ఋతు సంహారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఋతు సంహారము కావ్యాన్ని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు. దీనినే తెలుగు ఋతువులు అన్న మరో పేరుతో వ్యవహరిస్తారు. పలు ఋతువులు తెలుగు నాట కలిగించే ప్రకృతి మార్పులు, ప్రజల జీవితాలలోకి తీసుకువచ్చే సున్నితమైన చేర్పులు వంటివాటిని వర్ణిస్తూ రాగరంజితమైన ఈ కావ్యాన్ని ఆయన రచన చేశారు.

రచన నేపథ్యం[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఈ ఋతు సంహార కావ్యానికి మూలకథావస్తువు, కావ్యరచన విషయంలో కాళిదాసు రచించిన ఋతు సంహారము కావ్యం ప్రభావం ఉంది. ఆ ప్రభావం నేరుగా ఆయన ఎంచుకున్న కావ్యనామంపైనే కనిపిస్తోంది.[1] కానీ విశ్వనాథ సత్యనారాయణ రచనలోని వర్ణనలపై మాత్రము ఆ ప్రభావమేమీలేదు సరికదా ఆయన చిన్నతనంలో చూచిన తెలుగు వాతావరణం వర్ణనలే ఉన్నాయి. ఈ కావ్యాన్ని నిజజీవితంలో విశ్వనాథ సత్యనారాయణ తన చిన్నతనంలో చూసిన పల్లెజీవితంలోని తెలుగు ఋతువులనే వర్ణించానని తెలిపారు[2].

కథావస్తువు[మార్చు]

తెలుగు ఋతువులు కావ్యానికి కథావస్తువు తెలుగు నాట వసంత, గ్రీష్మాది ఋతువులు ఎలా ప్రవర్తిల్లుతాయి, వాటి వల్ల ప్రజాజీవితంలో సూక్ష్మమైన భేదాలు ఎలా వాటిల్లుతాయి, ఆచార వ్యవహారాలు ఎలా వుంటవి మొదలైన విషయాలతో కూడివుంటుంది. ఇది వర్ణన ప్రధానమైన కావ్యము. కేవల ఋతువర్ణనలకే పరిమితం కాకుండా ప్రత్యేకించి తెలుగు నాట ఆయా ఋతువులు ఎలా వుంటాయన్నది రచించడం వల్ల ఈ కావ్యానికొక ప్రత్యేకత ఏర్పడింది. ఇదే పేరుగల తన కావ్యాన్ని కాళిదాస మహాకవి గ్రీష్మ ఋతువుతో ప్రారంభించగా విశ్వనాథ సత్యనారాయణ మాత్రం దీనిని వసంతంతో ప్రారంభం చేశారు. వసంత ఋతువు అందరికీ ప్రీతిపాత్రమైనదనే కాక తెలుగు వారి తొలి పండుగైన సంవత్సరాది వసంతంలోనే ప్రారంభమవడమూ కారణం కావచ్చు. తెలుగు నేల మీద పల్లె ప్రకృతిని సర్వాంగ సుందరంగా అభివర్ణించిన కావ్యంగా దీనిని పలువురు విమర్శకులు పేర్కొన్నారు.[1]

వసంతర్తువు[మార్చు]

వసంతఋతువు వర్ణనను విశ్వనాథ సత్యనారాయణ ప్రియురాలి ఎదచెమర్చడంతో, బాలికల వాలుజడల్లో మల్లెమొగ్గలు కనిపించడం, వేపకొమ్మ చిగురించి కోకిల కుహూరావాలు చేయడం వంటివాటితో ప్రారంభమైనాయని మొదలుపెట్టారు. భార్యాప్రవాసివోలె గొంతెత్తి కూజితాలు చేసే కోకిలనూ, కొబ్బరిమొవ్వు గెలను తొలచి కలాలిలాగ అందులోని కల్లు రుచికి మరిగిన ఉడుతను, ఇతరుల కోసం లోభివానిలాగా ప్రతిపువ్వునూ వెతికి తేనెబొట్లు సేకరించే తుమ్మెదలను వర్ణించారు. మల్లెపూవులను తెలుగు రసికలోకాన్ని మురిపించే కళాపూర్ణోదయం, ఆముక్తమాల్యద, మనుచరిత్ర మొదలైన కావ్యాలుగా వర్ణించడం విశేషం.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 చెన్నప్ప, మసన (సెప్టెంబరు 3, 1995). విశ్వనాథ సాహితీ సమాలోచనం (తెలుగు ఋతువులు) (ప్రథమ ముద్రణ ed.). హైదరాబాద్: యువభారతి. Check date values in: |date= (help)
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1/Date_validation at line 148: attempt to index field 'quarter' (a nil value).