ఇందిరా గాంధీ

వికీపీడియా నుండి
(ఇందిరాగాంధి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇందిరా గాంధీ
ఇందిరా గాంధీ

భారతదేశపు ప్రధమ మహిళా ప్రధాన మంత్రి


పదవీ కాలం
14 జనవరి 1980 – 31 అక్టోబరు 1984
రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి
జ్ఞాని జైల్ సింగ్
ముందు చౌదరి చరణ్ సింగ్
తరువాత రాజీవ్ గాంధీ
పదవీ కాలం
24 జనవరి 1966 – 24 మార్చి 1977
అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్
డా.జాకిర్ హుసేన్
వి.వి.గిరి
ఫకృద్దీన్ అలీ అహ్మద్
ముందు గుల్జారీలాల్ నందా
తరువాత మొరార్జీ దేశాయ్

కేంద్ర విదేశంగా శాఖా మంత్రి
పదవీ కాలం
9 మార్చి 1984 – 31 అక్టోబరు 1984
ముందు పి.వి.నరసింహారావు
తరువాత రాజీవ్ గాంధీ
పదవీ కాలం
22 ఆగస్టు 1967 – 14 మార్చి 1969
ముందు మహమ్మదాలీ కరీం చగ్లా
తరువాత దినేష్ సింగ్

కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి
పదవీ కాలం
26 జూన్ 1970 – 29 ఏప్రిల్ 1971
ముందు మొరార్జీ దేశాయ్
తరువాత యశ్వంతరావు చవాన్

పదవీ కాలం
1959
ముందు యు.ఎన్.దేబర్
తరువాత నీలం సంజీవరెడ్డి
పదవీ కాలం
1978–1984
ముందు దేవ్ కాంత్ బారువా
తరువాత రాజీవ్ గాంధీ

వ్యక్తిగత వివరాలు

జననం (1917-11-19)1917 నవంబరు 19
అలహాబాదు, సమైక్య ఆస్థానములు, బ్రిటీషు ఇండియా
మరణం 1984 అక్టోబరు 31(1984-10-31) (వయసు 66)
న్యూ ఢిల్లీ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఫిరోజ్ గాంధీ
బంధువులు నెహ్రూ-గాంధీ కుటుంబం
సంతానం రాజీవ్ గాంధీ , సంజయ్ గాంధీ
మతం హిందూమతము-ఆది ధర్మం
సంతకం ఇందిరా గాంధీ's signature

ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.[1]

మోతీలాల్ నెహ్రూ పేరుమోసిన న్యాయవాది. సంపదలకు నెలవైన ఆ ఇంటికి మోతీలాల్ ఇంగ్లీషు స్నేహితులు (బ్రిటిష్ వారు), స్వదేశీ స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. అతని కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ, కోడలు కమలా నెహ్రూ. కమలా నెహ్రూ సాంప్రదాయక కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం వల్ల అత్తవారింటికి అలవాటు పడటానికి మొదట్లో కొంచెం ఇబ్బంది పడింది. మోతీలాల్ కుటుంబంలోని వారు నవీన సంప్రదాయానికి అలవాటు పడినవారు.

ఇందిరా ప్రియదర్శిని 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాదులోని ఆనంద్ భవన్ లో జన్మించింది. ఆమె మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు. మోతీలాల్‌కు మనుమరాలంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయన నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నాడు. అయినా తన వృత్తిని వదలలేదు. 1919లో పంజాబ్ లోని వైశాఖీ పండుగ జరుగుతున్న తరుణంలో బ్రిటిష్ వారు జలియన్ వాలా బాగ్‌లో జరిపిన మారణకాండలో కొన్ని వేలమంది బలయ్యారు. ఈ సంఘటన మోతీలాల్ హృదయాన్ని కదిలించి వేసింది. వెంటనే తన వృత్తిని వదిలిపెట్టాడు. తన వద్ద ఉన్న ఖరీదైన విదేశీ వస్తులనన్నింటినీ తగులబెట్టాడు. ఖద్దరు దుస్తులను మాత్రమే ధరించడం మొదలు పెట్టాడు. తన కుమార్తెకు కాన్వెంట్ స్కూలు మానిపించాడు.

ఇలాంటి తరుణంలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ వారి ఇంటికి వచ్చాడు. నెహ్రూతో చాలా సేపు మాట్లాడాడు. ఇందిరకు వారు మాట్లాడుకున్నది ఏమిటో అర్థం కాకపోయినా ఇంటిలో జరిగే మార్పులకు ఒక చిన్ని ప్రేక్షకురాలిగా ఉంది. అది మొదలు వారి ఇల్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే వీరులకు తమ కార్యక్రమాలను రూపొందించుకునే కేంద్రంగా మారింది. ఆమె తల్లి, తండ్రి ఇద్దరూ స్వాంతంత్ర్యం కోసం కదనరంగంలోకి దూకారు.

చిన్నారి ఇందిర సైతం తన విదేశీ బొమ్మలను వదిలివేసింది. ఇప్పటి దాకా భోగ భాగ్యాలకు అలవాటు పడిన నెహ్రూలు కష్టాలను కోరి ఆహ్వానించినా ఆ కష్టాలను ధైర్యంగా ఎదురీది స్వతంత్ర భారత చరిత్రలో వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.వారి వంశానికి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.

బాల్యం

[మార్చు]

ఇందిర తొలి పేరు ప్రియదర్శిని ఇందిర. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తి. తాత మోతీలాల్ నెహ్రూ కూడా అలహాబాదులో పేరుపొందిన న్యాయవాదే కాకుండా జాతీయోద్యమ నాయకులలో ప్రముఖుడు.

ఇందిర పుట్టేసరికి భారతదేశమంతా ఆంగ్లేయుల పాలనలో ఆర్థికంగాను, సామాజికంగాను అనేక సమస్యలతో అల్లకల్లోలంగా ఉంది. ప్రతీ ఒక్కరూ వారి పాలనకు వ్యతిరేకిస్తున్నారు. వారిలో సమైక్యతను తీసుకురావలసిన అవసరం ఏర్పడింది. జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన అవసరం వచ్చింది. దీనికి శరీరంలోని ప్రతీ అవయవంలోనూ దేశభక్తి నిండిన నాయకులు కావాలి. బాల గంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, సరోజినీ నాయుడు, జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ వంటి నాయకులు ఈ పనికి పూనుకున్నారు.

జవహర్‌లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ స్వాతంత్ర్య పోరాట సమయంలో కారాగారానికి వెళ్ళవలసి వచ్చేది. అటువంటి సమయంలో చిన్నారి ఇందిరకు ఆమె తాతగారైన మోతీలాల్ నెహ్రూ తోడుగా ఉండేవారు. మోతీలాల్ కూడా కారాగారానికి వెళ్ళవలసి వచ్చినపుడు ఆమెకు తోడు ఎవరూ లేక ఒంటరితనాన్ని అనుభవించేది.

ఒక చిన్నారి తన ఎదురుగా జరిగే సంఘటనలను బట్టి తన వ్యక్తిత్వాన్ని మలుచుకుంటుంది. తాను ఆడుకొనే ఆటలు సైతం ఆ సంఘటనలకు అనుగుణంగా ఉండేవి. ఇందిర తాను ఆడుకునే ప్రతీ ఆటలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడే ఒక దేశభక్తురాలిగానే తనను ఊహించుకుంటూ ఆడుకొనేది. ఆమె ఆటలు ఆమెలో దేశభక్తిని ఎంత బాగా నింపాయంటే ఆమె స్వాతంత్ర్య పోరాటంలో చిన్నతనంలోనే తనతోటి వారితో కలసి పాల్గొనేలా చేసాయి.

వానర సేన

[మార్చు]

స్వాతంత్ర్య పోరాట సమయంలో నాయకులకు బ్రిటిష్ వారు తమని ఏ క్షణాన అరెస్టు చేస్తారో తెలిసేది కాదు. కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎప్పుడు దాడి చేస్తారో కూడా తెలిసేది కాదు. ఒకరి నుండి ఒకరికి వార్తలు చేరటం కష్టంగా ఉండేది. అటువంటి సమయంలో ఇందిర తన స్నేహితులతో కలసి "వానర సేన"ను ఏర్పాటు చేసింది.

వారు వార్తలను చేరవేయడం, జెండాలను తయారుచేయడం పోలీసుల చర్యలపై గూఢచర్యం చేయడం వంటి పనులను చేసేవారు. ఈ వానరసేనకు ఇందిర నాయకత్వం వహించి చెయ్యవలసిన పనులను వారికి నిర్దేశిస్తూ ఉండేది. "మనం పిల్లలమైనా స్వాతంత్ర్యం కోసం మనవంతు కృషి చెయ్యాలి". అని తోటి పిల్లలకు చెప్తూ ఉండేది.

