ఖూనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖూనీ
కృతికర్త: త్రిపురనేని రామస్వామి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకము
ప్రచురణ: సూతాశ్రమము, తెనాలి
విడుదల: ఆగస్టు 1, 1935

ఖూనీ హేతువాది, కవిరాజు త్రిపురనేని రామస్వామి రచించిన నాటకం. విశ్వనాథ సత్యనారాయణ నాస్తికత్వాన్ని నిరసిస్తూ రాసిన వేనరాజు నాటకాన్ని వ్యతిరేకిస్తూ రాసిన నాటకం ఖూనీ.[1]

రచన నేపథ్యం

[మార్చు]

1935 ప్రాంతంలో జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేనరాజు నాటకాన్ని నిరసిస్తూ కవిరాజు త్రిపురనేని రామస్వామి ఖూనీ రాశారు. నాటకం ఆగస్టు 1, 1935న సూతాశ్రమము, తెనాలి ద్వారా తొలి ముద్రణ పొందింది. వేదాల్లో, భాగవతంలో నాస్తికుడైన వేనరాజుకీ, గౌతముడికీ మధ్య జరిగే సంఘర్షణను ఇతివృత్తంగా విశ్వనాథ వారు నాస్తికత్వాన్ని నిరసిస్తూ, మతం, ధర్మం, న్యాయం అన్న నైతిక దృక్పథం లేని రాజు ఎంతటి దారుణాలకు తెగబడతాడన్న కోణంలో వేనరాజును రచించారు. ఈ దృక్పథాన్ని వ్యతిరేకిస్తూ నాస్తికుడైన వేనరాజును కథానాయకునిగా, బ్రాహ్మణుడు గౌతముడిని ప్రతికథానాయకునిగా ఎంచి చిత్రీకరించారు త్రిపురనేని రామస్వామి. ఒకనాడు తన స్నేహితుడు నండూరి శేషాచార్యుల ఇంటికి ఉబుసుపోకకు పోగా అక్కడ మేజాబల్ల మీద విశ్వనాథ వారు రచించిన వేనరాజు నాటకం వ్రాతప్రతి వుంటే చదవడం ప్రారంభించినట్టు, ఆయనను అడిగి ఇంటికి తీసుకువెళ్లి నాటకం పూర్తిచేసి వేనుడంతటి దుర్మార్గుడా అని ఆశ్చర్యపోయి భాగవత కథను చదవగా ఆ అనుమానం పటాపంచలైనట్టు, ఆ విధంగా ఈ నాటకం వ్రాసే ప్రేరణ విశ్వనాథ సత్యనారాయణే కలిగించినట్టు త్రిపురనేని రామస్వామి స్వయంగా వ్రాసుకొన్నారు.[2]

ఇతివృత్తం

[మార్చు]

