ఏకవీర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏకవీర విశ్వనాథ సత్యనారాయణ రచించిన విశిష్టమైన నవల.

శీర్షిక[మార్చు]

నవలలో ప్రధానమైన పాత్రలు ఏకవీర, మీనాక్షి, కుట్టాన్, వీరభూపతి. వీరిలో ప్రతిపాత్ర విశిష్టమైనవే, ఏ పాత్ర లేకున్నా కథాగమనం మారిపోతుంది. కానీ మీనాక్షి అనో, వీరభూపతి అనో, కుట్టాన్ అనో మరేదో పేరో కాకుండా ఏకవీర అనే పేరు పెట్టడం వెనుక విమర్శకులు కారణాన్ని విశ్లేషించారు. నవల ముగుస్తున్నప్పుడు సుందరేశ్వరుడు ఏకవీరను ఆవహించి ఆమెతో ఒక మహత్కార్యం చేయించాడని, అందుకే వారి కన్నా ఆ పాత్ర కొంత మిన్నయైనదని భావించారు.[1]

కథాసంగ్రహం[మార్చు]

మధురను ముద్దు కృష్ణప్ప నాయకుడు పరిపాలిస్తున్న కాలం ఈ కథాకాలం. నవలలో నలుగురు ప్రధానపాత్రలు-ఏకవీర, మీనాక్షి, కుట్టాన్, వీరభూపతిలు. కుట్టాన్ కృష్ణప్ప నాయకుని మంత్రుల్లో ఒకరైన ఉదయన్ సేతుపతి కుమారుడు. వీరభూపతి అతని ప్రాణ స్నేహితుడు, మొదట సామాన్య రైతు కొడుకు హోదాలో ఉన్నా తదనంతరం రాజ్యపరిపాలనకు చెందిన ముఖ్యపదవిలో చేరుతాడు. కుట్టాన్ మీనాక్షి అనే సామాన్య సంసారి కుమార్తెను ప్రేమిస్తాడు, మీనాక్షికి కూడా కుట్టాన్‌పై ప్రేమ ఉంటుంది. కానీ కుట్టాన్ తండ్రి విషయం తెలిసి కూడా నిర్లక్ష్యం చేసి ఉన్నత కుటుంబానికి చెందిన ఏకవీరను ఇచ్చి వివాహం చేస్తాడు. కుట్టాన్ ఆమెపైకి తన ప్రేమను తిప్పుకోలేక, మీనాక్షిని మరచిపోలేక సతమతమవుతూంటాడు.
మరోవైపు అతని ప్రాణమిత్రుడు వీరభూపతి కూడా ఉన్నత కుటుంబానికి చెందని ఏకవీరను ప్రేమించివుంటాడు. ఏకవీర కూడా వీరభూపతిని ప్రేమించినా ఆమె తల్లిదండ్రులు ఆమె ఇష్టాయిష్టాల ప్రసక్తి లేకుండా కుట్టాన్‌కి ఇచ్చి వివాహం చేస్తారు. కుట్టాన్ ప్రేమించిన మీనాక్షి వీరభూపతి భార్య అవుతుంది. వీరిద్దరి మధ్య కూడా నిశ్శబ్దమే రాజ్యమేలుతూంటుంది. ఇలాంటి స్థితిలో ఆ ఇద్దరు జంటల జీవితాలు ఏ మార్పులు తిరిగాయో, చివరకు కథ ఏ తీరానికి చేరిందో నవలలోని మిగిలిన కథాభాగం.[1]

ప్రాచుర్యం[మార్చు]

సినిమా రూపం[మార్చు]

ఏకవీర నవలను చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో సి.నారాయణరెడ్డి పాటలు, మాటలు వ్రాయగా ఎన్.టి.రామారావు, కాంతారావు, కె.ఆర్.విజయ, జమున ప్రధాన పాత్రలలో సినిమాగా తీశారు. సినిమా స్క్రిప్టులో నవలలో లేని చాలా మార్పలు చేశారు. సినిమా ఆర్థికంగా విజయవంతం కాకపోగా పాటలు తప్ప మిగిలిన ప్రయత్నం విమర్శకులను కూడా మెప్పించలేదు.

ప్రభావం[మార్చు]

ఏకవీర నవలపై చారిత్రిక గ్రంథాల ప్రభావం ఉంది. పలు తెలుగు కావ్యాలతో పాటుగా పలు ఆంగ్ల నవలల ప్రభావం కూడా ఉంది. ఈ విషయాన్ని విశ్వనాథ సత్యనారాయణ ప్రస్తావిస్తూ సైలాస్ మారినర్‌లోని కథానిర్మాణం, కాళిదాస భవభూతులలోని శిల్పం, ఠాగూర్ నౌకాడూబీలోని శరీరవాంఛా దూరమైన ప్రేమధర్మం. నా తెలుగు రచనాశక్తీ - ఈ నాల్గింటినీ కలిపి ఏకవీరగా చేశాను అన్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. 1.0 1.1 కామేశ్వరరావు, టే (మార్చి 1934). "ఏకవీర విమర్శ". గృహలక్ష్మి. 7. Retrieved 6 March 2015. Check date values in: |date= (help)CS1 maint: discouraged parameter (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ఏకవీర&oldid=1486367" నుండి వెలికితీశారు