Jump to content

ఎన్.జి.రంగా

వికీపీడియా నుండి
(ఎన్.జి. రంగా నుండి దారిమార్పు చెందింది)
గోగినేని రంగనాయకులు
ఎన్.జి.రంగా
జననంగోగినేని రంగనాయకులు
నవంబరు 7, 1900
మరణంజూన్ 9, 1995
ఇతర పేర్లుఎన్.జి.రంగా
భారత రైతాంగ ఉద్యమపిత
వృత్తిలోక్ సభ సభ్యుడు , రైతు నాయకుడు
ప్రసిద్ధిభారత స్వాతంత్ర సమరయోధుడు,
రాజకీయ పార్టీకాంగ్రెసు పార్టీ
కృషికార్ లోక్ పార్టీ
మతంహిందూ మతము హేతువాది
తండ్రిగోగినేని నాగయ్య
తల్లిఅచ్చమాంబ

ఆచార్య ఎన్.జి.రంగాగా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబరు 7, 1900 - జూన్ 9, 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ వాది, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.[1] 1991లో భారత ప్రభుత్వం నుండి  పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. 1930-1991 వరకు సుదీర్ఘ కాలం భారత పార్లమెంట్‌ సభ్యునిగా పనిచేసారు.[2]

జీవిత ప్రథమార్థం

[మార్చు]

రంగా, 1900, నవంబరు 7గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు జన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా (1927-1930) పనిచేసారు. ఇతడు హేతువాది. 1924 లో గుంటూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన వెలగా సుబ్బయ్య, పిచ్చమ్మ దంపతుల కుమార్తె భారతీదేవి తో రంగా వివాహం జరిగింది.

స్వాతంత్ర సమరం

[మార్చు]

1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి, రంగా తన ఉద్యోగాన్ని వదిలి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడు. 1931 డిశంబరులో వెంకటగిరి రైతాంగ ఉద్యమ కాలంలో రంగా ఒక సంవత్సరకాలం జైలు శిక్ష అనుభవించాడు. రైతు ఉద్యమాలను స్వాతంత్ర్య పొరాటంలో భాగం చేసారు. 1933 లో నిడుబ్రోలులో రామనీడు పేరుతో వయోజన రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు. ఈ రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు. ఈ పాఠశాల గత స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది.

తన భార్య భారతీ దేవితో కలసి వ్యక్తి గత సత్యాగ్రహంలో పాల్గోన్నారు. 1940లో మద్రాసులో శాసనోల్లంఘనజేసి చెరసాలలో ఏడాది పున్నాడు. 1941 జైలునుండి విడుదల చేసి వెనువెంటనే డెటిన్యూగా రాయవేలూరు జైలుకు తీసుకొని వెళ్ళి 1942లో విడుదల చేశారు. మరలా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 1942 నవంబరు 4 న నిర్భంధించి రాజపుట్లనా దగ్గర దామో జైల్లో ఉంచి 1944 అక్టోబరు 9 తేదీన విడుదల చేశారు. ఈ సమయంలో ఆయన ఆనేక గ్రంథాలు రాశాడు. స్వాతంత్ర్య పొరాటంలో రంగా ఆరు సార్లు కారాగారంలో ఉన్నారు.

స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, వల్లభాయ్ పటేల్, రాజాజీ, రాజేంద్ర ప్రసాదు, యం.యం.జోషి, జయప్రకాశ్ నారాయణ్, రాధాకృష్ణ, వి.వి.గిరి, ప్రకాశం పంతులు వంటి వారి సహచర్యంతో విశేషంగా కృషి చేసారు.1939 కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో నేతాజీని బలపరిచాడు. 'ధన్య జీవి నేతాజీ' అనే పేరుతో పుస్తకం రాసారు.

1930 లో తొలిసారి ఢిల్లీ కేంద్ర శాసనసభకు ఏన్నికైనాడు. మరలా రెండవ సారి జస్టిస్ పార్టీ అభ్యర్థి కొసరాజు రామయ్య చౌదరిపై గెలుపొంది 1934 నుండి 1946 వరకు కొనసాగాడు. ఆ రోజుల్లో అందరికి ఓటు హక్కు లేదు. పది రూపాయలు శిస్తు చెల్లించినవారికే ఓటు ఉండేది. 1946 కి చదువుకున్న వారికి కూడా ఓటు హక్కు వచ్చింది.

