ప్రగడ కోటయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రగడ కోటయ్య
జననం(1915-07-26)1915 జూలై 26
నిడుబ్రోలు, గుంటూరు జిల్లా
మరణం1995 నవంబరు 26(1995-11-26) (వయసు 80)
వృత్తిజాతీయోద్యమ నాయకుడు
తల్లిదండ్రులు
  • ప్రగడ వీరభద్రుడు (తండ్రి)
  • కోటమ్మ (తల్లి)

ప్రగడ కోటయ్య ( 1915 జూలై 26 - 1995 నవంబరు 26) ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు, చేనేత పరిశ్రమ రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ప్రగడ కోటయ్య గుంటూరు జిల్లా, నిడుబ్రోలులో చేనేత వృత్తి చేసుకొనే ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు 1915, జూలై 26న రెండవ కుమారుడుగా జన్మించాడు. ఇతడికి ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీ మణులు. 1931లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ స్కూలు ఫైనల్‌ ప్యాసయ్యాడు. కొంతకాలం బాపట్ల తాలూకా బోర్డులో ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేసాడు. ఇతడి కుటుంబం చీరాల ఈపురుపాలెంలో కొంతకాలం నివాసం ఉంది. ఇతడి వివాహం ఇందిరాదేవితో జరిగింది. ఈ దంపతులకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు.

ఆక్స్ ఫర్డు విశ్వవిద్యాలయంలో భారతీయ చేనేత పరిశ్రమ పై పరిశోధన జరిపిన ఆచార్య ఎన్ జి రంగా సలహా మేరకు మద్రాసు లోని టెక్స్‌టైల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదివి అక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేసాడు. ఇదే అనుభవంతో 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జిగా ఉద్యోగంలో చేరి సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేశాడు.

1952 నుంచి 1962 వరకు రెండు పర్యాయాలు, తర్వాత 1957 నుంచి 1972 వరకు ఎమ్మెల్యేగా, 1974 నుంచి 1980 వరకు ఎమ్మెల్సీగా ఉన్నాడు. అనంతరం 1990 నుంచి 1995లో మరణించేంత వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. 1974 నుంచి 1978 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. 1945లో ఏర్పడిన ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాడు.70వ జన్మదినం సందర్భంగా చీరాలలో జరిగిన సభలో ఆనాటి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ బెజవాడ గోపాలరెడ్డి, ఇతడికి ‘ప్రజాబంధు’బిరుదునిచ్చి సత్కరించారు. కోటయ్య మరణాంతరం రాష్ట్ర ప్రభుత్వం వెంకటగిరిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు ప్రగడ కోటయ్య పేరు పెట్టింది.

చేనేత రంగం అభివృద్ధికి కోటయ్య అభిప్రాయాలు, సూచనలు, సలహాలు విన్న ఆనాటి తోటి పార్లమెంట్ సభ్యులేకాక, ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సైతం అబ్బురపడేవారు.

మెడికల్ సెలక్షన్ కమిటీ సభ్యుని గా, ప్రదేశ్ కాంగ్రేశ్  కమిటీ జనరల్ సెక్రటరీ గా  ఆంధ్ర విశ్వ విద్యాలయం సెనేట్ సభ్యునిగా  పదవీ బాధ్యతలు సమర్ధవంతంగా ప్రగడ కోటయ్య నిర్వహించారు.

చేనేత రంగం

[మార్చు]

1937 జూన్‌లో నిడుబ్రోలులో గుంటూరు జిల్లా చేనేత మహాసభ జరిగింది. ఈ సభను వెనుక వుండి నడిపించింది ప్రగడ కోటయ్యే. ఎన్.జి.రంగా, తాడిపర్తి శ్రీకంఠం, దామెర్ల రమాకాంతరావు, రామనాథం రామదాసు, పెండెం వెంకట్రాములు మొదలైన ప్రముఖ నాయకులు ఈ సభలకు హాజరయ్యారు. ఆ తర్వాత గుంటూరులో చెన్న రాష్ట్ర చేనేత మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభలో అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. 1939లో జరిగిన మద్రాసు రాష్ట్ర కేంద్ర చేనేత సహకార సంఘం ఎన్నికల్లో డైరెక్టర్లుగా చేనేత నాయకులు ఎన్నికయ్యేలా ఇతడు పథకం రచించి కృతకృత్యుడయ్యాడు. 1941లో బ్రిటిష్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేనేతరంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు థామస్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీని కోటయ్య గుంటూరు జిల్లాకు ఆహ్వానించాడు. వంద పేజీల మెమొరాండాన్ని ఆ కమిటీకి అందజేశాడు. 1942లో చెన్నరాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘాన్ని చైతన్యవంతంగా చేసేందుకు దామెర్ల రమాకాంతరావు అధ్యక్షులుగా, ఇతడు ప్రధాన కార్యదర్శిగా కృషి చేశారు. నూలు కొరతను అధిగమించేందుకు నూలు ధరల స్థిరీకరణ కోసం చేనేత రక్షణ యాత్రలు నడిపాడు.

