కావ్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కావ్యరకాలు[మార్చు]

కావ్యాలలో రెండు రకాలు: అవి శ్రావ్య కావ్యాలు, దృశ్య కావ్యాలు.

దృశ్య కావ్యాలు.[మార్చు]

నాటకాలు మనకు తెలిసిన దృశ్య కావ్యాలు. ఇవి ప్రేక్షకులను ఎక్కువగా రంజింపజేస్తాయి. రంగస్థలం మీద నాటకం ప్రదర్శింపబడుతున్నప్పుడు ప్రేక్షకులు సంపూర్ణమైన రసాస్వాదన చేస్తారు.

శ్రావ్య కావ్యాలు[మార్చు]

శ్రావ్య కావ్యాలలో వాటిని చదువుకొని, అర్థం చేసుకొని, ఊహించి, భావించి దానిని దర్శించడానికి కష్టపడవలసి వస్తుంది. అయితే శ్రావ్య కావ్యంలో నాటకీయ లక్షణాన్ని ప్రవేశపెడితే నాటకంలోని సౌలభ్యాన్ని కొంతవరకు సాధించవచ్చును. ఈ శ్రవ్య దృశ్య కావ్యాలకే అనభినేయ, అభినేయ కావ్యాలని అంటారు. ఈ పేర్లు మనలను దాదాపు నాట్యం దగ్గరకు లాక్కుపోతున్నవి.

ధ్వని కావ్యము[మార్చు]

శబ్దార్ధాలు అప్రధానలు కావాలి. వ్యంగ్యార్ధము సర్వాతిశయితంగా ఉండాలి.కవి వ్యంగ్య ప్రధానమతి అయినప్పుడే కావ్యానికి ఈ సరసనామ సిద్ధి కలుగుతుంది. ఏమాత్రమైనా వ్యగ్యార్ధ తత్పరతత్వ విషయంలో మైమరచి శబ్దవ్యాసమ్మీదగాని, అర్ధనిబంధనమ్మీదగాని తన బుద్ధిని ప్రసరించాడో అప్పటి కావ్యము ధ్వని కావ్యము కాబోదు.

గుణీభూత కావ్యము[మార్చు]

ఇందులో వ్యంగ్యార్ధానికి సర్వప్రాధాన్యం ఉండదు. వాచ్యార్ధముకూడా తన ప్రాధాన్యాన్ని పోగొట్టుకోదు. ఒక్కొక్కప్పుడు వ్యంగ్యమును కూడా వాచ్యము అసుందరముగా చేస్తుంది. తనకు అంగము చేసుకుంటుంది. వ్యగ్యార్ధము వివక్షితము కావొచ్చు కాని ప్రధానము కాకపోవటం మూలాన దానిని గుణీభూత కావ్య మందురు.

చిత్ర కావ్యము[మార్చు]

గోడమీద బొమ్మలను మనము చిత్రమంటాము. ఈకావ్యము కూడా అటువంటిదే. ప్రాణం లేకపోయినా ప్రాణము ఉన్నదాని మాదిరిగా కనబడడం మూలాన ఆశ్చర్యం కలుగుతుంది. చిత్ర కావ్యం కూడా అంతే. కావ్యానికి వ్యగ్యము జీవితము. చిత్రంలో జీవితం ఉండదు. చిత్ర కావ్యంలో వ్యగ్యము ఉండదు. అసలుండదని కాదు; వివక్షితంగా ఉండదు. ఇందులో వ్యగ్యార్ధాన్ని నిబంధిచాలి అని కవి అనుకోడు. అతడనుకోకుండానే ఏదో నిస్సారవ్యంగ్యము వస్తే రావచ్చు. శబ్దము, అర్ధము ఉందులో ప్రధానము. శబ్దాడంబరమును కవి ఇందులో బాగా చూపిస్తాడు. అర్ధాలలోని చిత్ర విచిత్ర గతులను చూపి నగిషీ చెక్కుతాడు కవి. కాబట్టి శబ్ద చిత్రం ఒక రకంగాను, అర్ధ చిత్రం ఒక రకంగానూ ఉంటుంది. విదగ్ధ ముఖమండనము, కవ్వెంద్ర కంఠాభరణము తవీటిలో చూడదగిన కావ్యాలు.

