భగవంతుని మీది పగ (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భగవంతుని మీది పగ
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ‎
సంపాదకులు: విశ్వనాథ పావనిశాస్త్రి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
సీరీస్: పురాణవైర గ్రంథమాల
ప్రక్రియ: నవల
ప్రచురణ: శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్
విడుదల:
దీనికి ముందు: ఈ నవలామాలికకు ఇదే మొదటి నవల
దీని తరువాత: నాస్తికధూమము

భగవంతుని మీది పగ నవలను జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు. ఇది పురాణవైర గ్రంథమాలలో మొదటిది. మహాభారత యుద్ధం అయి వందేళ్ళ నాటి ఇతివృత్తం ఈ నవలలోని విషయం.

రచనా నేపథ్యం[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ నవలను సా.శ.1958 సంవత్సరంలో రాశారు. ఈ నవల పురాణవైర గ్రంథమాల నవలామాలికలోనిది. విశ్వనాథ వారు ఆశువుగా చెపుతూండగా ఈ నవలను పాలావజ్ఝుల రామశాస్త్రి లిపిబద్ధం చేశారు. నవలకు పీఠిక, ఉపోద్ఘాతాలను 1960 జనవరిలో రాశారు. నవల ప్రథమ ముద్రణ 1959లో జరిగింది. 5వ ముద్రణ 2006లో, 6వ ముద్రణ 2013లో జరిగాయి.[1]

పురాణవైర గ్రంథమాల[మార్చు]

పురాణవైర గ్రంథమాల శీర్షికన విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవలల్లో భగవంతుని మీది పగ మొదటిది. ప్రధానంగా భారతీయులకు చరిత్ర రచనా దృష్టి లేదని, పూర్వరాజుల పరంపర అడిగితే పుక్కిటి పురాణాలు చెప్తారని ఆంగ్లవిద్య ప్రారంభమయిన తరువాత భారత చరిత్రను రచన చేసిన పలువురు అభిప్రాయపడ్డారు. సుమారు వెయ్యేళ్ల క్రితమే, అల్ బెరూని (Abu al-Beruni) వంటి పండితుడే, “దురదృష్టవశాత్తు భారతీయులు చారిత్రక గతిక్రమాన్ని పట్టించుకోరు. వారి రాజుల వంశపరంపరలు నమోదు చేసుకోవడంలో వారికి ఒకరకమైన నిర్లక్ష్యభావం ఉంది. ఖచ్చితమైన సమాచారం కోసం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియక కథలు కల్పించి చెప్తారు” అన్నాడు. ఇదేమాట, ఏ మార్పులు లేకుండా, వలసపాలన నాటి రచయితలు కూడా పదే పదే ఉటంకించడం మూలాన ఈనాటికీ ఒక సత్యంగా స్థిరపడిపోయింది.[2]
ఈ నేపథ్యంలో పురాణాల చారిత్రికతను తిరస్కరించిన చరిత్ర రచనా ధోరణిని విశ్వనాథ వారు పురాణవైరంగా పేర్కొన్నారు. భగవంతుని మీది పగ ఉపోద్ఘాతంలో ఈ నవలామాలిక లక్ష్యాలను పేర్కొంటూ ఆ లెక్క(పాశ్చాత్య చరిత్ర కారుల లెక్క) ప్రకారము కలి ప్రవేశము మొదలు- సంయుక్తా పృథ్వీరాజుల కథ దనుక, పాశ్చాత్యులు తారుమారు చేసిరి. ఆ కాలము, అనగా సుమారు మూడువేల యేండ్ల కాలము, మహమ్మదు గోరీ వచ్చువరకు మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవక తవకలు కాదని నవలల రూపమున నిరూపించుటకు చేసెడి ప్రయత్న మిది. అందుచేత దీనికి పురాణవైరము అని శీర్షిక ఏర్పరుపబడినది. అన్నారు విశ్వనాథ సత్యనారాయణ.[3] ఈ నవలామాలికలోని నవలలు మొత్తం 12. ఆ నవలలు ఇవి:

 1. భగవంతుని మీది పగ
 2. నాస్తికధూమము
 3. ధూమరేఖ
 4. నందోరాజా భవిష్యతి
 5. చంద్రగుప్తుని స్వప్నము
 6. అశ్వమేధము
 7. అమృతవల్లి
 8. పులిమ్రుగ్గు
 9. నాగసేనుడు
 10. హెలీనా
 11. వేదవతి
 12. నివేదిత

చారిత్రికాంశాలు[మార్చు]

ఈ నవలలోని కథాకాలము కలియుగము ప్రారంభించిన 100 సంవత్సరాల నాటిది.[4] సంప్రదాయ పండితులు కలియుగాబ్ది 100గా వ్యవహరిస్తూంటారు. దాదాపుగా క్రీ.పూ.3100 సంవత్సరంగా చెప్పుకోవచ్చు. నవల ప్రకారం అది శాతవాహనులను చక్రవర్తులుగా చేసి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించిన శ్రీముఖుని కాలం. కానీ ప్రాధాన స్రవంతికి చెందిన చరిత్రకారులు మాత్రం శ్రీముఖుని ద్వారా శాతవాహనులు చక్రవర్తులయిన కాలాన్ని క్రీ.పూ.230గా అంచనా వేస్తున్నారు.[5]
జనమేజయ మహారాజు తుంగభద్రా నది ఒడ్డున కొందరు మునులకు కొంత స్థలాన్ని దానమిచ్చినట్టుగా దానశాసనం దొరికిందని పేర్కొంటూ దాన్ని ఈ నవలారచనలో ఒక ఆధారంగా స్వీకరించారు విశ్వనాథ సత్యనారాయణ. (జనమేజయ మహారాజు ఈ నవలలో పాత్ర)[6]

ఇతివృత్తం[మార్చు]

కలియుగారంభమైన 100 ఏళ్ల తర్వాత హస్తినాపురానికి ముఖ్యమైన సామంతరాజ్యమైన ఆంధ్రరాజ్యంలో ఈ నవల ప్రారంభమవుతుంది. రోమపాద మహారాజు రాజ్యం చేస్తూండగా, ఆయన పెద్ద కొడుకు, యువరాజ పట్టాభిషేకం పొందిన శ్రీముఖునికి జయద్రధుడనే రహస్య మిత్రుడు ఉంటాడు. అతను యువరాజుతో తనకున్న చెలిమిని రహస్యంగా ఉంచుతాడు. ఒకనాడు యువరాజును ఉత్సాహపరచి గొప్ప జలపాతం నుంచి కిందికి దూకించి ప్రాణాపాయాన్ని కలిగించబోతాడు. రాజు రెండవ కొడుకు విజయసింహుడు ఖడ్గవేత్త. ఖడ్గవిద్యలో మహాప్రతిభావంతుడు. భావి సేనాని. అతనికి ఖడ్గవిద్యలో పోటీదారైన నిరంకుశుడు స్పర్థ, ఈసులతో విజయసింహుని మించాలని గంగు అనే గొల్లవాని వద్దనున్న ఖడ్గవిద్య రహస్యాలు గ్రహించే ప్రయత్నం చేస్తాడు. గంగు మ్లేచ్ఛ దేశాలు వెళ్ళి కొన్ని తుచ్ఛము, ప్రమాదభరితము ఐన కాలంజరి మొదలైన మారణవిద్యలు నేర్చినవాడైనా స్వచ్ఛమైన క్షత్రియులకు అవి నేర్పడానికి ఇచ్చగించడు. ఆ నేపథ్యంలో జయద్రథుడు గంగును కలుస్తాడు. గంగుకు మ్లేచ్ఛదేశాల్లోని గురువు తనకూ గురువని, ఆయన గంగును కలిసి కాలంజరి పారంపర్యంగా కొనసాగేలా ఎవరికైనా నేర్పేలా చూడమన్నట్టు చెప్పి అలాగే మాటతీసుకుంటాడు. దాంతో గంగు కాలంజరి విద్యను నిరంకుశునికి ఉపదేశిస్తాడు. జయద్రథుని తల్లి దుస్సల మరోవైపు అంతఃపుర స్త్రీలతో స్నేహం చేస్తూంతుంది. నాగార్జునుని భార్య నీలకు బీజరూపంలో ఉన్న మ్లేచ్ఛ భావాభిమానాన్ని అభివృద్ధి చేసి పూర్తిగా మ్లేచ్ఛ మతానుయాయిగా మారుస్తూంటుంది. ఆ సమయంలో శ్రీముఖుని భార్య కాళింది మహాప్రభావం వల్ల దుస్సల నేర్పిన మ్లేచ్చాభిమానాన్ని వదిలి స్వధర్మానురాక్తురాలు అవుతుంది. ఇలా అన్నీ ప్రయత్నాలూ బెడిసికొట్టినాకా ఆ రాజవంశాన్ని ప్రభావితం చేసేందుకు దుస్సల, జయద్రథులు చేసిన ఆఖరి, గట్టి ప్రయత్నమేమిటి? వారిన్ని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? చివరికి వారి జీవితాలు ఎలా పరిణమిస్తాయి అన్నది మిగిలిన కథ.

