మాలతీ మాధవం (సంస్కృత నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాలతీమాధవం మహాకవి భవభూతిచే విరచితమైన ఒక సంస్కృత నాటకం. ఇది రూపకంలో ఒకానొక విభాగమైన "ప్రకరణ" అనే తరగతికి చెందినది. ఈ నాటకం 10 ఆంకాలను కలిగివుంది. శృంగార రస ప్రధానమైనది. సా.శ. 8 వ శతాబ్దకాలానికి చెందిన ఈ రమణీయమైన నాటకం రెండు బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన మాలతీ-మాధవుల జీవితాలను కేంద్రంగా చేసుకొని అల్లిన కథ చుట్టూ సాగుతుంది. దీని మూలం గుణాఢ్యుని బృహత్కథ లోని ఒక చిన్న కల్పిత కథ. మాలతి, మాధవుడు, మదయంతిక, మకరందుడు, కామందకి, సౌదామిని, కపాలకుండల తదితర సజీవ పాత్రలతో అలరారే ఈ సంస్కృత నాటకంలో వర్ణితమైన మాలతీ-మాధవుల ప్రేమ వివాహం, చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతూ, అద్భుత సంఘటనలతో కూడి శృంగార, బీభత్స, రౌద్రాది రసభరితంగా సాగుతుంది.

కృతికర్త విశేషాలు

[మార్చు]

భవభూతి సా.శ. 8 వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ సంస్కృత కవి. నాటక కర్త. సంస్కృత సాహిత్యంలో కాళిదాసు తరువాత అంతటివాడుగా కీర్తి గడించినవాడు.[1] శ్రీకంఠుడు అనే పేరు గల ఇతను కనోజ్ రాజ్యపాలకుడైన యశోవర్మ అస్థానకవులలో ఒకడు.[2] కవి వాక్పతికి సమకాలికుడు.[1] భవభూతి కేవలం మూడు సంస్కృత నాటకాలు మాత్రమే రాసాడు. అవి 1. మహావీరచరిత్ర, 2. మాలతీ మాధవం, 3. ఉత్తరరామచరిత్ర. ఈ మూడు ప్రసిద్ధ నాటకాలను రాసిన తరువాతనే వృద్ధాప్యంలో కనోజ్ రాజాస్థానాన్ని ఆశ్రయించాడు.[3]

మూల కథ

[మార్చు]

మాలతీ మాధవం ఒక కల్పిత కథ అని ప్రచారంలో ఉన్నప్పటికీ గుణాఢ్యుని "బృహత్కథ" నుండి భవభూతి తన నాటక ఇతివృత్తాంతాన్ని ఎంచుకొన్నట్లు తెలుస్తుంది. దురదృష్టవశాత్తు పైశాచి భాషలో రాయబడిన క్రీ. పూ. 1 వ శతాబ్దం నాటి గుణాఢ్యుని బృహత్కథ మూలప్రతి అలభ్యం. అయితే దానిలోని కథలను స్వీకరించి తరువాతి కాలంలో సంస్కృత భాషలో అనువదించబడిన కథలే నేడు మిగిలాయి. సా.శ. 11 వ శతాబ్దానికి చెందిన కవులైన సోమదేవసూరి, క్షేమేంద్రులు పైశాచి భాషలో వున్న బృహత్కథను సంస్కృతంలోకి పద్యరూపంలో అనువదించారు. సోమదేవసూరి "కథాసరిత్సాగరం" లోని, క్షేమేంద్రుని "బృహత్కథామంజరి" లోని "మదిరావతి" కథే భవభూతి మాలతీ మాధవానికి మూలం అని విమర్శకుల అభిప్రాయం. అయితే కథాసరిత్సాగరం, బృహత్కథామంజరి లలోని అనువాద కథలకు మూలం గుణాఢ్యుని బృహత్కథ కాబట్టి భవభూతి 'మాలతీ మాధవం' నాటక కథకు కూడా మూలం గుణాఢ్యుని బృహత్కథ లోనే వుంటుంది.

రచనా నేపధ్యం-ప్రేరణ

[మార్చు]

మాలతీ మాధవాన్ని మహాకవి భవభూతి రాసిన రెండవ నాటకంగా విమర్శకులు పేర్కొంటారు. మహావీరచరిత్ర అతని తొలి నాటకం. కొత్తదనాన్ని కోరుకొనే భవభూతి తన తొలి నాటకానికి రామాయణ కథను ఇతివృత్తంగా ఎంచుకున్నాడు. అయితే వాల్మీకి, కాళిదాసు తదితరుల రామాయణ కథ కన్నా కొంచెం భిన్నంగా కొత్తదనంతో మహావీరచరిత్ర నాటకాన్ని వీరరస ప్రధానంగా రాసినప్పటికీ, కొత్తదనాన్ని ఆదరించే సహృదయత ఆనాటి సామాజికులలో కొరవడటంతో ఆ నాటకం అంతగా ప్రజాదరణ పొందలేదు. పైగా కావ్య విమర్శకుల మన్నన కూడా దక్కలేదు. రామాయణం లాంటి గొప్ప ఇతిహాస కథలో తాను ప్రవేశపెట్టిన నవ్యత్వాన్ని ప్రేక్షకులు మెచ్చకపోవడంతో, నిరాశ చెందిన భవభూతి బహుళ ప్రజాదరణను ఆశించి, ఒక కల్పిత కథను ఇతివృత్తంగా తీసుకొని, శృంగార రస ప్రధానంగా అద్భుత సంఘటనలతో కూడిన మాలతీ మాధవం ప్రకరణను రాసి ఉండవచ్చని విమర్శకులు పేర్కొన్నారు. తన మొదటి రూపకానికి మాదిరిగానే మాలతీ మాధవం నాటకం వ్రాయడానికి కూడా భవభూతి యమునా నది ఒడ్డున గల కల్పి (కాలప్రియ క్షేత్రం) ప్రాంతంలోనే ప్రేరణ పొందాడు.[4] అక్కడ కాలప్రియనాధోత్సవం సందర్భంలోనే దీనిని ప్రదర్శింపచేసాడు.

నిరాదరణకు గురైన తొలి నాటకంతో నిరాశ చెందినప్పటికీ భవభూతి, తన పూర్వ కవుల మార్గానికి మరలకుండా, తాను ఎంచుకొన్న నవ్యపథంలోనే కొనసాగాడు. పైగా ఆలంకారికులు కూడదన్న లక్షణాలను, ప్రాచీన నాటక సంప్రదాయాలకు విరుద్ధంగా వున్న ఎన్నో సంఘటనలను తన మాలతీ మాధవం నాటకంలో సైతం చొప్పించాడు. అయితే గాయపడిన అతని మనసులో మాత్రం తన నవ్యత్వానికి ప్రజాదరణ ఎక్కడో ఒకచోటైనా, ఎప్పటికైనా లభించి తీరుతుందని ఆశ మిక్కుటంగా ఉండేది. ఈ మనోభావమే మాలతీ మాధవం యొక్క ప్రస్తావనలో "ఏ నామ కేచీ దిహ ..... ” అనే ప్రముఖ శ్లోకంలో ప్రస్ఫుటంగా వ్యక్తమయింది.

ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां
जानन्ति ते किमपि तान्प्रति नैष यत्नः ।
उत्पत्स्यते तु मम कोऽपि समानधर्मा
कालो ह्ययं निरवधिर्विपुला च पृथ्वी ॥ ---- మాలతీమాధవం - భవభూతి

నా కృతులను అవహేళన చేసేవారు, విస్మరించేవారు ఎవరైనా కావచ్చు.
వారికి తెలియ చేయండి, నా ప్రయత్నం వారికోసం కాదని,
కాలం అంతులేనిది, ప్రపంచం విశాలమైనది.
ఏదో ఒక రోజు నా భావాలతో ఏకీభవించే వ్యక్తి ఎక్కడో ఒక చోట ఉంటాడు.

తనకు రాబోయే గుర్తింపు పట్ల తొణికిసలాడే ఆత్మవిశ్వాసంతో భవభూతి పేర్కొన్న ఈ శ్లోకం, తదనంతర కాలంలో కొత్తదనం కోరుకొనే కవులకు ఎంతో స్ఫూర్తి దాయకంగా నిలిచింది.

కథా నేపధ్యం

[మార్చు]

పద్మావతి, విదర్భ రాజ్యాలకు బ్రాహ్మణ మంత్రులైన భూరివసు, దేవరతుడు, బౌద్ధ సన్యాసిని కామందకి - ఈ ముగ్గురు పూర్వాశ్రమంలో విద్యార్థులుగా వున్నప్పుడు మంచి స్నేహితులు. బాల్యమిత్రులైన భూరివసు, దేవరతులు విద్యార్హులుగా వున్నప్పుడే, భవిష్యత్తులో తమకు పుట్టబోయే సంతానానికి వివాహం జరిపించడం ద్వారా తామిరువురు వియ్యంకులుగా మారడానికి సిద్దపడతారు. ఆ విధంగా స్నేహితురాలు కామాందకి సమక్షంలో ప్రతిజ్ఞ చేసుకొంటారు. కాలక్రమంలో భూరివసు, దేవరతులు పద్మావతి, విదర్భ రాజ్యాలకు మంత్రులవుతారు. భూరివసుకు మాలతి, దేవరతునికి మాధవుడు జన్మిస్తారు. బౌద్ధ సన్యాసిని కామందకి భూరివసువు కోరికపై అతని కుమార్తె మాలతికి విద్యాబుద్ధులు నేర్పుతూ, ఆమెకు సంరక్షకురాలిగా పద్మావతి రాజ్యంలోని ఒక మఠంలో నివసిస్తుంది.

అయితే పద్మావతి పుర రాజు, తన మంత్రి కూతురు మాలతి యొక్క వివాహాన్ని తన బంధువు అయిన నందనునితో జరపాలని అభిలషిస్తాడు. దానితో మాలతీ మాధవుల వివాహం జరిగే పరిస్థితి కనిపించదు. దీనితో కామందకి విచారపడి మంత్రి భూరివసు మనస్సులోని కోరికను అనుసరించి, వారి కుటుంబ శ్రేయాభిలాషిగా తన బుద్ధి చాతుర్యంతో మాలతీ మాధవులను కలిపే ప్రయత్నం చేస్తుంది. అంతకుముందు ఎన్నడూ కలుసుకొనని మాలతీ మాధవుల మధ్య పరస్పరానురాగం కలిగేటట్లు చేసి వారి ప్రేమ ఫలించేటట్లు తన శిష్యురాళ్ళతో కలసి కార్యభారం వహిస్తుంది. ఈ నేపథ్యంతో నాటకం ఆరంభమవుతుంది.

మాలతీమాధవం-ప్రధాన పాత్రలు

[మార్చు]

పురుష పాత్రలు:
మాధవుడు : మంత్రి దేవరతుని కుమారుడు. కథానాయకుడు.
మకరందుడు : మాధవుని ప్రాణ మిత్రుడు. నందనుని చెల్లెలు మదయంతికను ప్రేమించినవాడు.
నందనుడు : పద్మావతీపుర రాజు యొక్క బంధువు.
భూరివసు : పద్మావతీపుర రాజు యొక్క బ్రాహ్మణ మంత్రి. కథానాయిక మాలతి తండ్రి.
దేవరతుడు : విదర్భ రాజు యొక్క బ్రాహ్మణ మంత్రి. కథానాయకుడు మాధవుని తండ్రి.
కలహంసకుడు : మాధవుని సేవకుడు
అఘోరఘంటుడు : కాపాలికుడు. చాముండీ ఉపాసకుడు. మంత్రసిద్ధికై కన్యను బలి ఇవ్వబోయినవాడు.

స్త్రీ పాత్రలు: మాలతి : మంత్రి భూరివసు కుమార్తె. కథానాయిక.
మదయంతిక : నందనుని చెల్లెలు. మాలతి చెలికత్తె. మకరందుని ప్రియురాలు.
కామాందకి : బౌద్ధ సన్యాసిని. మాలతి సంరక్షకురాలు.
కపాలకుండల : అఘోరఘంటుని శిష్యురాలు. ప్రతినాయిక.
లవంగిక: మాలతి పెంపుడు సోదరి. సఖి.
మందారిక : మాలతి సేవకురాలు
అవలోకిత : కామాందకి శిష్యురాలు
బుద్ధరక్షిత: కామాందకి శిష్యురాలు
సౌదామిని : కామాందకికి ఒకప్పటి శిష్యురాలు. సఖి సమానురాలు. మానవాతీత శక్తులు గలది.

నాటక ఇతివృత్తం

[మార్చు]

రెండు బ్రాహ్మణ మంత్రి కుటుంబాలకు చెందిన మాలతీ-మాధవుల జీవితాలను కేంద్రంగా చేసుకొని, వారి ప్రేమ వివాహం చుట్టూ అల్లిన ఒక మనోహరమైన జిగీ బిగీ దృశ్యకావ్యం మాలతీ మాధవం. ప్రేమ వివాహంలో మాలతీ మాధవులకు ఎదురైన సంకటాలతో, విధివిలాసాలతో, విచిత్రమైన సంఘటనలతో, అద్భుత సన్నివేశాలతో కూడిన ఈ రమణీయమైన నాటకం ఆద్యంతం ప్రేక్షకులను రంజింపచేస్తూ రసవత్తరంగా సాగుతుంది. సుఖాంతమైన ఈ నాటకంలో మాలతీ-మాధవులతో పాటు మదయంతిక-మకరందుల ప్రేమకథ కూడా సమాంతరంగా సమతూకంతో నడుస్తుంది. ఈ ప్రకరణలో మొత్తం 10 అంకాలున్నాయి.

