Jump to content

విష్ణు సహస్రనామ స్తోత్రము

వికీపీడియా నుండి
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక vedic ప్రార్థనలలో ఒకటి. సహస్ర  అనగా  వెయ్యి . అంటే  ఈ స్తోత్రంలో  వెయ్యి నామాలు  ఉంటాయి . ఇది శ్రీమహావిష్ణువు యొక్క వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు (చాత్తాద శ్రీవైష్ణవులు) భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.ఇచట సహస్రనామము అనగా వేయి పేర్లు అని కాదు అనంతము అని చెప్పుకోవలెను.

మొదటిగా విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు (ధర్మరాజుకు) ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ప్రతీతి. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడింది.

రెండవది గరుడపురాణములో విష్ణు సహస్రనామ స్తోత్రము ఉంది. మూడవది పద్మపురాణములో కూడా దీని ప్రస్తావన ఉంది.ఈ మూడింటినే వ్యాసుడే రచించాడు అని కొందరు భక్తుల అభిమతము.గరుడపురాణములోని సహస్రనామ స్తోత్రమును శ్రీహరి రుద్రునకు, పద్మపురాణములోని స్తోత్రమును మహాదేవుడు తన సతి పార్వతికి ఉపదేశించాడు.కాని ఈ మూడింటిలో అతి ప్రాచీనమై, ప్రసిద్ధమై శ్రీ శంకర భగవత్పాదుల, పరాశర భట్టాదులచేత వ్యాఖ్యానింపబడి బాలురు, వృద్ధులు, స్త్రీలు మిగతావారిచే పారాయణగావించబడుచున్నది భారతాంర్గతమైన స్తోత్రము. అందువలన మిగతా రెండింటి ఉనికియే చాలా మందికి తెలీదు. వాటికి వ్యాఖ్యానములు కూడా లభించుటలేదు. ఈస్తోత్ర మహిమను సా.శ.6-7 శతాబ్దములకు చెందిన భాణభట్టు తన కాదంబరిలో విలాసవతి అను రాణికి జన్మించిన బాలకుని రక్షణకొరకు సూతికాగృహ సమీపములో విప్రవర్యులు నామ సహస్రమును పఠించుచుండిరని నుడువుటచే దీని ప్రాశస్త్యము మనవరికి చాలా కాలమునకు ముందుగానే అవగతమైనట్లు తెలియుచున్నది. అటులనే దీని మహిమ ఆయుర్వేద గ్రంథములలోను, జ్యోతిష్య శాస్త్రములలోను, ఉన్నాత్లు కూడా ఆధారములు ఉన్నాయి.

శ్రీ శంకరులు గేయం గీతానామ సహస్రం అని తమ మొహముద్గర స్తోత్రములో నుడువుటచే భగవద్గీతకు, నామ సహస్రమునకు కల సమప్రాధాన్యము, అన్యోన్య సాపేక్షత ఊహించవచ్చును. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రమునకు శ్రీ శంకర భాష్యముతో పాటు, బృహత భాష్యము, విష్ణు వల్లభ భాష్యము, ఆనందతీర్ధ-కృష్ణానందతీర్ధ-గంగాధర యోగీంద్ర-పరాశరభట్ట-మహాదేవ వేదాంతి-రంగనాధాచార్య-రామానందతీర్ధ-శ్రీరామానుజ-విద్యారణ్యతీర్ధ-బ్రహ్మానందతీర్ధ భారతి-సుదర్శన-గోవిందభట్టుల భాష్యములు (వ్యాఖ్యానములు) పదిహేను ఉన్నాయి.ఇప్పుడు మనకు లభిస్తున్న వాటిలో శ్రీశంకరులదే ప్రాచీనము అని చెప్పవచ్చును.1901లో దీనిని ఆర్.అనంతకృష్ణ శాస్త్రిగారు తొలిసారి ఆంగ్లములోనికి అనువాదించిరి.

స్తోత్రవిభాగము

[మార్చు]

విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ. చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివిధ విభాగాలున్నాయి.

పూర్వ పీఠిక

[మార్చు]

ప్రార్థన

[మార్చు]

ప్రార్థన శ్లోకములు, స్తోత్రము ఆవిర్భవించిన సందర్భ వివరణ ఈ పూర్వపీఠికలో ఉన్నాయి. ముందుగా వినాయకు నకు, విష్వక్సేను నకు, వ్యాసు నకు, ఆపై విష్ణువుకు ప్రణామములతో స్తోత్రము ఆరంభమౌతుంది.

