Jump to content

బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి

బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం (1891-1936) తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. ఆయన గాంధీ అనుచరునిగా సుపరిచితుడు. సీతానగరంలోని కస్తూర్భాగాంధీ ఆశ్రమానికి చాలా సేవ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. సుబ్రహ్మణ్యం నిస్వార్థ సేవకు, అంకితభావానికి పేరు పొందిన వ్యక్తి. స్వాతంత్ర్య పోరాట సమయంలో గాంధీకి వెన్నుదన్నుగా నిలిచి ఈ ప్రాంత ప్రజలను పోరాటానికి సమాయత్తులను చేసిన నిస్వార్థజీవి. స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన వారిలో జిల్లాలో అగ్రశ్రేణి నాయకునిగా పేర్కొనవచ్చు. అదేవిధంగా ఆనం కళాకేంద్రం వద్దనున్న మైదానం బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం పేరుతోనే ప్రాముఖ్యత చెందింది.[1]

పరిచయం

[మార్చు]

డా. బ్రహ్మజోస్యుల సుభ్రహ్మణ్యం L.C.P& S. రాజమండ్రీ కాపురస్తులు 1916 నుండి వైద్యవృత్తిలో నుండిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు. రాజమండ్రీకి 20 కిలోమీటర్ల దూరములో నున్న సీతానగరంలోని గౌతమిఆశ్రమ సంస్దాపకులలో ప్రముఖులు. మహాత్మా గాంధీగారు ప్రతి ఏటా ఆంధ్రప్రాంతములకు వచ్చినప్పుడు వీరి గౌతమి ఆశ్రమంలో బస చేసేవారు. స్వాతంత్ర్యోద్యమములో వారు ఎన్నో సార్లు ఖారాగార శిక్ష అనుభనించి చివరగా 1932 లో పోలీసువారిచే నిర్దాక్షణ్యముగానుా కృూరముగాను దెబ్బలు తినినప్పటినుండి వారు తీవ్ర ప్రాణాంతకమైన ఆనారోగ్యముచెంది 23-12-1936 న మరణించెను. వారు స్థాపించిన సీతానగర ఆశ్రమం ఇప్పటికీ కస్తూరబా ట్రస్టు వారు నడుపుచున్నారు. మహాత్మా గాంధీ డాక్టర్ సుబ్రహ్మణ్యంగారిని గురించి తన యంగ్ ఇండియాలో 1929లో వ్రాసినది, తదుపరి డాక్టర్ గారు 1936 లో పరమదించినప్పుడు గాందీజీ తంతిద్వారా (by Telegram) పంపిన సందేశము (క్రింద ఉల్లెఖించబడినవి) డా. సుబ్రహ్మణ్యంగారి త్యాగశీలము, నిరాడంబర నిస్వార్ధ చరిత్రను వెల్లడించును. వారు దేశం కోసం చేసిన త్యాగము మరువరానిది. వారిని గురించి దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రసంగము ఆకాశవాణి ప్రసారముచేసింది. దిగవల్లి వేంకట శివరావు గారు రచించి 1938లో ప్రచురించిన "భారత దేశమున బ్రిటిష్ రాజ్యతంత్రము" అను పుస్తకము డాక్టరు సుబ్రహ్మణ్యంగారికి అంకితముచేశారు. అందు మిత్రస్మృతి అని వీరినిగురించి 7 పేజీలలో వ్రాసియున్నది (సశేషం)

జనన వృత్తాంతం

[మార్చు]

సబ్రహమణ్యంగారు గుంటూరు జిల్లా ముప్పాళ్ళ గ్రామవాస్తువ్యులైన బ్రహ్మజోశ్యుల రామయ్యగారు లక్ష్మీనరసింహమ్మ గార్ల కూమారులు. వీరు అక్టోబరు 12 1891గుంటూరు జిల్లాలో కొండవీడులో జన్మించిరి. వీరికి బెజవాడ కాపురస్తులైన చెరుకుపల్లి బుచ్చిరామయ్య గారి కుమార్తె కామేశ్వరమ్మతో 1912 వ సంవత్సరములో వివాహమైనది.

