నందోరాజా భవిష్యతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందోరాజా భవిష్యతి
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ‎
సంపాదకులు: విశ్వనాథ పావనిశాస్త్రి
ముద్రణల సంఖ్య: 5 ముద్రణలు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
సీరీస్: పురాణవైర గ్రంథమాల
ప్రక్రియ: నవల
ప్రచురణ: శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్
విడుదల: 1960
పేజీలు: 181
ఇంతకు ముందు: ధూమరేఖ
దీని తరువాత: చంద్రగుప్తుని స్వప్నము

నందోరాజా భవిష్యతి నవలను జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు. ఇది పురాణవైర గ్రంథమాలలో నాలుగవది.

రచనా నేపథ్యం[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ నందోరాజా భవిష్యతి నవలను 1960 సంవత్సరంలో రాశారు. ఈ నవల పురాణవైర గ్రంథమాల నవలామాలికలోనిది. విశ్వనాథ వారు ఆశువుగా చెపుతూండగా జువ్వాడి గౌతమరావు ఈ నవలను లిపిబద్ధం చేశారు. పురాణవైర గ్రంథమాలలో దీని తర్వాతి నవలైన చంద్రగుప్తుని స్వప్నము.తో కలిపి నందోరాజా భవిష్యతి నవలను వరుసగా 12 రోజుల్లో ఆశువుగా చెప్పారు.[1]

పురాణవైర గ్రంథమాల[మార్చు]

పురాణవైర గ్రంథమాల శీర్షికన విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవలల్లో నందోరాజా భవిష్యతి నాల్గవది. పురాణవైరమనే పదాన్ని గ్రంథకర్త రకరకాల లక్ష్యాలతో ప్రయోగించారు. ప్రధానంగా భారతీయులకు చరిత్ర రచనా దృష్టి లేదని, పూర్వరాజుల పరంపర అడిగితే పుక్కిటి పురాణాలు చెప్తారని ఆంగ్లవిద్య ప్రారంభమయిన తరువాత భారత చరిత్రను రచన చేసిన పలువురు అభిప్రాయపడ్డారు. సుమారు వెయ్యేళ్ల క్రితమే, అల్ బీరూనీ (Abu al-Biruni) వంటి పండితుడే, “దురదృష్టవశాత్తు భారతీయులు చారిత్రక గతిక్రమాన్ని పట్టించుకోరు. వారి రాజుల వంశపరంపరలు నమోదు చేసుకోవడంలో వారికి ఒకరకమైన నిర్లక్ష్యభావం ఉంది. ఖచ్చితమైన సమాచారం కోసం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియక కథలు కల్పించి చెప్తారు” అన్నాడు. ఇదేమాట, ఏ మార్పులు లేకుండా, వలసపాలన నాటి రచయితలు కూడా పదే పదే ఉటంకించడం మూలాన ఈనాటికీ ఒక సత్యంగా స్థిరపడిపోయింది.[2]
పురాణాల చారిత్రికతను తిరస్కరించే ఈ చరిత్ర రచనా ధోరణిని పురాణవైరంగా విశ్వనాథ పేర్కొన్నారు. పురాణాలలోని చారిత్రికతను అనుసరించి పురాణవైర గ్రంథమాల నవలామాలను రచించారు. ఈ నవలామాలికలోని నవలలు మొత్తం 12. ఆ నవలలు ఇవి:

 1. భగవంతునిమీది పగ
 2. నాస్తిక ధూమము
 3. ధూమరేఖ
 4. నందోరాజా భవిష్యతి
 5. చంద్రగుప్తుని స్వప్నము
 6. అశ్వమేధము
 7. అమృతవల్లి
 8. పులిమ్రుగ్గు
 9. నాగసేనుడు
 10. హెలీనా
 11. వేదవతి
 12. నివేదిత

చారిత్రికాంశాలు[మార్చు]