1946 లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్కు (మొదటి పార్లమెంట్) సభ్యునిగా మద్రాస్ ప్రొవిన్షియల్ నుండి ఎన్నికై, భారత రాజ్యాంగ రచనలో అనేక సలహాలు, సూచనలు ఇచ్చి క్రియాశీలంగా పాల్గొన్నారు. గ్రామీణ ఆర్థిక, సామాజక స్థితి మెరుగపర్చటానికి వీరు చేసిన సూచనలు అమూల్యమైనవి.

భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులతో 1950-52 మధ్య ఏర్పడ్డ తొలి పార్లమెంటులో రంగా సభ్యునిగా కొనసాగారు.[3]

రైతు ఉద్యమాలు

[మార్చు]

1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వం వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత 1936 లో స్వామి సహజానంద సరస్వతితో కలసి భారతీయ కిసాన్ సభను (AIKS) స్థాపించాడు. జమిందారీ వ్యవస్థపైన అలుపెరుగని పోరాటం చేసారు. గ్రామీణ ప్రజల రుణ విముక్తికి మార్గాలను సూచించారు. కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి నిర్వహణలో 1937లో "రైతాంగ రక్షణ యాత్ర" పేరుతో ఇచ్ఛాపురం నుండి మద్రాసు వరకు రంగా ప్రారంభించిన పాదయాత్ర నాలుగు నెలలు పాటు కొనసాగి రైతాంగంలో చైతన్యస్ఫూర్తిని రగిల్చింది.

రైతాంగ ఆర్థిక పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై "బాపు దీవెనలు" అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు. గ్రామీణుల కొరకు 'వాహిని' అనే వారపత్రికను 1936లో ప్రచురించటం మొదలు పెట్టారు. దీనిలో అనేక వ్యాసాలు రాసి వారి అభిప్రాయాలను పంచుకునేవారు.

రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1939 లో భారతి దేవితో కలసి బర్మా దేశం వెళ్ళి అక్కడ కార్మిక సభకు అధ్యక్షత వహించి, వారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చాడు. 1946 లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948 లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952 లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954 లో న్యూయార్కులో జరిగిన ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్ లోనూ, 1955 లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు. 1957 లో బల్గేరియా రైతు సదస్సులో పాల్గొన్నాడు.[4]

రాజకీయ జీవితము

[మార్చు]

రంగా, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1946 నుండి 1951 వరకు పనిచేసారు. 1951 లో కాంగ్రెసు పార్టీ నుండి నిష్క్రమించి కృషికార్ లోక్ పార్టీ స్థాపించారు. 1955 లో కాంగ్రెస్, ప్రజా పార్టీలతో కలసి ఒక కూటమిగా పొటి చేసి ఆంధ్ర రాష్ట్ర శాసస సభకు జరిగిన ఎన్నికలో ఘన విజయం సాధించారు. నెహ్రు కోరికపై కృషికార్ లోక్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. 1957లో తెనాలి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైనారు.[5]

స్వతంత్ర పార్టీ

[మార్చు]

రైతులకు నష్టం కలిగించే రష్యా ముద్రగల సమష్టి సహకార వ్యవసాయ విధానాన్ని అంగీకరిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విధానాలను, రంగా పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తరువాత 1959 లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ ప్రవేశ పెట్టిన సహకార వ్యవసాయ చట్టాన్ని అమోదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ రంగా కాంగ్రెస్ పార్టీని వీడారు.

నెహ్రూ విధానాలను వ్యతిరేకిస్తున్న చక్రవర్తి రాజగోపాలాచారి, మినూ మసాని, కె.యం.మున్షీ లతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు. రంగా, స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై, ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షంగా రూపుదిద్దుకొన్నది. కానీ 1971 సార్వత్రిక ఎన్నికలలో గ్రాండ్ అలెయన్స్ పేరుతో కూటమిగా పోటీ చేసిన స్వతంత్ర పార్టీ, 8 స్థానాలలో మాత్రమే గెలిచి బలహీన పడింది. ఆ తరువాత 1972లో రంగా తిరిగి ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3]

1980 నుండి 1991 వరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడిగా పనిచేసారు.[2]