గాంధీజీ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు ఆయన పక్కనే కూర్చుని తమ పిల్లల మద్దతు ఆయనకుందని తెలియజెప్పేది. ఆమె విద్యార్థినిగా ఉన్న సమయంలో తన తల్లిదండ్రులు, గాంధీజీ మొదలైన కాంగ్రెస్ నాయకులు ఉన్న కారాగారాలకు వెళ్ళి వారిని చూసి వచ్చేది. ఇందిర వయసులో చిన్నదైనా భారతదేశపు చరిత్రను, స్వాతంత్ర్య పోరాటం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది.

ఆమె తండ్రి నెహ్రూ తన బిడ్డకు లోకజ్ఞానం గురించి తెలియజెప్పవలసిన సమయంలో ఎక్కువ కాలం కారాగారములో ఉండటం వలన ఇందిరకు ఏమీ నేర్పే అవకాశం లేదని ఆలోచించి కారాగారము నుండే ఆమెకు భారతదేశ సంస్కృతి గురించి, భారతదేశ చరిత్ర గురించి, ప్రపంచ చరిత్ర గురించి ఉత్తరాలను రాసేవారు. ఆయన తన కుమార్తె ఇందిరను ప్రియదర్శిని అని పిలిచేవాడు

విద్యాభ్యాసం, తల్లి మృతి

[మార్చు]

పూణే విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలో ఆమె ఉత్తీర్ణురాలయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లో చేరింది. అక్కడ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపింది. తరచుగా కారాగారానికి వెళ్ళడం మూలాన కమలా నెహ్రూ ఆరోగ్యం చెడిపోయింది. ఆమెను చికిత్స కోసం స్విట్జర్లాండ్ తీసుకువెళ్ళారు. తల్లికి తోడుగా ఆమె అక్కడే ఒక బడిలో చేరింది. ఎంత చికిత్స చేయించినా కమలా నెహ్రూ ఆరోగ్యం కుటుదపడలేదు. పైగా అంతకంతకూ క్షీణించింది. ఇందిరకు పదిహేడు సంవత్సరాల వయస్సు వచ్చేటప్పడికి ఆమె ఎంతో అభిమానించే తల్లి మరణం ఆమెను ఒంటరిని చేసింది .

తల్లి మరణం వలన ఏర్పడిన ఒంటరితనం నుండి ఆమె త్వరగా కోలుకోవాలంటే ఆమె ఐరోపాలోనే చదవాలని నెహ్రూ నిర్ణయించాడు. అక్కడ ఆమె చదువు ఆమెకు మనోధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని సరైన రీతిలో నిర్మించుకుని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుందని నెహ్రూగారి ఆశయం

తండ్రి ఆశయానికి అనుగుణంగా నడుచుకోవాలని ఇందిర కూడా నిర్ణయించుకుంది. పశ్చిమ విద్యను అభ్యసిస్తూ ఆమె తనలోని సంకోచాన్ని, ఒంటరితనాన్ని వదిలించుకుంది. లండన్లో ఎక్కువ రోజులు గడిపింది. ఇంగ్లండు లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని సోమర్ విల్ కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో, 1930 లో, చేరింది.[2] ఆ తర్వాత లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలోనే, పాత్రికేయుడు ఫిరోజ్ గాంధీతో స్నేహం ఏర్పడింది. ఫిరోజ్ తో స్నేహం ఆమె ఒంటరితనాన్ని పోగొట్టింది.

వివాహం

[మార్చు]

ఫిరోజ్ తో పరిచయము క్రమంగా పరిణయానికి దారి తీసింది. ఫిరోజ్ గాంధీ నెహ్రూ కుటుంబానికి తెలిసినవాడు మాత్రమే కాదు స్నేహితుడు కూడా. ఇందిరకు అతని వ్యక్తిత్వం బాగా నచ్చింది. అతడినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఫిరోజ్ పూర్వీకులు పర్షియా నుండి భారతదేశానికి వలస వచ్చి స్థిరపడ్డారు. వారు పార్సీలు. నెహ్రూ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. అందువల్ల ముందు నెహ్రూ వీరి వివాహానికి అంగీకరించలేదు. నెహ్రూ ఇందిర నిశ్చయాన్ని విని గాంధీ సలహాని తీసుకోవాల్సిందిగా ఇందిరను కోరాడు. గాంధీ వీరి ప్రేమను అర్థం చేసుకుని వారి వివాహానికి అంగీకరించాల్సిందిగా నెహ్రూను కోరాడు. మహాత్మా గాంధీ ఒప్పించడంతో 1942లో ఇందిర, ఫిరోజ్ ల వివాహం జరిగింది.

క్విట్ ఇండియా ఉద్యమం

[మార్చు]

1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలయింది. జవహర్‌లాల్ నెహ్రూ కారాగారం నుండి విడుదల అవుతూనే మళ్ళీ అరెస్టు అయ్యారు. గాంధీజీ కూడా అరెస్టు అయ్యారు. అరెస్టుకు నిరసనగా దేశమంతా సమ్మెలు జరిగాయి. అయితే బ్రిటిష్ వారు పోలీసు బలంతో సమ్మెలను అణచివేసారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టు అయి కారాగారానికి వెళ్ళి 1943 మే 13 న విడుదలైంది.[3] కారాగారంలో ఉండగానే ఆమె ఒక మగ పిల్లవాడికి తల్లి అయింది. ఆ పిల్లవాడికి రాజీవ్ అని పేరు పెట్టింది. పెళ్ళి జరిగినది మొదలు అరెస్టు అయ్యి, విడదలయ అయ్యేలోపు ఆమెలో జాతీయ భావం పెరిగి పెద్దయ్యింది. దేశం కోసం పనిచేయాలి అనే తపన మొదలయింది.

రాజీవ్ గాంధీకి రెండు సంవత్సరాల వయసు ఉండగా వారు లక్నో బయలుదేరి వెళ్లారు. అక్కడ నేషనల్ హెరాల్డు పత్రికా సంపాదకునిగా ఫిరోజ్ గాంధీ పనిచేసేవాడు. రాజీవ్ గాంధీకి తమ్ముడు సంజయ్ గాంధీ జన్మించాడు.

భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించింది. తండ్రికి కూతురు మాదిరిగానే కాకుండా కార్యదర్శిగా, స్నేహితుడిగా మెలగింది. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడూ ఇందిర తండ్రి తరఫున ప్రచారం చేసి గెలిపించింది. ఫిరోజ్ గాంధీ, నెహ్రూకు వ్యతిరేకంగా గళమెత్తి అవినీతి అక్రమాలను ముఖ్యంగా బీమా కుంభకోణాన్ని బయటపెట్టాడు. తత్ఫలితంగా అప్పటి నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేయవలసి వచ్చింది.

రాజకీయ జీవితానికి శ్రీకారం

[మార్చు]

ఇందిర ఎన్నో సంవత్సరాలపాటు నెహ్రూగారి వెనుకనే ఉన్నా, అనుకోని విధంగా తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టింది. ఇది ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోను, తండ్రి రాలేక పోయిన సభలలో ఆమె మాట్లాడవలసి వచ్చేది. ఆమె ఉపన్యాసం, ముఖ్యంగా ఖంగుమని మోగే కంఠస్వరం, సామాన్యులలో కలసిపోయే ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేవి. ఇది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను 1959 ఫిబ్రవరి 2 న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సెప్టెంబరు 8న ఆమె భర్త ఫిరోజ్ గాంధీ మరణించాడు. ఇది ఆమెలో అభద్రతా భావాన్ని కలుగజేసింది. అయితే పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలను నిర్వహించడం, భర్త మరణం వలన ఏర్పడిన ఒంటరితనం ఆమె మౌనాన్ని పెంచడంతో పాటు, ఆమెకు జీవితం పట్ల అవగాహనను, ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచింది. నెమ్మదిగా నెహ్రూగారి స్నేహితులతోను, రాజకీయ నాయకులతోనూ సంభాషణలలో పాల్గొనడం ప్రారంభించింది.

తేజ్‌పూర్ యాత్ర

[మార్చు]

1962 చివరిలో చైనా భారత సరిహద్దుపై వివాదం చెలరేగి అస్సాంలో తేజ్‌పూర్ చైనా దాడికి గురయ్యింది. అటువంటి సమయంలో ఆర్మీ ఛీఫ్ హెచ్చరికను గానీ, స్నేహితుల మాటలను గానీ, తండ్రి చెప్పినది గానీ, వినకుండా అస్సామీలకు ధైర్యాన్నిచ్చి, వారిని కష్టాలకు వదిలి వెయ్యమనే నమ్మకాన్ని వారికి ఇవ్వడానికి ఇందిరా ఒంటరిగా తేజ్‌పూర్ ప్రయాణం చేసి వెళ్ళారు. చైనా వారు వెనక్కి తగ్గేదాకా తాను తేజ్‌పూర్ వదలనని వారి వెన్నంటి ఉంటానని అక్కడి అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. అయితే ఆమె వచ్చిన రోజే చైనావారు వారి సేనలను ఉపహరించుకోవడం మొదలుపెట్టారు.