నవలలోని చారిత్రికాంశాలను ముద్రారాక్షసం, పురాణాల నుంచి తీసుకున్నారు. నవల ప్రకారం క్రీ.పూ.1634 సంవత్సరంలో నందుడు మగథ రాజ్యానికి రాజయ్యాడు. విశ్వనాథ సత్యనారాయణ నవలల ప్రకారం అప్పటికి బుద్ధుడు జన్మించి 200 యేళ్లయింది (క్రీ.పూ.1430ల ప్రాంతం). అయితే ప్రధాన స్రవంతిలోని చరిత్రకారులు ఈ తేదీలను విభేదిస్తున్నారు. వారి అభిప్రాయంలో నందుడు రాజ్యాన్ని గెలిచిన కాలం క్రీ.పూ.424[3] కాగా గౌతమ బుద్ధుని జననం క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని భావిస్తున్నారు.[4]
నందునికి రాక్షసుడు మంత్రి అన్న అంశాన్నీ, రాక్షసుని పాత్రచిత్రణను. ప్రసిద్ధ సంస్కృత నాటకం ముద్రారాక్షసము నుంచి తీసుకున్నారు. పురాణాలలో నందుని గురించి శాసిష్యతి మహాపద్మః ద్వితీయ ఇవ భార్గవః (ఇతడు రాజవంశముల విషయంలో రెండవ పరశురాముని వలె అయినాడు) అని రాశారు. కలియుగ రాజవృత్తాంతములో నందుని గురించి సర్వ క్షత్రాంతకృత్ నృపః (సర్వక్షత్రియలను నిర్మూలించెను) అని పేర్కొన్నారు. ఆ గ్రంథంలోనే నందుడు ఐక్ష్వాకులను, పాంచాలురను, కౌరవులను, హైహయులను, కాలకులను, ఏకలింగులను, శూరసేనులను, మైథిలులను నాశనము చేసెను అని పేర్కొన్నారు. బ్రహ్మాండ పురాణంలో నందుడు సర్వక్షత్రం సముద్ధృత్య (సర్వక్షత్రియులను నాశనము చేసెను) అని పేర్కొన్నారు. ఈ పురాణాంశాలను ఆధారం చేసుకొని నవలను రాసినట్టుగా విశ్వనాథ సత్యనారాయణ పీఠికలో పేర్కొన్నారు.[5]

ఇతివృత్తం[మార్చు]

మహాభారత యుద్ధం ముగిసిన 1540 సంవత్సరాలు, కలియుగం ప్రవేశించిన 1504 సంవత్సరాల తర్వాత భారతదేశంలోని ప్రధానమైన మగధ సామ్రాజ్యాన్ని శిశునాగ వంశానికి చెందిన మహానంది పరిపాలిస్తున్న కాలంలో నవల ప్రారంభమవుతుంది. బుద్ధుడు జన్మించి అప్పటికి 200 ఏళ్ళు పూర్తి అవుతుంది. దేశమంతటా బౌద్ధమతం వ్యాపించివుంటుంది. చాలా రాజ్యాల రాజులు బౌద్ధాన్ని స్వీకరించడమే కాక తమ క్షత్రియ వంశంలోనే పరమాత్ముడైన బుద్ధుడు జన్మించాడని గర్విస్తుంటారు. అంతేకాక పూర్వ వర్ణవ్యవస్థకు బ్రాహ్మణులే కారణమని వారిపై వేధింపులకు పాల్పడుతారు. ఈ నేపథ్యంలోనే మగధ రాజధాని గిరివ్రజపురములో సర్వదేశాల రాజకుమారులు సమావేశమవుతారు. ఆ సమావేశం బ్రాహ్మణులందరినీ కాలరాచే నిర్ణయం తీసుకునేందుకే అయినా కొందరు రాజప్రముఖులు దాన్ని అడ్డుకుంటారు.
మగధ చక్రవర్తి మహా నందునికి ఒక శూద్ర స్త్రీకి జన్మించిన మహాబలశాలి, వీరుడైన నందుణ్ణి చక్రవర్తికి క్షత్రియ స్త్రీలకు జన్మించిన ఇతర రాకుమారులు అంగీకరించరు. రాజపుత్రుల సమావేశానికి ఆ నందుణ్ణి రాకుండా సైన్యాధిపతి ఉత్తుంగభుజుని నియోగించి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. తన తల్లి శూద్రత్వం కారణంగానే తనను వారు అడ్డుకున్నారని గ్రహించిన నందుడు తన తండ్రి తప్ప సర్వ క్షత్రియులకు ప్రబల విరోధిగా మారుతాడు.
హైహయ, పాంచాల, కౌరవ, సూరసేనాది పలు రాజ్యాల రాజులు ఆ తర్వాత నెలల వ్యవధిలో చిత్రంగా నాశనమైపోతారు. రాజ్యాధికారం తారుమారై వేర్వేరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. చివరికి దేశంలోని ప్రబల రాజ్యాలైన మగధ, కోసలలు మాత్రమే మిగులుతాయి. మగధ రాజ్యపు పొలిమేరల్లో ఉన్న రాజ్యాలను ఆక్రమించి కోసల రాజు మగధ ముంగిటకు వస్తాడు. కోసల రాజ్యం కవ్వింపుకు మగధ సేనాని యుద్ధసన్నాహం చేసుకుని వెళ్ళగా రాజ్యవ్యవహారాలన్నీ చూస్తున్న రాకుమారునికి మగధ చక్రవర్తి మహానందుడు యుద్ధం వద్దని బోధిస్తాడు. శరవేగంగా ఎన్నో రాజ్యాల్లో జరుగుతున్నా పరిణామాల వెనుక ఉన్నది నందుడే కావచ్చనీ, ఆతని ఆప్తమిత్రుడైన బ్రాహ్మణుడు రాక్షసుని కోసల రాజు వద్దకు రాయబారం పంపమంటాడు. ఆపై జరిగే పరిణామాలన్నీ నవలను ముగింపు వైపుకు తీసుకువెళ్తాయి.

