వేనరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేనరాజు
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
సంపాదకులు: విశ్వనాథ పావని శాస్త్రి
అంకితం: బెల్లంకొండ కనకాంబా రాఘవరాయ దంపతులకు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకము
ప్రచురణ: శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్
విడుదల: 1935 2006

వేనరాజు జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన నాటకం. ఈ నాటిక గొప్ప సంచలనానికి, వివాదాలకూ కేంద్రబిందువైంది.

రచన నేపథ్యం

[మార్చు]

వేనరాజు నాటకాన్ని 1930 దశకంలో రచించి ప్రదర్శనలు జరిపారు. ఈ నాటకం వివాదాలకు మూలభూతమై త్రిపురనేని రామస్వామి ఖూనీ నాటక రచనను ప్రేరేపించింది. 2006లో గ్రంథకర్త కుమారుడు విశ్వనాథ పావని శాస్త్రి సంపాదకత్వంలో పునర్ముద్రణ పొందింది. బెల్లంకొండ కనకాంబా రాఘవరాయ దంపతులకు వేనరాజు నాటకాన్ని విశ్వనాథ సత్యనారాయణ అంకితం చేశారు.[1]

ఇతివృత్తం

[మార్చు]

వేనరాజు నాటకానికి వేదాల్లో, భాగవతంలో ప్రస్తావనకు వచ్చే నాస్తికుడైన వేనుడు, అతని ప్రత్యర్థి ఆస్తికుడు ఐన గౌతముల కథను ఇతివృత్తంగా స్వీకరించారు. వేనుడు క్షత్రియుడు, రాజు, నాస్తికుడు. నాటకంలో విశ్వనాథ సత్యనారాయణ వేనరాజు పాత్రను కౄరుడైన పాలకునిగా, వేదధర్మంపై అక్కసుతో దారుణ కృత్యాలు చేసే వ్యక్తిగా చిత్రీకరించారు. గౌతమ మహర్షితో వేనుడికి వైరం ప్రబలి తుదకు వేనుణ్ణి గౌతముడు తపశ్శక్తితో సంహరించడం ప్రధాన ఇతివృత్తంగా పేర్కొనవచ్చు.[2]

పాత్రలు

[మార్చు]

వేనరాజు నాటకంలోని ముఖ్యపాత్రలు ఇవి:[3]

 • వేనుడు - రాజు
 • గౌతముడు - వేనుడి చెలికాడు
 • అంగరాజు - వేనుడి తండ్రి
 • పృథువు - వేనుడికి మొదట చెల్లెలు, పిదప తమ్ముడు
 • కౌషీతకుడు - సేవకుడు
 • దౌషీతకుడు - సేవకుడు
 • వినీతభట్టు - వంది
 • శ్రీధరభట్టు - కుర్ర వంది
 • కాలభట్టు - ఒక ముసలి బ్రాహ్మణుడు
 • భూదేవి - వసుంధర
 • వినీతభట్టు ముసలి భార్య
 • వినీతభట్టు కుమార్తె

వివాదాలు

[మార్చు]

వేనరాజు నాటకానికి ప్రతిగా ప్రముఖ హేతువాది త్రిపురనేని రామస్వామి ఖూనీ నాటకాన్ని రచించారు. విశ్వనాథ వారు మద్రాసులో వేనరాజు నాటికను ప్రదర్శించారు అప్పట్లో ఆ నాటిక పైన చాలా రభస జరిగింది దానితో విశ్వనాథ వారు చాలా కలత చెందారు. గూడవల్లి రామబ్రహ్మం గురించిన ప్రస్తావనలో ఈ ప్రదర్శనవల్ల విశ్వనాథ సత్యనారాయణ ఎంతగా బాధ పడ్డారంటే వారి బాధని చూసిన చాలా మంది అయన ఆ వ్యాకులతతోనే సముద్రంలోకి దూకి చచ్చిపోతారని అనుకున్నారని ప్రస్తావించారు.. ఈ గొడవ జరిగిన మూడో రోజున మానసిక సాంత్వన కోసం విశ్వనాథ వారు రామబ్రహ్మం గారిని కలవటానికి వెళ్లారు.[4]

ఖూనీ, వేనరాజుల నడుమ భేదాలు

[మార్చు]
 • వేనరాజులో వేనుడు వైదిక ధర్మాన్ని కాలరాచి, మొత్తం సమాజాన్ని అతలాకుతలం చేసే దుర్మార్గుడు. ఖూనీలో వేనుడు నాస్తికుడు, ప్రజలను మూఢుల్ని చేసే మతవిశ్వాసాలను, యజ్ఞాల్లోని జీవహింసనూ వ్యతిరేకించే వ్యక్తి.
 • వేనరాజులో గౌతముడు సనాతన ధర్మానికి ప్రతినిధియైన మహర్షి, సహృదయుడు, వేనుడి దారుణ కృత్యాలను నిరసించే వ్యక్తి. ఖూనీలో గౌతముడు ప్రాబల్యం నిలుపుకునేందుకు వేనుడి కొడుకుని, సైన్యాధిపతినీ రెచ్చగొట్టి చంపించే దుర్మార్గుడు.
 • విశ్వనాథ వారి వేనరాజులో పృథువు వేనుడికి మొదట చెల్లెలుగా ఉండి తమ్ముడిగా మారుతాడు. ఖూనీలో పృథువు వేనుడి కొడుకు.
 • ఖూనీ వలె కాక వేనరాజులో వేనుడి తండ్రి అంగరాజు జీవించే ఉంటాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]
 1. వేనరాజు నాటకానికి విశ్వనాథ పావనిశాస్త్రి నోట్
 2. వేనరాజు, ఖూనీ(వ్యాసం):హేలీ:పుస్తకం.నెట్:27.2.2014
 3. వేనరాజు:విశ్వనాథ సత్యనారాయణ:విశ్వనాథ పబ్లికేషన్స్:2006
 4. అభ్యుదయ చలన చిత్ర రథ సారథి – గూడవల్లి రామబ్రహ్మం
"https://te.wikipedia.org/w/index.php?title=వేనరాజు&oldid=3890666" నుండి వెలికితీశారు