మద్దూరి అన్నపూర్ణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మద్దూరి అన్నపూర్ణయ్య
జననం(1899-03-20)1899 మార్చి 20 [1]
కొమరగిరి, పిఠాపురం తాలూకా, తూర్పుగోదావరి జిల్లా
ఇతర పేర్లుఆంధ్రా నేతాజీ
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు

మద్దూరి అన్నపూర్ణయ్య (1898 - 1953) ప్రముఖ స్వాతంత్ర్యయోధులు, పాత్రికేయులు. ఆంధ్రా నేతాజీగా సుప్రసిద్ధుడు.[2]

వీరు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం తాలూకాలోని కొమరగిరి (కొత్తపల్లె) గ్రామంలో జన్మించారు. తన అన్నయ్య దీక్షితుల వద్ద విద్యను అభ్యసించారు. వీరికి బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం ఇచ్చిన ప్రోత్సాహం వీరిలో విప్లవ బీజాలు నాటాయి. కాకినాడ కళాశాలలో బి.ఎ. పరీక్ష పూర్తిచేసిన వెంటనే వీరు జిల్లా విద్యార్థి మహాసభను దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. కాంగ్రెస్ అనే పత్రికను కొంతకాలం నడిపారు. వీరు ప్రచురించిన చిచ్చుల పిడుగు వ్యాసానికి బ్రిటిషు ప్రభుత్వం 18 నెలల కఠిన శిక్షను విధించింది. ఆ పత్రికలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామ గాథలను, విప్లవవీరుల త్యాగ కథనాలను, అల్లూరి సీతారామరాజు నడిపిన మన్యం తిరుగుబాటుకు సంబంధించిన కథనాలను ప్రచురించారు. 1929-32లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని కారాగారం చేరారు. జైల నుండి విడుదలైన తర్వాత కాంగ్రెసు సోషలిస్టు పార్టీలో చేరి సామ్యవద వ్యాప్తికై కృషిచేశారు. ద్వితీయ ప్రపంచ యుద్ధం కాలంలో సుభాష్ చంద్ర బోస్ నాయకత్వంలో ఏర్పడిన ఫార్వర్డు బ్లాకులో చేరారు. తర్వాత ప్రభుత్వం వీరిని నాలుగేండ్లు నిర్భంధించింది. విడుదలైన తర్వాత జై భారత్, నవశక్తి పత్రికలను నడిపారు. మద్రాసు శాసనసభకు సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పొటీచేసి ఓడిపోయారు. మెహర్‌బాబా భక్తులై వారి సందేశ వ్యాప్తికై వెలుగు అనే పత్రికను కొంతకాలం నడిపారు. భార్యా పిల్లల్ని పోషించే బాధ్యతకూడా దేవుడిపై భారం వేసి,దేశం కోసం 55ఏళ్ళు దీక్షగా శ్రమించి,అందులో 11సంవత్సరాలు జైలులో గడిపిన మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య ఈ తరం వారికి ఎవరికీ తెలియదు .కాంగ్రెస్,నవశక్తి, జయభారత్,వెలుగు పత్రికలు నడిపి,స్వతంత్రం ముందూ ఆతర్వాత కూడా నిర్భయంగా ‘’కల౦ ఖడ్గాన్ని ‘’ విశ్రు౦ఖల౦గా ప్రయోగి౦చిన నిస్వార్ధ పాత్రికేయ ప్రముఖుడు .స్వాతంత్ర్యం వస్తే కులం ,గిలం పోయి ,ఆస్తిపాస్తులన్నీ అందరివీ అవుతాయని ,అందరూ సమానంగా అనుభవి౦చ వచ్చువని నమ్మిన సామ్యవాద స్వప్నాలు కన్నస్వాతంత్ర్య సమర యోధుడు .అల్లూరి ,నేతాజీవంటి విప్లవ నాయకులతో ,గాంధీ ,జయప్రకాష్ వంటి అగ్రశ్రేణి జాతీయ నాయకులతో భుజం భుజం కలిపి సాగిన అగ్రశ్రేణి దేశీయ నాయకుడు .జర్నలిస్ట్ ,కవి, నవలాకారుడు .ప్రకాశం ,,పివిజి రాజు పుచ్చలపల్లి ,రంగాలకు అభిమానుడు .కానీ స్వాతంత్ర్యం వచ్చాక ఆయనకు ప్రాధాన్యమే లేకుండా పోయింది .అసెంబ్లీకి రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు .స్వతంత్ర భారత దేశ రాజకీయాలకు పనికి రాని వాడు అనిపించుకొన్న లౌక్యమెరుగని పెద్దమనిషి .మొక్కు బడిగా ఆయన శతజయంతి ఉత్సవం జరిపారు .స్వాతంత్ర్య ఉద్యమకాలం లో అనేక అపూర్వ త్యాగాలు చేసి స్వతంత్రం రాగానే జాడ కనిపించకుండా పోయిన మహోన్నతనాయకులలో మద్దూరి వారుకూడా ఒకరు .

అన్నపూర్ణయ్యగారు జైల్లో మగ్గుతుంటే ఇంటిదగ్గర కుటుంబం గర్భ దరిద్రం లో మగ్గిపోయేది .భార్య రమణమ్మ గారు మహా సాధ్వి .ఆయనకు కార్డు రాయటానికి కూడా ఆమెచేతుల్లో కాణీ ఉండేదికాదు .ఒక కార్డు మాత్రం ‘’ఏ దినం కార్డు కోసం ఎదురు చూస్తారో ,ఆ దిన౦ ఈకార్డు ను చూసి తృప్తి పడండి ‘’అని తేదీ కూడా వేయకుండా రాసింది ఆమహా ఇల్లాలు . . ఈడొచ్చిన ఆడపిల్లలకు చేతనైన రీతిలో పెళ్ళిళ్ళు జరిపి బాధ్యత తీర్చుకొని ఆత్యాగమయి అసువులు బాసింది .భార్య మరణ వార్త విన్న అన్నపూర్ణయ్య తన బాధకు అక్షరాకృతి కల్పించి ‘’చేత కాసు లేదు ,చెరసాలలో భర్త –పిల్ల పెళ్లి కూడా పెనిమిటి లేకనే –నీవే చేయవలసి వచ్చె నీలవేణి-జనులసాయమైన ,ధనసాయమైన –లేకపోయేనే నీకు లేమి గల్గె-వలదు నా బాధ పరమ శత్రువునకైన –బ్రతికి యున్నాడ జీవచ్ఛవంబ నగుచు ‘’’

మూలాలు[మార్చు]

  1. రావినూతల, శ్రీరాములు (2000). మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. p. 12.
  2. అనంత పద్మనాభ స్వామి, చల్లా (25 September 2016). ఆంధ్ర నేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య. హైదరాబాదు: ఆంధ్రప్రభ. p. 12.

[1]