రామాయణ కల్పవృక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీమద్రామాయణ కల్పవృక్షము

రామాయణ కల్పవృక్షం, తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ రచించిన పద్య కావ్యము. తెలుగులో రామాయణం అనేక కావ్యాలుగాను, వచన రూపంలోను, సినిమాలుగాను, గేయాలుగాను, జానపద గీతాలుగాను చెప్పబడింది. ప్రతి రచనకూ ఒక విశిష్టత ఉంది. అలాగే విశ్వనాథ సత్యనారాయణ రచన "రామాయణ కల్పవృక్షం" అతని సాహితీ ప్రతిభకు, తాత్విక భావాలకు, ఆధ్యాత్మిక ధోరణికి, తెలుగు సాహిత్యంలో పద్య కావ్యాల విశిష్టతకు నిదర్శనంగా ప్రసిద్ధమైంది. రామాయణాన్ని, విశ్వనాథను, పద్యకవిత్వాన్ని విమర్శించే వారికి కూడా ఇది ఒక ప్రధాన లక్ష్యంగా ఉంటున్నది.

పరిచయం

[మార్చు]

తండ్రి ఆనతి, జీవుని వేదన రెండూ ఏకమై ప్రేరేపించగా రామాయణ కల్పవృక్షం అవతరించిందని చెప్పుకున్నాడు విశ్వనాథ.

వ్రాసిన రామచందృకథ వ్రాసితివనిపించుకో వృథా
యాసముగాక కట్టుకతలైహికమా! పరమా యటంచు దా
జేసిన తండ్రియాజ్ఞయును జీవునివేదన రెండు నేకమై
నాసకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్

ఇందులో కావ్య ప్రేరణ (జీవునివేదన, తండ్రియాజ్ఞ, కావ్యేతివృత్తం (నాథకథన్ రచించెదన్, కావ్యరచన (నా సకలోహవైభవ సనాథము) అనే మూడు అంశాలు ఈ పద్యంలో వ్యక్తమైనాయి. మళ్ళీ రామాయణమే వ్రాయాలా అని అనుకునే వారికి ఎవరి అనుభూతి వారిదైనట్లుగా తన భక్తి రచనలు తనవి అని సమాధానం చెప్పాడు. ఇంత మంది వ్రాసిన రామాయణం మళ్ళీ వ్రాయడానికి విశ్వనాథ చెప్పిన కారణం ప్రతీ రోజూ తిన్న అన్నమే అని తినడం మానేయడం లేదు. సంసారంలో కష్ట సుఖాలున్నాయి కదా అని మనం మానేయడం లేదు. మన పిల్లల ల్నీ సంసార బంధంలోకి లాగుతున్నం కదా. అలాగే ఎవరి అనుభూతులు వారివి. ఈ రామాయణం నా అనుభూతి. నా రసాస్పందన” అని విశ్వనాధ వారు కావ్య రచనా హేతువును వివరించారు.

మరల నిదేల రామాయణం బన్నచో,
        నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు,
        తన రుచి బ్రదుకులు తనివి గాన
చేసిన సంసారమే చేయు చున్నది,
        తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెద నేనును,
        నా భక్తి రచనలు నావి గాన
కవి ప్రతిభలోన నుండును గావ్యగత శ
తాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా దృతిని మించి.

[1]

ఈ కావ్యం అవతారికలో బాగా ప్రసిద్ధమైన ఒక పద్యం

అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్

అవతారికలో ఈ పద్యం చాలా ప్రసిద్ధమైంది. నన్నయకు, తిక్కనకు లేనటువంటి భోగము గురువర్యులైన చెళ్ళపిళ్ళ వారికి తన శిష్యరికం వల్ల కలిగిందని చెప్పుకున్నారు. వారికీర్తిని దేశమంతట వ్యాపించుటకు తన శిష్యరికమే కారణం అన్నాడు. ఇది మనకు అహంకారంగా కనిపిస్తుంది. అది ఆయన ఆత్మవిశ్వాసం మాత్రమే.[2]

తెలుగు సాహిత్యంలో రామాయణ కల్పవృక్షం స్థానం

[మార్చు]

