Jump to content

బారు రాజారావు

వికీపీడియా నుండి

బారు రాజారావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శి.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

రాజారావు 1888లో పశ్చిమ గోదావరి జిల్లా లోని నర్సాపురంలో జన్మించాడు. నర్సాపురం, కాకినాడ, పెద్దాపురం లలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో చేరాడు. 1905లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకుగాను కళాశాల నుండి బహిష్కరించబడ్డాడు. ఆ తరువాత మద్రాసు లోని పచ్చయ్యప్ప కళాశాలలో చదివి, ఆఖరుకు కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. ఈయన ఎత్తుగా, చక్కగా హుందాతనం ఉట్టుపడుతూ ఉండేవాడు. ఈయన మృదుస్వభావి, ప్రాపంచిక ఆలోచనా ధోరణి కలిగినవాడు. పి.రాజేశ్వరరావు ఈయన్ను స్వాతంత్ర్యోద్యమానికి పునాది రాళ్ళైన నిశ్శబ్ధ దేశభక్తుల్లో ఒకడిగా అభివర్ణించాడు.[1]

కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శిగా

[మార్చు]

1917లో భారత జాతీయ కాంగ్రేసు కార్యదర్శిగా ఉన్న న్యాపతి సుబ్బారావు పంతులు రాజారావును కార్యాలయ కార్యదర్శిగా నియమించాడు. అదే పదవిలో రాజారావు 17 ఏళ్లపాటు పనిచేశాడు. ఆ పదిహేడేళ్లలో అనేకమంది కాంగ్రేసు అధ్యక్షులకు నమ్మినబంటుగా ఉన్న రాజారావు, వివిధ నాయకుల మధ్య సంధానకర్తగా పనిచేశాడు. పార్టీ యంత్రాంగంపై ఈయనకు గట్టి పట్టు ఉండేది. పెద్ద పెద్ద నిర్ణయాలలో ఈయన సలహాలు, సూచనలకు మంచి బలం ఉండేది. అందువల్ల అనేకమంది నాయకులు సూచనలకై రాజారావును సంప్రదించేవారు.

భారత జాతీయ కాంగ్రేసు కార్యదర్శిగా ఈయన అలీ సోదరులకు ఆప్తుడు, విఠల్‌భాయి పటేల్ ఈయన ఉత్తరప్రత్యుత్తరాలు వ్రాసే విధం నచ్చేది. మోతీలాల్ నెహ్రూ రాజారావును గద్దె వెనుక ఉన్న శక్తిగా అభివర్ణించాడు. రాజాజీ ఈయన్ను స్వరాజ్య ప్రభుత్వానికి కార్యదర్శిగా నియమించాడు. మదన్‌మోహన్ మాలవ్యా ఈయన్ను నడిచే సెక్రటరీగా వర్ణించాడు. రాజారావు రామకృష్ణ మఠం భక్తుడు. మాతా శారదా దేవిని తరచూ సందర్శిస్తూ ఉండేవాడు. అందరితోనూ కలిసిమెలిసి సఖ్యంగా ఉండేవాడు. ఎవరితోనూ రాజారావుకు ఘర్షణ ఉండేది కాదు.

నెహ్రూ కుటుంబంతో

[మార్చు]

రాజారావు కుటుంబం ఒక దశాబ్దంపైగా అలహాబాదులో నివసించి నెహ్రూ ఇంటిల్లిపాదిలో ఒకడిగా జవహర్‌లాల్, మోతీలాల్ నెహ్రూలతో కలిసిమెలిసి ఉండేవారు. 1930 సత్యాగ్రహం సమయంలో ఈయన భార్య అలివేలమ్మ కమలా నెహ్రూతో పాటు అలహాబాదులోని విదేశీ వస్త్రపు దుకాణాలముందు పికెటింగు చేసింది. ఈయన కుమారుడు గోవిందరావు, ఈయన కూతురు శేషమ్మ, ఇందిరతో పాటు బాలసేవాదళ్‌లో పనిచేశారు. మోతీలాల్ నెహ్రూ మరణించినప్పుడు రాజారావు ఆయన అస్థికలను తీసుకొనివచ్చి రాజమండ్రి వద్ద గోదావరి నదిలో కలిపాడు. జవహర్‌లాల్‌తో పాటు సొంత సోదరునివలే కలిసిమెలిసి తిరిగేవాడు.

