పాండురంగ వామన్ కాణే

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మహామహోపాధ్యాయ ఆచార్య పాండురంగ వామన్ కాణే (1880-1972) ప్రముఖ భారతీయవేత్త, సంస్కృత పండితుడు. ఈయన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఒక సాంప్రదాయ చిత్‌పవన బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.

ప్రసిధ్ధ ప్రచురణలు[మార్చు]

ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే టౌను హాలు; కాణే తన పరిశోధనలకు ఇక్కడి వనరులను వాడారు.

హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర (ధర్మశాస్త్రం చరిత్ర) అను ఉద్గ్రంథాన్ని రచించినందుకు డా. కాణే పేరు పొందారు. ఏన్షెంట్ అండ్ మిడీవల్ రెలిజియన్స్ అండ్ సివిల్ లా ఇన్ ఇండియా (భారతదేశముయందలి ప్రాచీన, మధ్య తరపు మతవిశ్వాసములు మరియు వ్యవహార చట్టము) అను ఉపశీర్షికతో ఈ పుస్తకం ప్రచురింపబడింది. శతాబ్దాలుగా వెలువడిన పలు తాళపత్రగ్రంథాల మొదలు పుస్తకాల వరకు పరిశోధించిన డా. కాణే ఈ పుస్తకము ద్వారా భారతదేశముయందలి ప్రాచీన, మధ్య తరాలలో న్యాయవర్తనయొక్క పరిణామక్రమము గురించి తెలియజేసెను. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే, భండార్కర్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రఖ్యాత సంస్థలలో లభ్యమయిన వనరులను డా. కాణే తన పరిశోధనలో ఉపయోగించారు. ఆరువేలఅయిదువందల పుటల పైబడి ఉన్న ఈ గ్రంథము ఐదు సంపుట్లలో ప్రచురితమయ్యింది; మొదటి సంపుటి 1930లో ప్రచురింపబడగా చివరి సంపుటి 1962లో ప్రచురింపబడింది. ఈ గ్రంథము విషయవైశాల్యము, లోతైన పరిశోధనలకు పేరు పొందినది - డా. కాణే మహాభారతం, పురాణాలు, చాణక్యుడు వంటి విభిన్న దృక్పథాల రచనలను సంప్రదించడమే కాక, అప్పటివరకు జనసామాన్యానికి తెలియని ఎన్నో పుస్తకాలను సంప్రదించారు. ఈ గ్రంథ వైశిష్ట్యము ఆయన సంస్కృత భాషా ప్రావీణ్యానికి ఆపాదించబడింది. పురాణాలు మున్నగు గ్రంథాలను పూజాభావముతో కాక అపేక్షాభావముతో పరిశోధించినందువలనే ఆయన కృతార్థులయ్యారని ఒక భావన.

వ్యవహారమయూఖ అను పుస్తకరచనలో భాగంగా, చదువరులకు ఉపయుక్తముగా ఉండుటకు ధర్మశాస్త్రచరిత్ర గురించి ఒక ముందుమాట వ్రాయడానికి కాణే పూనుకున్నారు. కాలక్రమంలో ఆ బీజం మహావృక్షమై హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్రగా రూపు దిద్దుకుంది. ఈ ఉద్గ్రంథాన్ని ఆంగ్లభాషలో రచించినప్పటికీ, "ధర్మ" అను పదానికి సరిసమానమైన అర్థం ఇవ్వగల పదమేదీ ఆంగ్లభాషలో లేదని కాణే అభిప్రాయపడ్డారు. ఆంగ్ల, సంస్కృత, మరాఠీభాషలలోని ఆయన రచనలు దాదాపు పదిహేనువేలపుటలదాకా ఉన్నాయి.

గుర్తింపు[మార్చు]

ఆచార్య కాణే "మహామహోపాధ్యాయ" బిరుదుతో గుర్తింపబడ్డారు. ఆయన బొంబాయి విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు. భారతీయత్వ విద్యకై (Indology or Indic studies: ఇండాలజీ లేక ఇండిక్ స్టడీస్) నెలెకొల్పబడిన కురుక్షేత్ర విశ్వవిద్యాలయం స్థాపనకై ఆయన సేవలు వినియోగించుకోబడినాయి. 1956లో ఆయన పరిశోధనాగ్రంథం అయిన హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర వాల్యూమ్ IVకు (ధర్మశాస్త్రం చరిత్ర నాల్గవ సంపుటి) సంస్కృతానువాదం విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన భారతీయ విద్యా భవన్లో గౌరవసభ్యునిగా ఉన్నారు.

