క్రొవ్విడి లింగరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రొవ్విడి లింగరాజు
Krovvidi lingaraju.jpeg
క్రొవ్విడి లింగరాజు
జననంనవంబర్ 3, 1904
మరణంజనవరి 3, 1986
వృత్తిరచయిత

క్రొవ్విడి లింగరాజు ( నవంబర్ 3, 1904 - జనవరి 3, 1986) స్వాతంత్ర్య సమర యోధులు, పత్రికా సంపాదకుడు, పత్రికా రచయిత, అనువాద రచయిత, సంఘసంస్కరణాభిలాషి, రాజకీయ విశ్లేషకుడు. రాజమండ్రి పురపాలక సంఘం అధ్యక్షులుగా, శాసన సభ్యులుగా రాష్ట్రానికి, అఖిలభారత స్వాతంత్ర్య సమర యోధుల సంఘానికి ఉపాధ్యాక్షులుగా దేశానికి సేవలందించారు.

విశేషాలు[మార్చు]

లింగరాజు 1904, నవంబరు 3వ తేదీన రాజమండ్రిలో జన్మించాడు. ఇతని తండ్రి సూర్యనారాయణ పడవల హెడ్‌గుమాస్తాగా పనిచేసేవాడు. తల్లి లక్ష్మీనరసమ్మ. గాంధీ స్ఫూర్తితో కళాశాల విద్యకు స్వస్తిచెప్పి, జాతీయ ఉద్యమంలో కీలకపాత్ర వహించాడు. 1922 నుండి రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశాడు. ఇతడు బులుసు సాంబమూర్తి, బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యంల అనుచరునిగా పనిచేశాడు. మద్దూరి అన్నపూర్ణయ్యను ఇతడు గురువుగా భావించాడు. మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకత్వం వహించిన కాంగ్రెస్ పత్రికకు సహాయకుడిగా పనిచేశాడు. అన్నపూర్ణయ్య జైలులో ఉన్నప్పుడు ఇతడే కాంగ్రెస్ పత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు. ఇతడు కాంగ్రెస్ పత్రికతో పాటు వేదిక, గోదావరి పత్రికలకు సంపాదకత్వం వహించాడు. ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రికలలో అనేక వ్యాసాలు వ్రాశాడు. కృష్ణాపత్రికలో విదురుడు అనే కలం పేరుతో వారం వారం అనే శీర్షికను నిర్వహించాడు. ఇతడు అనేక సార్లు జైలుశిక్షను అనుభవించాడు. 1921లో సహాయనిరాకరణోద్యమ సమయంలో ఆరునెలలు, 1930లో ఉప్పు సత్యాగ్రహం సాగినప్పుడు రెండున్నర సంవత్సరాలు జైలుశిక్షను అనుభవించాడు.

మాక్సిం గోర్కీ 'మదర్'ను అమ్మగా అనువదించారు. 'సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు' పొందిన తొలి తెలుగు రచయిత . జవహర్ లాల్ నెహ్రూ రచించిన ' డిస్కవరీ ఆఫ్ ఇండియా ' ను 'భారతదేశం' గా అనువదించారు. గొప్పోళ్ళన్యాయం కథల సంపుటిని రచించారు. ఈయనకు 1984లో అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహీతీ సత్కారం లభించింది[1] .

పదవులు[మార్చు]

ఇతడు నిర్వహించిన పదవులలో కొన్ని ముఖ్యమైనవి:

  • 1938-1941 - రాజమండ్రి మునిసిపల్ ఛ్హైర్మన్
  • 1946-1952 - రాజమండ్రి నియోజకవర్గ శాసనసభ్యుడు
  • 1946-1947 - టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో పార్లమెంటరీ సెక్రెటరీ
  • కార్యదర్శి - గాంధీ కలెక్టెడ్ వర్క్స్ కమిటీ
  • అధ్యక్షుడు - రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధుల సంఘం
  • ఉపాధ్యక్షుడు - భారత స్వాతంత్ర్య సమరయోధుల సమితి
  • స్థాపక అధ్యక్షుడు - శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాల
  • అధ్యక్షుడు - కందుకూరి వీరేశలింగం ఆస్తిక డిగ్రీ కళాశాల

అమ్మ[మార్చు]

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నవలలో మాగ్జిం గోర్కీ రష్యన్ భాషలో రచించిన అమ్మ ఒకటి. ఈ రచన 1906లో తొలిసారి వెలువడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కోట్ల కోట్ల ప్రతులు వెలువడుతూనే ఉన్నాయి. తెలుగునాట కూడా దాని ప్రభావం అమోఘమైంది. అమ్మ అనే మాటలో కొంతమంది సెంటిమెంటు చూస్తుంటారు గాని వాస్తవంలో అమ్మ అనేదే ఏ సెంటిమెంటూ లేని వాస్తవం. మానవాళి అస్తిత్వానికి ఆరంభ వాచకం అమ్మే. అన్ని బాధలూ, గాథలకు ప్రథమ ప్రత్యక్ష సాక్షి అమ్మే. వాస్తవానికి అమ్మ పాత సమాజానికి ప్రతీక. దాని క్రమానుగత చైతన్య పతాక. 'అమ్మ' పుస్తకంలోని ప్రతి పాత్రా, ప్రతి పరిణామం రచయిత మగ్జీమ్‌ గోర్కీ వాస్తవ జీవితంలో పరిశీలించి తెలుసుకున్నదే. 1905లో రష్యాలో తొలి విప్లవం పొడసూపింది. దాన్ని జార్ చక్రవర్తి దారుణంగా అణచివేశాడు. ఆ విప్లవమే అక్టోబరు విప్లవ విజయానికి స్ఫూర్తి. ఆ తొలి విప్లవం నుంచి వెలువడ్డ మూడు అపురూపమైన నవలల్లో గోర్కీ అమ్మ కూడా ఒకటి. ఇది తెలుగులో అమ్మ నవలకు వచ్చిన తొలినాటి అనువాదాల్లో ఒకటి.[2] దీని ఆరోకూర్పును విజయవాడలోని ఆదర్శ గ్రంథమండలి వారు 1956లో ప్రచురించారు. దీనికి గద్దె లింగయ్య సంపాదకత్వం వహించారు.

మరణం[మార్చు]

ఇతడు 1986, జనవరి 3న తన 83వ యేట మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.
  2. భారత డిజిటల్ లైబ్రరీలో అమ్మ పుస్తక ప్రతి.