విజయలక్ష్మి పండిట్
విజయలక్ష్మి పండిట్ | |
---|---|
జననం | స్వరూప కుమారి 1900 ఆగస్టు 18 |
మరణం | 1990 డిసెంబరు 1 | (వయసు 90)
జాతీయత | హిందూ మతము |
ఇతర పేర్లు | విజయలక్ష్మి పండిట్ |
వృత్తి | రాజకీయనాయకురాలు మహారాష్ట్ర గవర్నర్ యు.ఎస్.ఎ.రాయబారి సోవియట్ యూనియన్ రాయబారి మెక్సికో రాయబారి స్పెయిన్ రాయబారి ఐర్లండ్ రాయబారి యునైటెడ్ కింగ్‍డం హై కమీషనర్ మొదటి మహిళా మంత్రి |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
జీవిత భాగస్వామి | రంజిత్ సీతారామ్ పండిట్ |
పిల్లలు | చంద్రలేఖ, నయనతార సెహగల్, రీటా |
తల్లిదండ్రులు |
|
విజయలక్ష్మి పండిట్ (1900 ఆగస్టు 18 - 1990 డిసెంబర్ 1) సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్య వేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి మోతీలాల్ నెహ్రూ. జవహర్‌లాల్ నెహ్రూ సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి గాంచింది. 1962 నుండి 1964 వరకు మహారాష్ట్ర గవర్నరుగా పనిచేసింది. 1921లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్ సీతారామ్ పండిట్ ను వివాహమాడింది. అప్పటి సంప్రదాయాల ప్రకారం ఆమె పేరును విజయలక్ష్మి పండిట్ గా మార్చడం జరిగింది.
భారత స్వాతంత్ర సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలకూ, కారాగార శిక్షలనూ, సైతం లెక్క చేయకుండా, తమ ధన మాన ప్రాణాలను దేశమాత స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహాపురుషులు, వీరవనితలందరిలో విజయలక్ష్మీ పండిట్ కూడా ఒకరు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి పొందిన మహిళ ఈమె. నెహ్రూ వంశీయులది పూర్వం కాశ్మీరు. నెహ్రూ వంశీయులు కాశ్మీరు నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.[1]
బాల్యం
[మార్చు]మోతీలాల్ నెహ్రూ దంపతులకు విజయలక్ష్మీ పండిత్ సా.శ. 1900 సం. ఆగష్టు 18 వ తేదీన జన్మించారు. జవహర్‍లాల్ నెహ్రూ ఈమె సోదరుడు. నెహ్రూ కన్నా పండిట్ పదకొండు సంవత్సరాలు చిన్నది.
జవహర్‍లాల్ నెహ్రూ, విజయలక్ష్మీ పండిట్ ల తల్లి స్వరూపరాణి నెహ్రూ. చిన్నతనంలో విజయలక్ష్మీ పండిట్ స్వరూపకుమారిగా పిలువబదుతుండేది. జవహర్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ వకీలుగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు బాగా ధనం కూడా సంపాదించిన వ్యక్తి. మోతీలాల్ కుటుంబం చాలా సంపన్న మైన కుటుంబం కావటంతో అందమైన, అధునాతనమైన భవనంలో నివసించేవారు. ఈ భవనమే (ఆనంద భవన్) గా పిలువబడేది. భవనానికి తగిన తోట, టెన్నీసు కోర్టు, చుట్టూ చిన్నచిన్న ఔట్ హౌస్ లు, ఈదేందుకు స్విమ్మింగ్ పూల్ మొదలైన నాగరిక యేర్పాట్లతో దాస దాసీ జనాలతో మహారాజ కుటుంబంలాగా ఉండేది. వీరి కుటుంబం ఆనంద భవన్ అలహాబాద్లో ఉండేది.
మోతీలాల్ ను చిన్నతనం నుంచీ, విదేశీ నాగరికత, వారి ఆచార వ్యవహారాలంటే మక్కువ. ఇంట్లో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు, వారిని సక్రమంగా పెంచేందుకు ఆంగ్లేయ వనితలే ఉండేవారు. అందువల్లనే మోతీలాల్ పిల్లలైన జవహర్ లాల్, విజయలక్ష్మీ పండిత్ ఆమె సోదరి కృష్ణలను కూడా చిన్నతనం నుంచీ పాశ్చాత్యుల నాగరికత అలవాటై పోయింది.