చేనేత పారిశ్రామికులకు చాలినంత నూలు సరఫరా చేయాలని, నూలు ధరలు అదుపులో పెట్టాలని, నూలు ఎగుమతులు ఆపాలని నినదిస్తూ ఇతడు ఆందోళనలు చేపట్టాడు. 1950 వరకు పరిస్థితులలో మార్పు రాలేదు. దాంతో చేనేత కాంగ్రెస్‌ సమర శంఖం పూరించింది. అన్ని జిల్లాల్లో ఆకలియాత్రలు, సత్యాగ్రహాలు పెద్దఎత్తున చేపట్టాడు. అయినా ఫలితం రాలేదు. దాంతో మద్రాసు నగరంలో 1950 ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 30 వరకు 75 రోజులపాటు కోటయ్య సత్యాగ్రహం నడిపాడు. దాదాపు పదివేల మంది చేనేత కార్మికులు ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. 75 రోజుల అనంతరం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హరేకృష్ణ మెహతాబ్‌ మద్రాసు వచ్చి చేనేత కాంగ్రెస్‌ నాయకులతో చర్చలు జరిపాడు. ఇతడు మంత్రి ఇచ్చిన హమీలతో సత్యాగ్రహాన్ని విరమించాడు.

1952 మద్రాసు శాసనసభ ఎన్నికల్లో ప్రకాశం పంతులు గారి కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ అభ్యర్థిగా ఇతడు చీరాల నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎన్నికయ్యాడు.శాసనసభలో కోటయ్య వాక్పటిమను చూసిన ఆనాటి ముఖ్యమంత్రి రాజాజీ, కాంగ్రెసు పార్టీలో చేరితే మంత్రి పదవి అప్పగిస్తానని అన్నారు.కానీ కోటయ్య నైతిక విలువలకే ప్రాముఖ్యతనిచ్చి ఆయన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు[2].

1953 తర్వాత చేనేత వర్గాల ప్రయోజనాల కోసం రేపల్లెలో సత్యాగ్రహం చేపట్టాడు. ఫలితంగా జైలు శిక్ష అనుభవించాడు. కనుంగో కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమించాడు. చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగించేందుకు సహకార సంఘాలు ఒక మార్గంగా ఇతడు నమ్మాడు. ఇతడు చేనేతరంగంతో పాటు రైతులు, జిన్నింగ్‌, స్పిన్నింగ్‌, కాంపోజిట్‌ మిల్లులపై ఆమూలాగ్రం అధ్యయనం చేశాడు.

ఆయన హయాం లోనే ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు 200 పైగా నూతన చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసారు.అసంఘటితంగా ఉన్న చేనేత రంగం అభివృధ్హికి వారు నేసి బట్టలకు సరైన గిట్టుబాటు ధర లభించడానికి కార్మికుల కష్టాలు కడతెర్చడానికి ప్రగడ కోటయ్య కృషి చేసారు.

చీరాల వద్ద 17 వేల ఎకరాలకు పైగా బంజరు భూములను పేదలకు పంపిణీ చేసే విషయంలో చీరార సముద్ర తీర ప్రాంతంలో సేద్యపునీటి సౌకర్యమ్ కల్పించడం లో.చీరాల, నెల్లూరు, రాజమండ్రి పట్టణాలలో సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయడంలో కోటయ్య కృషి ఉంది.

భారత ప్రభుత్వ చేనేత రంగ ప్రతినిధిగా స్రీలంక, బ్రిటన్, చైనా, హాంకాంగ్ తదితర దేశాలు సందర్శించారు.

మరణం

[మార్చు]

నిరంతరం ప్రజాజీవితం గడిపిన కోటయ్య అనారోగ్యం కారణంగా 1995, నవంబర్ 26న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. తడ్క యాదగిరి (26 July 2015). "నేతన్నల జాతీయ నాయకుడు". ఆంధ్రజ్యోతి. Retrieved 11 April 2016.[permanent dead link]
  2. సాక్షి దిన పత్రిక 26 జూలై 2018