పద్య కావ్యము[మార్చు]

ఇందులో అన్నీ పద్యాలే. గద్య ముండదు. 'ఇతిశ్రీ' అని చెప్పేచోతు తప్ప. ఈ కావ్యాన్ని సర్గలుగా విభాగిస్తారు. కావ్యము కన్య కాబట్టి ఆపిల్లకు కొందరు ఆశ్వాసభాగం చేస్తారు. సర్గలుకాని, ఆశ్వాసాలు కాని ఎన్నిఅయినా ఉండవచ్చును. ఒక్కొక్క విభాగంలో ఎన్నయినా పద్యాలు ఉండవచ్చును. ఆకవీశ్వరులవారు ఎంతగుక్కపెడితే అంత. ఆయాసం వచ్చినప్పుడు ఆశ్వాసం తగ్గటం కూడా ఉంటుంది.

గద్య కావ్యము[మార్చు]

ఇందులో పద్యాలుండద్వు. అంతా గద్య మాత్రమే. అక్కడక్కడ ఏదైనా చిన్న పద్యము కావ్యం నంజుకోవడానికి ఉన్నట్లుంటే ఉండవచ్చును. అంతమాత్రాన గద్యకావ్యానికి హాని లేదు. ఉందులో కావ్యకామిని అప్పుడప్పుదు అక్కడక్కడ ఉచ్చ్వాసాలు విడుస్తూ ఉంటుంది. ఆశ్వాసం ఉంటే ఉండవచ్చును. ఇవేవీ లేకుండా ఒకటే పద్ధతిలో కూడా తీగసాగ వచ్చును.

చంపూ కావ్యము[మార్చు]

ఇందులో గద్యమూ, పద్యమూ ఉంటుంది; మనము దీనిని ప్రబంధం అనవచ్చును. ఇందులో విభాగాలు యధేష్టంగా ఉంటవి. కాండవిభాగం, గుచ్చవిభాగం, స్తబకం, ఆశ్వాసం ఇంకా ఓచిత్యానుసారంగా ఏవైనాసరే!

సిద్ధహేమచంద్రుడు తన కావ్యానుశాసనమ్ లో వేరొక విధంగా కావ్య భేధ పరిగణం చేస్తున్నాడు. ప్రేక్ష్యమనీ, శ్రవ్యమనీ. ప్రేక్ష్య కావ్యం కూడా పాఠ్యమనీ, గేయమనీ రెండు విధాలున్నవి.

పాఠ్యము[మార్చు]

ఇందు నాటక ప్రకరణాది రూపక ప్రభేదాలు అంతర్భావము పొందుచున్నవి. ప్రధాన రూపకాల పరస్పర సాంకర్యమువలన సిద్ధములైన అవాంతర ప్రభేదాలుకూడా పాఠ్యముగానే ప్రైగణింపబడుచున్నవి. పాఠ్యకోటిలో చేరదగినవానిని హేమచంద్రుడు కొన్నిటిని చెప్పిచెప్పి 'ఆది' పదమును ప్రయోగించాడు. 'ఆదిశబ్దాత్ కోలాహలాది లక్షితాస్తోటకాదయో గ్రాహ్యాః'.పాఠ్యములో అంగగీతములు ప్రతిష్ఠితములై ఉండవు. గేయములో ఈరెండూ సుప్రతిష్ఠితములు కావటానికి అవకాశం ఉంది. పాఠ్యములో రసానుగుణత్వమనే అడ్డంకి ఉండటంవలన అంగ గీతములు విపర్యాసనమును పొందవలసివస్తున్నది. వర్ణాంగములు, వాద్యములు, గేయపదాలు, నృత్యము, అన్నీకూడా గేయపదాలలో ఉండవచ్చును. కొన్ని రాగకావ్యాలను మొత్తానికి మొత్తం గానమ్ంచేయవచ్చును. ధ్రువాగీతాఅలకు సరిగా పాఠ్యాలలో అవకాశం ఉండనే ఉండదు. గీతముతో ప్రధానంగా రంజనమును సంపాదించుట, తదుపయుక్తమైన అంగవ్యాపారమును ప్రదర్సించుట, నృత్యముతో చిత్తగ్రహణమును చేస్తూ నృత్యమునే ప్రధానంగా చేస్తూ గీతమును అప్రధానముగా చేయుట, ప్రధాన రసాఅనుసారంగా, లయతాళానుగుణంగా సాత్వికాద్యభినయాన్ని సంపాదించే విధానాలు మొదలైనవన్నీ గేయములోనే ఉంటవికాని పాఠ్యములో ఉండవు. పాఠ్యములో వ్యుత్పత్యనుసంధానము ఉంటుంది. భరతాదులందరూ దీనిని నిబంధనముగా చేసుకొని ప్రవృత్తిని ప్రసరింపజేసారు.