చైనా సమస్య వల్ల నెహ్రూ చాలా అలసటకు, ఒత్తిడికి గురి అయ్యాడు. రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోనూ నెహ్రూ పట్ల వ్యతిరేకత మొదలయ్యింది. ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది ప్రచారం చెయ్యడం మొదలుపెట్టారు. నెహ్రూకు వీటికి ప్రతిగా చర్యలను చేపట్టేందుకు శక్తిగానీ, ఆసక్తి గానీ లేకపోయింది. ఇందిర తండ్రి పరిస్థితిని గమనించింది. నెహ్రూ తన వద్దకు వచ్చేవారి సమస్యల పరిష్కారానికి, కొన్ని కఠినమైన విషయాల పరిష్కారానికి ఇందిర సహాయం తీసుకోవడం ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె తీసుకున్న చర్యలు, ఆమె పద్ధతి, పట్టుదల నెహ్రూకి ఆమె నాయకత్వం పట్ల, ఆమె పట్ల నమ్మకాన్ని పెంచాయి.

కామరాజ్ ప్లాన్

[మార్చు]

1963లో కామరాజ్ ప్లాన్ కు ఇందిర మద్దతు తెలిపింది. దీని ప్రకారం వయసు ముదిరిన వారు రాజీనామా చేసి యువకులకు అవకాశమివ్వాలి. ఎందరో సీనియర్ నేతలను రాజీనామా చేయవలసినదిగా కోరారు. మొట్టమొదటిగా జవహర్‌లాల్ నెహ్రూ తాను ప్రధాని పదవికి రాజీనామా చెయ్యబోతున్నట్లుగా ప్రకటించారు. ఎవరైతే నెహ్రూని పదవిని నుండి తప్పించాలని అనుకున్నారో వారే రాజీనామాకు అంగీకరించలేదు. నెహ్రూని పదవిలో కొనసాగించవలసినదిగా కోరారు.

1963 ఆగస్టు 25న పదకొండు మంది సీనియర్ నేతలు పార్టీ నుండి వైదొలగారు. కామరాజ్ పార్టీ కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఎంతో పకడ్బందీగా వ్యూహం పన్ని పార్టీలో వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఇందిరాగాంధీ రాజకీయంగా ఎదగడానికి ఇది ఒక సువర్ణావకాశం. నెహ్రూని అంటిపెట్టుకుని, ఆయనకు తానొక సంరక్షకురాలిగా మారి, ఆయనకు అవసరమైన వేళ తన యుక్తితో తన శక్తిని నిరూపించిన గొప్ప మేథావి, రాజకీయవేత్త ఇందిరాగాంధీ. ఒకే ఒక దెబ్బతో నెహ్రూని ఎదురు నిలిచిన రాజకీయ నాయకులనందరినీ మట్టి కరిపించారు. ఆమె నాయకత్వాన్ని సమర్థించేవారు రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్నారు.

ఇది ఎంత సువర్ణావకాశమైనా ఆమె దానిని సంపూర్ణంగా వినియోగించుకోలేకపోయింది. "కామరాజ్ ప్లాన్" అమలులోకి తీసుకువచ్చిన కొన్ని నాళ్లకే నెహ్రూ ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆమె తండ్రికి సపర్యలు చేస్తూ తండ్రి వద్దే ఉండిపోయింది. 1964 జనవరి 6న నెహ్రూగారికి పక్షవాతం వచ్చింది. అప్పుడు భువనేశ్వర్ లో 68వ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. నెహ్రూ ఆరోగ్యం మీద నమ్మకం కుదరక కొంతమంది నేతలు ప్రధాని పదవికి పోటీ పడటం మొదలుపెట్టారు. కొంతమంది శ్రేయోభిలాషులు నెహ్రూ వారసుడిని ప్రకటిస్తే బాగుంటుందని సూచించారు. ఆ అవసరం లేదని, తనకేం కాదని, తనకు స్వస్థత చేకూరుతుందని త్వరలో తాను మరలా హుషారుగా తిరగగలుగుతానికి వారికి నెహ్రూ చెప్పాడు.

అయితే 1964 మే 27న జవహర్ లాల్ నెహ్రూ తుదిశ్వాస విడిచాడు.

కేంద్ర మంత్రిగా..

[మార్చు]

నెహ్రూ మరణం తరువాత లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధాని పదవిని అధిష్టించాడు. శాస్త్రిగారు ఇందిరా గాంధీని ప్రధానిగా ఉండమని కోరాడు. అయితే నెహ్రూకు ఆఖరి దశలో ఏర్పడిన వ్యతిరేకత తనను రాజకీయంగా ఎదగనివ్వదని తెలిసిన ఇందిరా గాంధీ శాస్త్రిగారి ప్రతిపాదనను వెంటనే తిరస్కరించింది. శాస్త్రిగారు ఆమె ఏ మంత్రిత్వ శాఖనైనా నిర్వహించాలని మరీ మరీ కోరగా, కొంత అయిష్టంగానైనా అందుకు అంగీకరించింది. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.

దక్షిణ భారతదేశంలో గొడవలు జరిగాయి. బలవంతంగా హిందీ భాషను వారిపై రుద్దాలని నేతలు నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా దక్షిణ భారత ప్రజలు సమ్మెను మొదలుపెట్టారు. ఇందిర తానే వెళ్ళి అక్కడివారికి హిందీ బలవంతంగా వారిపై రుద్దమని, ఇష్టమైన వారే ఆ భాషను చేర్చుకోవచ్చని ప్రభుత్వం తరపున వారికి హామీ ఇచ్చి వారిని శాంతింపజేసింది.

ప్రధానమంత్రిగా

[మార్చు]

1964 లో ప్రధాని పదవిని చేపట్టిన శాస్త్రిగారు తాష్కెంట్ నగరంలో 1966 జనవరి 10న గుండెపోటుతో మరణించాడు. గుల్జారీలాల్ నందా కొద్ది కాలం పాటు తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవి నిర్వహించాడు. శాస్త్రి తరువాత ప్రధాని ఎవరన్న ప్రశ్న పార్టీలో తలెత్తింది. మొరార్జీ దేశాయ్, గుల్జారీలాల్ నందా మొదలైన మహామహులంతా ఇందిరాగాంధీకి ప్రత్యర్థులుగా ప్రధాని పదవికి పోటీ పడుతున్నారు. చివరకు మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ పోటీలో మిగిలారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ ఇందిరాగాంధీకి తన మద్దతు తెలిపాడు. అతని మద్దతుకు కారణం - ఆమె ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పరిచయాలను కలిగి ఉండటమే కాక వారి మధ్యనే పెరగడం, అనేక దేశాలను చూడడమే కాక, ఎంతో మంది ప్రపంచ నేతలతో పరిచయాలను కలిగి ఉండటం, రాష్ట్ర, కుల, మతాలకు అతీతంగా నవీన భావాలను కలిగిన ఆమె ఆదర్శం.

ఆమె 1966 జనవరి 24న మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించింది. నేటివరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్ని చేపట్టలేదు.

ఇందిర ప్రధానమంత్రి అయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఏమంత సజావుగా లేవు. అంతర్గత కుమ్ములాటలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీలో మొరార్జీ దేశాయ్ లాంటి వారు అసమ్మతివాదులుగా తమ గళాన్ని వినిపించారు. ప్రధాన మంత్రి పదవికి జరిగిన పోటీలో ఇందిరా గాంధీ మొరార్జీ దేశాయ్ ను అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి కామరాజ్ మద్దతుతో సిండికేట్ సహాయంతో 355-169 ఓట్లతో ఓడించి దేశ 3వ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది. మొరార్జీ దేశాయ్ ఇందిరను మూగ బొమ్మ (గూంగీ గుడియా) గా అభివర్ణించాడు. అయితే అది సరైనది కాదని ఇందిర మున్ముందు తన చర్యల ద్వారా నిరూపించుకుంది.

ఆమె ధైర్యం, సమయస్ఫూర్తితో చర్యలు గైకొనే రీతి, ఆమెను ఎన్నో సంవత్సరాలు ప్రధాని పదవిలో ఉండేటట్లు చేసాయి.

