వరుణ్ గాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరుణ్ గాంధీ
వరుణ్ గాంధీ


పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గము ఫిలిభిత్

వ్యక్తిగత వివరాలు

జననం (1980-03-13) 1980 మార్చి 13 (వయస్సు: 39  సంవత్సరాలు) మార్చి 13]]. 1980
ఢిల్లీ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసము కొత్త ఢిల్లీ
మతం హిందూ/సిక్కు

భారతీయ జనతా పార్టీ యువ నేతలలో ముఖ్యుడైన వరుణ్ గాంధీ (Varun Gandhi) 1980, మార్చి 13న జన్మించాడు. భారతదేశంలో చారిత్రకంగా, రాజకీయంగా ప్రముఖమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్ తను మూడు నెలల వయసు ఉన్నప్పుడే తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు నానమ్మ, భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ మరణించింది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు ఇప్పటివరకు ముగ్గురు భారతదేశ ప్రధాన మంత్రి పదవిని చేపట్టినారు. మోతీలాల్ నెహ్రూ ఈ కుటుంబం నుండి పేరు ప్రఖ్యాతలు పొందిన తొలి వ్యక్తి కాగా, వరుణ్ గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకలు ఐదవ తరానికి చెందినవారు. ప్రారంభం నుండి ఈ కుటుంబం వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండటమే కాకుండా పార్టీ అధ్యక్షపదవిని చేపట్టడంలో మరియు అధికార పదవులు చేపట్టడంలో ముందంజలో ఉన్నారు. కాని వరుణ్ గాంధీ రాజకీయాలలో చేరినప్పటి నుండి భారతీయ జనతా పార్టీ పక్షంలోనే ఉన్నాడు. 2009 సార్వత్రిక ఎన్నికలలో పోటీచేయడానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్టీ టికెట్టు కూడా పొందినాడు. ఎన్నికల ప్రసంగంలో మతపరమైన ఉద్రేక ప్రసంగాలు చేసినందుకు ఎన్నికల కమిషన్ పోటీచేయడానికి అనర్హత విధించగా, ఈ విషయంలో వాతావరణం వేడెక్కడంతో తొలుత బెయిల్ వారెంటు తీసుకున్న వరుణ్ దాని గడుపు ముగయడంతో స్వచ్ఛందంగా మార్చి 28, 2009న పిలిభిత్ స్థానిక కోర్టులో లొంగిపోయి, 20 రోజులు ఇటా జైలులో ఉండి ఏప్రిల్ 16న పెరోల్ పై విడుదలైనాడు.

ప్రారంభ జీవనం[మార్చు]

సంజయ్ గాంధీ, మేనకా గాంధీల ఏకైక సంతానమైన వరుణ్ గాంధీ 1980, మార్చి 13న జన్మించాడు.[1] విధి వక్రించి అతిచిన్న ప్రాయంలో ఉండగానే తండ్రిని కోల్పోయాడు. కేవలం మూడు నెలల వయస్సు ఉన్నప్పుడు తండ్రి సంజయ్ గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇది జరిగిన మరి కొద్ది కాలానికే నానమ్మ అయిన ఇందిరా గాంధీ అంగరక్షకుల తుపాకుల కాల్పులకు బలైంది. ఇతనిది భారతదేశంలోనే చెప్పుకోదగిన కుంటుంబం. 1989 నుండి ఐదేళ్ళ పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో సమీపంలోనున్న రిషీ వాలీ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఉన్నత విద్య లండన్లో జరిగింది.

రాజకీయ జీవనం[మార్చు]

దస్త్రం:Varun Gandhi in a public meeting in Pilibhit.jpg
ఫిలిబిత్‌లో ఒక బహిరంగ సభలో వరుణ్ గాంధీ

కుటుంబ రాజకీయాలు[మార్చు]