గేయము[మార్చు]

పదార్ధములను అభినయించే స్వభావము గేయములలో ఉంటుంది. గేయకావ్యాలలో ప్రయోగము సామాన్యంగా మూడు విధానాలు-మసృణము, ఉద్ధతము, మిశ్రమము అని. ఉపరూపకములనబడేవి గేయములో చేర్చబడినవి.

మహా కావ్యము[మార్చు]

ఇది శ్రవ్యకావ్యాలలో ఒకటి. నాటకాదులలో మాదిరిగా ముఖాది సంధులు మాహాకావ్యంలో కూడా ఉండాలి. అప్పుడే కథాగమినిక బాగుంటుంది. ఇందులో అవాతర విభాగాలను అనేక విధాల చేయుట జరిగినది- సర్గ, సంధి, ఆశ్వాసము, అవస్కంధక, బంధము అని. ప్రతి బంధాంతములో భిన్న వృత్తము ఉండటము మామూలు. అష్టాదశవర్ణనలు మహాకావ్యంలో ఉండలనుట సామాన్యలక్షణము. వాటిలో కొన్ని తగ్గినా మహాకావ్యత్వానికి లోటు రాదు. కావ్యాలను వేరొక విధంగా కూడా విభజింపవచ్చును.

ఆఖ్యాయిక[మార్చు]

నాయకుడు తన వృత్తమును ప్రతిపాదించుకోవాలి. వక్త్రము, అపరవక్త్రము అనే ఆర్యా వృత్తాలు ఇందులో ఉంటవి. ఆవృత్తాలు భావ్యర్ధాన్ని సూచించేవిగా ఉండాలి. అవాంతర ప్రకరణాల పరిసమాప్తి వచ్చినప్పుడు ఉచ్చ్వాస నిబంధనము చేయాలి. గద్యమయంగా ఉండాలి. అక్కడక్కడా పద్యలున్నా దోషంలేదు.

కథ[మార్చు]

ఇది గద్యమయము. అంతా పద్యమయంగా కూడా ఉండవచ్చును. గద్యమయమైన కథకు కాదంబరి ఉదాహరణ. పద్యమయమునకు లీలావతి ఉదాహరణ. ఇందులో నాయకుడు ధీరకాంతుడు. ఇతని కథను కవిగాని, ఇతరులుగాని చెప్పాలి.కదలలో అవాంతరభేదాలు చాలా ఉన్నట్లు ఊహించాలి.

ఆఖ్యానము[మార్చు]

ప్రబంధము మద్యములో ఇతరుల ప్రబోధం కొరకు కొన్ని ఉపాఖ్యానాలు చెప్పబడుతూ ఉంటవి. నలాదుల ఉపాఖ్యానాలు అటువంటివే. ఈచెప్పబడే ఉపాఖ్యానమును ఒక గ్రధికుడు అభినయించుతూ, పఠించుతూ, గానం చేస్తూ చెప్పుటము ఆఖ్యానమనబడుతున్నది.

నిదర్శనము[మార్చు]

చేతనాచేతనముల చేష్టలను అనుసరించి కార్యము అకార్యములు నిశ్చయింపబడాలి. కర్తవ్యా కర్తవ్య ప్రబోధమునే ప్రధానంగా చేసుకొని నిదర్శన నిబంధకుడు నిదర్శనరూపంగా తిర్యగతిర్యక్కుల చేష్టలను నిబంధించుతాడే గాని వాని చేష్టలలో అభినివేశమును ఉంచడన్నమాట. పంచతంత్రం ఇటువంటిదే.