ఆమె ప్రధాని పదవిని చేపట్టేవరకు ఆమె తన చర్యలను తన ఆలోచనలను బహిరంగపరచలేదు. స్త్రీ శక్తిని తక్కువగా అంచనావేసే ఆ రోజుల్లో ఒక మహిళ ప్రధానమంత్రిగా అంత పెద్ద దేశాన్ని, అంతమంది ప్రజలను, తనకున్న తక్కువ అనుభవంతో ఎలా పరిపాలిస్తుందో ప్రపంచం మొత్తం గమనిస్తోంది. వారందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆమె కొద్ది కాలంలోనే తన సమర్థతను నిరూపించుకుంది.

ఆమె ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన కొత్తలోనే అధికార యంత్రాంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించింది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, కొత్త పద్ధతులను చేపట్టబోతున్నట్లు, ఇది పాత సాంప్రదాయ పద్ధతులకు, నవీన భావాలు గల యువతరానికి జరిగే పోరాటంగా ఆమె చెప్పింది.

సామాన్యుని అండ రాజకీయనేతలకు ఎంత ముఖ్యమో ఆమెకు తెలుసు. అందుకే తాను కార్యాలయానికి వెళ్ళే ముందు దేశం నలుమూలల నుండి తనను కలవడానికి వచ్చే ఎంతో మంది ప్రజలను కలసి వారి సమస్యలను వినేది. వారిచ్చే వినతులను స్వీకరించేది. వాటిని అంతటితో వదిలెయ్యకుండా వాటికి తగ్గ చర్యలను తీసుకోవల్సిందిగా వెంటనే ఆదేశాలిచ్చేది.

ప్రపంచ నేతల గుర్తింపు

[మార్చు]

సిక్కుల కోరిక మేరకు వారికి పంజాబ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటుకు ఒప్పుకోని కొంతమంది తిరుగుబాటు చెయ్యగా దానిని ఆమె అణచివేసింది. దేశంలో కరువు కాటకాలు ఎక్కువగా ఉండటంతో ఆమె ఆహార ధాన్యాల దిగుమతిపై దృష్టి సారించింది. పేదరికాన్ని నిర్మూలించడానికి ఆమె నడుం కట్టింది. వీటి మీదే ఆమె దృష్టిని కేంద్రీకరించింది.

పశ్చిమ దేశాల సహాయంతోను, ప్రపంచ బ్యాంకు సహాయంతోను దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని ఆమె ఆశించింది. అందుకే ఆమె అమెరికా ప్రయాణమయింది. మధ్యలో పారిస్ లో ఆగి అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఛార్లెస్ డిగాలేని కలిసింది. స్త్రీల శక్తి సామర్థ్యాల మీద ఏ మాత్రం నమ్మకం లేని ఛార్లెస్ ఇందిరాగాంధీతో మాట్లాడాక, "స్త్రీలలో ఇంతటి శక్తి సమర్థ్యాలు ఉంటాయని నేనూహించలేదు. ఆమెలోని సామర్థ్యం చూసిన వారికి ఆశ్చర్యం కలుగక మానదు. ఆమె ఏమైనా సాధించగలదు." అని వ్యాఖ్యాంచించారు.

అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌ను, రష్యా ప్రధాని అలెక్సి కోసిజిన్ తోను, ప్రపంచ బ్యాంకు అధికారులతోను, అంతర్జాతీయ ద్రవ్యనిధి అధికారులతోను చర్చలు జరిపింది. ఆ చర్చలు చాలా ప్రాముఖ్యతను పొందాయి. ఆమె భారత దేశ గౌరవానికి, ఉన్నతికి ఏ మాత్రం భంగం కలుగకుండా మాట్లాడిన తీరు, ఆమె కనబరచిన రాజకీయ పరిపక్వత, చురుకుదనం అందరినీ ఆకట్టుకుంది.

మొరార్జీ దేశాయ్ని సంతృప్తి పర్చడానికి ఉప ప్రధానమంత్రి, కీలకమైన ఆర్థిక మంత్రి పదవులను ప్రసాదించింది. అంతర్గత పోరాటాల ఫలితంగా 1967 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 స్థానాలను కోల్పోవాల్సివచ్చింది. ఆమె మాత్రం విజయం సాధించింది. దీనికి అసలు కారణం ఆమె సామాన్యునికి దగ్గరగా ఉండటం. మరలా ప్రధాని పదవికి పోటీ ఏర్పడింది. ఓడినవారు కూడా వ్యాపారవేత్తలు. కొంతమంది జమీందారీ కుటుంబాలకు చెందిచవారి అండాతో ప్రధాని పదవికై పోటీ పడ్డారు. అయితే బరిలో చివరికి ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ లు మిగిలారు. ఆమె తన తెలివితేటలతో ఆయనని పోటీ నుండి విరమింపజేసింది. ఆమె ప్రధాని అయింది. మొరార్జీ దేశాయ్ ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. అంతే కాక ఆమె నేతృత్వంలో ఆర్థిక శాఖను నిర్వహించింది.

ప్రధానిగా రెండవసారి

[మార్చు]

ఆమె ప్రధాని పీఠాన్ని రెండవసారి అలంకరించింది. అప్పటి అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్నన్ గారి పదవీకాలం పూర్తి కావచ్చింది. కాంగ్రెస్ వారు మరలా అతనినే ఆ పదవిలో నిలబెట్టాలని అనుకున్నారు. కానీ ఇందిర అప్పటి ఉపాధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ ను అధ్యక్షునిగా పదవికి ప్రతిపాదించింది. ప్రతిపక్షాల వారు ప్రధాన న్యాయమూర్తి సుబ్బారావుగారిని ప్రతిపాదించారు. జాకీర్ హుస్సేన్ ఓటమి తనకు పెద్ద దెబ్బ అవుతుందని తెలిసీ, ఆమె అందుకు సిద్ధపడింది. ఆమె అంచనాలు ఎప్పుడూ తలకిందులవ్వలేదు. జాకీర్ హుస్సేన్ పోటీలో నెగ్గాడు.

ఇజ్రాయిల్, అరబ్బు దేశాలకు మధ్య తగవులు వచ్చినప్పుడు ఇందిర అరబ్బుల పట్ల తన సానుభూతిని వెలిబుచ్చడం అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాలకు ఆగ్రహం తెప్పించింది. అయినా ఆమె వెరవలేదు. తన పద్ధతులను, ఆలోచనా పంథాను మార్చుకోలేదు. ఎవరికీభయపడని మనస్తత్వం ఆమెది. ఆరెండు దేశాల మధ్య యుద్ధం దేనికైనా దారి తీయవచ్చని, ప్రపంచ యుద్ధమే సంభవించవచ్చని, మన దేశ పరిస్థితి దృష్ట్యా మన ఆసియా ఖండంలో, శాంతి సుస్థిరత అవసరమని ఆమె ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలియజేసింది.

1969లో జాకీర్ హుస్సేన్ మరణం ఆమెకు సవాల్‌గా మారింది. ఆమె వ్యతిరేకులు ఆమెను ఎలాగైనా గద్దె దించాలనే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిని అధ్యక్ష పదవికి పోటీలో పెట్టారు. కానీ, ఇందిరా గాంధీచే ప్రతిపాదించబడ్డ చేయబడ్డ వి.వి.గిరి పోటీలో నెగ్గి అధ్యక్షుడయ్యాడు.

మొరార్జీ నుండి ఆర్థిక శాఖను వెనక్కి తీసుకోవడమే కాక 1969లో బ్యాంకులను జాతీయం చేసి ఒక్కసారిగా సంచలనం సృష్టించడం వి.వి.గిరి గెలుపుకు కారణం కావచ్చు. మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసాడు.

కాంగ్రెస్ లో చీలిక

[మార్చు]

బ్యాంకుల జాతీయకరణం ద్వారా ప్రజల మన్ననలనందుకున్న ఇందిర, పార్టీలో మాత్రం శత్రువుల సంఖ్యను పెంచుకుంది. జరుగుతున్న, జరిగిన సంఘటనలతో నష్టపోయిన కొంతమంది నాయకులు, ఆమె నాయకత్వం సహించలేని మరికొందరు ఆమె పార్టీ నుండి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. కాంగ్రెస్ ఆవిర్భవించిన 100 సంవత్సరాల తరువాత దానిలో చీలిక ఏర్పడింది. ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ ను కాంగ్రెస్ (ఆర్) గాను, రెండవ చీలికను కాంగ్రెస్ (ఓ) గాను గుర్తించారు. ఈ చీలిక వల్ల ఇందిరాగాంధీకి ఆధిక్యం తగ్గడం జరిగింది. ఇందిరపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వారి ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. పార్లమెంటులో మిగిలిన చిన్న పార్టీలు, స్వాతంత్ర్య సభ్యులు ఆమెకు మద్దతునిచ్చారు. ఇది ఆమె దూరదృష్టికి చక్కటి నిదర్శనం.

