Jump to content

శివలెంక మల్లికార్జున రావు

వికీపీడియా నుండి
శివలెంక మల్లికార్జునరావు

డాక్టర్ శివలెంక మల్లికార్జున రావు L.C.P&S బెజవాడలో 1916 నుండి 1982 దాకా సుప్రసిధ్ద వైద్యులు. 20 శతాబ్దములో మొదటి నాలుగు దశాబ్దములపాటు గాంధీజీ సత్యాగ్రహోద్యమములో కృషిసలిపిన ఆంధ్రదేశ స్వాతంత్ర్యసమరయోధులలో ఒకరు.

జీవిత విశేషాలు

[మార్చు]

వీరు తమ మాతామహుల గ్రామమైన యెలకుర్రు గ్రామంలో 1894, జనవరి 13వ తేదీన జన్మించారు[1]. వీరి తండ్రి శివబ్రహ్మం, తల్లి భ్రమరాంబ. కాలమందు బెజవాడలోని వారి PEOPLE'S CLINIC చాల ప్రముఖమైనది. వీరు ఆంధ్రపత్రిక అదిపతి శివలెంక శంభూప్రసాద్ గారి అన్నగారు. వీరు బెజవాడలో ఉన్నత విద్యను అభ్యసించి, బందరులో ఇంటరు పరీక్షను వ్రాసి, హైదరాబాదు వైద్యకళాశాలలోను, కలకత్తా లోని జాతీయ వైద్య కళాశాల (NATIONAL MEDICAL COLLEGE) లోను వైద్య విద్యనభ్యసించిరి. వీరితో పాటు ఆ రోజులలో (1912-1916) వైద్య విద్యార్థులుగా నుండి స్వతంత్ర పోరాటములో సమరయోధులుగా అనేక సార్లు జైలుకెళ్లి చివరకు పోలీసులచేత అతి కృూరముగా దెబ్బలు తిని, కోలుకోలేక 1936లోనే పరమదించిన డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం గారు, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ ఘంటసాల సీతారామ శర్మ వీరికి కలకత్తా వైద్యకళాశాలలో సమకాలీకులు. దిగవల్లి వేంకట శివరావు గారి అప్రచురిత వ్యాసములు "నా జ్ఞాపకాలు", "Diary and Family History" మరియూ అనేక చేతి వ్రాత ప్రతులుగా నున్న వ్యాసముల లోవీరిని గురించి అక్కడక్కడ వ్రాసియున్నది. వీరు 1930 సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 2 యేండ్లు కఠిన కారాగారశిక్ష విధించబడి రాయవెల్లూరు జైలుకు పంపబడ్డారు. అప్పుడు అక్కడ వీరి మేనమామ అయిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన వారున్నారు. వీరు బెజవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1932 సంవత్సరములో లార్డు వెల్లింగటన్ గవర్నర్ జనరల్ నిరంకుశముగా పరిపాలనజరుగుచున్న రోజులలో గాంధీతో సహా అనేక కాంగ్రెస్స కార్యకర్తలను జైలులో నిర్బందించబడిరి. అప్పటిలో కాంగ్రెస్సు వారు గాంధీ ప్రవేశపెట్టిన సహాయనిరాకరణోద్యమము సాగించుచుండిరి. 1932 జనవరి నెలలో బెజవాడలోను కృష్ణాజిల్లాలో అనేక చోట్ల సెక్షన్144 అమలులోనుండినప్పుడు స్వరాజ్యాందోళనకారులపై పోలీసులు విజృంభించి చేసిన లాఠీచార్జీలతో కృష్ణాజిల్లాలో అనేకమందికి గాయములు తగిలినవి. వారిలో చాలమంది డాక్టరు శివలెంక మల్లికార్జున రావు గారి పీపుల్సు హాస్పిటల్ లో చికత్సపొందేవారు. 1932 సంవత్సరము జనవరి 26 తేదీన స్వరాజ్యదినముగపరిగణంచి చేసిన సత్యాగ్రవేడుకలు, తదుపరి ఏప్రల్ మాసములో 1919వ సంవత్సరపు జలియన్ వాలా బాగ్ స్మృతిచిహ్నముగా చేసిన సత్యాగ్రహ కార్యక్రమములనణచుటకు పోలీసుల నిర్భందచర్యలు లాఠీఛార్జీలు జరిగినవి. ఆకాలమందు జరిగిన Police Excess లవల్ల గాయములు తగిలి చికిత్సపొందిన వారి స్థితిగతుల లెఖలు డాక్టరు మల్లికార్జునరావుగా రి వైద్యశాలవారి తబ్సీళ్ళతో దిగవల్లి శివరావు గారు సంకలనం చేసిన నివేదిక 1932 జూలై 14 వతేదీన మద్రాసులోని శాసనమండలి సభ్యులకు కృష్ణాజిల్లా కాంగ్రెస్సు కార్యాలయమువారు పంపించిరి. మల్లికార్జునరావుగారు 1942 క్విట్ ఇండియా ఉద్యమములో కూడా పాల్గొన్నారు. వీరి సమాజసేవకు గుర్తింపుగా విజయవాడలో ఒక వీధికి వీరి పేరు మీద "మల్లికార్జునరావు వీధి" అని నామకరణం చేశారు.

మరణం

[మార్చు]

మల్లికార్జునరావు గారు 1982 సంవత్సరం నవంబరు 12 తారీఖున మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. మల్లెల, శ్రీరామమూర్తి (6 May 1979). "త్యాగి, నిరాడంబరజీవి డా.శివలెంక మల్లికార్జున రావు గారు". ఆంధ్రపత్రిక ఆదివారం అనుబంధం. Retrieved 14 December 2017.[permanent dead link]