స్తోత్ర కథ

[మార్చు]

అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగిన ఆరు ప్రశ్నలు:

  1. కిమ్ ఏకమ్ దైవతం లోకే - లోకంలో ఒక్కడే అయిన దేవుడు (పరమాత్ముడు) ఎవరు?
  2. కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్ - జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?
  3. స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును?
  4. కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును?
  5. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః - మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?
  6. కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ - ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును?

అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం: జగత్ప్రభువును, దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని వేయి నామములను నిశ్చలమైన భక్తితో స్తుతిసేయట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామము చేయుట వలనను సర్వదుఃఖములనుండి విముక్తి పొందవచ్చును. ఆ బ్రాహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళ ప్రదుడు. సకల సృష్టి-స్థితి-లయ కారకుడు. ఈ వేయి గుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేసారు.

సంకల్పము

[మార్చు]
1690 కాలానికి చెందిన విష్ణుసహస్రనామ స్తోత్రం పుస్తకం ముఖచిత్రం

తరువాత స్తోత్రములో సంకల్పము (ఎవరిని, ఎందుకు స్తుతిస్తున్నాము) చెప్పబడుతుంది. ఈ స్తోత్రమునకు

  • ఋషి - వేదవ్యాసుడు
  • ఛందస్సు - "అనుష్టుప్" Chanda should be Gayatri as per the verse "Gayatri chandah"
  • మంత్రాధిష్టాన దైవము - శ్రీమన్నారాయణుడు
  • బీజము - అమృతాం శూద్భవః భానుః
  • శక్తి - దేవకీ నందనః స్రష్టా
  • మంత్రము - ఉద్భవః క్షోభణః దేవః
  • కీలకము - శంఖభృత్ నందకీ చక్రీ
  • అస్త్రము - శార్ఙ్గదన్వా గదాధరః
  • నేత్రము -రథాంగపాణి రక్షోభ్యః
  • కవచము -త్రిసామా సామగః సామః
  • యోని - ఆనందం పరబ్రహ్మ
  • దిగ్బంధము - ఋతుః సుదర్శనః కాలః
  • ధ్యానము చేయు దేవుడు - విశ్వరూపమని భావించే విష్ణువు
  • చేసే పని - సహస్రనామ జపము
  • కారణము - శ్రీమహావిష్ణువు ప్రీతి కొరకు..

ధ్యానము

[మార్చు]

తరువాత పాలకడలిలో శంఖ చక్ర గదా పద్మములు ధరించిన వాడు, భూమియే పాదములుగా గలవాడు, సూర్యచంద్రములు నేత్రములైనవాడు, దిక్కులే చెవులైనవాడు, త్రిభువనములు శరీరముగా గలవాడు, శేషశాయి, విశ్వరూపుడు, శ్రీవత్సాంక కౌస్తుభ పీతాంబరధారి, నీలమేఘ వర్ణుడు అయిన రుక్మిణీ సత్యభామా సమేతుడు, ముకుందుడు, పరమాత్ముడు అయిన దేవునకు ధ్యానము చెప్పబడుతుంది.

"హరిః ఓం" అంటూ వేయి నామాల జపం మొదలవుతుంది.

వేయి నామములు

[మార్చు]
విష్ణు సహస్రనామ స్తోత్రము
వేయి నామముల వివరణ
1 - 100
101 - 200
201 - 300
301 - 400
401 - 500
501 - 600
601 - 700
701 - 800
801 - 900
901 - 1000
1 - 1000 లఘు వివరణ

విశ్వం అనే నామంతో మొదలైన సహస్ర నామ జపం సర్వ ప్రహరణాయుధ అనే వెయ్యవ నామంతో ముగుస్తుంది. ఈ ప్రధాన స్తోత్ర భాగంలో 108 శ్లోకాలలో వేయి నామములు పొందుపరచబడి ఉన్నాయి. పరమాత్ముని వివిధ లక్షణ గుణ స్వభావ రూపములు వివిధనామములలో కీర్తించబడ్డాయి. అనంత గుణ సంపన్నుడైన భగవానుని వేయి ముఖ్యగుణములను కీర్తించే పుణ్యశబ్దాలుగా ఈ వేయి నామాలను సాంప్రదాయికులు విశ్వసిస్తారు.

విష్ణు సహస్రనామాల గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు రచించిన భాష్యము వీటిలో ప్రథమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించింది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.

వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు శంకరాచార్యులు "స్థవిరోధ్రువః" అని ఒకే నామమును పరిగణించగా, పరాశరభట్టు "స్థవిరః", "ధ్రువః" అనే రెండు నామములుగా పరిగణించెను. పరాశరభట్టు "విధేయాత్మా" అని తీసుకొనగా శంకరాచార్యులు "అవిధేయాత్మా" అని తీసుకొనెను. కాని ఇటువంటి భేదాలు చాలా కొద్ది.

ఇంకా కొన్ని నామములు పునరావృతమైనట్లుగా ఉంటాయి. ఉదాహరణకు విష్ణుః (మూడు సార్లు) ; శ్రీమాన్, ప్రాణదః (ఒక్కొక్కటి నాలుగు సార్లు) ; కేశవః, పద్మనాభః, వసుః, సత్యః, వాసుదేవః, వీరః, ప్రాణః, వీరహా, అజః, మాధవః (ఒక్కొక్కటి మూడు సార్లు) ; పురుషః, ఈశ్వరః, అచ్యుతః, అనిరుద్ధః, అనిలః, శ్రీనివాసః, యజ్ఞః, మహీధరః, కృష్ణః, అనంతః, అక్షోభ్యః, వసుప్రదః, చక్రీ (ఒక్కొక్కటి రెండేసి సార్లు) - ఇలా చెప్పబడ్డాయి. మొత్తం 90 నామాలు ఒకటికంటె ఎక్కువసార్లు వస్తాయి. కాని భాష్యకారులు ఒకే నామానికి వివిధ సందర్భాలలో వివిధ అర్ధాలు వివరించి, పునరుక్తి దోషం లేదని నిరూపించారు.

ఇంకా భగవద్గీతకు, విష్ణు సహస్రనామ స్తోత్రానికి అవినాభావ సంబంధము ఉంది. (రెండూ మహాభారతం లోనివే). ప్రత్యేకించి గీతలోని 10వ అధ్యాయము (విభూతి యోగము) లో భగవంతుని వర్ణించే విభూతులు అన్నీ విష్ణు సహస్ర నామంలో వస్తాయి. (ఉదాహరణ - ఆదిత్యః, విష్ణుః, రవిః, మరీచిః, వేదః, సిద్ధః, కపిలః, యమః, కాలః, అనంతః, రామః, ఋతుః, స్మృతిః, మేధా, క్షమః, వ్యవసాయః, వాసుదేవః, వ్యాసః). 11 వ అధ్యాయము (విశ్వరూప సందర్శన యోగము) లలో భగవంతుని వర్ణించే పదాలు అన్నీ విష్ణు సహస్ర నామంలో దాదాపుగా వస్తాయి. (ఉదాహరణ: తత్పరః, అవ్యయః, పురుషః, ధర్మః, సనాతనః, హృషీకేశః, కృష్ణః, చతుర్భుజః, విశ్వమూర్తిః, అప్రమేయః, ఆదిదేవః). ఇంకా గీత 2వ అధ్యాయములోని స్థితప్రజ్ఞ లక్షణాలు, 12వ అధ్యాయములోని భక్త లక్షణాలు, 13వ అధ్యాయములోని భగవద్గుణములు, 14వ అధ్యాయములోని త్రిగుణాతీతుని లక్షణాలు, 16వ అధ్యాయములోని దేవతాగణగుణాలు అన్నీ వేర్వేరు నామాలుగా సహస్రనామ స్తోత్రంలో చెప్పబడ్డాయి.

శంకరాచార్యులు "గేయం - గీతా - నామ సహస్రం" అని రెండు పవిత్ర గ్రంథాలకూ ఎంతో ప్రాముఖ్యతను తెలియజెప్పారు.