"విశ్వనాథ అంటే శ్రీమద్రామాయణ కల్పవృక్షమే" అని బేతవోలు రామబ్రహ్మం అన్నాడు. దివాకర్ల వేంకటావధాని కూడా "విశ్వనాథ కవిత మెరుపునకు శిఖరాయమానము శ్రీమద్రామాయణ కల్పవృక్షము" అన్నాడు. విశ్వనాథ నన్నయలాగా కథాకథన శిల్పం, తిక్కనలాగా నాటకీయ శిల్పం కనబరచాడు గనుకనే "నన్నయ్యయు తిక్కనయు నన్నావేశించిరి" అన్నాడు.[3] రామాయణ కల్పవృక్షం విశిష్టత గురించి అనేక వ్యాసాలు, రచనలు, ఉపన్యాసాలు వెలువడ్డాయి. వాటిలో "జ్ఞానపీఠ విశ్వనాథ రామాయణ కల్పవృక్షము కావ్య వైభవము" అనేది కోటి సూర్యనారాయణమూర్తి సంకలనం చేసిన వివిధ వ్యాసాల సమాహారం.[4] మరొకటి "రామాయణ కల్పవృక్షము - తెలుగుదనము" అనే పరిశీలనా గ్రంథము.[5] ఇవే కాకుండా అనేక పత్రికా రచనలలోను, ఉపన్యాసాలలోను, బ్లాగులలోను రామాయణ కల్పవృక్ష వైశిష్ట్యాన్ని పరిశీలకులు ప్రశంసించారు.

"తెలుగు సాహిత్యంలో రామకథ" అనే పరిశోధనా రచనలో రచయిత్రి పండా శమంతకమణి ఇలా అన్నది. "ఆధునిక సాహిత్యంలో వెలువడిన రామాయణరచనలలో ముందుగా పేర్కొనవలసినది రామాయణ కల్పవృక్షము. ఇది వాల్మీకిరామాయణానుసారి అయ్యును నూతన కల్పనములు, పాత్రపోషణము, వర్ణనా వైచిత్ర్యములతో స్వతంత్ర కావ్యత్వమును సమకూర్చుకొన్నది. అహల్యాశాప విమోచన ఘట్టము, అశ్వమేధ సమయంలో దశరథుడు గుహుని, విశ్వామిత్రుని ఆహ్వానించుట, శివ ధనుర్భంగము, మారీచ వధ వంటి ఘట్టములలో కథనం వాల్మీకి కథనంనుండి గణనీయంగా మార్చబడింది. వాలి వధ, సీత అగ్ని ప్రవేశం వంటి ధర్మ సందేహాస్పదమనిపించే విషయాలను నూత్నమైన మెళకువలతో కవి తీర్చిదిద్దెను. దుష్టపాత్రల చిత్రణలో కూడా క్రొత్త దనము, ఆధ్యాత్మికత జోడింపబడినవి. అన్నింటికంటె విశిష్టముగా పేర్కొనవలసిన విషయం సన్నివేశాలలోను, సంభాషణలలోను, చర్యలలోను కవి మేళవించిన తెలుగుదనం. వాల్మీకి రామాయణమునకు వ్యాఖ్యానప్రాయమైన కావ్యముగా కల్పవృక్షము రూపొందింపబడింది. పరంపరాగతమైన సాహిత్య ప్రక్రియలను, ఆధునిక కాలంలో వచ్చిన భిన్న దృక్పధాలను క్షుణ్ణముగా అర్ధము చేసికొని సహృదయుడైన విమర్శకునిగా విచారణశీలిగా రూపొందిన ప్రభావంతుడైన కవి వెలయించిన కమనీయ కావ్యము రామాయణ కల్పవృక్షము.[6]

కథావిభాగములు

[మార్చు]

రామాయణ కల్పవృక్షములో కథావిభాగాలకు వాల్మీకములాగానే కాండలని పేరుంచారు. బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, సుందరకాండము, యుద్ధకాండములనేవి ఆ ప్రాథమిక విభాగాలు. ఆపైన ప్రతి కాండను అనేకమైన ఖండములుగా విభజించారు.

బాలకాండము

[మార్చు]

విశ్వనాథ వారి కల్పవృక్షము బాలకాండములోని అవతారిక పద్యాలతో ప్రారంభమవుతుంది. వీటిలో విశ్వనాథ సత్యనారాయణ తనకు రామాయణ వ్రాసేందుకు కలిగిన ప్రేరణ, చేసిన ప్రయత్నం వంటివి చెప్పుకున్నారు. తన వంశము, కావ్యానికి వ్రాయసకానిగా వున్న తమ్ముడు వెంకటేశ్వరరావు వంటి వారి వివరాలతో కూడిన అనేక పద్యాలు కూడా అవతారికలో వుంటాయి.