ఒకటవ అంకం:
పద్మావతీపుర మంత్రి భూరివసు కూతురు మాలతి. శాస్త్రాధ్యయన నిమిత్తం విదర్భ రాజ్య మంత్రి కొడుకైన మాధవుడు పద్మావతీపురానికి వస్తాడు. ఈ సమాచారం తెలుసుకొన్న బౌద్ధ సన్యాసిని కామాందకి మాలతీ మాధవులను కలిపే ఏర్పాటు చేస్తుంది. ఫలితంగా మదనోత్సవ సమయంలో మాలతీ మాధవులిరువురూ ఒకరినొకరు కలుసుకొని పరస్పరం ఆకర్షితులవుతారు. మాలతి చిత్రించిన మాధవుని వర్ణపటం మాధవుని చేరుతుంది. మాధవుడు కూడా మాలతి పై తనకు గల ప్రేమను మిత్రుడు మకరందునికి తెలియచేస్తాడు. ఆ సమయంలో మాలతి చెలికత్తె లవంగిక మాధవుని పొగిడి అతనివద్ద గల వకుళమాలను మాలతి కోసం అడిగి తీసుకొంటుంది. అన్యాపదేశంగా మాలతి ఇష్టానికి అతనికి తెలియచేస్తుంది. మాధవుడు చిత్రించిన మాలతి చిత్రపటం మాలతి వద్దకు చేరుతుంది.

రెండవ అంకం:
మాలతి తన సఖి లవంగికతో మాధవుని గురించి చర్చిస్తూ, తల్లిదండ్రుల అనుమతి లేకుండా మాధవునితో ప్రేమ వివాహం జరుగుతుందా అని ఆలోచనలో పడుతుంది. ఇంతలో రాజానుగ్రహం కోసం ఆమె తండ్రి, ఆమెకు వరునిగా నందనుని నిర్ణయిస్తాడు. అక్కడకు వచ్చిన కామాందకి నేర్పుగా ఆమెకు నందనుని పట్ల విముఖత కలిగేటట్లు చేస్తుంది. దుఃఖితురాలైన మాలతిని ఓదారుస్తూ, శకుంతల తన ఇచ్ఛానుసారం దుష్యంతుని పెండ్లాడిన ఉదంతాన్ని తెలియచేసి, తెగువతో ఇచ్ఛానుసారంగా నిర్ణయం గైకొనమని,అప్పుడే ఆమె కోరిక ఈడేరగలదని ఆమెకు సూచిస్తుంది.

మూడవ అంకం:
మాధవుని మిత్రుడైన మకరందుని వివాహం, నందనుని చెల్లెలు మదయంతికతో జరగడం మంచిదని భావించిన కామాందకి, వారిరువురి మధ్య కూడా ప్రేమ చిగురించేటట్లు ప్రయత్నిస్తుంది. ఒక అశోకవనంలో మాలతీ మాధవులు అనుకోకుండా కలుసుకొనేటట్లు కామాందకి ఏర్పాటు చేస్తుంది. మాధవుడు ముందుగానే అక్కడకు వచ్చి ఒక పొద మాటున దాక్కొంటాడు. మాలతి కూడా తన సఖితో కలసి అక్కడికి వస్తుంది. వాళ్లిద్దరూ కలుసుకోవడానికి ముందే బోను నుంచి తప్పించుకున్న ఒక పులి హఠాత్తుగా వారికి ఎదురవుతుంది. పులి బారినపడ్డ మదయంతికను మకరందుఁడు రక్షించి, పులిని చంపి సొమ్మసిల్లిపోతాడు.

నాల్గవ అంకం:
తేరుకున్న మకరందుడు తనచే రక్షింపబడిన మదయంతికను చూసి ప్రేమిస్తాడు. ఇంతలో మాలతి వివాహం నందనునితో నిశ్చయమైనదనే వార్త వారికి తెలిసి విషాదంలో మునిగిపోతారు. కుమిలిపోతున్న మాలతీ మాధవులను కామాందకి ఓదార్చి వారి పెళ్ళికి బాసటగా వుంటానని ప్రమాణం చేస్తుంది. నిరాశలో కూరుకుపోయిన మాధవుడు నగరం విడిచిపోతాడు. ఈ నాల్గవ అంకాన్ని శార్ధూల విభ్రమ అంటారు.

ఐదవ అంకం:
శ్మశాన సమీపంలో గల కరాళ శక్తి మఠంలో అఘోరఘంటుడనే కాపాలికుడు మంత్రసిద్ధి కోసం కరాళ శక్తికి తాంత్రికపూజలు చేస్తాడు. దానికి కావలిసిన నరబలి కోసం అతని శిష్యురాలు కపాలకుండల, కన్య అయిన మాలతిని నగరం నుండి ఎత్తుకొని తెస్తుంది. అదే సమయంలో మాలతిని స్మరిస్తూ ఆ శ్మశానంలో విరాగిలా మాధవుడు సంచరిస్తుంటాడు. భూత, ప్రేత వికటాట్టహాసాలతో, నాట్యాలతో బీభత్సంగా వున్న శ్మశానంలో మాధవుడు విరక్తితో తన మనుష్య మాంసాన్ని పిశాచాలకి అర్పించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో బలిపీఠ మెక్కి విలపిస్తున్న మాలతి కంఠ స్వరాన్ని గుర్తుపట్టిన మాధవుడు, కరాళ శక్తి మఠంలో ప్రవేశించి అఘోరఘంటునితో యుద్ధం చేసి సంహరించి మాలతిని రక్షిస్తాడు. స్త్రీ వధ పాపమని తలచి కపాలకుండలను విడిచిపెడతాడు. ఈ ఐదవ అంకాన్ని శ్మశాన వర్ణన అంటారు.

ఆరవ అంకం:
వివాహవేడుకలో భాగంగా పూజ చేయడం కోసం కామాందకితో కలసి మాలతి దేవీమందిరంలో ప్రవేశిస్తుంది. అక్కడ కామాందకి యుక్తితో మకరందునికి మాలతి వేషం ధరింపచేసి పెళ్లికూతురుగా భూరివసు ఇంటికి పంపిస్తుంది. అక్కడ ఆమెకు నందనునితో వివాహం జరుగుతుంది. ఇక్కడ నిజమైన మాలతికి మాధవునితో వివాహం జరపడం కోసం కామాందకి ఆమెను తన మఠానికి పంపిస్తుంది. ఈ ఆరవ అంకాన్ని కోరికా వివాహం అని పిలుస్తారు.

ఏడవ అంకం:
వధువు మాలతి రూపంలో వున్న మకరందుడు, తనను వివాహం చేసుకొన్న నందనుని తన్నుతూ ముప్పుతిప్పలు పెడతాడు. దానితో పోరు పడలేక నందనుడు బయటకు వెళ్ళిపోతాడు. తన వదినకు నచ్చచెప్పడానికి వచ్చిన మదయంతిక, మాలతి వేషంలో వున్నది తన ప్రియుడు మకరందుడేనని తెలుసుకొని సంతోషిస్తుంది. మకరందుడు కూడా మాలతీ వేషాన్ని తీసివేసి, నందనుని ఇంటి నుండి ఉడాయించి కామాందకి మఠంలో ప్రవేశిస్తాడు. ఈ ఏడవ అంకాన్ని నందన విప్రలంభ అని పిలుస్తారు.