పూర్వం విద్యార్థి విద్యార్థినులు వారి వారి స్థితిని వట్టి ఆధారపడుతుండేది. వారి చదువు, ఇప్పటి మాదిరిగా ధనికుల బిడ్డలు కూడా పాఠశాలకు వెళ్ళేవారు కాదు. వారి వారి హోదాలకు తగినట్లు స్త్రీలను కానీ, పురుషులను కానీ, ఉపాధ్యాయులుగా ఎన్నిక చేసి వారిని ఇండ్లకు వచ్చి విద్యాబోధన చేయమనేవారు. విజయలక్ష్మీ కి ఆమె సోదరి కృష్ణకూ, విద్యాధికురాలైన ఒక ఆంగ్ల వనిత ఉపాధ్యాయినిగా ఉండి వారికి శిక్షణ చేయిస్తూండేది.
చిన్నతనం నుంచీ, విదేశీ క్రమశిక్షణ ప్రకారం నియమిత వేళలకు వారి పనులు వారు చేసుకునే క్రమశిక్షణ అలవాటైపోయించి. చక్కని స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు మధ్య హుందాగా పెరిగారు పిల్లలు.
మోతీలాల్ కుటుంబంలో వారంతా ఆరోగ్యం విషయంలో పిల్లలతో సహా మంచి శ్రద్ధ తీసుకునేవారు. ఉదయం సమయంలో నడక, గుర్రపు స్వారీ వంటివి చేస్తూ చక్కని శరీర పోషణను అభివృద్ధి చేసుకునేవారు. వేళకు చదువు, భోజనం, విశ్రాంతి మిత్రులతో కలసి ఆటపాటలు అందుబాటులో ఉన్న వినోద కార్యక్రమాలకు హాజరు కావటం వంటి కాలక్షేపాలతో ఒక నియమ బద్ధమైన వాతావరణంలో ఆ కుటుంబం పెరిగింది.
మోతీలాల్ తన వృత్తిలో గంట విరామం లేకుండాచదువుతున్నా, పిల్లల కోసం ఒక సమయం కేటాయించి వారితో సరదాగా కాలక్షేపం చేసేవాడు. పెంపక విధానంలో ఆడా, మగా అన్న భేదం ఉండేది కాదాయనకు. పసిపిల్లల మానసిక విధానం చాలా సున్నితంగా ఉంటుంది. అన్నదమ్ములతో గాని, అక్కచెల్లెళ్ళతో గాని, వారు సమాన గౌరవాభిమానాలు తల్లిదండ్రులనించి పొందగలిగినప్పుడే వారు సవ్యమైన పంధాలో పెరగగలరు. మగవారిని ఎక్కువగా ప్రేమించే ఆడపిల్లలు గదాని అయిన దానికి, కానిదానికి వారికి ఆంక్షలు విధించటం కోపగించటం వంటి పనులు చేస్తుంటే వారిలో అసూయ ద్వేషాలు మొదలైన లక్షణాలు తలెత్తే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయం.
అయితే చాలామంది మోతీలాల్ బంధువులకూ స్నేహితులకూ, ఈ పద్ధతి కాస్త విచిత్రంగా తోచి వారి గుర్రపు స్వారీ మొదలైన విషయాలలో ఆయనకు సలహాలిస్తూండేవారు. అయినా వారి మాటలు పాటించేవాడు కాడాయన. స్వరూపకుమారిది చిన్నితనం నుంచీ, చాలా సున్నితమైన మనస్తత్వం. ప్రతి విషయం చురుకుగా, లోతుగా పరిశీలనా దృష్టితో ఆలోచించటం ఆమెకు అవవాటైపోయింది. చక్కని రూపం ఆ రూపానికి తగిన అందం. ఈ అందచందాలకు తగిన సునిశిత మేధస్సు ఆమెకు ప్రత్యేక లక్షణాలు.
తనకు సంరక్షకురాలైన ఆంగ్ల వనిత నియమాలను శ్రద్ధగా పాటించే దామె. వీరిని పెంచే విధానంలో ఆమె ఒకే రకమైన శ్రద్ధ తీసుకున్నా, ఆమె పాటించే నియమాలు కొంత వరకు స్వరూపకుమారి చెల్లెలయిన కృష్ణ కు వచ్చేవి కావు. స్వరూపకుమారి చిన్నతనం నుంచి మంచి ధైర్యం గల మనిషి. ప్రతి దానికి సిగ్గుపడటం భయపడటం లాంటివి ఆమెకు నచ్చేవి కావు. చెప్పదలుచుకున్నది కుండపగలకొట్టినట్లు చెప్పేది.