భారతదేశంలోనే అతి ముఖ్యమైన రాజకీయ కుటుంబంలో జన్మించుటచే వరుణ్‌కు రాజకీయాలు వారసత్వంగా వచ్చినవే. తన నానమ్మ తాత అయిన మోతీలాల్ నెహ్రూ‎ భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించాడు. నానమ్మ తండ్రి జవహర్‌లాల్ నెహ్రూ‎ జాతీయోద్యమ నేతనే కాకుండా భారత జాతీయ కాంగ్రెస్‌లో చురుగ్గా పాలుపంచుకొని పార్టీ అధ్యక్ష పదవిని కూడా చేపట్టినాడు. స్వాతంత్ర్యానంతరం భారత తొలి ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశాడు. నానమ్మ ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి పదవిని నిర్వహించింది. ఇందిరా గాంధీ పాలనా సమయంలోనే వరుణ్ తండ్రి సంజయ్ గాంధీ కూడా రాజకీయాలలో చురుగ్గా వ్యవహరించాడు. 1980లో తండ్రి సంజయ్ గాంధీ మరణంతో సంజయ్ సోదరుడు రాజీవ్ గాంధీ‎ రాజకీయాలలో ప్రవేశించి ఆ తరువాత ప్రధానమంత్రి పదవి కూడా చేపట్టినాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ‎ రాజీవ్ భార్య. వరుణ్ తల్లి మేనకా గాంధీ కూడా సంజయ్ గాంధీ మరణం అనంతరం రాజకీయాలలో ప్రవేశించింది. ప్రారంభంలో సంజయ్ విచార్ మంచ్ పార్టీని స్థాపించింది. ఈ పార్టీ 1984 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఐదు స్థానాలకు పోటీచేసి నాలుగు చోట్ల విజయం సాధించింది. ప్రస్తుతం మేనకా గాంధీ భారతీయ జనతా పార్టీ తరఫున లోక్‌సభ సభ్యురాలిగా ఉంది.

వ్యక్తిగత రాజకీయాలు[మార్చు]

2004 సార్వత్రిక ఎన్నికలలోనే పోటీకి ఆసక్తి చూపిననూ వయస్సు అడ్డంకి రావడంతో విరమించుకున్నాడు. కాని దృష్టి మాత్రం రాజకీయాలపైనే సాగించాడు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించి పలు సమావేశాలలో, పార్టీ మీటింగులలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక సభ్యుడిగా నియమించబడ్డాడు. అప్పుడు తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి వెళ్ళి ప్రజల పరిస్థితిని, కష్టాలను ప్రత్యక్షంగా గమనించాడు. ప్రజల కష్టాలు పరిశీలించి వారికి అప్పటికప్పుడు సహాయం కూడా చేశాడు. ఇవన్నీ రాజకీయంగా అతని ఎదుగుదలకు దోహదపడింది. 2006లో మధ్య ప్రదేశ్ లోని విదిశా లోక్‌సభ ఉప ఎన్నికలలో పార్టీ టికెట్టు కోసం ప్రయత్నించిననూ లభించినట్టే లభించి చివరి క్షణంలో దూరమైంది.[2] 2009 ఎన్నికలకై ఇదివరకు అతని తల్లి మేనకా గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఫిలిబత్ లోక్‌సభ స్థానంలో పోటీచేయడానికి పార్టీ టికెట్టు కూడా పొందినాడు. మార్చి 5న ఎన్నికల ప్రసంగంలో మతపరమైన ఉద్రేక ప్రసంగాలు చేసినందుకు ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికలలో పోటీచేయడానికి అనర్హత విధించింది. వరుణ్‌కు పార్టీ టికెట్టు ఇవ్వరాదని భారతీయ జనతా పార్టీని ఆదేశించింది[3]

ఇటీవలి పరిణామాలు[మార్చు]