విద్యారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయనను రాజ్యసభ సభ్యునిగా నియమించింది. 1963లో సర్వోత్తమమైన భారతరత్న అవార్డుతో ఆయన గౌరవించబడ్డారు.

ఇతరాలు[మార్చు]

ప్రజలకు హక్కులే గానీ బాధ్యతలు లేవు అన్న తప్పుడు అభిప్రాయం కలుగజేయడం ద్వారా భారత రాజ్యాంగము దేశములోని సాంప్రదాయిక ఆలోచనలను ప్రక్కన పెట్టిందని కాణే అభిప్రాయపడ్డారు.

ఆయన ఉద్గ్రంథముయొక్క సాధికార ప్రవృత్తి వలన, విజ్ఞాన సర్వస్వమువలె వైశాల్యము కలిగియుండుట వలన, పెక్కుమార్లు అది రాజకీయచర్చలలో చోటుచేసుకున్నది. అటువంటి ఒక సందర్భము అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వ హయాములో చోటుచేసుకుంది: ప్రాచీన భారతీయులు గోమాంసము భుజించెడివారా, లేదా అను అంశముపై రెండు వర్గాలవారూ తమ వాదనను బలపరుచుకోవటానికి కాణే పుస్తకాలలోని వివిధ భాగాలను ఉటంకించారు. సాంప్రదాయికముగా హిందువులు ఆవులను గోమాతగా పూజించుట వలన గోమాంసము వారికి నిషిధ్ధము; అందువలన ఈ వాదోపవాదములు మిక్కిలి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అటులనే ఇంకొక సందర్భములో యజ్ఞోపవీతధారణ అవకాశము నేడు కేవలము పురుషులకే లభ్యమయినప్పటికీ పూర్వకాలములో మహిళలు కూడా యజ్ఞోపవీతం ధరించేవారా, లేదా అన్న అంశము పై కాణే రచనలను ప్రామాణికముగా తీసుకుని వాదన జరిగింది.

స్మరణ[మార్చు]

1974లో కాణే జ్ఞాపకార్ధంగా ప్రాచ్యశాస్త్ర విద్యలో (Oriental studies: ఓరియంటల్ స్టడీస్) పరిశోధనను పెంపొందించి, ప్రోత్సహించి, పోషించే నిమిత్తం, ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే వారు మహామహోపాధ్యాయ డా. పి. వి. కాణే ఇన్స్టిట్యూట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అండ్ రిసర్చ్ను (మహామహోపాధ్యాయ డా. పి. వి. కాణే స్నాతకోత్తర విద్య మరియు పరిశోధనా సంస్థ) నెలకొల్పారు. అంతేగాక, ప్రతి మూడు సంవత్సరములకు ఒక మారు, వైదిక, ధర్మశాస్త్ర, అలంకార సాహిత్యాలలో విశేష కృషిని కనపరిచిన ఒక పరిశోధకునికి మహామహోపాధ్యాయ డా. పి. వి. కాణే స్వర్ణ పతకము ఇవ్వబడుతోంది.

మూలాలు (ఆంగ్లములో)[మార్చు]

  1. మహామహోపాధ్యాయ డా. పి. వి. కాణే పై ఒక వ్యాసము
  2. హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర ఐదు సంపుటిల ప్రచురణ సంవత్సరాలు
  3. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గురించి
  4. భారతీయ విద్యా భవన్ గౌరవ సభ్యత్వం గురించి
  5. మహామహోపాధ్యాయ డా. పి. వి. కాణే ఉద్గ్రంథ పరిణామక్రమము
  6. భారత రాజ్యాంగము - దేశములోని సాంప్రదాయిక ఆలోచనలు
  7. ఒక వాదన: ప్రాచీన భారతీయులు గోమాంసము భుజించెడివారు - డా. పి. వి. కాణే ప్రచురణల నుండి ఋజువులు
  8. ఒక వాదన: ప్రాచీన భారతీయులు గోమాంసము భుజించెడివారు కారు - డా. పి. వి. కాణే ప్రచురణల నుండి ఋజువులు
  9. డా. కాణే గురించి (విభాగము 2.2) (జర్మను సైటు, డా. కాణే గురించి ఆంగ్లములో)
  10. ధర్మశాస్త్ర సాహిత్యము - కాణే కాలక్రమ వర్గీకరణ (వ్యాసము చివరలో ఇవ్వబడినది) (జర్మను సైటు, కాలక్రమ వర్గీకరణ ఆంగ్లములో)