ఉత్తర పీఠిక

[మార్చు]

ఫలశ్రుతి

[మార్చు]

ఈ స్తోత్రం వలన కలిగే ప్రయోజనాలు ఫలశ్రుతిలో చెప్పబడ్డాయి. క్లుప్తంగా ఇదీ ఫలశ్రుతి:

  • ఈ దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభములు కలుగవు. బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు లభించును. క్షత్రియులకు విజయము, వైశ్యులకు ధనము, శూద్రులకు సుఖము లభించును. ధర్మము కోరువారికి ధర్మము, ధనము కోరువారికి ధనము అబ్బును. కోరికలీడేరును. రాజ్యము లభించును. భక్తితో వాసుదేవుని నామములను శుచిగా కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు, ప్రాధాన్యత లభించును. వారి రోగములు హరించును. వారికి బలము, తేజము వర్ధిల్లును.
  • పురుషోత్తముని స్తుతి చేసేవారిలో వ్యాధిగ్రస్తులు ఆరోగ్యవంతులవుతారు. బంధితులకు స్వేచ్ఛ లభించును. భయమునుండి విముక్తి కలుగును. ఆపదలు తొలగిపోవును. అట్టి భక్తుల కష్టములు కడతేరును. వాసుదేవుని భక్తులకు పాపములు తొలగును. వారికి అశుభములు, జన్మ మృత్యు జరా వ్యాధి భయములు ఉండవు. సుఖము, శాంతి, సిరి, ధైర్యము, కీర్తి, సస్మృతి లభించును. పుణ్యాత్ములగుదురు.
  • సకల చరాచర జీవములు, గ్రహ నక్షత్రాదులు, దేవతలు వాసుదేవుని ఆజ్ఞానుబద్ధులు. జనార్దనుడే సకల వేద జ్ఞాన విద్యా స్వరూపుడు. ముల్లోకాలలో వ్యాపించిన విష్ణువు ఒకడే. వ్యాసునిచే కీర్తింపబడిన ఈ స్తవమును పఠించిన, విన్న యెడల శ్రేయస్సు, సుఖము లభించును. అవ్యయుడైన విశ్వేశ్వరుని భజించినవారికి పరాభవమెన్నడును జరుగదు.
  • ఈ స్తోత్రంతో కలిపి చదివే ఈ స్పష్టమైన ఫలశ్రుతి మహాభారత పాఠంలో అంతర్గత విభాగం. దీనికి జనాదరణ కలిగించడానికి ఎవరో తరువాత అతికించినది కాదు. భాష్యకారులు తమ వ్యాఖ్యలలో ఫలశ్రుతిని కూడా వివరించారు.

ఉపదేశాలు

[మార్చు]
  • అర్జునుడు "పద్మనాభా! జనార్ధనా! అనురక్తులైన భక్తులను కాపాడు" అని కోరగా కృష్ణుని సమాధానం - "నా వేయి నామములు స్తుతించగోరే వారు ఒకే ఒక శ్లోకమును స్తుతించినా గాని నన్ను పొందగలరు"
  • వ్యాసుడు చెప్పినది - "ముల్లోకములు వాసుదేవుని వలన నిలచియున్నాయి. అన్ని భూతములలోను వాసుదేవుడు అంతర్యామి. వాసుదేవునకు నమోస్తుతులు"
  • పార్వతి "ప్రభో! ఈశ్వరా! విష్ణు సహస్ర నామమును పండితులు నిత్యం క్లుప్తంగా ఎలా పఠిస్తారు? సెలవీయండి" అని విన్నవించగా ఈశ్వరుడు ఇలా చెప్పాడు - "శ్రీరామ రామ రామ యని రామనామమును ధ్యానించనగును. రామనామము వేయి నామములకు సమానము"
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
  • బ్రహ్మ చెప్పినది - "అనంతుడు, వేలాది రూపములు, పాదములు, కనులు, శిరస్సులు, భుజములు, నామములు గల పురుషునకు నమోస్తు. సహస్రకోటి యుగాలు ధరించిన వానికి నమస్కారములు"
  • సంజయుడు చెప్పినది - "యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఉన్నచోట ఐశ్వర్యము, విజయము నిశ్చయంగా ఉంటాయి."
  • శ్రీ భగవానుడు చెప్పినది - "ఇతర చింతనలు లేక నన్నే నమ్మి ఉపాసన చేసేవారి యోగక్షేమాలు నేనే వహిస్తాను. ప్రతియుగం లోను దుష్ట శిక్షణకు, సాధురక్షణకు నేను అవతరిస్తాను"
  • నారాయణ నామ స్మరణ ప్రభావము - "దుఃఖితులైనవారు, భయగ్రస్తులు, వ్యాధిపీడితులు కేవలము నారాయణ శబ్దమును సంకీర్తించినయెడల దుఃఖమునుండి విముక్తులై సుఖమును పొందుతారు."