ప్రవహ్లిక[మార్చు]

ఒక మహా సభానిబంధనము- అందులో ఇద్దరి వివాదము. ఆపోట్లాట కూడా ప్రధానాంశమును సంబంధించి ఉండాలి. నిరూపింపబడే భాషకంటే ఇతరభాషాసంబంధం కూడా ఉండాలి. అప్పటి సంకీర్ణత్వములో ఒకరి భాష ఒకరికి తెలియకుండా ఉంటుంది. కాబట్టి వివాదం బాగా ముదురుతుంది.

మతల్లిక[మార్చు]

దీనినే మంధల్లి లేదా మంధల్లికా అనికూడా వ్యవహరింపబడుతున్నది. సంకీర్ణ నీచ భాషానిబంధనము, క్షుద్రమైన పూజ. పురోహితామాత్య తాపసాదులు ప్రారంభించిన కార్యమును నిర్వహించలేకపోవటము ఇందులో ముఖ్యలక్షణములు.

మణికుల్య[మార్చు]

రచన బిగువుగానే ఉంటుంది. కాని మొదట్లో వస్తువేమీ గోచరంకాదు. కథ ఎక్కడనుండి ప్రారంభింప బడిందో, ఎక్కడికి పాఠకుణ్ణి తీసుకుపోతున్నదో ఏమీతెలీదు. అంతా మొదట్లో అయోమయంగా ఉంటుంది. తరువాత తరువాత కథ బయటపడుతుంది. మణికుల్య (కాలన)లో జలం కనబడదుగా. పరిణామంలో స్వభావం తెలుస్తుంది. కథలో బిగువున్నదని మనం నేడు తలచే నవలలు మణికుల్యలే అనవచ్చును.

పర్యాయబంధము[మార్చు]

వసంత వర్ణనము మొదలైనవి ఉండాలి. అవాంతరంగా అనేకక్రియల సంబంధం ఉన్నా ఏకవర్ణనోద్ధేశము ఉండాలి. ఏయే ఋతువులు వర్ణన ఉన్నా ముఖ్యాంశ సంబంధము మాత్రం వీడిపోరాదు. వర్ణిత విషయము ప్రధానాంశము నందించాలి.

పరికథ[మార్చు]

ధర్మాది పురుషార్ధాలు ఉద్దేశింపబడాలి. ఉపసాధనలో విచిత్రత ఉండవచ్చును. నానావృత్తాంత వర్ణనములు ప్రధానత్వం పొందాలి. అంతగా రసబంధాభినివేశము అక్కరలేదు. ఇతివృత్తవ్యాహరణమే ముఖ్యం. అందుకునే దీర్ఘ సమాసం కూడా ఉండవచ్చును.

ఖండకథ[మార్చు]

గ్రంథాంతరములో ప్రసిద్ధమైన ఇతివృత్తాన్ని తీసుకొని వర్ణించాలి. ఆకథను మధ్యలోనుండిగాని, ఉపాంతమందుండిగాని గ్రహింపవచ్చును. ఖండాత్మకంగా గ్రహించిన వర్ణనాచాతుర్యంతో పూర్ణమగా చెయ్యాలి.

సకలకథ[మార్చు]

సర్వఫలాల స్వభావసుందరత్వము కలిగిన ఇతి వృతమును వర్ణించాలి. ఖండకథా సకలకథలు సమాన్యంగా సంస్కృత భాషాత్మకంగా ఉండవని అంటారు.

ఉపకథ[మార్చు]

ఏదో ఇతరకథ నాశ్రయించినా చమత్కారాతిశయానుసారంగా ప్రసిద్ధమైన వేరొక కథా నిబంధనము చెయ్యాలి. రెండు కథలనూ అంగాంగిభావం కుదురుతుంది. రెండూ సమన్వయం పొందాలి.

బృహత్కథ[మార్చు]

అద్భుతాద్భుత కథల నిబంధనం ఉండాలి. యేకథను ప్రధానం చేసుకొనిన అనేకకథల కూర్పు శోభించాలి. అవాంతర కథలు కూడా పరిపూర్ణత్వము కలవి కావాలి.