మార్చి 5వ తేదీన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ మతపరంగా ఉద్రేక ప్రసంగాలు చేసినట్లు ప్రచారం కావడంతో ఎన్నికల కమిషన్ వరుణ్ గాంధీ ఎన్నికలలో పోటీ చేయరాదని ఆంక్షలు విధించింది. అయితే ఇది రాజకీయంగా తనను ఇరకాటంలో పెట్టేందుకు కుట్రమాత్రమేనని, తాను ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేనని, దీనికి సంబంధించి ఎటువంటి క్షమాపణలు చెప్పే ప్రశక్తే లేదని స్పష్టం చేశాడు. పిలిభిత్‌లో హిందువులు భయంతో బతుకున్నారు. ఓ బ్లాకులో మూడు ఆలయాలను ధ్వంసం చేశారు. అందువలనే ఈ వర్గ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలనుకున్నట్లు చెప్పినాడు.[4] ఈ విషయంలో పరిస్థితి విషమించడంతో ముందస్తు బెయిల్‌కై ప్రయత్నించగా ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరి చేసింది.[5] వరుణ్ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా ముందు వెనుకంజ వేసి తర్వాత వరుణ్ తప్పు లేనట్లు ప్రకటించింది. ప్రారంభంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం వరుణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.[6] ఈ విషయంలో శివసేన పార్టీ అధినేత బాల్ థాకరే ఒక అడుగు ముందు వేసి వరుణ్ గాంధీ మాటలలో తప్పేమీ లేదని ప్రకటించాడు.[7] విశ్వ హిందూ పరిషత్తు కూడా వరుణ్ గాంధీని సమర్థించింది.[8] తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్.ను తొలిగించాలని వరుణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాదు హైకోర్టు తోసిపుచ్చింది.[9][10] ముందస్తు బెయిల్ గడుపు ముగయడంతో 2009 మార్చి 28న పిలిభిత్ స్థానిక కోర్టులో స్వచ్ఛందంగా లొంగిపోయాడు.[11] 19 రోజులపాటు ఉత్తరప్రదేశ్ లోని ఎటావా జైలులో గడిపిన వరుణ్ గాంధీ ఏప్రిల్ 16న పెరోల్‌పై విడుదల అయ్యాడు.[12]

వరుణ్ హత్యకు కుట్ర[మార్చు]

వరుణ్ గాంధీని హత్య చేయడానికి ఛోటాషకీల్ అనుచరుడు కుట్రపన్నినట్లు మార్చి మూడవవారంలో నిఘా అధికారులు పసిగట్టిన ఫోన్ సంభాషణల ద్వారా బయటపడింది.[13] మార్చి 27న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో వరుణ్‌పై దాడిజరిగే అవకాశాలున్నాయని కూడా హెచ్చరించింది. మార్చి 28న వరుణ్ గాంధీ ఢిల్లీ నుంచి ఫిలిబిత్ కోర్టులో లొంగిపోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ హత్యచేయడానికి వేసిన పథకం విఫలమైంది.

20 రోజుల జైలు జీవితం[మార్చు]

ఇటా జైలులో వరుణ్ గాంధీ గడిపిన 20 రోజుల జైలు జీవితం వ్యక్తిగతంగా మంచి ఇమేజ్‌ను సాధించిపెట్టింది. రాజకీయ సోపానంలో అనేక మెట్లను ఒక్క ఉదుటున ఎక్కేశాడు. యువ రాజకీయ నాయకుడిగా దేశమంతటా పరిచయమయ్యాడు. పార్టీలోనూ ఈ విషయంపై వరుణ్‌కు హోదా పెరిగింది. అగ్రనేతలతో సమంగా ప్రాధాన్యత పెరిగింది. ఇదే విషయమై "ఒక వ్యక్తికి జీవితంలో ఇలాంటి అవకాశం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది" అని పిలిభిత్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యోగేంద్ర గంగ్వార్ పేర్కొన్నాడు.[14] కొత్త ఇమేజ్ కారణంగా సభలు, సమావేశలలో వరుణ్ ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

రచనలు[మార్చు]

వరుణ్ గాంధీ ది అదర్‌నెస్ ఆఫ్ సెల్ఫ్ (The Otherness of Self) పేరుతో ఒక కవితా సంపుటిని రచించాడు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. sify.com/news/fullstory.
 2. హిందూ ఆన్‌లైన్ ఎడిషన్ తేది 07-10-2006
 3. ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009
 4. యాహూ తెలుగు వార్తలు తేది 18-03-2009
 5. యాహూ తెలుగు వార్తలు తేది 20-03-2009
 6. యాహూ తెలుగు వార్తలు తేది 17-03-2009
 7. యాహూ తెలుగు వార్తలు తేది 18-03-2009
 8. హిందూ ఆన్‌లైన్ ఎడిషన్ తేది 27-03-2009
 9. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
 10. యాహూ తెలుగు వార్తలు తేది. 25-03-2009
 11. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
 12. ఈనాడు దినపత్రిక, తేది 17-04-2009
 13. ఈనాడు దినపత్రిక, తేది 05.04.2009
 14. ఈనాడు దినపత్రిక, తేది 10-05.2009