సమర్పణ

[మార్చు]

శరీరముచేత గాని, వాక్కుచేత గాని, ఇంద్రియాలచేత గాని, బుద్ధిచేత గాని, స్వభావంచేత గాని చేసే కర్మలనన్నింటినీ శ్రీమన్నారాయణునకే సమర్పిస్తున్నాను. భగవంతుడా! నా స్తోత్రంలోని అక్షర, పద, మాత్రా లోపములను క్షమించు. నారాయణా! నీకు నమస్కారము.

అన్న ప్రణతులతో ఈ పుణ్యశ్లోకము ముగుస్తుంది.

సాంప్రదాయాలు, వ్యాఖ్యలు

[మార్చు]

హిందూమత సాంప్రదాయంలో శివుడు, శక్తి, వినాయకుడు, లక్ష్మి - ఇలా చాలా దేవతల సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి. ఎవరి సంప్రదాయాలను బట్టి వారు ఆయా దేవతలను అర్చిస్తారు. కాని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము బాగా ప్రాచుర్యాన్ని పొందిన స్తుతులు.

విష్ణు సహస్రనామము పారాయణ విస్తృతంగా చేయడానికి కొన్ని కారణాలు -

  • ఈ పారాయణకు కుల, మత పట్టింపులు లేవు. (బ్రాహ్మణులకు, వైశ్యులకు, క్షత్రియులకు, శూద్రులకు వచ్చే ప్రయోజనాలు ఫలశృతిలో స్పష్టంగా ఉన్నాయి)
  • పారాయణకు పెద్దగా శక్తి సామర్థ్యాలు, ఖర్చు అవసరం లేదు. శ్రద్ధ ఉంటే చాలును.
  • ఫలశృతిలో చెప్పిన విషయాలు విశ్వాసాన్ని పెంచుతున్నాయి.
  • పేరుమోసిన పండితులు ఈ స్తోత్రానికి వ్యాఖ్యలు రచించి, ప్రజల విశ్వాసాన్ని ఇనుమడింపజేశారు.
  • విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం గృహస్తులకు అనుకూలమైన పూజా విధానం.

స్మార్తుల వ్యాఖ్యలు

[మార్చు]

శైవుల శ్రీరుద్రం ప్రార్థనలో విష్ణువు శివుని స్వరూపమని చెప్పబడింది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో కొన్ని నామాలు (114-రుద్రః, 27-శివః, 600-శివః) శివుని స్తుతించేవిగా ఉన్నాయి. శివకేశవులకు భేదము లేదని శంకరాచార్యులు వ్యాఖ్యానించారు. ఇంకా శివుడనగా మంగళకరుడనీ, అదే నామము విష్ణువుకూ వర్తిస్తుందనీ మరికొన్ని వ్యాఖ్యలు.[1] . ముఖ్యంగా అద్వైత వాదం నిర్గుణ నిరాకార శుద్ధ సత్వ పరబ్రహ్మమును గురించి చెబుతుంది గనుక శంకరాచార్యుల భాష్యము ఆ కోణంలోనే ఉంది.

వైష్ణవ వ్యాఖ్యలు

[మార్చు]

పరాశర భట్టు, ఇతర వ్యాఖ్యాన కర్తలు శివునితో ప్రమేయము లేకుండా విష్ణువు పరంగానే అన్ని నామాలనూ వ్యాఖ్యానించారు. శ్రీ వైష్ణవులకు, అనగా రామానుజాచార్యులు విశిష్టాద్వైతమును అనుసరించే వారికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరమ పావన స్తోత్రాలలో ఒకటి. శ్రీలక్ష్మీవల్లభుని కరుణ ప్రాప్తికి సులభమార్గము ఈ స్తోత్రము. ఇంకా శ్రీవైష్ణవులు పంచాయుధములు ధరించిన, వైకుంఠనివాసుడైన, శ్రీదేవీ భూదేవీ సమేతుడైన నారాయణుని రూపమునకు (సాకార భగవంతునకు) తమ అర్చనా సంప్రదాయములలో విశేష ప్రాముఖ్యతనిస్తారు. వారి వ్యాఖ్యలు కుడా ఈ దృక్కోణంలోనే ఉన్నాయి.

పారాయణము, అర్చన

[మార్చు]

అన్ని శ్లోకాలను (పూర్వపీఠిక, స్తోత్రము, ఉత్తరపీఠిక) క్రమంలో చదవడాన్ని పారాయణం అంటారు. పెద్దగా ఈ పారాయణానికి ప్రత్యేకించి విధివిధానాలు లేవు. అంగన్యాస, కరన్యాసాలు పారాయణానికి ముందు చేయడం ఒక ఆచారం. చాలామంది విష్ణు సహస్ర నామ పారాయణానికి ముందుగాని, తరువాతగాని లక్ష్మ్యష్టోత్తర నామాన్ని పారాయణం చేస్తారు. భక్తి ముఖ్యమనీ, సామాన్యమైన పూజకు పాటించే నియమాలు పాటించడం భావ్యమనీ చెబుతారు.