విద్యాభ్వాసం

[మార్చు]

మేట్రిక్యులేషన్ విజయవాడలో చదివారు. ఆతరువాత మల్లికు స్థాపించినజాతీయ వైద్య కళాశాల, కలకత్తా (National Medical College, Calcutta) లో యల్.సి.పి. అండ్ యస్ అను వైద్య పట్టా పుచ్చుకున్నారు. వీరికి సమకాలీకులుగా వైద్య కళాశాలలో చదివినవారిలోఘంటసాల సీతారామ శర్మ , శివలెంక మల్లికార్జున రావు కూడా యున్నారు. ఆరోజులలోనే కలకత్తాలో బి.ఎ చదునుచున్న బారు రాజారావు గారు కూడా వీరికి సమకాలీకులే. వీరందరు స్వాతంత్ర్యసమరయోధములో చాలకృషిచేసినవారు. బారు రాజారావు గారుఅఖిల భారత కాంగ్రెస్సు సదస్సుకు పరమనెంటు అండర్ సెక్రటరీగా చేశారు వీరు అఖిల భారత కాంగ్రెస్సు జనరల్ సెక్రటరీగా చేసిన న్యాపతి సుబ్బారావు గారి బంధువులు.

వైద్యవృత్తి, స్వతంత్రోద్యమములో కృషి

[మార్చు]

1916 నుండి రాజమండ్రీలో వైద్య వృత్తి ప్రారంభించి స్వల్పకాలములోనే సుప్రసిద్ద వైద్యులుగా పేరుపొందిరి. కానీ వారు 1920 నుండి గాంధీజీ ఇచ్చిన స్వతంత్రసమర పిలుపుతో గాంధీవాదియై గాంధీగారు ప్రవేశపెట్టిన అన్ని స్వతంత్రోద్యమములలో అత్యంత ఉత్సాహముతో తదేక దీక్షతో త్రికరణశుద్ధిగా కృషి సల్పిన రాజమండ్రీ వాస్తవ్యులలో ప్రముఖులు గానుండిరి. 1921 లో రాష్ట్రీయ కాంగ్రెస్సు కమిటికి కార్యదర్శిగానుండినకాలంలో 1 సంవత్సరం కారాగార శిక్షపొందిరి. వీరు స్వరాజ్యోద్యమములలో అత్యంత ప్రముఖులవటమూ, వారి మార్గదర్శకత్వము అత్యంత ప్రజాప్రేరణకరమైనందువలననూ వీరి దినచర్యలు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వపు పోలీసు వారు అనుదినము గమనించేవారు.

సీతానగరంలో గౌతమి సత్యాగ్రహాశ్రమ స్థాపన, హరిజనాశ్రమ స్థాపన

[మార్చు]