జమీందారీ వ్యవస్థ రద్దుకై ఆమె ప్రవేశపెట్టిన బిల్లు లోక్‌సభలో నెగ్గినా రాజ్యసభలో వీగిపోయింది. అయితే పట్టువదలని ఆమె రాష్ట్రపతి ద్వారా జమీందారీ వ్యవస్థను రద్దు చెస్తున్నట్లుగా అధికార ప్రకటన చేయించింది.

ఇది సహించలేని జమీందారులు, కాంగ్రెస్ (ఓ) నేతలు, కొన్ని పార్టీలను కలుపుకొని, వ్యాపారవేత్తలు, వారి మద్దతుతో నడిచే పత్రికల సహాయంతో ఇందిరకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఇది గమనించిన ఇందిరా గాంధీ ప్రజల ఓట్లతోనే తన సామర్థ్యాన్ని నిరూపించి తన శత్రువులకు చూపించదలచి, లోక్‌సభను రద్దు చెయ్యవలసినదిగా రాష్ట్రపతికి సిఫారసు చేసింది. 1971 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.

1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పటికీ కమ్యూనిస్టుల సహాయంతో అలాగే రెండేళ్ళు పరిపాలించింది.

గరీబీ హటావో

[మార్చు]

ఎలాగైనా ఇందిరాగాంధీని పదవీచ్యుతురాలిని చెయ్యాలని ఎత్తులు వేసే నేతలు ఇందిరా హటావో (ఇందిరను తొలగించండి) అనే నినాదంతో ప్రచారం మొదలు పెట్టారు. ఎత్తులకుపై ఎత్తులు వేయగల నేర్పరి ఇందిర "గరీబీ హటావో" (పేదరికాన్ని పారద్రోలండి) అనే నినాదంతో తన ప్రచారాన్ని నిర్వహించింది.

నలభై మూడు రోజుల పాటు దేశమంతా పర్యటించింది. ముప్పై ఆరు వేల మైళ్ల పర్యటనలో మూడు వందల సభలను నిర్వహించి కొన్ని లక్షల మంది ప్రజలను కలుసుకుంది. ఆమెను చూసిన ప్రజల కళ్ళు ఆనందంతో మెరిసాయి. వారందరి దృష్టిలోనూ అమే వారి కోసం పోరాడే ఒక గొప్ప యోధురాలు. ప్రజలే ఆమె బలం. వారిచ్చే తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని తెలిసినా ప్రత్యక్షంగా వారిని కలసి కాంగ్రెస్ (ఆర్) ను గెలిపించవలసినదిగా కోరింది.

మరలా ప్రధాని పదవి

[మార్చు]

ఆమె తిరుగులేని ఆధిక్యతతో గెలిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మూడవసారి ప్రధాని పదవిని చేపట్టింది. ఈ పదవీ కాలంలోనే బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగింది.

తూర్పు పాకిస్తాన్‌లో, పశ్చిమ పాకిస్తాన్‌ బలగాలు సృష్టించే అల్లర్లను, అరాచకాలను భరించలేక లక్షలకొద్దీ ప్రజలు భారతదేశంలోకి వలస రావడం మొదలుపెట్టారు. ముక్తి బహిని (తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర్యసమరయోధులు) తూర్పు పాకిస్తాన్ విముక్తికై పోరాడుతున్నారు. ఇది 1970 నుండి 71 వరకు జరిగింది. వారికి తన మద్దతును తెలుపుతూ మన దేశ సైన్యాన్ని వారికి అండగా పంపించింది. మనదేశ సైన్య సహకారంతో ముక్తి బహిని విజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అంకురార్పణ చేసారు. ఆనాటి తూర్పు పాకిస్తాన్ నేటి బంగ్లాదేశ్.

ఈ కాలంలో రాజభరణాల రద్దు, 1966లో రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో బ్యాంకుల జాతీయకరణ లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలన కై గరీబీ హటావో నినాదం, 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది.

1971 పాకిస్తాన్ తో యుద్ధంలో నిర్ణయాత్మక విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 1974లో రాజస్థాన్ ఎడారి లోని పోఖ్రాన్లో అణుపాటవ పరీక్ష చేసి అమెరికా కన్నెర్రకు గురైంది. అంతేకాదు, ఆ చర్య వల్ల భారత అణు కార్యక్రమానికి బలమైన పునాది పడింది.

1971 డిసెంబరు 16న లోక్‌సభలో ఆమె ఈ చారిత్రాత్మక సంఘటన గురించి సగర్వంగా ప్రకటిస్తూ, మనదేశ వాయు, నావిక, ఆర్మీ సేవల శౌర్యానికి, సామర్థ్యానికి దేశ ప్రజల గర్విస్తున్నారని అభినందించింది.

ఈ సందర్భంగా ఆమెకు వ్యతిరేకులు, ప్రతిపక్ష నేతలు సైతం లేచి నిలబడి ఆమెను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. ఈ నిర్ణయం, విజయం తనది కాదని దేశ ప్రజలందరిదీ అని ఆమె చెప్పింది. దీనివల్ల ఆమె ప్రజలలో మరింత పేరు తెచ్చుకోవడమే కాక వారందరి దృష్టిలో మరింత ఎదిగింది.

కానీ కాలం గడుస్తున్నకొద్దీ ప్రజలలో అసహనం పెరిగింది. ఆర్థిక వ్యవస్థలో పెద్దగా మార్పు రాకపోవడం, పెరిగిన లంచగొండితనం, ప్రజాజీవన స్థితిగతులలో మార్పు రాకపోవడం వంటివి ప్రజల అసహనానికి కారణాలయ్యాయి.

అత్యయిక స్థితి/ అత్యవసర పరిస్థితి

[మార్చు]

1971లో అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్ పై గెల్చిన ఇందిర ఎన్నిక చెల్లదని ఇందిరాగాంధీ విజయాన్ని సవాలు చేస్తూ రాజ్‌నారాయణ్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, తరువాత 6 సంవత్సరాల వరకు ఇందిరాగాంధీ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనరాదని అలహాబాదు ఉన్నత న్యాయస్థానం 1975లో తీర్పు ఇచ్చింది. దీనిపై ఇందిరాగాంధీ అత్యున్నత న్యాయస్థానంలో స్టే ఆర్డర్ తెచ్చుకున్నది.

ప్రతిపక్ష నాయకులు, ఆమె వ్యతిరేకులు కలిసి ఇందిరకు వ్యతిరేకంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించి, పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఇందిరకు తమ అవిధేయతను తెలియజేయాల్సిందిగా కోరదలిచారు. ఈ సంగతిని పసిగట్టిన ఇందిర పరిస్థితిని చేజారనీయకుండా అదుపులోకి తీసుకురావాలని ఆలోచిందింది. వారిని అలా వదిలేస్తే దేశంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయని, శాంతిని స్థాపించడం కోసం తాను ఎంతటి కఠినమైన చర్యకైనా సిద్ధమని నిరూపిస్తూ ఇందిర దేశామంతటా అత్యయిక స్థితి (emergency)ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 వ ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25న అత్యయిక స్థితిని ప్రకటించారు. అదే రోజు ర్యాలీ నిర్వహించాలని ప్రతిపక్ష నాయకుల వ్యూహం.

1975 జూన్ 26న దేశ ప్రజలనందరినీ ఉద్దేశించి రేడియోలోను, దూరదర్శన్‌లోనూ, ఏ మాత్రం ఆవేశపడాకుండా, మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ్ వంటి నేతలు అరెస్టు చెయ్యబడ్డారని చెప్పినపుడు ప్రజలందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. కారణం అరెస్టు అయిన వారిలో కొందరు ఆమె తండ్రి నెహ్రూతో కలసి పనిచేసారు. కొంతమంది స్వాతంత్ర్య సమరయోధులు. అత్యయిక స్థితిని అమలు చేయడంలో ఆమె అసలు అంతర్యం ప్రజలెవ్వరికీ బోధపడలేదు.

చట్టం కఠినంగా అమలు పరచబడింది. విదేశీ పత్రికలకు సంబంధించిన విలేకరులను దేశం వదిలిపెట్టి వెళ్లవలసినదిగా ఆదేశించారు. మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ్ వంటి నేతలను అరెస్టు చేసి కారాగారంలో పెట్టలేదు. గృహ నిర్బంధం గావించారు. అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు ఏవైతే ప్రజల శాంతి భద్రతలను భంగం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాయో, ప్రజాస్వామ్యాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకొని ఆ ప్రజాస్వామ్యాన్నే భ్రష్టుపట్టించడానికి ప్రయత్నిస్తున్నాయో ఆ శక్తులను అరెస్టు చేసి కారాగారాలలో పెట్టారు. అన్ని పౌర హక్కులను రద్దు చేసి, వేలకొలది ప్రతిపక్ష నాయకులను, విలేకరులను చెరసాలపాలు చేసింది.