విద్యాభ్యాసం
[మార్చు]స్వరూపకుమారి అయిదు సంవత్సరాల వయస్సులో 1905 సంవత్సరం మే నెలలో జవహర్ లాల్ విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్ళాడు. కుమారునితో పాటు కుటుంబమంతా వెళ్ళారు. జవహర్ లాల్ లండన్ హోరో విశ్వవిద్యాలయంలో చేరాడు. కుమారుడ్ని అక్కడ చదివేందుకు అన్ని ఏర్పాట్లు చేసి మోతీలాల్ భార్య పిల్లలతో ప్రపంచ యాత్ర చేశాడు.
మోతీలాల్ తన కుటుంబంతో ఇండియా చేరేసరికి ఇండియాలో రాజకీయ కల్లోలం తయారైంది. అంతకు పూర్వం పరాయి వారొచ్చి తమ మీద అధికారం చెలాయిస్తున్నారన్న విషయం బాధ కలిగించినా, ఐకమత్యాలు, అవగాహనలు లేకపోవటం వలన వారినే పాలకులుగా అనుమతించారు మనవారు. రోజు రోజుకు బ్రిటిష్ పాలకుల దురాగతాలూ, అత్యాచారాలూ ఎక్కువైపోతున్నాయి. భారతీయుల స్వేచ్ఛకు ఎక్కుబ భంగం కలుగుతోంది. చేయని నేరాలకు శిక్షలు, పండని పంటలకు పన్నులు, ప్రకృతి ప్రసాదించే వస్తువులపై కూడా విపరీయమైన పన్నులు వేయడం, కట్టలేని వారి ఆస్తులు పశువులు జప్తు చేసి స్వాధీనం చేసుకోవడం వంటివి ఎక్కువైపోయాయి. భారతీయులను ఇంకొంచెం వేధించేందుకు కర్జను ప్రభువు వంగదేశాన్ని రెండు భాగాలుగా విభజించి, ఒక భాగంలో మహమ్మదీయులకు ఎక్కువ ప్రాముఖ్యం కలిపించి, హిందూ, ముస్లిం లకు మత కల్లోలాలు సృష్టించాడు. దీనితో దేశంలో అంతః కలహాలు ప్రారంభమైనాయి. 1906 లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడైన దాదాబాయి నౌరోజి, స్వరాజ్యం అనే నినాదం లేవనెత్తాడు. తర్వాత విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వరాజ్యం సాధించటం జాతీయ విద్య అమలుపరచడం వంటి విషయాలలో చాలా ఉద్యమాలు ప్రారంభమైనాయి. ఈ భావాలను 1908 లో బిపిన్ చంద్రపాల్ ప్రచారం చేసారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో అతివాదులు, మితవాదులు అనే రెండు భాలుగా విడిపోయారు.తిలక్ మహాశయుడు కూడా యీ అతివాద ధోరణి వల్లనే ప్రభుత్వం చేత ఆరు సంవత్సరాలు కఠిన కారాగాల శిక్ష విధించబడి 1908 లో మండలే జైలుకు వెళ్ళాడు.
మతవాదుల ఉద్యమాల వలన మోతీలాల్ అంతగా ఆకర్షించపడక పోయినా, 1915 వ సంవత్సరంలో జరిగిన హోంరూలు ఉద్యమము నుంచీ, మోతీలాల్ రాజకీయాలపైన ఆసక్తి యెర్పడింది. 1915 నాటికి అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజంలో ఉంది. అప్పతికి తిలక్ జైలు నుంచి విడుదలవటం జవహర్ లాల్ ఇంగ్లాండులో బారిష్టరు డిగ్రీతో ఇండియాకు వచ్చి న్యాయవాద వృత్తి ప్రారంభించటం, దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ రావటం లాంటివి జరిగాయి.