ఉదాహరణము[మార్చు]

గద్యపద్య సమన్వితం కావాలి. కలిక, ఉత్కలిక అనేపేర్లు కల గద్యలుంటవి. మొదట 'జయతి' అని ఉపక్రమం ఉంటుంది. మాలిన్యాది రమ్య పద్య నిబంధనము ఉండాలి. అనంతరము 'ఇతి' అని ఉపక్రమించి ఎనిమిది వాక్యాలు ఉంచాలి. వీటిలో ప్రాసల ఉండాలి. తాళానుగుణ్యం తప్పదు. ఎనిమిది విభక్తులుతో కూడుకున్న అష్టవాక్యాలకు నిబంధనం ఉండాలి. వీటిలో వర్ణింపబడే నాయకుని నామాంకనము అవసరము. సర్వ విభక్తులతో ఒక పద్యముండాలి.

చక్రవాళకము[మార్చు]

పద్యాలుంటవి. సంబోభన విభక్తి ప్రాచుర్యంగా ఉంటుంది. కళిక లనబడే గద్యలుండవచ్చును. విముక్త పునరాకృష్ట శబ్దవిన్యాసశోభను ప్రదర్సించాలి. ఆద్యంతపదాలు శృంఖలితములు కావ్యాలన్నమాట. రచన ఓజస్విగా ఉండాలి. మొదటా, చివరా ఆశీర్వాదాలు.

భోగావళి[మార్చు]

మొదటా, చివరా పద్యాలు;మధ్యలో గద్యాలు. భాష భిన్న భిన్నముగా ఉండాలి. గద్యలో నాలుగు వాక్యాలనుగాని, ఎనిమిది వాక్యలనుగాని గుంపులు గుంపులుగా విభాగింపాలి. ఇదే స్కంధవిభాగము. ప్రతీ స్కంధమునకును విషయము వేరు వేరుగాఉండాలి. "దేవా -నృపా" అని మధ్యమధ్యలో సంబోధనలు. ఈకాలములో ఇవ్వబడే స్వాగత పత్రాలకు ఈపేరు బాగా ఉంటుంది.

బిరుదావళి[మార్చు]

సామాన్యముగా ఇది భోగావళి మాదిరే. నాయకుని పరాక్రమం, కులక్రమాగత బిరుదులు వర్ణింపబడాలి. వాక్యాల ఆడంబరము అవసరము. ఇంకా తారావళి, చతురుత్తరము, చతుర్భద్రము, కరంభకము, విశ్వావళి, రత్నావళి పంచాననావళి, అకారాది హకారాంతాక్షరఘటన గల వ్రజ్యాసంపుటితో ఉండే సంఘాతము, నానాకవికర్తృక పద్యాలను ఒకచోట చేర్చటమే స్వరూపంగా ఉన్న సుభాషిత రత్నాగారమువంటి సంఘాతము మొదలైన కావ్య భేదాలు ఇంకా చాలా ఉన్నట్లు అగ్నిపురాణం వల్ల తెలుస్తుంది.

కావ్య గుణములు[మార్చు]

గుణమను శబ్దము నానర్ధ సంకలితము.అన్నంభట్టు విరచితమైన తర్కసంగ్రహముద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయభావాః అని మొదటి సూత్రము.పై వాక్యమునుబట్టి వైయాకుల మతమును పదార్ధములు సప్త విధములు. ఇందు రూప రస గంధ స్పర్స సంఖ్యా పరిమాణ పృధక్త్వ సంయోగ విభాగ పరత్వా పరత్వ గురుత్వ ధ్రువత్వ స్నేహ శబ్దబుద్ధి సుఖ దుఃఖఇఛ్చాద్వేష ప్రయత్న ధర్మాధర్మ సంస్కారాః చతుర్వింశతిః గుణాః అని గుణములు 24 గుగా పేర్కొనబడినవి.

ఇట్లు గుణశబ్దము వస్తుసూత్రధర్మముగాను మనుష్య ధర్మములను శార్యాదులపరముగాను వాడబడి క్రమముగా కావ్యధర్మవాచకముగాగూడ నైనది.