అత్యయిక స్థితిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించి సమయానికి రావడం జరిగింది. లంచగొండితనం మాయమయింది. మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలు, అత్యాచారాలు జరగడం లేదు. రైళ్ళు సమయానికి నడిచాయి. ప్రజలలో నేరాల పట్ల భయాందోళనలు తగ్గాయి.

20 సూత్రాల పథకం

[మార్చు]

పంచ వర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి చెయ్యాలని నెహ్రూగారి ఆకాంక్ష. కాని, బీదప్రజలు కానీ, మధ్య తరగతికి చెందిన వారు కానీ ఆ ప్రణాళికల ఫలాన్ని సరిగ్గా అందుకోలేక పోయారు. అసలు ఆ ప్రణాళికల ఆశయం నెరవేరడం లేదు. గాంధీ గారి సూత్రాన్ని అనుసరించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వారి కోసం ఇరవై సూత్రాల పథకాన్ని రూపొందించింది. వెట్టి చాకిరీ చట్ట విరుద్ధమని ప్రకటించింది.

20 సూత్రాల పథకం ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తానని ఆమె చేసిన ప్రతిజ్ఞను చెల్లించుకోవడమే ఆమె ఆశయం. ఇరవై సుత్రాల పథకాన్ని అమలు చెయ్యాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్రమంత్రులకు సూచించింది. దేశ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడసాగింది.

ప్రతిపక్ష నాయకులు అత్యయిక స్థితి పట్ల తమ అసంతృప్తిని వ్యక్తపరిస్తే, అందులో కొందరు నాయకులు దీనిలో విదేశీ హస్తం ఉందని ఆరోపించారు. విదేశాల్లో ఉండి స్వాతంత్ర్య పోరాటానికి సహకరించిన ఎందరో మిత్రులు కూడా ఇందిర చర్యను వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకత ఆమెకు మనశ్శాంతిని దూరం చెయ్యడం మాత్రమే కాక ఆమె ఆరోగ్యాన్ని కూడా కొంచెం పాడు చేసింది. తన భావాలను ఎదుటి వారితో పంచుకునే అలవాటు లేని ఆమె ఇప్పుడు మరింత ఒంటరి అయ్యింది.

అంతే కాకుండా 1975 ఆగస్టు 15న బంగ్లాదేశ్ అధ్యక్షుడు హత్యకావించబడటం, ఆమెలో అనేక సందేహాలను రేకెత్తించింది. అందులోనూ అత్యయిక స్థితి వల్ల ఏర్పడిన పరిస్థితుల వల్ల కూడా ఆమెకు సందేహాలు ఎక్కువయ్యాయి. ప్రతివారిని అనుమానించడం, నమ్మకం కోల్పోవడం జరిగింది.

ఆ సమయంలో ఆమెకు అండగా ఆమె రెండవ కుమారుడు సంజయ్ గాంధీ నిలిచాడు. సంజయ్ గాంధీ ఇందిర నుండి ధైర్యం, ఓటమిని అంగీకరించని మనస్తత్వం, నిర్ణయత్మక ధోరణిని పుణికిపుచ్చుకున్నాడు. వీటికి అదనంగా తండ్రి నుండి అనుకున్నది సాధించాలనే గుణం, స్నేహతత్త్వం మొదలైనవి వారసత్వంగా అందుకున్నాడు.

సంప్రదాయాలకు వ్యతిరేకి. కార్యసాధనే ముఖ్యంగా భావించేవాడు. సాధనా పద్ధతి ఎటువంటిదైనా లెక్కచేసేవాడు కాదు. యువజన కాంగ్రెస్ ను స్థాపించి తమ మద్దతును ఇందిరకు ప్రకటించాడు. అవసరమైన సమయంలో తనకు సహకరించిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు తన కృతజ్ఞతలను, ధన్యవాదాలను తెలియజేసింది ఇందిర.

ఇందిర ఓటమి

[మార్చు]

సంజయ్ గాంధీ ఐదు సూత్రాల పథకాన్ని ప్రారంభించాడు. కుటుంబ నియంత్రణ, వరకట్నం, కులాల మీద ఆయన దృష్టి సారించాడు. ఇందిర ఆయనపై విశ్వాసాన్ని పెంచుకుని, అవసరమైన వేళల రాజకీయ విషయాలపై తగు సూచనలు చెయ్యవచ్చని అభిప్రాయపడింది. సంజయ్ గాంధీ చర్యల వల్ల కొంతమంది ఇందిరాగాంధీ అనుచరులు కొన్ని విషయాలలో బాధపడిన సందర్భాలున్నాయి. వారిలో కొందరు సంజయ్ గాంధీ గురించి ఇందిరకు చూచాయగా తెలియజేసారు. కానీ, ఆమె కొట్టి పారేసింది. మరి కొందరు ఆమెకు చెప్తే తాము ఆమె అభిమానానికి దూరమవుతామని భయపడి మిన్నకున్నారు.

సంజయ్ గాంధీ పరిపాలనలో జోక్యం చేసుకోవడం, అత్యయిక స్థితి గురించి సరియైన పత్రికా ప్రచారం లేకపోవడం వంటివి ప్రజలలో ఇందిరమీద అభిమానాన్ని తగ్గించాయి. 1977లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓడిపోయింది.

సన్నిహితులు ఆమెను ఎన్నోసార్లు అత్యయిక స్థితి వల్ల కొన్ని దుష్ఫలితాలు ఎదురవుతున్నాయని, ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడుతోందని, అత్యయిక స్థితి ముగింపును ప్రకటించమని హెచ్చరించారు. ఆమె వినలేదు. అత్యయిక స్థితి ముగీయకుండానే గృహ నిర్బంధంలో ఉన్న నాయకులంతా విడుదల చెయ్యబడ్డారు. 1977 మార్చి 19న ఎన్నికలు నిర్వహించబడతాయని ప్రకటించింది. అత్యయిక స్థితి ఇంకా అమలులో ఉన్నందున పోలింగు సమయంలో అవినీతికి ఆస్కారం ఉండదు. తమకు అనుకూల చర్యలు చేపట్టేందుకు ఆమె వ్యతిరేకులకు సరియైన వ్యవధి లేకపోయింది. 1977లో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించి ఎన్నికలను ప్రకటించింది.

జనవరి 30న జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ వంటి నాయకులు ఊరేగింపు జరిపి ప్రజల వద్దకు వెళ్ళారు. వారిని చాలాకాలం తరువాత చూసిన ప్రజలు జయజయ ధ్వానాలు చేసారు. అత్యవసర పరిస్థితి పరిణామం 1977 ఎన్నికలలో ఓటమి రూపంలో బయటపడింది. ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో కూడా జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది.

మార్చి 22న ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామా చేసింది.

ఓటమిని చవిచూసినా, రాజకీయాల నుండి విరమణ తీసుకోలేదు. జనతాపార్టీ విజయానికి ముఖ్యకారణం ఇందిర మీద జరిగిన దుష్ప్రచారమే. జనతా పార్టీలో వారివి విభిన్న ధ్యేయాలు, అభిప్రాయాలు. ఒకరితొ ఒకరికి పడదు. ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా ఇందిరను పదవీచ్యుతురాలిని చేయాలనే సంకల్పమే వారిని ఒకటిగా పనిచేసేటట్లు చేసింది.

ఇందిరను కొన్ని కేసులలో ఇరికించి అరెస్టు చేయించారు. కానీ ఏ కేసులూ ఆమె మీద నిలువలేదు. వెంటనే ఆమెను విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రజలలో ఇది జనతా పార్టీ మీద అవిశ్వాసాన్ని కలుగజేసింది. ఇందిర మీద అభిమానాన్ని పెంచింది. ఇందిర విడుదలవుతూనే ప్రజలలోకి వెళ్లింది. ప్రజల అభిమానాన్ని చూరగొన్నది.

ఇందిరాగాంధీ తనకు అనుకూలంగా ఉన్నవారందరిని కూడగట్టి ఇందిరా కాంగ్రెస్గా ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి ఇందిర అధ్యకురాలిగా ఎన్నికయింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లలో ఇందిరా కాంగ్రెస్ విజయభేరి మ్రోగించి రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 1978 నవంబరు 7 న ఇందిర మరలా పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయింది. కర్ణాటక లోని చిక్‌మగలూరు నుండి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించింది.