మోతీలాల్ రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచీ, కాంగ్రెస్ నాయకులు చాలామంది "ఆనంద భవనానికి" రాకపోకలు ఎక్కువ చేశారు. అందువలన స్వరూపరాణికి తండ్రి గారి మూలముగా చిన్నతనం నుంచే అఖిలభారత కాంగ్రెస్ నాయకులందరితో పరిచయాలు ప్రారంభమైనాయి. 1915 వ సంవత్సరం కాంగ్రెస్ మహాసభలు బొంబాయిలో జరిగాయి. ముస్లింలీగ్ సమావేశాలు కూడా అక్కదే జరిగాయి. మోతీలాల్ తో పాటు స్వరూప కుమారి యీ రెండు సమావేశాలకు హాజరైనా, ఆమెకు రాజకీయాలపైన పెద్ద పరిశీలనా దృష్టి లెకపోవడంతో సమస్యలు క్షుణ్ణంగా అర్థమయ్యేవి కావు. అయినా ఆమెకు దేశ పరిస్థితులు, ఉద్యమ విధానాలు తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రం ఉండేది.
1916 వ సంవత్సరంలో స్వరూపకుమారి అన్న గారైన జవహర్ లాల్ నెహ్రూ కు కమలా నెహ్రూతో ఢిల్లీలో వివాహమైంది. మోతీలాల్ బాగా ధనవంతుడవడం వలన వివాహం చాల ఆడంబరంగా జరిగింది. వారు కాశ్మీరు విహార యాత్రకు వెళుతూ వారి వెంట స్వరూప కుమారి కూడా వెళ్ళింది. వీరు కాశ్మీరు అందచందాలను చూసి మొదటి ప్రపంచ యుద్ధం అయ్యాక తిరిగి వచ్చారు. తండ్రీ కుమారులు యుద్ధ వార్తలు చాలా కుతూహలంగా వింటూ చర్చించుకొనేవారు. తండ్రి అన్నతో స్వరూప కుమారి కూడా ఆ వార్తలూ, వీరి నిర్ణయాలూ వింటూ పరిస్థితులను కొంత అవగాహన చేసుకుండేది.
స్వరూప కుమారి ఆమె సోదరి కృష్ణ లకు కవిత్వమంటే మంచి ఆసక్తి. వారిద్దరూ ఎక్కువ కాలం వారి తోటలో కూర్చుని సాయంకాల సమయాలలో కవిత్వ ప్రసంగాలతో కాలము వెళ్ళబుచ్చేవారు. స్వరూప కుమారి పదిహేడవ ఏట ఆమె సంరక్షకురాలైన ఆంగ్ల వనిత వెళ్ళిపోయింది. సోదరి కృష్ణకు ఆమె అన్ని విధాల చేదోడుగా ఉంటూ, పది సంవత్సరాల కృష్ణకు ఆమె ఎంతో విజ్ఞానాన్ని బోధిస్తూ ఆమెను విపరీతంగా ప్రేమించింది.
స్వరూప కుమారికి కసలు పాఠశాల విద్యంటే తెలియదు. జలియన్ వాలా బాగ్ ఉదంతంతో ఉద్యమం గాంధీజీ నాయకత్వంలో ఉదృతమైనది. ఈ సంఘటనలన్నీ మోతీలార్ పూర్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఉపకరించాయి. గాంధీజీ, మోతీలాల్ చర్చల ఫలితంగా ఆ సంవత్సరం అమృత్ సర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభకు మోతీలాల్ అధ్యక్షుడు. జలియన్ వాలా బాగ్ ఉదంతంతో మోతీలాల్ కుటుంబమంతా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో మోతీలాల్ కుటుంబమంతా పాల్గొన్నారు.