ఇష్టిఖండము

[మార్చు]

మొదటిగా వచ్చే ఖండం పేరు ఇష్టి ఖండము. ఈ ఖండములో దశరథ మహారాజు, ఆయన మువ్వురు భార్యలు, సంతానలేమి, ప్రయత్నాలు, మంత్రుల సలహాతో యాగం చేయుట, యాగఫలంగా యజ్ఞపురుషుడు పాయసపాత్రలివ్వడం వరకూ ఉన్న కథ వస్తుంది. వాల్మీకి రామాయణంలోని మూలకథనం నుంచి కల్పవృక్షములోని ఇష్టిఖండములోని కథనం పలుమార్లు భేదిస్తుంది వాల్మీకంలో దశరథుని ముగ్గురు భార్యలైన కౌశల్య, సుమిత్ర, కైకేయిల ప్రస్తావన యాగప్రారంభం వరకూ రాకపోగా కల్పవృక్షకారుడు ఆ ప్రస్తావనే కాక విపులమైన వివరణలు, వారి లక్షణముల విశేష వర్ణనలు కూడా దశరథుని ప్రస్తావన కాగానే మొదలుపెడతారు. కౌశల్యముక్తికాంతా సమానాకార అంటూ ప్రారంభమయ్యే సీసపద్యంలో ఒక పాదం కౌశల్య గురించి, ఒక పాదం కైకేయి గురించి, రెండు పాదాలు సుమిత్ర గురించి మళ్ళా కౌశల్యతో ప్రారంభించి అదే పద్ధతిలో వస్తాయి. ఇదంతా భవిష్యత్తులో కౌశల్యకు, కైకకు ఒక్కొక్క పుత్రుడు, సుమిత్రకు ఇద్దరు కుమారులు కలగబోతున్నారని సూచనే కాక ఆయా లక్షణాలు కూడా పుట్టబోయే కొడుకుల మూలలక్షణాలకు సామ్యంతో వుండడం గొప్ప విశేషమని విమర్శకులు పేర్కొన్నారు.[7]

యుద్ధకాండము

[మార్చు]

విశ్వనాథ వారి కల్పవృక్షము యుద్ధకాండములో మొదటి కొన్ని పుటలు "ఒక్కమాట", "ఈ ముద్రణ కు ఆర్ధిక సహాయం చేసినవారి యొక్క పేర్లు పట్టిక", చివరిగా "విషయ సూచికని" పొందు పర్చారు. ఈ యుద్ధకాండములో 5 ఖండములు కన బడుచున్నవి. అవి ఏమనగా. సంశయ ఖండము, కుంభకర్ణ ఖండము, ఇంద్రజిత్ ఖండము, నిస్సంశయ ఖండము, ఉపసంహరణ ఖండము.

సంశయ ఖండము

[మార్చు]

సంశయ ఖండములో చాలా ఆసక్తి కలిగించే అంశాలను విశ్వనాధ వారు పొందు పర్చారు. కొన్ని అంశాల పేర్లు ఇక్కడ ప్రస్తావించుట జరిగింది. శ్రీ రాముడు హంసతో సీతకు పంపిన సందేశము, రామ లక్ష్మణుల మాయ శిరస్సు, శ్రీ రాముని సూర్యోపాసన, అంగదుని రాయబారం మొదలగునవి.

కుంభకర్ణ ఖండము

[మార్చు]

కుంభకర్ణ ఖండములో చాలా ఆసక్తి కలిగించే యుద్ధ సన్నివేశములను విశ్వనాధ వారు పొందు పర్చారు. కొన్ని సన్నివేశముల పేర్లు ఇక్కడ ప్రస్తావించుట జరిగింది. రావణాసురిని యుద్ధ రంగ ప్రవేశము, కుంభకర్ణ నిద్రా భంగము, కుంభకర్ణ వధ మొదలగునవి.

ఇంద్రజిత్ ఖండము

[మార్చు]

ఇంద్రజిత్ ఖండములో చాలా ఆసక్తి కలిగించే మఱిన్నియుద్ధ సన్నివేశములను విశ్వనాధ వారు పొందు పర్చారు. కొన్ని ఆసక్తి కలిగించే సన్నివేశముల పేర్లు ఇక్కడ ప్రస్తావించుట జరిగింది. ఇంద్రజిత్ యుద్ధ రంగ ప్రవేశము, మయా సీత వధ, ఇంద్రజిత్ వధ, రావణుని శోకం క్రోధము మొదలగునవి.

నిస్సంశయ ఖండము

[మార్చు]

నిస్సంశయ ఖండములో చాలా ఆసక్తి కలిగించే మఱిన్నియుద్ధ సన్నివేశములను విశ్వనాధ వారు పొందు పర్చారు. కొన్ని ఆసక్తి కలిగించే సన్నివేశముల పేర్లు ఇక్కడ ప్రస్తావించుట జరిగింది. రావణుని యుద్ధ రంగ ప్రవేశము, లక్ష్మణ స్స్వామి మూర్చ, హనుమంతుని సంజీవిని తెచ్చుట,  రావణుని యుద్ధ రంగ పునరాగమనము,  బ్రహ్మాస్త్ర ప్రయోగము రావణ సంహారము మొదలగునవి.