ఎనిమిదవ అంకం:
మదయంతికను ఎత్తుకొనిపోయాడనే నేరారోపణతో రాజభటులు మకరందుని బంధిస్తారు. వారితో పోరాడుతున్న మకరందునికి సాయం చేయడం కోసం మాధవుడు, మాలతిని ఒంటరిగా ఉద్యానవనంలో విడిచిపెట్టి వెళతాడు. పగతో రగిలిపోతూ అదను కోసం ఎదురుచూస్తూన్న కపాలకుండల, ఒంటరిగా వున్న మాలతిని అపహరించి శ్రీపర్వతం వద్దకు తీసుకొనిపోతుంది. మరోవైపు రాజభటులతో పోరాడుతున్న మాధవమకరందుల యుద్ధకౌశలాన్ని చూసి ప్రసన్నుడైన రాజు వారిరువురిని విడిచిపెడతాడు. మాలతిని వెదుకుతూ వారు కామందకి ఆశ్రమాన్ని చేరుకొంటారు. ఈ అంకాన్ని మాలతీ అపహరణం అని పిలుస్తారు.

తొమ్మిదవ అంకం:
కామాందకి యొక్క ఒకప్పటి శిష్యురాలు, సఖి అయిన సౌదామిని పద్మావతీ పురానికి చేరుకొంటుంది. మాధవుడు మకరందునితో కలసి మాలతి కోసం పరితపిస్తూ వనంలో అన్వేషిస్తాడు. ప్రకృతి శోభ పరవశంతో మాధవునిలో విరహవేదన తారాస్థాయికి చేరుకొంటుంది. మాలతి కోసం విలపిస్తూ పిచ్చివానివలె వనంలో సంచరిస్తున్న మాధవునికి సౌదామిని ప్రత్యక్షమై కపాలకుండల నుంచి మాలతిని తను రక్షించిన వైనం తెలిపి, ఆమె సురక్షితంగా వున్నదనడానికి నిదర్శనంగా ఆమె ధరించిన వకుళమాలను చూపుతుంది. తరువాత ఆకాశమార్గంలో మాధవుని తోడ్కొని వెళ్ళిపోతుంది. ఈ అంకాన్ని మాలతీ అన్వేషణ అని పిలుస్తారు.

పదవ అంకం:
మాలతిని కోల్పోయామన్న బాధతో వికలమనస్కురాలైన కామందకి, మదయంతికలు అర్దంతరంగా తమ జీవితాలను ముగించుకొనే సమయంలో మకరందుని ద్వారా మాలతి జీవించివున్నదనే శుభవార్తను తెలుసుకొంటారు. తన వల్లే కూతురు చనిపోయిందన్న బాధతో ఆత్మహాత్య చేసుకోబోతున్న భూరివసును వారిస్తూ మాలతి వస్తుంది. ఆమె వెంబడి మాధవుడు వచ్చి అందరిని కలుసుకొంటాడు. ఈ విధంగా సౌదామిని వల్ల మాలతి రక్షింపబడటమే కాక ఆత్మహాత్యకు పాల్పడుతున్న అందరి ప్రాణాలు కూడా సకాలంలో రక్షింపబడతాయి. మాలతీమాధవుల, మదయంతికామకరందుల జంట వివాహలతో నాటకం సుఖాంతమవుతుంది.

కథా నిర్మాణం

[మార్చు]

మాలతీ మాధవం ప్రాథమికంగా ఒక "ప్రకరణం". అంటే కల్పితమైన ఇతివృత్తంతో తేలికగా సాగిపోయే ఒకానొక రూపకం. రూపకాలకు చెందిన 9 విభాగాలలో "ప్రకరణం" అనేది ఒకటి. అయితే మాలతీ మాధవం కథ కల్పితమైనప్పటికీ అనేక కథలప్రభావం దీని కథా నిర్మాణంపై కనిపిస్తుంది. ముఖ్యంగా సోమదేవ సూరి కథాసరిత్సాగరం లోని "మదిరావతి కథ" ప్రభావం అధికం. అలాగే ప్రకరణంలో ఆవశ్యకంగా ఉండాల్సిన విదూషకుని పాత్ర దీనిలో కనిపించదు. దీనిలో కథ గంభీరంగా, శృంగార రసభరితంగా సాగుతుంది. నాటకంలో శృంగార రసం అంగిరసంగా, బీభత్స రౌద్రాది రసాలు అంగరసాలుగా పోషించబడ్డాయి. కథా నిర్మాణం అద్భుత సన్నివేశాలతో, విధికృతమైన సంఘటనలతో, చిత్రమైన మలుపులు తిరుగుతూ వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ రసభరితంగా సాగుతుంది. ముఖ్యంగా మాలతీ మాధవుల ప్రేమ, విరహవేదన వంటి రసవద్ఘట్టాలు మనోజ్ఞంగా అభివర్ణించబడ్డాయి. అందుకే భవభూతి మాలతీ మాధవం నాటక కథా సంవిధానం పట్ల కించుక అతిశయంతో తన నాటక కథను 'అద్భుతమైన, చిత్ర విచిత్ర మలుపులతో కూడినదిగా, మనోజ్ఞమైనదిగా, ప్రతిభావంతమైనది'గా పేర్కొనడం జరిగింది..[5]

అయితే కథా సంవిధానంలో పునరుక్తులు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. కొన్ని సందర్భాలలో కథ అనవసరంగా పొడిగించబడటంతో మెల్లగా సాగుతుంది. నాటకంలో మాలతీ మాధవుల ప్రేమ కథ ప్రధానమైనదైనప్పటికీ దానికి మదయంతికా మకరందుల ప్రేమ కథ కూడా రసవత్తరంగా జోడించబడింది. భవభూతి తన కథా నిర్మాణంలో మాధవ, మకరందుల జంట కథలను సమాంతరంగా నడపడంలో ఎంతో నైపుణ్యం కనపరిచాడు. రెండు కథలను ప్రధాన స్రవంతికి ఆవశ్యకమైనవిగా చూపడంలో చక్కని కౌశలం ప్రదర్శించాడు.

పాత్రలు-చిత్రణ

[మార్చు]

కల్పితమైన కథ అయినప్పటికి ఈ ప్రకరణం లోని పాత్రల చిత్రణ సజీవంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మాలతి, మాధవుడు, మదయంతిక, మకరందుడు, కామందకి, సౌదామిని, కపాలకుండల తదితర విలక్షణమైన పాత్రలు సజీవతతో అలరారుతాయి.

ఈ నాటకంలో మాలతీ మాధవుల పాత్రలు చిరస్మరణీయమైన పాత్రలు. అపూర్వమైన ప్రేమభావనలో ఓలలాడే ఈ పాత్రలు, నాటక ఆద్యంతం ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తూ కట్టిపడేస్తాయి. మాలతీ మాధవులను ఉత్తేజకరమైన ప్రేమైక జీవులుగా, అందమైన ప్రేమాస్పదమైన జంటగా భవభూతి చిత్రించిన తీరు నభూతో నభవిష్యతి. ఒకరికోసం ఒకరు అన్నట్లుగా సృజించబడిన ఈ అఖండ ప్రేమ పాత్రలు పాఠకుల మనస్సులో చెరగని ముద్ర వేస్తాయి. తరాలు మారినా మనోజ్ఞమై చరిత్రలో కలకాలం నిలిచిపోతాయి.