అయితే ఇందిరను దారిలోంచి తొలగించుకోవాలనే వారు చేసే ప్రయత్నాలు ఆపలేదు. ఆమె పదవిలో ఉండగా అధికారులను పీడించినట్లు ఆరోపించి ఆమెను తీహార్ కారాగారంలో ఉంచారు. అయినా ఆమెలోని పోరాట పటిమ తగ్గలేదు. అక్కడ ఉండే తాను విడుదల అయిన తరువాత చెయ్యవలసిన ప్రణాళికను తయారుచేసింది. విడుదల అవగానే తన ప్రణాళికను అమలు పరచింది. అప్పటి మొరార్జీ దేశాయ్ పరిపాలనలో ధరలు ఆకాశాన్నంటాయి. నేరాలు పెరిగాయి. అదును చూసి ప్రతిపక్షమైన కాంగ్రెస్ వారు అతనిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిలో నెగ్గలేకపోయిన దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేసాడు.

ఇందిరా కాంగ్రెస్ మద్దతుతో చరణ్ సింగ్ ప్రధానిగా పదవిని చేపట్టాడు. నెలలోపే అతను తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అతను ప్రధానిగా ప్రజల సమస్యల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. 23 రోజులు అతని పాలనను గమనించిన ఇందిర అతనికి తన మద్దతును ఉపసంహరించుకుంది. గత్యంతరం లేని పరిస్థితులలో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి లోక్‌సభను రద్దు చెయ్యవలసినదిగా కోరాడు.

ఇందిర ప్రజలలో సుడిగాలివలె తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చెస్తానని వారికి మాట ఇచ్చింది. ఇందిరపై ప్రజలకు గల నమ్మకం మరొకసారి ఋజువయింది. లోక్‌సభ ఎన్నికలలో 529 స్థానలకు గాను 351 స్థానాలు గెలుచుకుని తమ సత్తాను నిరూపించుకున్నది.

ప్రధానిగా మరలా ఇందిర

[మార్చు]

ఆమె స్వయంగా తెలంగాణలోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంచి ఆధిక్యతతో గెలుపొందింది. 1980 జనవరిలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇందిర తన మంత్రివర్గంలో యువజన కాంగ్రెస్ సభ్యులకు చోటిచ్చింది. ఎంతమందికి మంత్రి పదవి ఇచ్చినా తన కుమారుడైన సంజయ్ గాంధీకి మాత్రం అవకాశం ఇవ్వలేదు. అతడికి ఇంకా రాజకీయానుభవం కావాలని ఆమె ఉద్దేశం.

అప్పటికి దేశ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. 1979 లో వచ్చిన కరువు, బంగ్లాదేశ్ నుండి వచ్చిన కాందిశీకులు అస్సాంలో నివాసమేర్పరచుకొని అక్కడే ఉండిపోవడం వంటివి దేశంలోని పరిస్థితిని తలక్రిందులు చేసాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలు జనతాపార్టీ పాలనలో ఉండిపోవడం దేశ పరిస్థితిని చక్క దిద్దడానికి ఆటంకంగా మారింది. అందువల్ల 1980 ఫిబ్రవరి 13న ఆ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది.

తన మంత్రివర్గంలోని మంత్రులకు అనుభవం లేకపోవడం వల్ల ఆయా రంగాల్లో అనుభవం ఉన్నవారిని, మేధావులను వారికి సహాయకులుగా ఏర్పాటు చేసింది. నెమ్మదిగా దేశ పరిస్థితిని అదుపులోకి తీసుకు రాసాగింది. ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎదుర్కోవలసి వచ్చుంది. ఉగ్రవాదులు పంజాబ్ స్వర్ణదేవాలయం నుండి ఉద్యమాన్ని నడపాలని నిర్ణయించారు. బింద్రన్ వాలే నాయకత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఆపడానికి భారత సైన్యం సహాయంతో "ఆపరేషన్ బ్లూస్టార్" పేరుతో జరిపించిన పోరాటంలో బింద్రన్ వాలేతో పాటు ఇంకా చాలా మంది మరణించారు. కానీ స్వర్ణదేవాలయం దెబ్బతింది. దీనివల్ల సిక్కుల కోపానికి ఇందిర గురయ్యింది.

రాజకీయాల్లోకి రాజీవ్

[మార్చు]

1980 జనవరిలో ప్రధానిగా పదవిని చేపట్టిన ఇందిరకు జూన్ లో అనుకోని కష్టం ఎదురైంది. జూన్ 23న సంజయ్ గాంధీ విమానం కూలి మరణించాడు. ఆమెకు కలిగిన శోకాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు. అయినా ఆమె అంతటి కష్టాన్ని కడుపులో దాచుకొని గాంభీర్యాన్ని ప్రదర్శించింది. ఆమె పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ పైలట్ గా తన ఉద్యోగానికి రాజీనామా చేసి, సోదరుని మరణంతో కుంగిన తల్లికి తన అండదండలు అందించాడు. కానీ సంజయ్ గాంధీ భార్య (మేనకా గాంధీ) ఆమెకు దూరమయ్యింది.

1983 లో అలీనోద్యమ దేశాల సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించారు. కామన్‌వెల్త్ సమావేశాన్ని కూడా భారతదేశంలో నిర్వహించారు. దీని ద్వారా భారత దేశ కీర్తిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉంచింది.

భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక

[మార్చు]

2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను ఏడవ స్థానంలో ఎంపికైయింది.[4]

అంతిమ క్షణాలు

[మార్చు]

ఆమె తనపై హత్యాయత్నం జరుగవచ్చని అనుమానిస్తూనే ఉంది. ఆమె తన మరణం హింస వల్ల వచ్చినా, ఆశ్చర్యం లేదని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరి రక్తపు బొట్టు ఇంకిపోయేవరకు తాను దేశం కోసం శ్రమిస్తానని, ప్రజలపై తనకు గల ప్రేమను ఎవరూ చంపలేరని పత్రికల్లో ప్రకటించింది. ఆమె అన్నట్లుగానే 1984 అక్టోబరు 31న ఆమె అంగ రక్షకులే ఆమెను కాల్చి చంపారు. ఆమెను చంపిన ఇద్దరు అంగ రక్షకులూ సిక్కులే. స్వర్ణదేవాలయం దెబ్బతినడం వలన ఏర్పడిన ద్వేషానికి బలయిపోయింది.

1984లో స్వర్ణదేవాలయంలో సైనికులను పంపి ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించి సిక్కు నాయకుడు సంత్ జర్నెయిల్ సింగ్ భింద్రన్ వాలేను హతమార్చింది. చివరికదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చింది. చివరి రక్తపు బొట్టు దాకా దేశం కోసమే ధారపోస్తాననే ఆమె మాటలు 66వ ఏట నిజం అయ్యాయి. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద గురుద్వారాలో ఇందిరాగాంధీ హంతకులు సత్వంత్‌సింగ్, బియాంత్‌సింగ్‌ లతోపాటు కుట్రదారుడు కేహార్‌సింగ్‌ లకు అమర వీరుల సరసన చోటుకల్పించడం నిరసనలకు కారణమైంది. వీరిని 'షహీద్‌ భాయ్‌'లుగా అభివర్ణిస్తూ రూపొందించిన చిత్రపటాలను సిక్కు మతవిశ్వాసాల కోసం ప్రాణాలు విడిచిన వారి పటాల పక్కనే ప్రచురించారు. ఈ పరిణామంతో ఆక్‌లాండ్‌లోని సిక్కు మతస్థుల్లో విభజన ఏర్పడింది. ఇతర వర్గాల ప్రజలూ హతాశులయ్యారు.