విశ్వనాథ రచించిన వేనరాజులోని మౌలిక కథాంశాన్ని స్వీకరించి వేరే దృక్కోణంతో రచించిన నాటకమిది. ఈ నాటిక మొదలు యజ్ఞాల గురించిన చర్చతో. వేనుడు గౌతముడిని యజ్ఞ యాగాదులు లోక కళ్యాణము కొరకే అని రుజువు పరచమంటాడు. తన పూర్వికులు పూర్వాచార పరాయణులు అయినంత మాత్రాన తానూ కూడా వారికి లాగే యజ్ఞాలు చేయాలనీ లేదనీ, యజ్ఞాలలో జరిగే జీవ హింసకు తాను వ్యతిరేకి ననీ అంటాడు వేనుడు. “భగవంతుడంటే ఎవడు? నా రాజ్యంలో నాకు ఎపుడూ కనపడలేదే? అయన ఉద్యోగమేమి?” అని సూటిగా అడుగుతాడు వేనుడు. ఈ విషయంపై గౌతముడికీ వేనుడికి వాగ్వివాదము అవుతుంది. సైన్యాధిపతి దృష్ట వర్మ, గౌతముడు కలిసి వైదిక ధర్మ విరోధి అయిన వేనుడి పాలన అంతమవ్వాలనీ అతని కుమారుడైన పృథు కుమారుడిని రాజు చేయాలనీ తీర్మానిస్తారు.
ఈ విషయాలన్నీ ముందుగానే తెలిసినా కూడా వేనుడు నింపాదిగా తన తల్లితో తాను ప్రజలని అభ్యుదయ పథాన తీసుకొని వెళ్ళటానికి ఎంతో తాపత్రయ పడ్డాననీ అయినను ప్రజలు మేల్కొన లేదనీ వారు మునుల చేతిలో కీలు బొమ్మలైనారనీ అంటాడు. ఇంత తెలిసి కూడా తాను ఎవరి పైనా యుద్ధము చెయననీ ఆత్మ రక్షణ కోసం కూడా ప్రతి దాడి చేయననీ, తన కార్యము ముగిసినదనీ తాను చావుకి సిద్ధమనీ అంటాడు తన తల్లితో. తన తదనంతరం ఏ బుద్ధుడో అవతరించి ఈ ప్రజలను బాగు చేస్తాడు అని ఆశ వ్యక్తం చేస్తాడు వేనుడు.
చివరి ఘట్టంలో వేనుడిని చంపేసాక స్వామి హత్య చేసిన సైన్యాధిపతి దృష్ట వర్మ పితృ హత్య చేసిన పృథు కుమారుడికి మధ్యన పశ్చాత్తాపంతో నిండిన ఒక సంభాషణ జరుగుతుంది. స్వామి హత్య చేసిన బాధతో దృష్ట వర్మకు పిచ్చి పడుతుంది. ఎక్కడ తమ కుట్ర బయట పెడతాడో అని గౌతముడి ఆజ్ఞ మేరకు పృథు కుమారుడు దృష్ట వర్మను హతమారుస్తాడు.[3]

పాత్రలు

[మార్చు]
  • వేనుడు - రాజు
  • గౌతముడు - బ్రాహ్మణుడు, ముని
  • దృష్టవర్మ - సైన్యాధిపతి
  • పృథువు - వేనుడి కొడుకు, యువరాజు

వేనరాజుతో భేదాలు

[మార్చు]
  • వేనరాజులో వేనుడు వైదిక ధర్మాన్ని కాలరాచి, మొత్తం సమాజాన్ని అతలాకుతలం చేసే దుర్మార్గుడు. ఖూనీలో వేనుడు నాస్తికుడు, ప్రజలను మూఢుల్ని చేసే మతవిశ్వాసాలను, యజ్ఞాల్లోని జీవహింసనూ వ్యతిరేకించే వ్యక్తి.
  • వేనరాజులో గౌతముడు సనాతన ధర్మానికి ప్రతినిధియైన మహర్షి, సహృదయుడు, వేనుడి దారుణ కృత్యాలను నిరసించే వ్యక్తి. ఖూనీలో గౌతముడు ప్రాబల్యం నిలుపుకునేందుకు వేనుడి కొడుకుని, సైన్యాధిపతినీ రెచ్చగొట్టి చంపించే దుర్మార్గుడు.
  • విశ్వనాథ వారి వేనరాజులో పృథువు వేనుడికి మొదట చెల్లెలుగా ఉండి తమ్ముడిగా మారుతాడు. ఖూనీలో పృథువు వేనుడి కొడుకు.
  • ఖూనీ వలె కాక వేనరాజులో వేనుడి తండ్రి అంగరాజు జీవించే ఉంటాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. హేతువుకు సేతువు కట్టిన ఖూనీ నాటకం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 12 జూన్ 2017, పుట.14
  2. ఖూనీ నాటకానికి త్రిపురనేని రామస్వామి తొలి పలుకులు:సెప్టెంబరు 1, 1935
  3. ఖూనీ:త్రిపురనేని రామస్వామి : సూతాశ్రమము, తెనాలి:1935
  4. వేనరాజు, ఖూనీ(వ్యాసం):హేలీ:పుస్తకం.నెట్:ఫిబ్రవరి 27, 2014
"https://te.wikipedia.org/w/index.php?title=ఖూనీ&oldid=3877768" నుండి వెలికితీశారు