అలంకారశాస్త్ర పితామహుడగు భరతమునీంద్రుడు నాట్య శాస్త్రం లోని కావ్యాంగములలో పేర్కొనబడిన గుణములే గుణవిచారావిర్భావమునకు మూలమని పలువిరి అభిప్రాయము, కాగా నాట్యశాస్త్రమునకు పూర్వమే కావ్య గుణప్రసక్తి కలదని కొందరి అభిప్రాయము.దీనికి వీరు చూపిన ప్రమాణము శకరాజగు రుద్రదమనుడు శాసనము.2 కాలము క్రీ.పూ.150 నందు

స్ఫుట లఘు మధుర చిత్రకాంత శబ్దసమయ
 ఉదార అల్ంకృతి గద్య పద్య కావ్య విధాన ప్ర
 వీణేన ప్రమాణ మానోన్మాద స్వర గతి వర్ణ సార
 సత్వాది భిః పరమ లక్షణ వ్యంజనై రుపేతి కాం
 తమూర్తినా స్వయ మధిక మహాక్షత్రప నామ్నా

ఇది రుద్రదమనుని వర్ణనము.ఇందు పేర్కొనబడిన మధుర (మాధుర్యము), కాంతము (కాంతియును), ఉదారము (ఔదార్యము) అను కావ్య గుణములుగా పలువరు అభిప్రాయపడిరి.రుద్రదమనుని నాటికి అనగా క్రీ.పూ.150 నాట్యశాస్త్రము (క్రీ.పూ.300) పూర్వము అలంకారశాస్త్రము అభివృద్ధిచెందియుండివచ్చును.

కావ్యమును స్త్రీస్వరూపముగా అలంకారికులు సమంవయించుటజేసి తదాశ్రయములైన శౌర్య ఉదార్యముల వంటివి కావ్యగుణములుగా స్వీకరించడబడమైనది.

కావ్యగుణములయొక్క సంఖ్య గూర్చి అగ్ని పురాణములో పేర్కొనబడినది కాని సంఖ్యావివరములు తెలియలేదు. నాట్యశాస్త్రము-16వ.ప్ర.95 వ శ్లోకములో గుణములు దశవిధములుగా చెప్పబడింది.అప్పటికి కావ్య నాట్యములకు విభాగములు ఏర్పడి యుండలేదనవచ్చునేమో!

శ్లేషః ప్రసాదః సంతా సమాధిః
 మాధుర్య మోజః పదసౌకుమార్యం
 అర్ధస్యచ వ్యక్తి రుదార తాచ
 కాంతిశ్చ కావ్యస్య గుణా దశైతే

బామహుడు కావ్యాలంకారము శ్రవ్యకావ్యములగూర్చి వ్రాస్తూ మాధుర్-ఔజః-ప్రసాదములను 3 గుణములనే పేర్కొనినాడు.తరువాతివారగు మమ్మట హేమచంద్రాదులును కావ్యగుణములను 3 గానే అంగీకరించిరి.

దండి గుణములకు గలస్థానమును పైవారివలెనే స్పష్టముగ తెలుపక పోయినను వానికి ప్రాధాన్యమిచ్చి భరతాదులు పేర్కొనిన 10 పేళ్ళనే వివరించెను.అవి క్రమముగా శ్లేష, ప్రసాదము, సమత, మాధుర్యము, సౌకుమార్యము, అర్ధవ్యక్తి, ఉజారత, ఔజస్సు, కాంతి, సమాధి. ఇప్పటున దండాచార్యుడును శాబ్దార్ధ గుణ విభాగము తెల్పియుండలేదు.

కావ్యశరీర సౌందర్యమునకేగాక ఆత్మ తత్వ పరిశీలనాదక్షుడై వామనాచార్యుడు గుణాలంకార సంస్కృతములైన శబ్దార్ధలకే కావ్యశబ్దము వర్తించునని చెప్పుచు తన పూర్వుల కన్న వివేకముగా ప్రదర్సించెను.

ఆనందవర్ధనాచార్యుడు శృంగారః రసాంతరాపేక్షతయా మధురో రసః తన్మయం కావ్య మాశ్రత్య మాధుర్యలక్షణో గుణః ప్రతితిష్ఠతి విప్రలంభశృంగారే కరుణే మాధుర్యం ప్రకర్షవత్ అని మాధుర్యము శృంగారముయొక్క ముఖ్య గుణమనియు, విప్రలంభశృంగారమునందును కరుణము నందును తద్విజృంభణ అభికమనియు చెప్పుచు గుణత్రయమును సూచించాడు.