స్వాతంత్ర్యోద్యమం

[మార్చు]

స్వాతంత్ర్యోద్యమంలో అనేక త్యాగాలు చేశాడు రాజారావు. 1930లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నందుకు మహాత్మాగాంధీతో పాటు యెరవాడ జైల్లో శిక్షను అనుభవించాడు. 1931లో డా.అన్సారీతో పాటు ఢిల్లో కేంద్ర కారాగారంలో ఉన్నాడు. 1932లో రాజారావును తిరిగి అరెస్టు చేసి సబర్మతి కేంద్ర కారాగారంలో ఉంచి, అక్కడ నుండి దక్షిణాదిన ఉన్న కన్ననూరు జైలుకు తరలించారు.

వివేకానందుని అన్న మొహేంద్రనాథ్ దత్తా తన పుస్తకం "న్యూ ఏషియా"ను రాజారావుకు అంకితమిచ్చాడు. రాజారావు బహుభాషావేత్త. తెలుగుతో పాటు ఇంగ్లీషు, హిందీ, బెంగాళీ, తమిళ భాషలు మాట్లాడేవాడు. కాంగ్రేసు కార్యవర్గ కమిటీలో అప్పుడప్పుడు తెలుగువాళ్ళను చేర్చటం చేస్తుండేవాడు. ఈయన ఇళ్లు ఎప్పుడూ బంధువులు, వచ్చిపోయేవారితో కళకళలాడుతూ ఉండేది. ఈయన తన భవిష్యత్తు గురించి కానీ, తన కుటుంబ భవిష్యత్తు గురించి కానీ పెద్దగా ఆలోచించలేదు.

భారతప్రభుత్వ చట్టం (1935) ప్రకారం 1937లో జరిగిన ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ పోటీ చేసినప్పుడు రాజారావు మద్రాసు ప్రొవింషియల్ లెజిస్లేచర్‌కు రాజమండ్రి నుండి ఎన్నికయ్యాడు. జవహర్‌లాల్ నెహ్రూ రాజమండ్రి వచ్చినప్పుడు ఆయనకు ఆతిథ్యం వహించటానికి అనేకమంది షావుకార్లు, హేమాహేమీలు పోటీపడ్డారు కానీ ఆయన రాజారావు ఇంట్లోనే బసచేశాడు.

మరణం

[మార్చు]

రాజారావు యాభై ఏళ్ల వయసులో 1938, జూన్ 8న మరణించాడు.

ఇంకా కొన్ని జీవిత విశేషాలు

[మార్చు]