ఈ నాటకంలోని కొన్ని పాత్రలు ఇతర ప్రసిద్ధ నాటకాలలోని ప్రముఖ పాత్రలను మరిపిస్తాయి. బౌద్ధ సన్యాసిని కామాందకి, కాళిదాసు 'మాళవికాగ్నిమిత్ర' లోని బౌద్ధ సన్యాసిని 'కౌశకి' పాత్రను తలపిస్తుంది. కౌశకి కన్నా కామాందకి పాత్ర ప్రతిభాశాలి. తెలివితేటలతో, వ్యూహరచనలో మేటి. కథానాయికా, నాయకులను నాటకీయకంగా కలపడంలోను, వారి మధ్య ప్రేమను చివురింప చేయడంలోనూ, ప్రేమ ఫలింప చేయడంలోనూ అసమానమైన ప్రతిభను చూపుతుంది. దూరదృష్టితో వ్యవహరించడంలోనూ, పరిస్థితులను సమయానుకూలంగా మార్చుకోవడంలోనూ అద్వితీయమైన నేర్పును ప్రదర్శించే పాత్రగా భవభూతి కామాందకి పాత్రను ప్రతిభావంతంగా చిత్రించాడు.

అలాగే కపాలకుండల కూడా చిరకాలం గుర్తుండిపోయే ప్రతినాయిక పాత్ర. విలక్షణమైన ఈ పాత్ర తరువాతి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. బంకీం చంద్ర ఛటర్జీ తన కపాల కుండల (1866) కాల్పానిక నవలలో తన కథానాయికకు మాలతీ మాధవం లోని పాత్ర ననుసరించి 'కపాల కుండల' అనే పేరు పెట్టడం జరిగింది.[6] అలాగే నాటకం చివరలో కనిపించే సౌదామిని కూడా చాలా ప్రాధాన్యత గల పాత్ర. పేరుకు తగినట్లే విషాదాంతంగా మారిపోబోతున్న కథలో మెరుపులా ప్రవేశించి కథను సుఖాంతం చేసి కీలకమైన పాత్ర ఆమెది. కామాందకి సఖిగా సరైన సమయంలో వచ్చి మాలతిని రక్షించడమేకాక, ఆత్మహాత్యకు పాల్పడుతున్న మిగిలినవారి ప్రాణాలను కూడా సకాలంలో రక్షించే పాత్రగా సౌదామిమి చిత్రించబడింది. చివరలో కథను కీలక మలుపు తిప్పిన ఆమె పాత్ర నాటకంలో ప్రముఖమైనది. ఆవశ్యకమైనది కూడా.

మాలతీ మాధవుల వంటి అపూర్వమైన ప్రేమజంట పాత్రలతో పాటు కామందకి, సౌదామిని, కపాలకుండల వంటి పూర్తి వైవిధ్యభరితమైన సజీవ పాత్రలు ఈ నాటకాన్ని అజరామరం చేసాయి

మూలకథతో పోలికలు-విభేదాలు

[మార్చు]

గుణాఢ్యుడు పైశాచి భాషలో రచించిన బృహత్కథ లోని కథలనుండి భవభూతి తన నాటక కథను స్వీకరించాడు.[7] అయితే గుణాఢ్యుని బృహత్కథ అలభ్యం అయినప్పటికీ అందులోని కథలు కథాసరిత్సాగరం, బృహత్కథామంజరి లలో అనువాదాలుగా నేటికి నిలిచేవున్నాయి. సోమదేవసూరి "కథాసరిత్సాగరం" లోని, క్షేమేంద్రుని "బృహత్కథామంజరి" లోని "మదిరావతి" కథే భవభూతి మాలతీ మాధవానికి మూలం అని విమర్శకుల అభిప్రాయం. కథాసరిత్సాగరంలోని మదిరావతి కథతో మాలతీ మాధవాన్ని తూలనాత్మకమగా పోల్చి చూస్తే భవభూతి మార్పులు, చేర్పులతో మూల కథను సన్నిహితంగానే అనుసరించాడని తెలుస్తుంది. మూలకథకు భిన్నంగా మాలతీ మాధవం నాటకంలో భవభూతి చేసిన ప్రధాన మార్పులు, కల్పనలు క్రిందివిధంగా ఉన్నాయి.

మూలకథ లోని పాత్రలు, సన్నివేశాల యొక్క పేర్లు మాలతీమాధవంలో పూర్తిగా మార్చబడ్డాయి. ఉదాహరణకు మదిరావతి పేరును మాలతిగాను, విజయసేన పేరును మకరందునిగాను, విశాల పేరును పద్మావతి గాను మార్చడం జరిగింది. మూలకథలో కథానాయకుడు ఒక బ్రాహ్మణ కుమారునిగా చిత్రించబడితే, భవభూతి నాటకంలో కథానాయకుని పేరు మాధవునిగా చిత్రించబడింది. అలాగే మూల కథలో కథానాయకుడి స్నేహితుడైన విజయసేనునికి చెల్లెలు మదిరావతి అయితే భవభూతి నాటకంలో కథానాయకుడి స్నేహితుడైన మకరందునికి చెల్లెలు ఉండదు. మూలకథలో ఏనుగు నుండి ప్రియురాలిని కాపాడటం జరిగితే, మాలతీ మాధవంలో పులి నుండి ప్రియురాలిని కాపాడటం జరుగుతుంది.

అలాగే చిన్నదిగా వున్న మూలకథను పొడిగించడం కోసం, మూలకథకు భిన్నంగా కొన్ని పాత్రలు, సన్నివేశాలను భవభూతి కల్పించాడు. ఉదాహరణకు మూలకథకు భిన్నంగా భవభూతి నాటకంలో మాధవునికి కలహంసుడు అనే సేవకుడు జోడించబడ్డాడు. మూలకథలో కథానాయిక మదిరావతికి చెల్లెలు ఉండదు. కానీ మాలతీ మాధవరంలో కథానాయిక మాలతికి ఒక పెంపుడు సోదరి లవంగిక పాత్రను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మూల కథలో పేలవంగా వున్న సంఘటనలను భవభూతి తన ప్రతిభాసంపన్నతతో, ఊహాశక్తితో చక్కని నాటకీయ సన్నివేశాలుగా మలిచాడు. ఉదాహరణకు వికల మనస్కురాలైన కథానాయకుడు శ్మశానంలో తిరుగాడే భూతప్రేతాలకు తన మనుష్య మాంసాన్ని అర్పించబోవడం లాంటి సంఘటనలు మూలకథలో లేవు.

ఏదిఏమైనప్పటికీ భవభూతి తన అసమాన ప్రతిభచే ఒక చిన్న సాధారణ కథను ఒక గొప్ప కళాఖండంగా తీర్చిదిద్దగలిగాడు. నాటక కథలోని సంఘటనల క్రమాన్ని తన సొంత మార్గంలో చెప్పగలిగాడు. తద్వారా మూల కథను మార్పు చేర్పులతో తనదైన శైలిలో ఒక రమణీయమైన సంపూర్ణ దృశ్యకావ్య రూపం లోకి మార్చగలిగాడు.