1920వ సంవత్సరములో గాంధీజీ ఇచ్చిన పిలుపుతో సమృధ్దిగాసాగుతున్నవైద్యవృత్తితో ధనసంపాదన కన్నా ప్రాముఖ్యమైనది దేశ స్వతంత్రమన్న దీక్షతో కాంగ్రెస్సు ఉద్యమములో ప్రవేశించి గాందీజీ ప్రవేశ పెట్టిన స్వరాజ్యోద్యమములు, రాజకీయోద్యమములు అన్నింటిలోనూ (1919-20సంవత్సరములలో రౌలట్ సత్యాగ్రహము (Movement against Roulette Act), 1920-21లో సహాయనిరాకరణోద్యమము ( Non Cooperation movement, Civil Disobedience movement), విదేశవస్తు బహిష్కరణోద్యమము, ఖద్దరు ఉద్యమము, తదుపరి 1930-31లో ప్రారంభించనట్టి సైమన్ కమీషన్ బహిష్కరణోద్యమము, సంపూర్ణ స్వరాజ్యోద్యమము, మరియూ ఉప్పు సత్యాగ్రహము మొదలగు శక్తిదాయకమైన స్వరాజ్యాంధోళన ఉద్యమములు) అనుసరించి, అమలుచేసి ప్రజాప్రేరణముచేయగలిగియుండెను. స్వరాజ్యోద్యమములను అణచివేయవలయునన్న దృఢనిశ్చయముకలిగియుండిన నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వము దృష్టిలో వీరు చాల అత్యంంత ప్రముఖమైన స్వతంత్ర గాంధీవాది యనియూ గోదావరిజిల్లాలో స్వతంత్రోద్యమము విఝృంబించుటకు మూలకారణము డాక్టరు సుబ్రహ్మణ్యంగారేననియు గుర్తింపబడెను. నిరంతరము పోలీసు నిఘాకి గురికాబడి తరుచుగా నిర్భందింపబడి ఖారా గార శిక్షలు అనుభవించెను. స్వతంత్రపోరాటముతోపాటు వైద్యవృత్తికూడా సాగించుచూ విశ్రాంతిలేక ప్రజాసేవచేయుచుండెను. 1921 లో రాష్ట్రీయ కాంగ్రెస్సు కమిటీకి అధ్యక్షుడుగా చేసిన కాలములో 1 సంవత్సరము ఖారాగారశిక్ష అనుభవించారు. గాంధీగారి సత్యాగ్రహ సాధన అమలుచేయుటకు తెలుగుప్రాంతములో సత్యాగ్రహాశ్ర మమొకటియుండుట చాలముఖ్యమని గ్రహించి, అట్టి ఆశ్రమమును స్థాపించ సంకల్పించి 1924 సంవత్సరములో ప్రముఖ స్వాతంత్ర్యసమరయోదులైన మద్దూరి అన్నపూర్ణయ్య గారు, ధరణీప్రగడ శేషగిరి రావు గారు మొదలగు వార్లతో కలిసి డా సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రీకి 20 కిలోమీటర్ల దూరములోనున్న సీతానగరంలో సత్యాగ్రహాశ్రమము (గౌతమి సత్యాగ్రహాశ్రమము అనే ఆశ్రమమును స్థాపించారు. తమ వైద్య వృత్తిని రాజమండ్రీనుంచి సీతానగరము ఆశ్రమానిక మార్చి ఆచ్చటనుండి ప్రజాసేవ చేసేవారు. ఆ ఆశ్రమం 14 యకరాల విశాలపరిధిలో, దాదాపు 25 కుటుంబాలకు చాలినన్ని వసతులు కలిగినదై యుండేది. మహాత్మాగాంధీ గారు ప్రతిఏటా ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు ఆ ఆశ్రమం లోనే బస చేసి వారి వారంచివరి మౌనవ్రతం ఆ ఆశ్రమంలో చేసేవారని ప్రముఖ గాందీ వాది దుర్గాబాయి దేశముఖ్ గారు రేడియో ప్రసంగములో చెప్పారు.[2], [3] 1932 దాకా సత్యాగ్రహాశ్రమము అలా నడుస్తున్న రోజులలో స్వతంత్రోద్యమ పోరాటం వృదృతమైనది. 1930-1931 లో ఉప్పుసత్యాగ్రహోద్యమములో డాక్టరు సుబ్రహ్మణ్యం గారు, చండ్రుభట్ల హనుమంతరావు గారు మెదలగు వారలు కాకినాడలోని చొల్లంగి రేవు దగ్గర ఉప్పు తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వము వారి ఉప్పు చట్టమునుల్లంఘించి చట్టరీత్యా దోషిక్రింద పరిగణింపబడగా మళ్లీ జైలు శిక్ష విధించ బడింది. స్వతంత్ర పోరాటములో అంతకు పూర్వమనేక సార్లు డాక్టరు గారు ఖారాగార శిక్ష అనుభవించారు.