ఇక వేయి నామాలనూ ఒక్కొక్కటిగా నమస్కారపూర్వకంగా చెప్పుతూ, పుష్పాదికాలతో పూజించడానిని అర్చన అంటారు. ప్రతి నామానికి ముందు ప్రణవం (ఓం), చివర చతుర్ధీ విభక్తితో "నమః" చేర్చి అర్చనలో చెబుతారు. ఉదాహరణకు పారాయణ శ్లోకం

రామో విరామో వరతో మార్గో నేయో నయో నయః
వీరః శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః

అర్చనలో చదివేది

  • ఓం రామాయ నమః
  • ఓం విరామాయ నమః
  • ఓం విరతాయ నమః
  • ఓం మార్గాయ నమః
  • ఓం నేయాయ నమః
  • ఓం అనయాయ నమః
  • ఓం వీరాయ నమః
  • ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః
  • ఓం ధర్మాయ నమః
  • ఓం ధర్మవిదుత్తమాయ నమః

మహాత్ముల, పండితుల అభిప్రాయాలు

[మార్చు]

శ్రీవైష్ణవ సాహిత్యం గురించి విస్తారంగా అధ్యయనం చేసిన ఎన్. కృష్ణమాచారి తమ విష్ణు సహస్రనామ స్తోత్ర వివరణ ఆరంభంలో ఈ స్తోత్రం ప్రాముఖ్యత గురించి ఆరు విషయాలు చెప్పారు:[2]

  1. ఇది మహాభారతమునకు సారము.
  2. నారదాది మహాభాగవతులు, ఆళ్వారులు, త్యాగరాజాది వాగ్గేయకారులు తమ భక్తికావ్యాలలో మరల మరల విష్ణువు వేయి నామాలను ప్రస్తావించారు.[3]
  3. విష్ణువు అంశావతారము, వేదవిదుడు అనబడే వేదవ్యాసుడు దీనిని మనకు అందించాడు.
  4. ఇది ధర్మములలోకెల్ల ఉత్తమము, సులభము, సకల కర్మబంధ విముక్తి సాధకము అని భీష్ముడు చెప్పాడు.
  5. ఈ స్తోత్రపారాయణం దుఃఖములనుహరిస్తుందనీ, శాంతి సంపదలను కలుగజేస్తుందనీ విస్తృతమైన విశ్వాసం.
  6. భగవద్గీత, నారాయణీయము వంటి గ్రంథాలలో చెప్పిన విషయాలు ఇందుకు అనుగుణంగా ఉన్నాయి.

"బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణుసహస్రనామ పుస్తకమును తీసికొనెను. తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను - శ్యామా! ఈ గ్రంథము మిగుల విలువైనది. ఫలప్రదమైనది. కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవితమపాయములోనుండెను. అట్టి సందిగ్ధ స్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా! అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగుచేసెనని యనుకొంటిని.[8]

  • స్వామి శివానంద తమ 20 ముఖ్య ఆధ్యాత్మిక ప్రవచనాలలో విష్ణు సహస్రనామమును చేర్చిరి.[9]

వనరులు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలములు

[మార్చు]
  1. Bhag-P 4.4.14 Archived 2007-02-21 at the Wayback Machine "Siva means mangala, or auspicious"
  2. http://home.comcast.net/~chinnamma/
  3. "విష్ణు సహస్రనామం తెలుగులో అర్థాలతో" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-02-26. Retrieved 2023-02-26.
  4. http://www.kamakoti.org/shlokas/kshlok19.htm
  5. 5.0 5.1 5.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-01-21. Retrieved 2007-03-04.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-03-21. Retrieved 2007-03-04.
  7. http://www.saibaba.org/newsletter5-29.html#carticle
  8. శ్రీ సాయిబాబాబా జీవిత చరిత్ర - హేమాండ్ పంతు రచన - 27వ అధ్యాయము - ప్రత్తి నారాయణరావు అనువాదము
  9. http://www.sivanandadlshq.org/teachings/20instr.htm

బయటి లింకులు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]