ఉపసంహరణ ఖండము

[మార్చు]

ఉపసంహరణ ఖండములో రావణ వధ అనంతరం చోటు చేసుకున్న కొన్ని సన్నివేశములను విశ్వనాధ వారు పొందు పర్చారు. ఈ సన్నివేశముల పేర్లు ఇక్కడ ప్రస్తావించుట జరిగింది. మండోదరి దుఃఖము, హనుమ సీతాదేవి దర్శనం, సీత దేవి యగ్ని ప్రవేశము, సీతాదేవిని  శ్రీ రామునికి  సమర్పణ చేసిన అగ్ని దేవుడు, శ్రీ రామ పట్టాభిషేకము, హనుమంతునికి సీతాదేవి బహుమానం మొదలగునవి. ఈ ఖండముతో యుధ కాండము ముగిసినట్టే.

కావ్య రచనలో తెలుగుదనం

[మార్చు]

రామాయణ కల్పవృక్షంలో కనిపించే వాడుక నుడికారమూ, పలుకుబళ్ళూ చదివితే ఒక మహాకావ్యంలో, అందులోనూ పద్యకావ్యంలో ఇటువంటి భాషకూడా ఉపయోగించవచ్చా అని ఆశ్చర్యపోతాం. ఆ భాష సందర్భోచితంగా ఉండి, గుండెకు తాకుతుంది కూడా. కల్పవృక్షంలోని తెలుగు వాడుక భాష గురించి చెప్పాలంటే, అది పీ.హెచ్.డీకి తగిన అంశమే అవుతుంది. ఈ విషయమ్మీద పుస్తకాలు కూడా వచ్చాయి. కల్పవృక్షంలోని వాడుకభాషని ఒక మూడు దృక్కోణాలనుండి పరిశీలించవచ్చు:
(1) వాడుక భాషలోని సామెతలు, నుడికారము, పలుకుబడి
(2) తెలుగు భాషకి ప్రత్యేకమైన వాక్యవిన్యాసం
(3) తెలుగు సంభాషణల్లో కనిపించే గడుసుదనం, ఒడుపు, కాకువు. కల్పవృక్షంలో తెలుగు సామెతలు అసంఖ్యాకంగా కనబడతాయి.
ఉదాహరణగా కొన్ని పద్యాలు

ఆటవెలది:
అయినవారికేమొ ఆకులయందును,
కానివారికేమొ కంచములను
ఇంటిలోన దినుచు నింటి వాసంబుల
లెక్కపెట్టునట్టి లెక్కగాక

రామాయణ కల్పవృక్షంలో ప్రత్యేకంగా చెప్పుగోదగినవి తెలుగు వాడుకలోని పలుకుబళ్ళను యథాతథంగా పద్యాలలో పలికించడం. "గోల పెట్టు", "కిక్కురుమనలేదు", "దిమ్మెక్కి" మొదలైన పలుకుబళ్ళైతేనేమి, "రా అమ్మా", "అది కాదమ్మా" మొదలైన సంబోధనలైతేనేమి పద్యాలలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇక వాడుకభాషలోని వాక్యవిన్యాసాన్ని అలాగే ప్రయోగించిన సందర్భాలుకూడా అనేకం ఉన్నాయి. సుమంత్రుడు దశరథునితో, "నాతో రా!" అంటాడు! ఇది కందపద్య భాగం. ఇంతకన్నా వాడుకభాష మరెక్కడా ఉండదు. ఇక్కడ సందర్భం బట్టి అది ఎంతో సమంజసంగా కుదిరింది. సుమంత్రుడుకి దశరథుని దగ్గరున్న చనువు ఎంతటిదో ఇది స్పష్టం చేస్తుంది. అలాగే మిథిలకు వచ్చిన విశ్వామిత్రునితో జనక మహారాజు, "ఇది మీయిల్లు" అంటాడు. ఇంతటి వ్యావహారిక ప్రయోగం, ఒక మత్తేభ పద్యం మొదలని ఎవరైనా ఊహించగలరా! అలాగే విశ్వామిత్రుడు రాముణ్ణి తనతో పంపని దశరథుని అడిగినప్పుడు, దశరథుడు సందేహిస్తూంటే, "నీ కొడుకును గైకొని చని మా కాకలి యంచు దిందుమా, పిచ్చి నృపా!" అంటాడు. ఇలా విశ్వనాథ విశ్వామిత్రుడే అనగలడు! దశరథుడు రాముని తన వెంట పంపనన్నప్పుడు, విశ్వామిత్రుడెలా మాట్లాడతాడో చూడండి:

మత్తేభవిక్రీడితము:
అవునయ్యా! అవునిత్తునంటి మొద లీయంతంబునం దీయనం
టివి; పోనీ! రఘువింట యోగ్యమగునో నీ చేత! నీకున్ సుఖం
బవు నీ బంధులు నీవునున్ సుఖము పెల్లైయుండు డే బోదు మా
నవనాథా! సుఖమౌత నీకును బ్రతిజ్ఞాభంగ పుణ్యాబ్ధికిన్!

ఇలాంటి వాక్య విన్యాసం ఒక్క తిక్కనలో కనిపిస్తుంది, మళ్ళా విశ్వనాథలో కనిపిస్తుంది. ఇక - తెలుగు మాటల్లో కనిపించే ఒడుపు, గడుసుదనం గురించి చెప్పాలంటే, రామాయణ కల్పవృక్షమంతా ఉదహరించాల్సిందే! ... ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే ఓ పెద్ద గ్రంథమై కూర్చుంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు స్వయంగా రామాయణ కల్పవృక్షం చదివి అందులోని తెలుగుదనాన్ని, వాడుక భాష సొబగును తనివితీరా ఆస్వాదించవచ్చు.[8]

విమర్శలు

[మార్చు]

రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ రచనల్లోనే కాక 20వ శతాబ్దికి చెందిన తెలుగు సాహిత్యంలోనే అతిఎక్కువగా చర్చకు వచ్చిన రచనల్లో ఒకటి.

విశేషాలు

[మార్చు]

వాల్మీకి రామాయణంలో ఒక్కొక్క కాండము కొన్ని సర్గలుగా విభజింపబడింది. రామాయణ కల్పవృక్షంలో సర్గల వింగడింపు ప్రత్యేకంగా, ఖండాలనే భాగాలుగా ఉంది. ఆయా కథా విశేషాలను సూచించేవిధంగా విశ్వనాథ తన రచనలో ఖండాలకు పేర్లు పెట్టాడు. బాలకాండలోని సర్గల పేర్లు - ఇష్టి, అవతార, అహల్య, ధనుస్సు వంటివి. అయోధ్యాకాండలో ఖండాల పేర్లు - అభిషేక, ప్రస్థాన, మునిశాప, పాదుకా, అనసూయ; అరణ్యకాండలో ఖండాల పేర్లు - దశవర్షీ, పంచడటి, మారీచ, జటాయుః, శబరీ; కిష్కింధకాండ ఖండాలు - నూపుర, గజపుష్పీ, నియమపాలన, సమీకరణ, అన్వేషణ; సుందరకాండ ఖండాలు - పరరాత్ర, పూర్వరాత్ర, ఉషః, దివా, సంధ్యా; యుద్ధకాండ ఖండాలు - సంశయ, కుంభకర్ణ, ఇంద్రజిత్, నిస్సంశయ, ఉపసంహరణ.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. పుల్లమాంబ, గండవరపు. "విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం విశిష్టత". ఈమాట. Archived from the original on 2009-03-22. Retrieved 2009-02-27.
  2. రామాయణ కల్పవృక్షం అవతారిక విశేషాలు - మోహన్ భీమనాతి
  3. ద్వా.నా.శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర
  4. రామాయణ కల్పవృక్షము కావ్యవైభవము - కోటి సూర్యనారాయణ మూర్తి ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  5. రామాయణ కల్పవృక్షం - తెలుగుదనం - రచన: డా. పాణ్యం శ్రీనివాస - ప్రచురణ : పాణ్యం పబ్లికేషన్స్, వెల్దుర్తి, కర్నూలు జిల్లా (2000)ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  6. Panda Shamanthakamani (1972). Telugu Sahithyamulo Ramakatha (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  7. లక్ష్మీనరసింహారావు, కాజ (సెప్టెంబరు 1982). విశ్వనాథ శారద (బాలకాండములో కమనీయ శిల్పఘట్టములు వ్యాసం) (ప్రథమ ముద్రణ ed.). హైదరాబాద్: విశ్వనాథ సత్యనారాయణ స్మారక సమితి.
  8. ""ఈమాట"లో భైరవభట్ల కామేశ్వరరావు వ్యాసం "పద్యాలు - వాడుక భాష"". Archived from the original on 2011-02-05. Retrieved 2009-02-27.

వనరులు, బయటి లింకులు

[మార్చు]