లోక్‌సభ పదవీకాలం నియోజకవర్గం పార్టీ
2వ లోక్‌సభ 1957-1962 తెనాలి కాంగ్రెసు పార్టీ
3వ లోక్‌సభ 1962-1967 చిత్తూరు స్వతంత్ర పార్టీ
4వ లోక్‌సభ 1967-1970 శ్రీకాకుళం స్వతంత్ర పార్టీ
7వ లోక్‌సభ 1980-1984 గుంటూరు కాంగ్రెసు (ఐ)
8వ లోక్‌సభ 1984-1989 గుంటూరు కాంగ్రెసు (ఐ)
9వ లోక్‌సభ 1989-1991 గుంటూరు కాంగ్రెసు (ఐ)

1952-57 ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి, 1977- 80 ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిద్యం వహించారు.

తెనాలి, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి (1957-1991) లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.

1930 నుంచి 1991 వరకు, కొద్ది కాలం తప్పితే, నిరాఘాటంగా, పార్లమెంట్ లో 60 ఎళ్ళు ప్రజా ప్రతినిధిగా పనిచేసారు. సుదీర్ఘకాలం నిస్వార్ధంగా సేవలనందించిన రంగా పార్లమెంట్‌ సభ్యునిగా రికార్డు సృష్టించి, గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు.

1952, 1965 లలో జరిగిన కామన్ వెల్త్ పార్లమెంట్ సభలకు, 1980లో ఐక్యరాజ్య సమావేశానికి భారత ప్రతినిధిగా పాల్గొన్నాడు.

రంగా ఎందరినో ప్రజా నాయకులుగా తీర్చిదిద్దారు. గౌతు లచ్చన్న, పాతురి రాజగోపాలనాయుడు, సామాజక సేవకుడు జి. మునిరత్నం నాయుడు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, యడ్లపాటి వెంకట్రావు, కందుల ఓబుల రెడ్డి, ప్రగడ కోటయ్య, సుంకర సత్యనారాయణ, గోగినేని నాగేశ్వరరావు, బండ్లమూడి సుబ్బారావు వంటి వారితో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కొణిజేటి రోశయ్య కూడా రంగా శిష్యులే.

రచనలు

[మార్చు]

రంగా ఆంగ్లంలో 65 పుస్తకాలను,[6] తెలుగులో15 పుస్తకాలను రాసారు.[7] వాటిలో ముఖ్యమైనవి.

  1. రైతు కూలీలకోసం ప్రత్యేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. రైతుకూలీలరాజ్యం స్థాపనకోసం మహాత్మునితో సుదీర్ఘచర్చలను జరపడమే కాక, సంభాషణలసారాన్ని, 'బాపూ ఆశీస్సులు' అనే పేరుతో గ్రంథస్తం చేశాడు.
  1. నీలగిరి కొండజాతులు - వారి ఆర్థిక, సాంఘిక పరిస్థితులు-1928
  1. 1931 లో కారాగారం ఉన్న్న సమయంలో 'ఆధునిక రాజ్యాంగ సంస్థలు' అనే గ్రంథాన్ని రెండు భాగాలుగా రాశాడు.
  1. కాకతీయ, విజయనగర, తంజావూరు, జింజి, మధుర రైతాంగ ప్రజల, భరతపూర్, సిక్కు, మహారాష్ట్ర, ప్రజల రాజ్యాంగ నిర్మాణ చరిత్రలను పరిశీలించి 'కాకతీయ నాయకులు' పేరుతో రైతులకు రాజ్యాంగ నిర్మాణ, నిర్వహణ, చరిత్ర, కలవని నిరూపించారు.

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కారాగారంలో ఉన్నప్పుడు దిగువ మూడు పుస్తకాలను రాసారు.

