Jump to content

భవనం వెంకట్రామ్

వికీపీడియా నుండి
భవనం వెంకట్రామ్
భవనం వెంకట్రామ్


ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలం
24/02/1982—20/09/1982
ముందు టంగుటూరి అంజయ్య
తరువాత కోట్ల విజయభాస్కరరెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 18, 1931
మరణం ఏప్రిల్ 7, 2002
రాజకీయ పార్టీ కాంగ్రెసు
మతం హిందూ

భవనం వెంకట్రామ్ (జూలై 18, 1931 - ఏప్రిల్ 7, 2002) అని అందరూ పిలిచే భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి. ఇతను 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర ముఖ్య మంత్రులు నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇతని మంత్రివర్గం లోనే కలసి మంత్రులుగా పనిచేశారు.

వెంకట్రామ్ 1931 జూలై 18గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామంలో జన్మించాడు. ఇతను గుంటూరు పట్టణంలో న్యాయవాద వృత్తి ప్రాక్టీసు చేసేవాడు. రాజకీయాలలో రాకముందు ఇతను పూర్వపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వములో మంత్రిగా పనిచేసిన కందుల ఓబులరెడ్డి దగ్గర పర్సనల్ అసిస్టెంటుగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

1978లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో విద్యా శాఖా మంత్రిగా చేరి శాసన మండలికి నియమితుడైనాడు. వెంకట్రామిరెడ్డి కుల రాజకీయాలకు వ్యతిరేకముగా పేరులోని రెడ్డి విడచి ఆ తరువాత అధికారములోకి వచ్చిన అంజయ్య మంత్రివర్గములో కూడా మంత్రిగా కొనసాగాడు.

1982లో ఇతను కాంగ్రేసు పార్టీ అధిష్టానవర్గం అండతో ముఖ్యమంత్రి అయ్యాడు. అతని ప్రమాణ స్వీకారోత్సవానికి తన పాత రూం మేట్ ఎన్.టి.రామారావుని ఆహ్వానించాడు. అప్పడే రామారావుకు రాజకీయాలలోకి రావలన్న ఆలోచనకు బీజం పడిందని చెబుతారు. పలనాడు ప్రాంతానికి చెందిన వెంకట్రాం నందమూరి తారక రామారావుకు గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల (ఎ.సి.కాలేజి)లో చదివే రోజులలో సన్నిహిత స్నేహితుడు. 7 నెలల పాలన తర్వాత ఇతను అధిష్టాన వర్గం కోరిక మేరకు రాజీనామా చేసి కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగుమం చేశాడు. 1982లో దేశములోనే మొదటిదైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్శిటీ) ను నెలకొల్పడం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా సాధించిన పనులలో ఒకటి. కొంతకాలం రాజకీయ సన్యాసం తరువాత వీ.పీ.సింగ్ జనతా దళ్ పార్టీలో చేరి తిరిగి కాంగ్రేసు కొచ్చాడు. 2000లో రాం విలాస్ పాశ్వాన్, లోక్ జన శక్తి అనే కొత్త పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖకు అధ్యక్షుడయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఇతని భార్య భవనం జయప్రద 1967 నుండి 1978 వరకు వినుకొండ నియోజక వర్గం నుండి శాసనసభ సభ్యురాలు. ఈమె పి.వి.నరసింహారావు మంత్రివర్గములో విద్యుచ్ఛక్తి శాఖా మంత్రిగా, జలగం వెంగళరావు మంత్రివర్గములోను మంత్రిగా పనిచేసింది. వీరికి ఇద్దరు కుమార్తెలు.

మరణం

[మార్చు]

వెంకట్రామ్ 2002 ఏప్రిల్ 7 న 71 సంవత్సరాల వయసులో గుండెపోటుతో హైదరాబాదులోని మహావీర్ ఆసుపత్రిలో మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. http://timesofindia.indiatimes.com/city/hyderabad/Former-CM-Bhavanam-Venkatram-dies/articleshow/6110455.cms


ఇంతకు ముందు ఉన్నవారు:
టంగుటూరి అంజయ్య
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
24/02/1982—20/09/1982
తరువాత వచ్చినవారు:
కోట్ల విజయభాస్కరరెడ్డి