బారు రాజారావు గారి స్నేహితులైన దిగవల్లి వేంకట శివరావు గారు జ్ఞాపకాలు అను తమ అప్రచురిత రచనలో అంగ్లంలో వ్రాసిన విశేషాలు క్లుప్తంగా తెలుగులో ఇక్కడ ఇయ్యబడినవి. రాజమహేంద్రవరంలో రాజారావు గారు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణలు కాలేదు కానీ వారు కలకత్తా వెళ్ళి అక్కడ కలకత్తాలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై తరువాత అక్కడే కాలేజీలో బి.ఎ పట్టాకు నాలుగు సంవత్సరములు చదివారు కానీ పట్టా పూర్తిచేయలేదు. వారి కలకత్తా విద్యార్థి దశలో అప్పట్లో కలకత్తా లో1912 నుండి 1917 దాకా వైద్య విద్యనభ్యసించి తరువాత 1917 లో అక్కడే శంభునాధ్ మెమోరియల్ హాస్పిటల్ లో హౌస్ సర్జన్ గాచేసి న ఘంటసాల సీతారామ శర్మగారితో పరిచయం అయి అప్పటినుండి వారిద్దరు సన్నిహితులుగా నుండేవారు. రాజారావు గారు రామకృష్ణ పరమహంస భక్తులు. రామకృష్ణ మఠములోని కార్యకలాపాలలో ఉత్సాహంగా పాత్ర వహించేవారు. అప్పుడు కలకత్తా లోని బెల్లూరు మఠానికి తరుచు వెళ్ళే వారు. వారితో పాటు డాక్టరు శర్మగారిని కూడా తీసుకుని వెళ్ళేవారు. అప్పటికి స్వామీ బ్రహ్మానంద (రాఖల్ మహారాజ్ ) గారు ఆ మఠాదిపతి. వారితో రాజారావు గారికి పరిచయం. అప్పటిలో రామకృష్ణ పరమహంస సతీమణి శారాదా మాత మరియూ పరమహంస శిష్యులలో ప్రముఖులైన ఎమ్ మహీంద్రనాధ్ గుప్త గారు కూడా జీవించియున్న రోజులు అవి. 1936 దాకా రామకృష్ణ మఠానికి అధ్యక్షులుగానుండిన స్వామీ సివానందా గారు రాజారావుగారిని చాల ప్రేమాభిమానములతో చూసేవారు. రాజా రావు గారు చాల నీతి నియమములు, దైవ భక్తి కలిగిన వారు. బహు సౌమ్య స్వభావముకలిగిన వారు. 1923 లో వారు బెజవాడలో నే కొన్ని రోజులు బస చేశారు. ఆరోజులలో వారిని కాంగ్రెస్స కార్యాలయంలో వారి మిత్రులు డాక్టరు శర్మగారు, దిగవల్లి శివరావుగారు తరుచూ కలుసు కుంటూవుండేవారు. ఆ తరువాత వారు ఎప్పుడు బెజవాడ వచ్చినా వారి మిత్రులు ఘంటసాల సీతారామ శర్మ గారితో బసచేసేవారు. 1930 మే నెల మొదలు 1931 మార్చి నెల దాకా జరిగిన గాంధీ జీ సివిల్ డిజ్ ఒబీడియన్సు ఉద్యమంలో వారిని గూడా ఖారాగార నిర్బందము చేసి ధూలీయా జైలులో నిర్బందించారు. వారు డాక్టరు శర్మగారికి సోస్టు కార్డు వ్రాసి తను ధూలియా జైలునుండి విడుదలై రాజమండ్రీకి బెజవాడ మీదుగా ఫలానా తారీకు న వెళ్ళితున్న సంగతి వ్రాశారు. డాక్టరు శర్మగారు ఇంకా జైలులోనేవుండబట్టి ఆ పోస్టు కార్డు దిగనల్లి వేంకట శివరావు గారు చూసి తనే రైలు స్టేషన్ కు టిఫన్ కార్యర్లో భోజనం తీసుకుని వెళ్ళారు. రాజమండ్రీకి వెళ్ళే రైలుకి ఇంకా చాలా వ్వవధి వున్నందున రాజారావు గారు శివరావుగారితో కలిసి శివరావుగారి ఆతిధ్యము స్వీకరించి వారింటికి వెళ్లారు. అవి శివరావుగారి పై మొదటి రాజద్రోహం కేసు విచారణ జరుగుచున్న రోజులు ఆ కారణంగా రాజా రావు గారు శివరావు గారితో కలిసి వెళ్లటంవల్ల శివరావుగారి పై పోలీసులనిఘాకు ఇంకో కారణం ఆయి యుండినది. జాతీయ స్థాయి కాంగ్రెస్ సంస్థ లోఅనేక ప్రముఖులు వారితో పరిచయం కలిగి యుండేవారు. 1918 నుండి 1934 దాకా వారు అఖిల భారత కాంగ్రెస్ సదస్సులో అండర్ శక్రటరీగా చేశారు. అల్హాబాదులో అనందభవన్ కార్యాలయము నుడి పని చేశేవారు. మోతీలాల్, జవహర్ లాల్ నెహ్రూ లతో సన్నిహిత పరిచయం కలిగియుండే వారు. 1937 ఎన్నికలకు పండిట్ నెహ్రూ గారు రాజమహెంద్రవరం వచ్చినప్పుడు నెహ్రూ గారు రాజారావుగారి నివాసములోనే బసచేశారు. అప్పటిలో రాజారావుగారి నివాసము చిన్న వసారా గది. దాంట్లోనే నెహ్రూ రాజారావు గారితో పాటు ఉన్నారు. 1937 లో రాజారావుగారు ఎమ్ ఎల్ సిగా ఎన్నికైనారు. దురదృష్టవశ్యాత్తూ 1938 జూన్ లోనే (అప్పటికి వారికి యాభై ఏండ్ల వయస్సు మాత్రమే) పరమందించారు. రాజారావుగారిని గురించి ఒక వ్యాసం 1938 జూలై మాసపు భారతి పత్రికలో నండూరి బంగారయ్య గారు వ్రాసియున్నారు.[2]

మూలాలు

[మార్చు]
  1. The Great Indian Patriots, Volume 1 By P. Rajeswar Rao
  2. "బారు రాజారావు గారు" నండూరి బంగారయ్య భారతి జులై 1938