మమ్మటుడును ఆనందవర్ధనాచార్యుడువలె గుణత్రయమును మాధుర్యౌజఃప్రసాదములు అంగీకరించి దండి వామనాదులు చెప్పిన గుణములను పేర్కొనినాడు.

పండితరాజు ప్రాచీనులు చెప్పిన 10 గుణములను వివరించుచు మతమున మాత్రము గుణములు మూడే అని చెప్పినాడు.

పైవిమర్సనములవలన సారాంశమేమనగా కావ్యమునందు గుణప్రాధాన్య విషయ మెట్లున్నను గుణముల సంఖ్యావిరూపణమునందే భిన్నాభిప్రాయములు కనబడుచున్నవి.గుణముల సంఖ్య 10యును వారు కొందరు, 24అని కొందరు, 3యని కొందరి పేర్కొనరి.

అప్పకవి తప్ప తెలుగు ప్రాచీనాలంకారికులందరు గుణములను దశవిధములగనే వివరించిరి. అప్పకవియు తన గ్రంథమున ప్రసక్తముగా కావ్యగుణములను వర్ణించాడు. అర్ధవ్యక్తి సౌకుమార్యజః ప్రసాదకాంతి మధురతౌదార్యసమాధి సామ్యశేషములు పదియుని తెల్పుచు నేయే దోషమున కేయేగుణము పరిహారకారమో చెప్పుచు మరికొన్ని 2 గుణములను పేర్కొనినాడు.

కావ్య నిర్వచనాలు[మార్చు]

కవి శబ్దం మొదటగా వేదాల్లో పరమాత్మ పరంగా వాడారు. కవి ఋషి, ద్రష్ట, సృష్ట, అందువల్లనే "నానృషి కురుతే కావ్యం" అన్నారు. కవి క్రాంత దర్శికావ్యానికి పరమ ప్రయోజనం ఆనందం. ఆనందంతో పాటు ఉపదేశం ఉండాలి. అందువల్లనే విశ్వశ్రేయస్సే కావ్యం అన్నారు.

ప్రాచీన సంస్కృత కవుల నిర్వచనాలు[మార్చు]

సంస్కృత అలంకారికులు కావ్యాన్ని నిర్వచించారు 1. భరతుడు - నాట్య శాస్త్రం - ఇతివృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితం, అనగా ఇతివృత్తము కావ్యమునకు శరీరమని చెప్పవచ్చును

2. దండి - కావ్యాదర్శం - ఇష్టార్థ వ్యవచ్చిన్న పదావళీ కావ్యం అనగా మనోహరమగు అర్థముతో అలంకృతమైన పదసముదాయము కావ్యము

3. భామహుడు -భామహాలంకారం - శబ్దార్థౌ సహితౌ కావ్యం - అనగా శబ్దార్థములుతో కూడినది కావ్యము. భామహుడి ఇంకో నిర్వచనం -కావ్యంతు జాయతే జాతకస్య చిత్ప్రతిభావతః అనగా ప్రతిభావంతుడగు ఒకానొకకవికి మాత్రమే కావ్యనిర్మాణము సాధ్యమగును

4. రుద్రటుడు - రుద్రటాలంకారం - శబ్ధార్థౌ కావ్యం

5. మమ్మటుడు - కావ్య ప్రకాశం - తదదోషౌ శబ్ధార్థౌ సగుణావనలంకృతీ పునః క్వాపి. అనగా దోషరహితములును, గుణసహితములును,సాలంకారములును అగు శబ్దార్థములు కావ్యము.ఎచతనైనా అలంకారములు ఉండకపోవచ్చును.

6. విశ్వనాథుడు - సాహిత్య దర్పణం - వాక్యం రసాత్మకం కావ్యం.అనగా రసాత్మకమైన వాక్యము కావ్యము

7. జగన్నాథ పండిత రాయలు - రస గంగాధరం - రమణీయార్థ ప్రతిపాదక శబ్ధః కావ్యం.అనగా రమణీయమైన అర్థమును ప్రతిపాదించు శబ్దము కావ్యము

8. విద్యాధరుడు-కవయతీతి కవిః. అనగా వర్ణించువాడు కవి

9. అభినవగుప్తుడు-కవనీయం కావ్యం. అనగా వర్ణింపదగినది కావ్యం

10. ఆనందవర్థనుడు -అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః. అనగా అంతులేని కావ్యప్రపంచమునకు కవియే బ్రహ్మ

11. భర్తృహరి-సుకవితా యద్యస్తి రాజ్యేన కిం. అనగా మంచి కవిత్వం ఉన్నచో సామరాజ్యమెందుకు?