వివాహం
[మార్చు]కథియవార్ లో రంజిత పండిట్ అనే ఒక న్యాయవాది ఉండేవాడు. ఆయన ఉత్తమైన వ్యక్తి. విద్యాధికుడు. మహదేవ దేశాయ్]], రంజిత పండిట్ లు ఇద్దరూ కలిసి చదువుకున్నారు. మహదేవ దేశాయ్ గాంధీజీకి అంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. రంజిత పండిట్ కూ, స్వరూప కూమారీలకు 1921 సంవత్సరం మే 10 వ తారీఖున వివాహం జరిగింది. వీరి వివాహానికి గాంధీజీతో సహా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అందరూ హాజరయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేసం యేర్పాటు చేయబడింది. ఓప్రక్క విజయలక్ష్మీ పండిట్ వివాహం, మరోప్రక్క వర్కింగ్ కమిటీ సమావేశంతో అలహాబాద్ కళ కళ లాడింది. వీరిద్ధరూ ఆదర్శ దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. పండిట్ విద్యాధికుడూ, జ్ఞాని అని గ్రహించిన విజయలక్ష్మి అతని శిష్యురాలిగానే నదుచుకుంది. విజయలక్ష్మీ ని కేవలం రూపసికాకల్, సంసార లక్షణాలుగల యువతిగా అభిమానించిన రంజిత్ పండిట్ అభిప్రాయం చివరివరకూ అదే మాదిరిగా ఉండేది. వీరి జీవితం ఆదర్శం. వీరి ఆశయాలు మహోన్నతమైనవి. చంద్రలేఖ, నయనతార, రీటా ఈ ముగ్గురూ ఈ దంపతులకు కలిగిన కుమార్తెలు.
భర్తతో కలిసి యూరప్ పర్యటన
[మార్చు]సబర్మతీ ఆశ్రమంలో ఉన్నపుడైనా, మోతీలాల్, గాంధీజీ అభిప్రాయాలతో ఏకీభవించలేక పోయ్యాడు. విజయలక్ష్మీ పండిట్, రంజిత్ పండిట్ లు ఐరోపా అంతా తిరగాలనిపించి 1925లో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకొనే సమయానికి అన్న గారి భార్త కమలకు ఆరోగ్యం పాడై స్విట్జర్ లాండ్ తీసుకు వెళ్ళవలసి వచ్చి, జవహర్‍లాల్ భార్య, కుమార్తె లతో కలసి ఐరోపా కు బయలుదేరాడు. విజయలక్ష్మి, రంజిత్ లు కూడా వారితో కలసి వెళ్ళారు. ఈ దంపతులిద్దరూ కొంతకాలం యాత్ర చేసి, వివిధ దేశాల ఆర్థిక రాజకీయ, సాంఘిక పరిస్థితులను స్వయంగా చూసి తిరిగి ఇండియా చేరుకున్నారు. 1927 వ సంవత్సరం మోతీలాలు కూడా ఐరోపా వెళ్ళాడు. ఆయన అక్కడ ఉండగానే విజయలక్ష్మి, రంజిత్ లు తిరిగి ఐరోపా బయలుదేరి వెళ్ళారు.
గాంధీజీ ఉప్పుసత్యాగ్రహంలో విజయలక్ష్మి
[మార్చు]1930 వ సంవత్సరం మార్చి 12 తేదీన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ అలహాబాద్లో జవహర్ లాల్ నెహ్రూ, ఉప్పు తయారుచేసే సంఘటనలో విజయలక్ష్మీ, కృష్ణ ఇద్దరూ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అదే సంవత్సరం ఏప్రిల్ 14 వతేదీ జవరల్ లాల్ అరెష్టు అయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా తాత్కాలికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండవలసి వచ్చింది. ఉప్పు సత్యాగ్రహంలో చాలా సమావేశాలలో విజయలక్ష్మీ పండిట్ ఉత్సాహంగా పాల్గొని విరివిగా ఉపన్యాసాలిచ్చింది. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ, ఉత్సరాలూ, ఊరేగింపులూ జరిపింది. అన్ని రకాలుగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఎన్నో రకాలుగా ప్రభుత్వం చేత మోసగింపబడే భారతీయులకు తను చేతనైన సహాయం చేయడం ఒక భారత మహిళగా తన కర్తవ్యమని భావించిన విజయలక్ష్మీ పండిట్ ప్రభుత్వాజ్ఞలను గూడా ధిక్కరించి ఉద్యమ ప్రచారము చేసింది.