1930-32 మధ్యకాలములో బ్రిటిష్ ప్రభుత్వమువారి అభిమతముననుసరించి పోలీసువారు డాక్టరుగారి ఆశ్రమమును తుడిచిపెట్టవలెనన్న దృఢసంకల్పముతో రాజమహేంద్రవరం డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటు ముస్తఫాలీఖాను నిశ్చయించి 1932 జనెవరి 18 తేదీన డాక్టరుగారి ఆశ్రమవాసులపై లాఠీఛార్జిచేసి, నిర్భందములోకి తీసుకుని, ఆశ్రమమును వశముచేసుకుని ఆశ్రమధ్వజస్తంభములను ఇతర ఆస్తిని ధ్వంసముచేశారు. అంతటితో ఆగక ఆశ్రమ వాసులపై కేసులు నమోదచేసి నాల్గైదు సంవత్సరములు శిక్షలు పడేటట్టు చేసి ఆశ్రమమును పాడుబడేశాడు (deserted). అప్పటినుండి ఈ ఆశ్రమపరిసరములో సభలు, సమావేశములు నిషేధించబడెను. కానీ పట్టువదలని స్వాతంత్ర్యసమరయోధులైన డా సుబ్రహ్మణ్యం మొదలగు వారు ఆశ్రమం దగ్గరలోనున్న హరిజనవాడలో తిరిగి కూటమైయుండి ఉద్యమము సాగించుచుండెడివారు.[4] . 1931 జనెవరి 26న సంపూర్ణస్వరాజ్యము కాంగ్రెస్సు మహాసభలో ఘోషించబడింది. అందు చే 1932 జనెవరి 26 తేదీన స్వాతంత్ర్యదినముగా పరిగణించబడి దేశంలో అనేక రాష్ట్రములలో సత్యాగ్రహఆందోళనలు చేయబడినవి. రాజమహేంద్రవరం పరిసరప్రాంతములలో కూడా అట్టి స్వతంత్రదినోత్సవ సందర్భమున అనేకమంది స్రీలు సత్యాగ్రహముచేసిరి. ఆనాడు స్త్రీలచే సత్యాగ్రహముచేయించినది డాక్టరు సుబ్రహ్మణ్యం గారేనన్న ఆరోపణతో వారిని దండించుటయె ముఖ్యలక్ష్యముగానెంచి రాజమహేంద్రవరం డి యస్ పి ముస్తఫాలీ ఖాన్ నిశ్చయించి తన పోలీసు బృందంతో వచ్చి డాక్టరు సుబ్రహ్మణ్యంగారు మధ్యాహన్నం నాళం భీమరాజు గారింట భోజనానంతరము విశ్రమించుచుండగా ఇంటిలోనున్న స్వాతంత్ర్య సమరయోదులను బయటకు లాగి లాఠీ దెబ్బలచే నేలకూలద్రోసి దెబ్బలువేయుచుండగా నాళం భీమరాజు గారు అడ్డు వచ్చి డాక్టరుగారిని వదలివేసి తనను కొట్టమనగా ముస్తఫాలీఖాన్ రెచ్చిపోయి ఇంకా విదృంతగా సుబ్రహ్మణ్యంగారిని కొట్టాడు. దాంతో డాక్టరు సుబ్రహ్మణ్యంగారుకు డొక్కఎముకలు (Rib bones) విరిగి (Fracture) స్పృహతప్పి పడిపోవటం జరిగింది. మూడుమాసములు మంచం పట్టినతరువాత మరి కొన్నాళ్లకు తీవ్ర ప్రాణాంతక జబ్బుకు దారితీసినది. రాజమహేంద్రవరమున ఆనాటి పోలీసుచర్య నాల్గేండ్లక్రితం 1928 నవంబరు మాసమున సైమన్ కమీషన్ బహిష్కరణ ఆందోళనలో లాహోరు నగరమున లాలా లజపతిరాయ్ పై బ్రిటిష పోలీసు అధికారి జేమ్సు ఎ.స్కాట్ (James A. Scot) పోలీసు సూపరింటెండెంట్ చేయించిన లాఠీఛార్జితో సరిపోల్చవచ్చు. లాలా లజపతిరాయికి కూడా అటులనే తీవ్ర లాఠీదెబ్బలతదనంతరం జబ్బుచేసి మరణం సంభవించినది ( చూడు సైమన్ కమీషన్).