ఇతర నాటికల ప్రభావం

[మార్చు]

ఇతివృత్తంలోనే కాక ఈ నాటక కథా సన్నివేశాల పై ఇతర నాటక ప్రభావాలు కూడా ఉన్నాయని విమర్శకులు పేర్కొన్నారు. మాధవుని స్నేహితుడైన మకరందుడు స్త్రీ వేషం ధరించడం విశాఖదత్తుని దేవీ చంద్రగుప్త నాటకంలో కనిపిస్తుంది.[7] ఆరవ అంకంలో మాధవుడు ఆలయ గర్భగృహంలో దాగడం, అకస్మాతుగా లవంగిక స్థానంలో నుంచొని కథానాయకి మాలతిని హత్తుకోవడం లాంటి పరికల్పనలు భాసుడు రాసిన 'అవిమారక' నాటకంలో ఉన్నాయి.[7] తొమ్మిదవ అంకంలో మాధవుడు మాలతి కోసం అన్వేషిస్తూ విలపిస్తూ మూర్ఛిల్లే దృశ్యాలు కాళిదాసు విక్రమోర్వశీయం లోని పరిస్థితుల నుండి స్వీకరించబడ్డాయి.[7]

కథా సన్నివేశాలు మాత్రమే కాక మాలతీ మాధవం నాటకంలో ప్రయోగించిన అనేకానేక పదాలు, భావనలు కౌటిల్యుని అర్థశాస్త్రం నుండి యథేచ్ఛగా స్వీకరించబడ్డాయని, ఆ మేరకు భవభూతి కౌటిల్యునికి రుణపడ్డాడని భారతీయ భాషా సాహిత్య పరిశోధకుడు దశరథ శర్మ పేర్కొన్నారు.[8]

నాటకం-ప్రత్యేకతలు

[మార్చు]

నాటకారంభం లోనే బౌద్ధ సన్యాసిని పరిచయమైన ఈ నాటకంలో బౌద్ధ సన్యాసినులైన కామాందకి, సౌదామినులు అమాయక ప్రేమికులను ఒకటయ్యేటట్లు కార్యభారం వహించడం, ఆద్యంతం వారికి సహాయం చేయడం కనిపిస్తుంది.[9] ముఖ్యంగా విరాగినులు అయినప్పటికీ వారు సమాజానికి దూరంగా కాక, సమాజంలో మమేకమై, త్రికరణశుద్ధిగా నిర్మలమైన ప్రేమికులకు తోడుగా చివరివరకూ నిలబడటం ఈ రూపకంలో ఒక ప్రత్యేకత.

మాలతీ మాధవం గొప్ప శృంగారభరితమైన నాటకమైనప్పటికి, దీనిలో వర్ణితమైన ప్రేమ సున్నితమైనది, పరిపూర్ణమైనది. నిర్మలమైన ప్రణయాన్ని కోమలమైన రీతిలో చూపించిన అత్యంత రమణీయ దృశ్యకావ్యంగా దీనిని విమర్శకులు కొనియాడారు. దీనిలో కామోద్రేకమైన అంశాలు లేవు. ప్రాచీన, సమకాలీన ప్రణయ కథా కావ్యాలలో విరివిరిగా కనిపించే స్త్రీ అంగాంగ సౌష్టవ వర్ణన, విశృంఖలమైన స్వేచ్ఛా ప్రణయ భావం లాంటివి మాలతీ మాధవంలో అసలు కానరావు. కామాతురతమైన ప్రేమ కన్నా వైవాహిక బంధానికి దారితీసే పరిపూర్ణమైన ప్రేమకు ఈ నాటకంలో ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం మీద అశ్లీలత అనేది ఈ నాటకంలో కనిపించకపోవడం ప్రశంసనీయమైన అంశం.

తొలి చూపులో ప్రేమ (లవ్ ఎట్ ఫస్ట్ సైట్) అన్న భావనకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడిన ఈ నాటకం రాజకీయ ప్రయోజనాలను ఆశించి వివాహాలు జరిపే పద్ధతులకు వ్యతిరేకంగా గళమెత్తింది.[10]

భవభూతి తన నాటకంలో ప్రేమలో మునిగిన జంట చిత్రణను దాటి, వారి మధ్య ప్రేమతో పెనవేసుకొన్న సున్నిత అనుబంధాలను ఉదాహరణకు ప్రేమికుల మధ్య నెలకొన్న నిరాశ, వైరాగ్యం, విరహవేదన, ప్రేమ భంగం మొదలగు భావాలను రమణీయంగా వర్ణించగలిగాడు.

అయితే సున్నితమైన ప్రణయకథకు ఆలంబనగా భవభూతి చేసిన మనోహరమైన ప్రకృతి వర్ణనలకు దీటుగా కొన్ని భయానక సంఘటనల వర్ణనలు ఈ నాటకాన్ని సంస్కృత సాహిత్యంలో అసాధారణమైన రూపకంగా నిలిపాయి.[9] సంస్కృత కళాకారుడు డేనియల్ హెచ్ హెచ్ ఇంజెల్స్ పేర్కొన్నట్లు ప్రణయం, భయానకం సరిసమానంగా రంగరించి రాయబడిన మాలతీ మాధవం లాంటి రూపకం సంస్కృత సాహిత్యంలో సాటిలేనిది.

మధ్యయుగారంభకాలంలో రాయబడిన ఈ ప్రకరణలో అలనాటి సామాన్య ప్రజల జీవన చిత్రణ అంతగా కనపడదు. అయితే కాళీ ఉపాసనలు, అఘోరాలు, నరబలులు, తాంత్రిక సాధనలకు సంబంధించిన విశేషాలు ఈ నాటకంలో ఉండటం గమనించదగ్గది. ఎనిమిదవ శతాబ్దంలో మధ్యయుగపు భారతీయ సమాజంలో పెనవేసుకుపోయిన ప్రతికూల అంశాలుగా వీటిని పేర్కొనవచ్చు.

ఈ నాటకంలో విధీకృతం అనిపించే సంఘటనలు అనేకం కనిపిస్తాయి. అనుకోకుండా జరిగే సంఘటనలతో బాధితుల ప్రాణాలు రక్షింపబడటం జరుగుతుంది.[2] ప్రాణహానిలో చిక్కుకున్న మాలతి అనుకోకుండా ఒకసారి మాధవుని వలన ఒకసారి సౌదామిని వలన మరొకసారి రక్షింపబడటం విస్మయానికి గురిచేస్తుంది.[2] ఈ నాటకంలో విధికి మానవులతో జరిగిన పోరాటంలోలో విధి పైచేయి కావడం కనిపిస్తుంది. అంతిమంగా ఈ నాటకం విధి బలీయమైనది మానవుడు కేవలం నిమిత్తమాత్రుడు అనే భావనను బలపరుస్తుంది.

ప్రభావం

[మార్చు]

శృంగార, బీభత్స రసభరితమైన మాలతీ మాధవం సంస్కృత రూపకం తదనంతర కాలంలో భారతీయ నాటక కర్తలను చాలా ప్రభావితం చేసింది. ప్రాచీన సంస్కృత రూపకాలను అన్య భాషలలో అనుసృజించే కవులకు, వారు తప్పనిసరిగా అనువదించవలసిన ముఖ్య నాటకంగా కాళిదాసు నాటకాల తరువాత స్థానంలో మాలతీ మాధవం నాటకం ఉండేది. సంస్కృతంలో కాళిదాసుని 'విక్రమోర్వశీయం' తదితర కథల తరువాత ఇతర భాషలలో అత్యధికంగా అనువదించబడిన కావ్యాలలో మాలతీ మాధవం ఒకటి.