  1. Kisans and Communists
  2. Challange of the World role of National Revolution
  3. Life and thoughts of a political prisoner వంటి పుస్తకాలు రాసారు

ఆంధ్రా ఎకనామికల్ సీరీస్ క్రింద వెలువడిన రంగా గారి పరిశోధన గ్రంథాలు

  1. Economic organisation of Indian villages vol 1 (Deltaic villages) 1926
  2. Economic organisation of Indian villages vol II (Dry Deltaic villages) 1928
  3. The Tribes of Nilagiries - Their Economic and Social conditions - 1928
  4. The Handloom Weaving Industry - 1930
  5. Economic condition of the Zamindary ryots 1933
  6. Labour in South India - 1934.
  7. A guide to Rural Economics.
  8. Colonial And Colored Peoples' Programme For Their Freedom And Progress

రైతు గ్రంథమాల పేరుతో వెలువడిన రంగా పరిశోధన గ్రంథాలు

  1. హరిజన నాయకుడు
  2. రైతు భజనావళి (ఇది అనేక భాషల్లో అనువదించ బదినది)
  3. ప్రపంచ ధనికవాదం, సామ్రాజయవాదులకు ప్రపంచ రైతాంగము సవాలు -1942
  4. ధన్య జీవి నేతాజి
  5. శారదార్చన (సాహిత్య వ్యాసాలు)
  6. భారతి దేవి సృతులు
  7. విప్లవ రైతాంగం

మరణం

[మార్చు]

ఆచార్య యన్.జి.రంగా 95 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో 1995 జూన్‌ 8వ తేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన 'గోభూమి'లో తుదిశ్వాస విడిచారు.[3] అంతకు ముందే ఈయన భార్య భారతి దేవి రంగా 1972 సెప్టెంబరు 27న చనిపోయారు.[8] వీరికి సంతానం లేదు, పదవులు ఆశించకుండా నిస్వార్ధంగా ప్రజాసేవలో తరించిన ధన్య జీవులు, ఆదర్శ దంపతులు ఆచార్య రంగా, భారతి దేవి రంగా.

పురస్కారాలు

[మార్చు]
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1978లో గౌరవ డాక్టరేట్ "కళాప్రపూర్ణ" పురస్కారం
  • రైతాంగానికి వీరు చేసిన  విశిష్టసేవలకు తార్కాణంగా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని'ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం'గా 1997 లో నామకరణ చేసారు.
  • 1991 లో భారత ప్రభుత్వం వీరికి  పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.
  • పార్లమెంట్లో రంగా కాంస్య విగ్రహం 1997 జూలై 27లో అవిష్కరించారు.[9]
  • ఆచార్య యన్.జి.రంగా చిరస్మరణీయ సేవలకు గుర్తింపుగా భారతీయ తపాలాశాఖ 2001లో ఒక ప్రత్యేక స్మారక తపాళాబిళ్ళను విడుదల చేసింది.
  • గుంటూరు, విజయవాడ, విశాఖ పట్నం, తెనాలి, ఒంగోలు, గోవాడ వంటి అనేక ప్రదేశాలలో రంగా కాంస్య విగ్రహాలు నెలకొల్పారు. రంగా భవన్‌ల పేరుతో హైదరాబాద్, ఒంగోలులలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి.
  • కావూరులో 50 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సహకారంతో 1992లో, "ఎన్.జి.రంగా కృషి విఙాన కేంద్రం" ఏర్పాటయినది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-02. Retrieved 2007-08-08.
  2. 2.0 2.1 Ranga, N.G. "9th Lok Sabha Members Bioprofile".{{cite web}}: CS1 maint: url-status (link)
  3. 3.0 3.1 3.2 గొర్రెపాటి వంకటసుబ్బయ్య , 1948, అనుభంధం: డా. నాగభైరవ ఆదినారాయణ (2017). ఆచార్య గోగినేని రంగనాయకులు జీవితం - కృషి.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)
  4. అధరాపురపు, తేజోవతి (2006). ఎన్.జి.రంగా, నవ భారత నిర్మాతలు,. న్యూ ఢిల్లీ: పబ్లికేషన్స్ డివిజన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము.
  5. నరిశెట్టి, ఇన్నయ్య. ""రైతు బాంధవుడు రంగా"". ఆంధ్రజ్యోతి.
  6. "ఎన్,జి,రంగా ఆంగ్ల రచనలు". Archived from the original on 2021-06-11. Retrieved 2021-06-11.
  7. "ఆచార్య రంగా తెలుగు రచనలు". Archived from the original on 2021-06-11. Retrieved 2021-06-11.
  8. "N G Ranga,ఆచార్య ఎన్‌.జి.రంగా". Archived from the original on 2016-03-07. Retrieved 2020-05-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "పార్లమెంట్ లొ రంగా గారి కాంస్య విగ్రహం".{{cite web}}: CS1 maint: url-status (link)