ఆ కేసు సబ్ కలెక్టరు బాలకృష్ణయ్య ఐ.సి.యస్ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ముస్తఫాలిఖాన్ తప్పుడు సాక్ష్యములు పెట్టియూ తప్పుడు సాక్షమిచ్చి డాక్టరుగారు అక్రమ సభచేసిరనియూ తన అధికారమునుల్లంఘించిరనియు సాక్ష్యముచెప్పెను. అయినప్పటికినీ సబ్ కలెక్టర్ ఆ కేసు కొట్టివేసి డాక్టరుగారిని విడుదల చేసిరి. జిల్లాకోర్టుకు అప్పీలలో కూడా కొట్టివేయబడుటయె గాక డాక్టరుగారికి నష్టపరిహారమిప్పించిరి. అంతట పోలీసువారు హైకోర్టులో అప్పీలుచేయగా అక్కడకూడా ఓడిపోయి ముస్తఫాలీఖాన్ చెప్పినది అబధ్దపు సాక్ష్యమని స్థిరపరచిరి. ఆ ఘటనానంతరం పోలీసు వారు ముస్తఫాలీఖాన్ సుబ్రహ్మణ్యంగారిపై అమలాపురంలో ఇంకో కేసు దాఖలుచేసి 6నెలలు శిక్షపడేటట్లు చేశాడు. 1932 లో జైలునుండి తిరిగి వచ్చిన డాక్టరుగారు పోలీసువారు నాశనం చేసిన తన గౌతమీ ఆశ్రమమును తిరిగి యధాస్థతికి తీసుకువచ్చే ప్రయత్నముచేయుచూ 1933 లో సీతానగరం లోనే మరొక హరిజనాశ్రమం స్థాపించిరి. గౌతమీ సీతానగరం సత్యాగ్రహాశ్రమ దుస్దిని తిరగతీయుటకు అత్యంత ఖర్చులాయను. వారికి ఆర్థికంగా కూడా క్లిష్ట పరిస్థితులేర్పడినవి. త్వరితగతిన వారి ఆరోగ్యము క్షీణించి చివరకు క్షయవ్యాధి పీడితుడై 1936 డిసెంబరు 23 తేదీన దివంగతులైయ్యెను. కానీ డాక్టరు సుహ్రహ్మణ్యం గారు యశఃకాయులై వారు స్థాపించిన సీతానగరం ఆశ్రమం ఈనాటికి నిలిచియున్నది. ప్రస్తుతం ఈ ఆశ్రమం ఆల్ ఇండియా చరకసంఘం వారి కస్తూర్బా ట్రస్తుతో కె జి ఆశ్రమం అని నడుప బడుచున్నది.[5], [6]

డాక్టరు సుబ్రహ్మణ్యంగారి పై గాంధీమహాత్ముని ప్రశంసలు

[మార్చు]