ఇందిరా గాంధీ జీవితంలో ప్రధాన ఘట్టాలు

[మార్చు]
  • 1938: భారత జాతీయ కాంగ్రెసులో ప్రవేశం
  • 1942-3-26న ఫిరోజ్ గాంధీతో వివాహం జరిగింది. తరువాత ఇందిరాగాంధీగా మారింది.
  • 1944-8-20న రాజీవ్ గాంధీ, 1946-12-14న సంజయ్ గాంధీలకు జన్మనిచ్చింది.
  • 1955 : కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సంఘంలో ప్రవేశం
  • 1955లోనే అఖిలభారత కాంగ్రెసుకి అధ్యక్షరాలుగా ఎన్నికైనది.
  • 1966-01-10న ప్రధాని లాల్ బహుదూర్ మరణంతో ఆ స్థానానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఎన్నికైనది.
  • 1966-01-24న భారతప్రధానిగా ఎన్నికై అతిచిన్నవయసులో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది.
  • 1966 : రాజ్యసభ ద్వారా ప్రధానమంత్రి పదవి చేపటిన వ్యక్తులలో ఇందిరా గాంధీ మొట్టమొదటిది.
  • 1966-19771980-1984 : జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం పాటు ప్రధానమంత్రి పదవి చేపట్టి రెండో స్థానంలో నిల్చింది.
  • 1967-03-13న కాంగ్రెసు పార్టి నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రధానిగా 2వసారి ప్రమాణస్వీకారం చేసింది. తన పాలనలో గోల్డ్ కంట్రోల్ ను ఎత్తివేసింది.
  • 1969 : ఇందిరా కాంగ్రెస్ పార్టీ స్థాపన
  • 1971లో 19 బ్యాంకులను జాతీయం చేసింది.
  • 1971-03-18న ఎన్నికల్లో గెలిపొంది, 3వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది.
  • గరీబీ హటావో అనే నినాదంతో దేశప్రజలని ఉత్తేజపరిచింది.
  • 1971లో పాకిస్తానుతో యుద్ధం జరగగా, ఓడించింది.
  • 1971 : తూర్పు పాకిస్తాన్‌ను పాకిస్తాన్ నుండి విడదీసి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసింది.
  • 1971 : భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ కూడా ఇందిరా గాంధీ.
  • 1973 మేలో సముద్రంలోని తైలనిక్షేపాలను వెలికితీసే సాగర్ సామ్రాట్ ని ఏర్పాటుచేసింది.
  • ఈమె హయంలో రాజస్థాన్ లోని ఫోఖ్రాన్ వద్ద భూగర్బ అణుపేలుడు ప్రయోగం జరిపింది.
  • 1975-04-19న తొలిసారిగా కృత్రిమ ఉపగ్రహమైన ఆర్యభట్ట ప్రయోగం ఈమె హయంలో జరిగింది.
  • సిక్కులను భారతదేశంలో అంతర్భాగం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది.
  • 1975-06-25న దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది.
  • 1977 : ఎన్నికలలో ఓడిపోయిన మొట్టమొదట భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.
  • 1980 : కొద్ది కాలం విరామం తర్వాత మళ్ళీ భారత ప్రధానమంత్రి పదవి చేపట్టిన వారిలో మొట్టమొదటి వ్యక్తి.
  • ఈమె హయంలో ఆలీనోద్యమం కొత్త రూపు సంతరించుకుంది.
  • 1983లో కామన్వెల్త్ ప్రధానుల సభను నిర్వహించింది.
  • సిక్కుల పవిత్రదేవాలయం స్వర్ణమందిరాన్ని నివాసం చేసుకొని మారణకాండ సాగించిన ఉగ్రవాది బిందైన్ వాలా. బిందైన్ వాలాపై దాడికోసం స్వర్ణదేవాలయంలోకి సైన్యాన్ని పంపించి, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు. ఈ దాడియే ఆపరేషన్ బ్లూస్టార్గా ప్రసిద్ధిగాంచింది.
  • ఈమె ఆర్థిక కార్యక్రమంపై 20 సూత్రాలని కూడా అమలపరిచింది.
  • 1983: అలీన దేశాల సదస్సును ఢిల్లీలో నిర్వహించింది.
  • 1984 : ఆపరేషన్ బ్లూ స్టార్ చర్యకు ఆదేశం
  • 1984-10-31న ఉదయం 9గంటల 16 నిమిషాలకి ఈమెను ఈమె అంగరక్షకులే కాల్చగా, స్వంతయింటిలోనే మరణించెను. హత్యకు గురైన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి కూడా ఇందిరా గాంధీ.
  • ఈమె సమాధి నిర్మించిన ప్రదేశానికి శక్తిస్థల్ అని పేరుపెట్టారు. ది ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్ 1966-1969, ది ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్ 1969-1972, ఇండియా 1975 మొదలగు పుస్తకాలు రచించెను.
  • 1953లో ఈమె సేవలకు అమెరికా వారిచే మదర్స్ అవార్డ్,
  • 1960లో ఏల్ యూనివర్షిటీ వారిచే హాలెండ్ మెమొరియల్ అవార్డ్,
  • 1965లో ఇటాలియన్ ఇసబెల్లా డిఎస్టే అవార్డులు వరించాయి.
  • 1967, 1968లల్లో రెండుసార్లు ఈమెని ఫ్రెంచ్ ప్రజలు, మిక్కిలి అభిమాన పాత్రురాలైన నాయకురాలుగా, ఎన్నుకున్నారు.
  • అంతరిక్షంలో ఉన్న వ్యోమగామితో మాట్లాడిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ

అమెరికావారి గ్యాలప్ పోల్ లో ప్రపంచాభిమానిగా ఈమె యావత్ ప్రపంచ ప్రజల అభిమానాన్ని పొందింది. అక్టోబరు 31న ఈమె వర్థంతిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ప్రధానంగా ఈమె హయంలో రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచన, 1971 పాకిస్తాన్తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందిననూ 1975 నాటి అత్యవసర పరిస్థితి, స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల తీవ్ర విమర్శల పాలైంది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైంది.

సంతానం / వారసులు

[మార్చు]

ఇందిరా గాంధీకి ఇద్దరు కుమారులు - రాజీవ్ గాంధీ (1944 - 1991), సంజయ్ గాంధీ (1946 - 1980) . సంజయ్ గాంధీని రాజకీయాలలో తెచ్చి, అత్యవసర పరిస్థితి కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. సంజయ్ ని తన రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దాలన్న సమయంలో విమాన ప్రమాదంలో మరణించాడు. ఆ తర్వాత 1981 ఫిబ్రవరిలో పైలట్ ఉద్యోగాన్ని వదలి రాజీవ్ గాంధీ రాజకీయాలలో ప్రవేశించాడు. ఇందిర హత్య అనంతరం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టి అత్యంత పిన్న వయస్సులో ఆ పదవిని చేపట్టిన రికార్డు సృష్టించాడు. అయితే బోఫోర్స్ కేసులో ఇరుక్కొని ఎన్నికలలో ఓటమిపాలైనాడు. 1991 మేలో శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ప్రచారం సమయంలో తమిళ ఈలం మానవ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవిలో ఉంటూ 2004 లోక్‌సభ ఎన్నికలలో యూ.పి.ఏ. కూటమితో కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, కుమారై ప్రియాంకలు కూడా రాజకీయాలలో ప్రవేశించారు.
సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ సంజయ్ మరణం తర్వాత ఇంటి నుంచి గెంటివేయబడింది. వేరు కుంపటి పెట్టి సంజయ్ విచార్ మంచ్ పార్టీ పెట్టిననూ మంచి ఆదరణ పొందలేదు. సంజయ్ గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సభ్యుడు.

బిరుదులు

[మార్చు]
  • 1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను స్వీకరించి ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా స్థానం సంపాదించింది.
  • 1983-84 లో రష్యా దేశపు లెనిన్ శాంతి బహుమతి లభించింది

ప్రాచుర్యం

[మార్చు]
  • 1971 లో బంగ్లాదేశ్ విమోచనాన్ని విజయవంతంగా సాధించిన సందర్భంలో నాటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి ఆమెను దుర్గామాతగా కీర్తించాడు.[5]

విమర్శలు

[మార్చు]

ఇందిరా గాంధీ స్వతంత్ర భారతదేశంలో పలు రాజ్యాంగ వ్యవస్థల పతనానికి నాంది పలికిన ప్రధానిగా విమర్శలు ఎదుర్కొంది.

ప్రచురణలు

[మార్చు]

పుస్తకాలు

[మార్చు]

1. *Indira: The Life of Indira Nehru Gandhi

2. *indira gandhi: Daughter of India

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. Gandhi, Indira. (1982) My Truth
  2. Frank, Katherine. (2001) Indira: The Life of Indira Nehru Gandhi.
  3. Frank, Katherine. (2001) Indira: The Life of Indira Nehru Gandhi. Page 186
  4. "A Measure Of The Man | Outlook India Magazine". web.archive.org. 2021-07-24. Archived from the original on 2021-07-24. Retrieved 2021-10-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. http://www.india-today.com/itoday/millennium/100people/indira.html Archived 2007-10-24 at the Wayback Machine ఇందిరా గాంధీ గురించి ఇండియా టుడేలో వచ్చిన వ్యాసం

బయటి లింకులు

[మార్చు]


ఇంతకు ముందు ఉన్నవారు:
గుర్జారీలాల్ నందా
భారత ప్రధానమంత్రి
24/01/1966—24/03/1977
తరువాత వచ్చినవారు:
మొరార్జీ దేశాయ్


ఇంతకు ముందు ఉన్నవారు:
చరణ్ సింగ్
భారత ప్రధానమంత్రి
14/01/1980—31/10/1984
తరువాత వచ్చినవారు:
రాజీవ్ గాంధీ