పాశ్చాత్య కవుల నిర్వచనాలు[మార్చు]

అయితే పాశ్చాత్యులు కావ్యాన్ని కాకుండా కవిత్వాన్ని నిర్వచించారు.

1. అరిస్టాటిల్ : కవిత్వమంటే అనుకరణమే, అనుకరణమంటే సృజన వ్యాపారమే కానీ కేవలానుకరణం కాదు.

2. శామ్యుల్ జాన్సన్ : Poetry is metrical composition. It is the art of uniting pleasure with truth by calling forth imagination to the help of reason. కవిత్వమంటే అంటే చందో బద్ద రచన. అది బుద్ధియు, భావనం సాధనాలుగా ఆనంద సత్యాల ఐక్యాన్ని సంఘటించే కళ.

3. జే. ఎస్. మిల్ : What is poetry but the thought and words in which emotion spontaneously embodies itself. కవిత్వం అంటే భావావేశం. తనంత తాను దాల్చెడి సహజ శబ్ధార్థ స్వరూపం

4. వర్డ్స్ వర్త్ : For all good poetry is the spontaneous overflow of powerful feelings. Poetry is the emotion recollected in tranquility. ఉత్తమ కవిత్వం ఎల్లప్పుడు పొంగి పొరలి వచ్చే శక్తిమంతాలైన అనుభూతులతో నిండి ఉంటుంది.

5. షెల్లీ : Poetry in a general sense may be defined as the expression of the imagination. భావనా వ్యక్తీకరణమే కవిత్వము

6. హేజ్ లిట్ : Poetry is the language of imagination and emotion. భావావేశ భావనల శబ్ధ స్వరూపమే కవిత్వం 7. కార్లైల్ : Poetry we will call musical thought. కవిత్వం లాయాత్మకమైన భావన

8. కోలరిడ్జ్ : Best words in their best order is the poetry. ఉత్తమమైన శబ్ధాలు, ఉత్తమమైన రీతిలో అమరివుండడమే కవిత్వం

9. మాత్యూ ఆర్నాల్డ్ : Poetry is the criticism of life. జీవిత విమర్శనమే కవిత్వం

10. ఏడ్గార్ ఏలంపో : Poetry is the rhythmic creation of beauty. కవిత్వం అంటే సౌందర్యాన్ని లయాత్మకంగా సృష్టించడం.

తెలుగు కవుల నిర్వచనాలు[మార్చు]

తెలుగు కవులు కావ్యాన్ని దాని ప్రయోజనాన్ని గురించి నిర్వచించారు. కావ్యం ఎట్లా ఉండాలో తెలుగు కవులు నిర్వచించారు. 1.నన్నయ- కవిత్వ లక్షణాలుగా ప్రసన్న కథా కలిథార్థ యుక్తిని, అక్షర రమ్యతను, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వాన్ని సూచించారు 2.తిక్కన -రసాభ్యుచిత బంధాన్ని కావ్య లక్షణాలుగా చెప్పారు. ప్రభంధ కవులు వర్ణనలకే ప్రాధ్యాన్యమిచ్చారు.

  • ఆధునిక కవులలో కవిత్వాన్ని నిర్వచించిన వారిలో ప్రముఖులు శ్రీశ్రీ. కవిత్వమంటే కదిలించేది పెనునిద్దుర వదిలించేది అన్నారు. ఇది కవిత్వానికి సంబంధించిన ప్రయోజనాన్ని తెలుపుతుంది. సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం కవిత్వ లక్షణాలుగా ఆధునికులు వివరిచారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలములు[మార్చు]

  • 1957 భారతి మాస పత్రిక వ్యాసము కావ్యగుణములు- రచయిత రాజేశ్వరి
"https://te.wikipedia.org/w/index.php?title=కావ్యము&oldid=4004325" నుండి వెలికితీశారు