి శాసనసభను ఆగస్టు 18న సమావేశపరచవల్సిందిగా కోరాడు.
- ఉద్వాసన పలికిన ఆర్థిక మంత్రి, నాదెండ్ల భాస్కరరావు గవర్నరును కలిసి తనకు ముఖ్యమంత్రినయ్యే మద్దతు ఉందని, తెలుగుదేశం అసమ్మతి సభ్యులు, కాంగ్రేస్ పార్టీ సభ్యుల మద్దతు తనకుందని, మంత్రివర్గము ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని కోరాడు.
- ఇంతలో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష కార్యదర్శి ఎన్.టీ.రామారావుకు మద్దతునిస్తున్న 163 మంది సభ్యుల జాబితా గవర్నరుకు పంపాడు.
- 1984 ఆగస్టు 16
- ఆగస్టు 16 ఉదయం నాదెండ్ల భాస్కరరావు తన మద్దతుదారులతో 52 కార్ల పటాలముతో గవర్నరు కార్యాలయము చేరుకున్నాడు. కాంగ్రేసు శాసనసభా పక్ష పార్టీ భాస్కరరావుకు మద్దతునిస్తున్న తీర్మానాన్ని గవర్నరుకు పంపింది.
- అదే సమయానికి ఎన్‌టీయార్ తనకు మద్దతునిస్తున్న 163 సభ్యుల జాబితా పత్రికలకు విడుదల చేశాడు. ఆ తరువాత వారిని గవర్నరు నివాసము ముందు ప్రవేశపెట్టాడు.
- గవర్నరు ఇరు పక్షాల మద్దతును ప్రత్యక్షముగా అంచనా వేయకుండా రామారావు ప్రభుత్వాన్ని గద్దె దించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు.[2]
1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు, తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నరైన రాంలాల్ని కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ లోపాయికారీ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు. గవర్నర్ ఈయనకు అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చాడు. తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో రామారావు ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేసాయి. నెలరోజుల గడువులో ఎంతో డబ్బు ఖర్చుపెట్టినా, భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబరు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు.[3] కేంద్ర ప్రభుత్వం తిరిగి రామారావును ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించింది. భాస్కరరావు తెలుగు దేశం పార్టీ తన ఆలోచనల రూపమే అని చెప్పుకున్నాడు. అయితే, ఈయనే ఆ తరువాత కాలములో అలా ప్రాంతీయ పార్టీని స్థాపించి తప్పుచేశానని చింతించాడు[4]
మరణం
[మార్చు]నాదెండ్ల భాస్కరరావు కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2026 ఏప్రిల్ 22న మరణించాడు.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "పార్లమెంటు సభ్యుల పేజీ". Archived from the original on 2006-05-27. Retrieved 2006-10-31.
- ↑ Democracy Triumphant in India: The Case of Andhra Pradesh - Krishna K. Tummala Asian Survey, Vol. 26, No. 3. (Mar., 1986), pp. 379. [1]
- ↑ Politics of Defection in India in the 1980s - P. M. Kamath Asian Survey, Vol. 25, No. 10. (Oct., 1985), pp. 1043. [2]
- ↑ "హిందూ పత్రికలో జనవరి 20, 2003న వచ్చిన వార్త". Archived from the original on 2007-02-28. Retrieved 2006-10-31.
- ↑ "మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత". Eenadu. 22 April 2026. Archived from the original on 22 April 2026. Retrieved 22 April 2026.
- ↑ "మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి". BBC News తెలుగు. 22 April 2026. Archived from the original on 22 April 2026. Retrieved 22 April 2026.
- ↑ "మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత". Andhrajyothy. 22 April 2026. Archived from the original on 22 April 2026. Retrieved 22 April 2026.
| ఇంతకు ముందు ఉన్నవారు: నందమూరి తారక రామారావు |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 16/08/1984—16/09/1984 |
తరువాత వచ్చినవారు: నందమూరి తారక రామారావు |