జూన్ లో తండ్రితో కలిసి బొంబాయి వెళ్ళినపుడు ప్రభుత్వం మోతీలాల్ నూ, కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టు చేసింది. అయినా కాంగ్రెస్ లో ఎప్పటి కప్పుడు సభ్యులు చేరుతూనే ఉన్నారు. ఇది జరిగిన కొద్దికాలానికి జవహర్ లాల్ నెహ్రూ ను రంజిత్ పండిట్ ను ప్రభుత్వం అరెష్టు చేసి చైనీ సెంట్రల్ జైలుకు పంపింది. మోతీలా అనారోగ్యంగా ఉండటం వలన ఆయనను విడుదల చేసింది. అదే సమయంల్ జవహర్ లాల్ కూడా విడుదలయ్యాడు. మోతీలాల్ అలహాబాద్ వచ్చినప్పటి నుండి విజయలక్ష్మీ, కృష్ణ వీరంతా సహాయ నిరాకరణోద్యమంలో పనిచేస్తూనే ఉన్నారు. నైనీ జైల్లో పండిట్ తో పాటు మదన్ మోహన్ మాలవ్య ఉండేవాడు. రంజిత్ వద్ద మాలవ్య జర్మనీ భాష నేర్చుకున్నాడు. రంజిత్ జర్మనీ, ఫ్రెంచ్, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో రంజిత్ మంచి పండితుడు.
మోతీలాల్ ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఆయనకు లక్నోలో జవహర్ లాల్, విజయలక్ష్మి, కమలా నెహ్రూ లు అంతా సేవలు చేస్తూనే ఉన్నారు. కానీ 1931 వ సంవత్సరం ఫిబ్రవరి 6 వ తేదీన మోతీలాల్ మరణించాడు.ఆ సంవత్సరం కరాచీలో జరిగిన కాంగ్రెస్ సభకు విజయలక్ష్మీ వెళ్ళలేదు. ఇర్విన్ సంప్రదింపులు వ్యర్థమై గాంధీజీ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్సు కు వెళ్ళి లండన్ నుంచి వస్తూంటే బొంబాయి వెళ్ళి ఆయనకు స్వాగతము చెప్పాలనుకున్న జవహర్ లాల్ ను అరెష్టు చేశారు. ఆ తరువాత బాపూజీ, పటేలు కూడా అరెష్టయ్యారు. ఈ ఉధ్యమంలో విజయలక్ష్మీ పండిట్, కమల, స్వరూపరాణి మొదలైన వారంతా ముమ్మరంగా ప్రచారం చేశారు.
విజయలక్ష్మీ పండిట్ కు సభలూ, సమావేశాల్లోనూ పాల్గొనకూడదని ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఒక రోజు అలహాబాద్లో జరిగిన బహిరంగ సభలో స్వరూపరాణి ఉపన్యసిస్తుంటే, ప్రభుత్వం లాఠీ చార్జీ అరెస్టులు జరిపించింది. విజయలక్ష్మీ పండిట్ ను అక్కడ అరెస్టు చేస్తే, ఉద్యమం తీవ్రమౌతుందని ప్రభుత్వం మరుసటి రోజు ఉదయం ఆనందభవన్ వద్ద ఆమెను, ఆమె సోదరి కృష్ణనూ అరెస్టు చేశారు. అయినా వారి అరెస్టులను వారుగానీ, వారి కుటుంబ సభ్యులు గానీ, ఏ మాత్రం విచారించలేదు. దేశం కోసం జైలుకు వెళ్ళడం చాలా ఘనతగా ఊహించారు. వారు వారి కుటుంబమంతా గర్వించింది. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కోర్టు విచారన తర్వాత చెరొక సంవత్సరం జైలు శిక్షను లక్నో జైలులో అనుభవించారు. సంవత్సరం గడిచాక వారు విడుదల చేయబడ్డారు. జవహర్ లాల్ భార్య కమలా నెహ్రూ కు అనారోగ్యంవల్ల ఆనంద భవన్ లో ఎవ్వరూ లేరు. వీరి తల్లి కూడా కమలా నెహ్రూ వద్ద కలకత్తా వెళ్ళి వదిన గారి సుస్థీ నయమయ్యాక అలహాబాద్ ఆనందభవన్ కి వచ్చారు.
జైలుకు వెళుతూ తన ముగ్గురు కుమార్తెలనూ, పూనా బోర్డింగ్ స్కూల్ లో ప్రవేశింపజేసి వెళ్ళింది. పిల్లల్ని చూసి సంవత్సరం అవటంవల్ల పూనా వెళ్ళి చెల్లెలుతో పాటు పిల్లల్ని చూసింది. అన్నగారి కుమార్తె ఇంధిరా గాంధీ కూడా అక్కడే చదువుతుంది. పూనాలో ఉన్న సమయంలో యార్యాడ జైలులో ఉన్న గాంధీజీని అనేక సార్లు చూశారు వారిద్దరు. కృష్ణ, విజయలక్ష్మీ, లు ముస్సోరీ వెళ్ళీ వచ్చాక అలహాబాద్ లో కృష్ణకు 1933 అక్టోబరు 20 వ తేదీన హతీసింగ్ తో వివాహం ఆనంద భవన్ లో జరిగింది.