అనువాదాలు

[మార్చు]

ముఖ్యంగా 19 వశతాబ్దంలో మాలతీ మాధవం సంస్కృత రూపకానికి దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషలలోనూ అనువాదాలు వెలువడ్డాయి. 1856 లో ప్రముఖ బెంగాలీ నాటకకర్త కాళీ ప్రసన్న సింహ ఈ సంస్కృత నాటకాన్ని తొలిసారిగా "మాలతీ మాధవ్" పేరుతో బెంగాలీ భాషలో అనువదించాడు.[11] తరువాత 1867 లో మరో బెంగాలీ నాటకకర్త రామనారాయణ్ తర్కరత్న అదే పేరుతోనే బెంగాలీ భాషలో అనువదించాడు.[12] తరువాత జ్యోతిరీంద్రనాథ ఠాకూర్ వంటి కవులు కూడా బెంగాలీ భాషలో ఈ నాటకాన్ని అనువదించారు. 1881 లో శాలిగ్రాం, 1898 లో లాలా సీతారాంలు మాలతీ మాధవ్ పేరుతొ హిందీలో అనువదించారు.[13] 19 వ శతాబ్దంలో బసవప్ప శాస్త్రి (1843-91) ఈ నాటకాన్ని కన్నడంలో అనువదించాడు.[14] కొట్టారత్తిల్ సంకుణ్ణి (1855-1937) మలయాళంలో అనువదించాడు.[15] వనపర్తి సంస్థానానికి చెందిన విక్రాల నరసింహాచార్యులు ఆంధ్రీకృత మాలతీ మాధవము పేరిట తెలుగులో అనువదించాడు.[16] వెలగపూడి కృష్ణయ్య తెలుగులో అనువదించిన మాలతీ మాధవం అలభ్యం.

భవభూతి మాలతీ మాధవాన్ని అనుకరిస్తూ తరువాతి కాలంలో వచ్చిన ప్రకరణాలలో మల్లికా మారుత ముఖ్యమైనది. దీనిని కాంచీపురానికి చెందిన ఉద్దండిని (15వ శతాబ్దానంతర కాలం) రాసాడు.[17] దీనినే 1903లో వడ్డాది సుబ్బారాయుడు మల్లికా మారుత ప్రకరణం పేరుతొ అనువదించడం జరిగింది.[18] ఇతివృత్తంలో సంస్కృత మాలతీమాధవం నాటకానికి దగ్గరగా వున్న మరో తెలుగు పద్య నాటకం మంజరీ మధుకరీయం. దీనిని 1860 లో కోరాడ రామచంద్ర శాస్త్రి ప్రబంధ ధోరణిలో స్వతంత్రంగా రాయడం జరిగింది.[19]

ఈ సంస్కృత నాటకం భారతీయ భాషలలోనే కాకుండా ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ తదితర యూరోపియన్ భాషలలో సైతం అనువదించబడింది. ఆసియాటిక్ సొసైటీ అఫ్ బెంగాల్ యొక్క సెక్రటరీ అయిన హోరస్ హేమాన్ విల్సన్ 1827 లో సెలెక్ట్ స్పెసిమెన్స్ అఫ్ ది థియేటర్ అఫ్ హిందూస్-2 లో భాగంగా భవభూతి విరచితమైన ఉత్తర రామ చరిత్రతో పాటు మాలతీ మాధవాన్ని కూడా ఆంగ్ల భాషలోకి అనువదించాడు.[20] 1832 లో జర్మనీకి చెందిన ప్రాచ్య భాషాచార్యుడు, సంస్కృత భాషా పండితుడు అయిన క్రిస్టియన్ లెస్సెర్ సంస్కృత మాలతీ మాధవం నాటకాన్ని జర్మనీ భాషలో పూర్తిగా పరిష్కరించగలిగాడు.[21] అదే సంవత్సరంలో జర్మనీకి చెందిన లుడ్విగ్ ఫ్రిట్జ్ మాలతీ మాధవాన్ని జర్మనీ భాషలోకి అనువాదం చేసాడు.[21] 1885 లో జార్జెస్ స్ట్రెహెలీ మాలతీ మాధవాన్ని ఫ్రెంచి భాషలోకి అనువదించాడు.[22]

చలన చిత్రీకరణలు

[మార్చు]

భవభూతి రాసిన మాలతీ మాధవం నాటక కథ ఆధారంగా తెలుగులో 1940 లో మాలతీ మాధవం చలన చిత్రం విడుదలయ్యింది. సి. పుల్లయ్య దర్శకత్వంలో తీయబడిన ఈ సినిమాలో మాలతిగా భానుమతి, మాధవునిగా సి.శ్రీనివాసరావు, ఇతర ప్రధాన పాత్రలలో కె.కామేశ్వరరావు, రేలంగి తదితరులు నటించారు.[23]

విమర్శ

[మార్చు]
 • మాలతీమాధవం నాటకంలో హాస్య ధోరణి కనిపించదు. విదూషకుని పాత్ర లేనే లేదు. నందనుని విప్రలంభం లాంటి సన్నివేశాలలో హాస్యరస పోషణకు పుష్కలమైన అవకాశాలున్నా భవభూతి ఎందుకనో విదూషక పాత్రను ప్రవేశ పెట్టలేదు. మొత్తం మీద మాలతీమాధవం నాటకంలో హాస్య రస పోషణ లోపించింది.
 • కావ్యరచనలో కొత్తదనం కోరుకొనే భవభూతి తన మాలతీ మాధవం నాటకంలో నాటక లక్షణాలకు విరుద్ధమైన పెక్కు విషయాలను, అలంకారికులు కూడదన్న సన్నివేశాలను ప్రవేశపెట్టాడు. ఉదాహరణకు మాలతీమాధవంలో రంగస్థలం మీదకు పులి రావడం, శ్మశాన దృశ్యాలు, మనుష్య మాంసం అర్పించడం మొదలైనవి.
 • క్లిష్టమైన ఘట్టాలతో కూడిన మాలతీమాధవం పఠన యోగ్యంగా ఉన్నప్పటికీ రంగస్థలం మీద ప్రదర్శనకు అంతగా తగినది కాదని విమర్శకుల అభిప్రాయం
 • కథా సంవిధానంలో పునరుక్తులు అధికంగా కనిపిస్తాయి. అవసరం లేకపోయినా కొన్ని చోట్ల కథ సాగదీయబడటంతో నాటకం మెల్లగా నడుస్తుంది.