(1) 1929లో మహాత్మాగాంధీ ఆంధ్రదేశం వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యంగారి సీతానగర ఆశ్రమములో అత్యుంత్సోహాముతో జరుగుచున్న ప్రజాసేవలు జూచి గాంధీజీ తన యంగ్ ఇండియా (YOUNG INDIA) పత్రికలో 1929 మే 16 తేదీనాటి ప్రచురణలో చేసిన ప్రశంస తెలుగుసేత ఉల్లేఖన " నేనీ విశాలదేశమున గావించిన పర్యటనమునందెచ్చటను గూడ ఈ ఫిర్కాలో జూచినంత ఉత్సాహమును జీవకళను జూచియుండలేదు. ఆశ్రమవాసులు సామాన్యజీవయాత్రను గడుపుచున్ను వారు గ్రామస్థులలో నైక్యమై వారిపై మఖండమైన పలుకుబడిని సంపాదించినారు. ఆ పేదగ్రామములో ఐదువేల రూపాయలు వసూలయ్యెను. ఇంత పెద్ద మ1త్తము మఱేఇతర స్థలమందును లభించియుండలేదు" ఉల్లేఖన సమాప్తి. [5]

(2) 1936లో డాక్టరు సుబ్రహ్మణ్యం గారు పరమదించినప్పుడు తంతి ద్వారా (Telegram) మహాత్మా గాంధీ పంపిన సందేశం ఆంగ్లములోని ఉల్లేఖన [5]

CONGRESS CAMP 
24/12/1936

" SUBRAHMANYAM'S DEATH GREAT BLOW. HIS HUMILITY, SACRIFICE AND STEADFASTNESS WERE ALL HIS OWN. MY SYMPATHY WITH HIS FAMILY MEMBERS AND HIS ASHRAM

GANDHI

సుబ్రహ్మణ్యం గారి సంతతి, ప్రముఖ బంధువులు

[మార్చు]

డాక్టరు సుబ్రహ్మణ్యం గారికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు. వారు స్వతంత్రయోద్యమ దీక్షకలవారైనందున పెద్ద కుమారునికి బాలగంగాధర శర్మ (B.B.G.Sarma) అనియు రెండవ కుమారునికి మోహన్ దాస్ అనియు నామకరణముచేసిరి. వారిద్దరు పెద్ద చదువులు చదివి ఉన్నత పదవులు నిర్వహించారు. డా సుబ్రహ్మణ్యం గారి బావమరిదైన చెరుకుపల్లి వెంకటప్పయ్య గారు యమ్. ఎ బియల్ విజయవాడలో ప్రముఖ న్యాయవాదిగా చేశారు. అంతకు ముందు వారు మద్రాసులోటంగుటూరి ప్రకాశం గారి పత్రిక స్వరాజ్య పత్రికలో సబ్ ఎడిటర్ గా నాలుగు సంవత్సరములు (1921- 1925) పనిచేసే రోజులలో 1923 డిసెంబరు 28 న జరిగిన కాకినాడ కాంగ్రెస్సు మహా సభకు వారు స్వరాజ్య పత్రికకు తినిధిగా (రిప్రజంటేటివ్) వెళ్ళారు. వారి సమకాలీకులుగా వారితో పాటు ఆ రోజులలో స్వరాజ్య పత్రకలోకె యమ్ పణిక్కర్ (K.M.Panikkar) గారు ఎడిటర్ గానుండేవారు

మూలాలు

[మార్చు]
  1. "తూర్పుగోదావరి జిల్లా చరిత్ర". Archived from the original on 2015-06-23. Retrieved 2015-06-25.
  2. దుర్గాబాయి దేశముఖ్ రేడియో ప్రసంగం, అక్టోబరు 2వ తేది 2013
  3. బాపూ గాంధీ అశ్రమం, క్రొవ్విడి లింగరాజు (1980)
  4. గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం, సి. వి. రాజగోపాలరావు (1990)
  5. 5.0 5.1 5.2 "భారత దేశమున బ్రిటిష్ రాజ్యతంత్రము" దిగవల్లి వేంకట శివరావు (1938) మిత్రస్మృతి pp 1-7. ఆంధ్ర గ్రంధాలయ ముద్రణాలయం బెజవాడ
  6. ఆంధ్ర పత్రిక 13-12-1937

ఇతర లింకులు

[మార్చు]