తొలి మంత్రిణిగా
[మార్చు]ఎన్నికలద్వారా ప్రజాభిప్రాయాలను తెలుసుకొని శాసన సభలలో ప్రవేశించేందుకు కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. జవహర్ లాల్ నెహ్రూ వంటి ప్రముఖులు, నిద్రా హారాలు లేకుండా వాడ వాడలా, పల్లె, పల్లెలా తిరిగి ఎన్నికల ప్రచారం చేసిన ఫలితంగా పదకొందు రాష్ట్రాలలో ఏడు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. విజయలక్ష్మీ పండిట్ కాన్పూర్ చిల్‍హర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ప్రత్యర్థి పైన వెయ్యి ఓట్ల మెజారిటీతో నెగ్గిందామె.
సంయుక్త రాష్ట్ర ప్రధాని గోవింద వల్లభ పంత్ అయ్యాడు. విజయలక్ష్మీ పండిట్ తొలిసారిగా మంత్రిణిగా పదవీ స్వీకారం చేసి స్థానిక స్వపరిపాలనా బాధ్యత చేపట్తింది. 1937 జూలై 28 న ఆమె ప్రమాణ స్వీకారం చేసింది. అసెంబ్లీలో గోవింద వల్లభ పంత్ ప్రవేశపెట్టిన స్వపరిపాలనా ప్రథమ తీర్మానం, ఆయనకు అనారోగ్యంగా ఉండటం వల్ల విజయలక్ష్మీ పండిట్ ఆ బాధ్యతను స్వీకరించింది.
వయోజన ఓటింగ్ పద్ధతిని ఎన్నుకోబడిన ప్రజా నాయకులచే ఏర్పాటైన రాజ్యాంగ ప్రణాళిక మాత్రమే అమలు చేయాలని ఈ తీర్మానం సారాంశం. ఆమె కనుసన్నల్లో ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాలలో తాను చూసిన నిరక్షరాస్యత, అస్పృశ్యత, అవిద్య అనారోగ్యాలు ప్రతిక్షణము కదలాడేవి.
అందువల్ల ఆమె 1938-39 సంవత్సరాలకు ఒక ప్రణాళిక తయారు చేసి, మూడు వందల ఆసుపత్రులను వివిధ రకాల వైద్య విధానాలతో స్థాపించింది. మంచి నీటి బావులు బాట సారులకూ, గ్రామీణులకూ నీరులేక బాధపడే ప్రాంతాలలో ఎన్నో బావులు తవ్వించింది. వయోజన విద్య పాఠశాలను నెలకొల్పింది. 1939 ఆగ్రా లోని స్త్రీ వైద్య కళాశాలను, శిశు పోషణ కారణంగా మార్పించింది.
తననియోజక వర్గంలో విపరీతంగా ఉన్న మలేరియా ను అరికట్టేందుకు ఆమె ఎంతగానో, పాటుపడింది. విద్యార్థులు వ్యాయామ నిమిత్తం అనేక పట్టణ, పల్లెలలో ఆట స్థలాలెన్నో ఏర్పాటు చేసింది. ఎవరెన్ని చేయించినా, పేరుకు మాత్రం భారత ప్రభుత్వం కానీ, అధికారాలన్నీ గవర్నర్ల చేతుల్లో ఉండేవి. వారు వీరి ఆలోచనలూ, ఆశయాలూ సాగనివ్వకుండా నిరంకుశ విధానము లోనే నడిచేవారు.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో
[మార్చు]1939సెప్టెంబరులో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభించబడింది. బ్రిటిషు ప్రభుత్వం ఈ యుద్ధంలో ఇండియాను ఇరికించింది. భారతీయుల సైనుకులు యుద్ధానికి రావాలంది. ప్రజానాయకులెవ్వరూ అందుకు అంగీకరించలేదు. బ్రిటిషు పాలకుల గోడమీది పిల్లి వాటం అటు నాయకులకూ అర్థం అయిపోయింది. నాయకులంతా రాజీనామా లిచ్చి బయటకు వచ్చేశారు.