కావ్య పరామర్శ

[మార్చు]

తొలి మధ్యయుగ కాలంలో వెలువడిన ఈ నాటకం ఆనాటి సమాజంలో ఉన్నత కుటుంబాల (Noble families) మధ్య జరిగిన ప్రేమ కథా ఇతివృత్తంతో సాగుతుంది. ఆర్థర్ ఆంథోనీ మెక్ డోనెల్ వంటి సంస్కృత పండితులు మాలతీ మాధవాన్ని సుఖాంతమైన భారతీయ రోమియో జూలియట్ కథగా చూపించారు.[24] అయితే సరళమైన ప్రేమ కథలో నరబలుల ప్రస్తావన, వశీకరణలు, మనుష్య మాంసం అర్పణలు, తాంత్రిక సాధనలు మొదలగునవి కలగలసిపోయి చివరకు ఒక సంక్లిష్ట ప్రేమకథగా రూపుదాల్చింది. ప్రేమ-అద్భుత సన్నివేశాలతో ఆసాంతం నిండిన ఈ జనరంజక నాటకం, ప్రేమోల్లాసం కొరకు, అద్భుత వీర రసానందం కొరకు ఉద్దేశితమైనప్పటికీ, సంస్కృత సాహిత్యంలో వెలువడిన ఉత్తమ రచనలలో ఒకటిగా విమర్శకులు దీనిని కొనియాడారు. దీని తరువాత సంస్కృత నాటక సాహిత్యంలో మరేతర ప్రకరణ కూడా దీనికి దీటుగా ఉద్భవించలేదు.[10] సంస్కృత భాషలో ప్రకరణ అనే భావనాభివృద్ధికి బహుశా పరాకాష్ఠగా నిలిచిన మాలతీ మాధవం నాటకం సంస్కృతంలో ఒక ఆదర్శ ప్రకరణగా నిలిచింది.[10] బృహత్కథ లోని ఒకానొక చిన్న కథను సంస్కృత భాషలో ఒక రమణీయ సంపూర్ణ దృశ్యకావ్యంగా లిఖితబద్ధం చేసిన మాలతీ మాధవం రూపకం ఒక మహత్తర కళాఖండంగా సంస్కృత సాహితీ చరిత్రలో సుస్థిర స్థానం పొందింది.

వీటిని కూడా చూడండి

[మార్చు]

భవభూతి
ఉత్తరరామచరిత్ర

గ్రంథసూచిక

[మార్చు]
 • Malatimadhava a play based on the romance of Malati and Madhava
 • MR, KALE. Malayimadhava (1928 ed.). Bombay. Retrieved 7 July 2019.
 • సంస్కృత సాహిత్యమాల; మహా నందీశ్వర శాస్త్రి & మార్కండేయ శాస్త్రి, జనత బుక్ హౌస్, విజయవాడ -2
 • Mudiganti Gopala Reddy; Mudiganti Sujatha Reddy. Sanskrita Saahitya Charitra (Telugu) (2002 ed.). Hyderabad: Potti Sreeramulu Telugu University .
 • C RAMANATHAN. BHAVABHUTI A BRIEF SKETCH OF LIFE & WORKS (PDF) (1985 ed.). Bangalore: INDIAN INSTITUTE OF WORLD CULTURE. Archived from the original (PDF) on 13 జూలై 2017. Retrieved 4 August 2017.
 • R.D, Karmarkar. Maltimadhavam Of Bhavbhuti (2003 ed.). Chowkhamba Vidyabhawan Varanasi. ISBN 8170841801.
 • Mirashi, Vasudev Vishnu. Bhavabhūti (1974 ed.). Delhi: Motilal Banarsidass. ISBN 8120811801.
 • మల్లాది, సూర్యనారాయణశాస్త్రి. భవభూతి నాటక కథలు (1950 ed.). మద్రాస్: మాక్మిలన్ & కంపెనీ.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 C RAMANATHAN 1985, p. 1.
 2. 2.0 2.1 2.2 R.D Karmarkar 2003, p. 2.
 3. Mudiganti Gopalareddy 2002, p. 415.
 4. Mudiganti Gopalareddy 2002, p. 412.
 5. R.D, Karmarkar. Maltimadhavam Of Bhavbhuti (2003 ed.). Chowkhamba Vidyabhawan Varanasi. p. 4. ISBN 8170841801. Retrieved 9 July 2019.
 6. సేన్, సుకుమార్. వంగ సాహిత్య చరిత్ర (1959 ed.). న్యూ ఢిల్లీ: సాహిత్య అకాడమీ. p. 235.
 7. 7.0 7.1 7.2 7.3 "Malati- Madhav". hinduscriptures.com. Shrivedant Foundation. Archived from the original on 31 అక్టోబర్ 2020. Retrieved 10 July 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 8. 'Bhavabhuti's Indebtedness to Kautilya' Journal of the Ganganath Jha Research Institute Vol VIII, part 3, May 1951
 9. 9.0 9.1 C RAMANATHAN 1985, p. 2.
 10. 10.0 10.1 10.2 PRAKARANA AS A DRAMATIC FORM (Chapter IV) (PDF). p. 137. Retrieved 10 July 2019.
 11. పురిపండా, అప్పల స్వామి (1979). ఉత్తర భారత సాహిత్యములు (వంగ సాహిత్య చరిత్ర) (చారీ అండ్ కంపెనీ, సికింద్రాబాద్ ed.). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమి , కళాభవన్ , హైదరాబాద్-4. p. 78.
 12. సేన్, సుకుమార్. వంగ సాహిత్య చరిత్ర (1959 ed.). న్యూ ఢిల్లీ: సాహిత్య అకాడమీ. p. 195.
 13. Khan, Tariq (2017). History of Translation in India (PDF) (Mysuru ed.). National Translation Mission Central Institute of Indian Languages. p. 110. ISBN 978-81-7343-189-0. Retrieved 7 July 2019.
 14. Datta, Amaresh. Encyclopaedia of Indian Literature: A-Devo (1987 ed.). Sahitya Akademi. p. 403. Retrieved 7 July 2019.
 15. CHATTERJI, SUNITI KUMAR. Cultural Heritage of India Vol-V (PDF) (T.HE RAMAKRISHNA MISSION INSTITUTE OF CULTURE CALCUTTA ed.). C a l c u t t a 1937: SvkAUI L o k e s w a r a n i n d \ , S l c r e t \ r y I h e R a m a k r is h n a M issiov I n s u t u i e o f O u l il -r l. p. 542. Retrieved 7 July 2019.{{cite book}}: CS1 maint: location (link)
 16. తూమాటి, దోణప్ప. ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణము (PDF) (1969 ed.). విశాఖపట్టణం: ఆంధ్ర విశ్వకళా పరిషత్. p. 379. Retrieved 10 July 2019.
 17. Vasudev Vishnu Mirashi 1974, p. 392.
 18. భారత డిజిటల్ లైబ్రరీలో మల్లికామారుత ప్రకరణము పుస్తకం.
 19. గొర్తి, సాయి బ్రహ్మానందం. "తెరమరుగవుతున్న తెలుగు నాటకం". eemaata .com. Retrieved 7 July 2019.
 20. Horace Hayman, Wilson. Select specimens of the Theatre of the Hindus transalated from original Sanscrit (1927 ed.). Asiatic Press, Calcutta. Retrieved 7 July 2019.
 21. 21.0 21.1 Chandima, Gangodawila. A Critical Appraisal of the Contribution of Germany and France to Sanskrit Studies (2010 ed.). Sri Lanka: Ven Gangodawila Chandima, Sri Lanka. p. 57. ISBN 978-9555237918. Retrieved 9 July 2019.
 22. Georges, Strehly. "Madhava et Malati : drame en dix actes et un prologue". worldcat.org. E. Leroux, Paris, 1885. Retrieved 7 July 2019.
 23. Admin. "Malathi Mahavam". gomolo.com. Gomolo. Archived from the original on 18 ఆగస్టు 2016. Retrieved 8 July 2016.
 24. Arther A., Macdonell. A History of Sanskrit Literature (PDF) (1900 ed.). London: WILLIAM HEINEMANN. p. 364. Retrieved 10 July 2019.