పాత్రలు[మార్చు]

శ్రీముఖుడు : రోమపాదుని పెద్ద కొడుకు. యువరాజు. సాహస ప్రవృత్తి కలవాడు. వివేకి.
విజయసింహుడు : రోమపాద మహారాజు రెండవ కొడుకు. భావి సేనాని. ఖడ్గవిద్యలో అనితర సాధ్యమైన ప్రతిభాసంపన్నుడు. ఆవేశపరుడు. ఆగ్రహంలో యుక్తాయుక్తాలు మరిచే లక్షణమున్నవాడు.
నాగార్జునుడు : రోమపాద మహారాజు మూడవ కొడుకు. మ్లేచ్ఛ భావాలకు ఆకర్షితుడై జయద్రథుని చేతిలో కీలుబొమ్మగా మారినవాడు.
జయద్రథుడు : ప్రతినాయకుడు. భారతదేశమంతటినీ మ్లేచ్ఛ భావాలకు ఆలవాలం చేద్దామన్న సంకల్పానికి బద్ధుడు. మహా ప్రతిభావంతుడు.
దుస్సల : ప్రతినాయకి. జయద్రథుని తల్లి. జయద్రథుని ప్రయత్నాలకు ఊతంగా అంతఃపుర స్త్రీలను మ్లేచ్ఛ భావానురాక్తుల్ని చేసే ప్రయత్నం చేస్తూంటుంది.
కాళింది : శ్రీముఖుని భార్య. ఉదాత్తమైన భావాలు, అద్భుతమైన ప్రతిభ, సరళమైన హృదయం గల స్త్రీ.
నీల : నాగార్జునుని భార్య. చిన్నతనంలో పనిమనుషుల ద్వారా మ్లేచ్ఛుల గాథలు విని వారి పట్ల సహానుభూతి, అటుపైన దుస్సల స్నేహంతో అనురక్తి పెంచుకుంటుంది. కాళింది బోధల వల్ల అవన్నీ పటాపంచాలవుతాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. భగవంతుని మీది పగ నవలకు "ఒకమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-09. Retrieved 2014-01-25.
 3. భగవంతుని మీది పగ నవలకు విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఉపోద్ఘాతము
 4. భగవంతుని మీది పగ(2013 ముద్రణ), పేజీ.71
 5. .K.A. Nilakanta Sastri, A History of South India (Madras, 1976).
 6. భగవంతుని మీది పగ నవలకు విశ్వనాథ సత్యనారాయణ రాసిన పీఠిక