భారతీయ నాయకులతో ఏ విధమైన సంప్రదింపులు లేకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులను భాగస్వామ్యులుగా చేసినందుకు విజయలక్ష్మీ పండిట్ ఆడ పులిలా గర్జించింది. భారతీయుల క్షేమం కోసం అంటూ, తన తప్పులతో భారతీయులకు పాలు పంచటం కుటిల రాజనీతి అంది. భారతీయులను బానిసలుగా చేసి వారి చేతిలో కీలుబొమ్మల మాదిరి ఆడించే బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని సహించమని హెచ్చరిక చేసింది. కేవలం యుద్ధ సమయాలలో మాత్రమే భారఈయులకు స్వాతంత్ర్యము అనే ఎర వేస్తూ యుద్ధము ముగిశాక భారతీయుల పట్ల బ్రిటిష్ వారు చూపించే నిరాదరనను క్షమించరు భారతీయులంది. ఈ యుక్తుల ద్వారా బ్రితిషు ప్రభుత్వం సాధించి పెట్టేదేమిటో, నిక్కచ్చిగా తేల్చమంది.
లేవండీ ఈ దేశము మనది. పరిపాలించే వారు పరాయివారు. వారి అధికారాన్ని సహించకండి. జాతి మేలుకోవాలి. స్వరాజ్యం స్థాపించే వరకూ నిదురించకూడదు! ప్రజలను నిద్ర మోల్కొలపింది.
పక్షవాతం వచ్చి తల్లి స్వరూపారాణి మరణించింది. యుద్ధ సమయంలోనే గాంధీజీ 1940 లో వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభించాడు. డెసెంబర్ 9 వ తేదీన విజయలక్ష్మీ పండిట్ సత్యాగ్రహంలో చేరింది. అప్పుడు అరెస్టుచేసి ప్రభుత్వం ఆమెను నైనీ జైల్లో నాలుగు మాసాలుంచింది. దేశంలో ఈ రాజకీయ తుఫాను వతావరణంలో ఉండగానే జవహర్ లాల్ కుమార్తె ఇంధిరా గాంధీకి, ఫిరోజ్ ఖాన్ కు పెళ్ళి జరిగింది. ఆ సమయంలోనే క్రిప్సు రాయబారం చెడింది. 1942 ఆగష్టు తొమ్మిదవ తేదీన బాపూజీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానము చేసింది. భారతీయనాయకులందరూ గాంధీజీకి అండగా నిలబడేసరికి నాయకులందరినీ ప్రభుత్వం ఖైదు చేసింది. 1942 ఆగష్టు 12 వ తేదీన విజయలక్ష్మీ పండిట్ ను అరెష్టు చేశారు. చిన్నపిల్లలైన ఆమె కురార్తెలు భయమూ బాధా లేకపోగా తల్లికి ధైర్యం చెప్పి నైనీ జైలుకు పంపారు.
ఆమె
జైలు జీవితంలో విజయలక్ష్మి
[మార్చు]రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు కు మహిళా ప్రతినిధిగా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (15 August 2020). "పరాయి పాలన నుంచి విముక్తికై." Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.
ఇతర లింకులు
[మార్చు]- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- నెహ్రూ-గాంధీ కుటుంబం
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- భారత దౌత్యవేత్తలు
- ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు
- 1900 జననాలు
- 1990 మరణాలు
- జమ్మూ కాశ్మీరు వ్యక్తులు
- నెహ్రూ-మహాత్మా గాంధీ కుటుంబం
- అలహాబాద్ వ్యక్తులు
- డెహ్రాడూన్ ప్రముఖులు
- అవివాహిత దౌత్యవేత్తలు
- మహారాష్ట్ర గవర్నర్లు
- యునైటెడ్ స్టేట్స్ భారతదేశం యొక్క దూతలు
- సోవియట్ యూనియన్ కు భారతదేశం యొక్క దూతలు
- ఐక్యరాజ్యసమితి కు భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధులు
- పద్మవిభూషణ పురస్కారం పొందిన మహిళలు
- భారతీయ హిందువులు
- మహిళా గవర్నర్లు
- భారత మహిళా రాజకీయ నాయకులు