బులుసు సాంబమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బులుసు సాంబమూర్తి
Bulusu Sambamurti
బులుసు సాంబమూర్తి


ఆధ్యక్షుడు, మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్
పదవీ కాలం
జూలై 18, 1937 – 1942
ముందు బి. రామచంద్రారెడ్డి
తరువాత యు. రామారావు

వ్యక్తిగత వివరాలు

జననం (1886-03-04)1886 మార్చి 4
Dulla, ఆంధ్ర ప్రదేశ్
మరణం 1958 ఫిబ్రవరి 2(1958-02-02) (వయసు 71)
కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్
జాతీయత Indian
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
వృత్తి రాజకీయాలు
మతం హిందూమతం

బులుసు సాంబమూర్తి (1886 - 1958) దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. భారతదేశ స్వాతంత్ర్యం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర అనే పరమ లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేసిన కార్యశూరుడు. ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు.

జననం[మార్చు]

ఈయన తూర్పు గోదావరి జిల్లా, దుళ్ల గ్రామంలో 1886, మార్చి 4 న జన్మించారు. ఈయన తండ్రి సుబ్బావాధానులు వేదపండితుడు. కుటుంబమంతా దానధర్మాలు చేస్తూ ధార్మిక జీవనం సాగించేవారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులై, విజయనగరం మహారాజా కళాశాలలో కొంతకాలం భౌతిక శాస్త్రం బోధించారు. స్వేచ్ఛా స్వభావి అయిన సాంబమూర్తికి ఈ ఉద్యోగం అంతగా నచ్చలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి న్యాయవాద వృత్తి చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. తరువాత బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై 1911లో కాకినాడలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.

మహాత్మా గాంధీ పిలుపునందుకొని న్యాయవాద వృత్తిని వదలి స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నారు. వీరు 1919లో హోంరూల్ ఉద్యమంలోను, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోను, 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోను, నీల్ సత్యాగ్రహంలోను పాల్గొని కారాగార శిక్షలు అనుభవించారు. 1927లో నాగపూరు పతాక సత్యాగ్రహ దళానికి నాయకులుగాను, 1928లో హిందూస్థానీ సేవాదళానికి అధ్యక్షులుగాను పనిచేశారు. తరువాత వీరు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెసు కమిటీకి అధ్యక్షులుగాను, 1929లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యులుగా వ్యవహరించారు. 1930 ఉప్పుసత్యాగ్రహ సమయంలో తన సహచరులతో చొల్లంగి సముద్రతీరానికి వెళ్ళి ఉప్పును తయారుచేశారు. అప్పుడు సాంబమూర్తిగారిని అరెస్టుచేసి వెల్లూరు జైలుకి తరలించారు. 1935-37 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగాను వ్యవహరించారు.

1935లో మద్రాసు ప్రోవిన్షియల్ ఎస్సెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు, చక్రవర్తి రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ప్రభుత్యాన్ని ఏర్పాటుచేశారు. సాంబమూర్తిగారు 1937 నుంచి 1942 వరకూ స్పీకరుగా ఉన్నారు. 1937లో కాంగ్రెస్ మంత్రివర్గ పరిపాలనలో మద్రాసు రాష్ట్ర శాసనసభకు వీరు సభాపతిగా విధులను సంప్రదాయాలకు అనుగుణంగా, మర్యాదగా, అద్వితీయంగా నిర్వహించి సభకు గౌరవ ప్రతిష్ఠలను సమకూర్చారు.

మరణం[మార్చు]

తన సర్వస్వాన్ని దేశోద్ధరణకు సమర్చించిన వీరు చివరి రోజులలో పేదరికంలో, అనారోగ్యంతో గడిపి 1958 సంవత్సరంలో పరమపదించారు.

2008లో భారత ప్రభుత్వం బులుసు సాంబమూర్తి గౌరవార్థం ఒక తపాళాబిళ్లను విడుదల చేసింది.

మూలాలు[మార్చు]

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.