పాత్రలు[మార్చు]

నందుడు : శిశునాగ వంశానికి చెందిన మహా నందునికి శూద్ర స్త్రీకి పుట్టినవాడు. నవలకు కథానాయకుడు. క్షత్రియుల పట్ల శతృత్వం వహించి భారతావనిలోని సమస్త రాజ్యాల రాజుల్నీ నాశనం చేసేందుకు పట్టుపట్టినవాడు. ఇతని పాత్రచిత్రణకు గ్రంథకర్త భవిష్యత్ పురాణం, కలియుగ రాజవృత్తాంతం వంటివాటిలో ప్రస్తావనలు ఆధారం చేసుకుని రచించారు.
రాక్షసుడు : నందుని ప్రాణమిత్రుడైన బ్రాహ్మణుడు. రాజనీతివేత్త. నందుని రాజనీతి రాక్షసోపజ్ఞకంగా రచించారు. ఈ పాత్రను ముద్రారాక్షసం ఆధారంగా రచించారు.
మహా నందుడు : శిశునాగ వంశానికి చెందిన మగధ చక్రవర్తి. పేరుకు చక్రవర్తే అయినా కొడుకు కాలాశోకుడు, మహాసేనాని ఉత్తుంగభుజుని వద్దనే నిజమైన అధికారాలుంటాయి.
కాలాశోకుడు : మహానందుని పెద్దకొడుకు. తండ్రి చక్రవర్తిత్వాన్ని పురస్కరించుకుని రాజ్యంపై అధికారాలు చెలాయిస్తాడు. తన విలాసాల కొరకు మిత్రుడు, సేనాని ఉత్తుంగభుజుని రాజ్యంపైకి పంపగా అతను దేశాన్ని దోచుకుని ప్రజలను రాజుకు విరోధుల్ని చేస్తాడు. చివరకు ఉత్తుంగభుజుని చేతుల్లోంచి తప్పించుకోలేక ఇబ్బందులు పడతాడు.
సుమిత్రుడు : కోసల దేశపు మహారాజు. పరమబౌద్ధుడు. తీవ్ర వేదమత ద్వేషం, బ్రాహ్మణ వ్యతిరేకత ఉన్న పాత్ర.

ఉదాహరణలు[మార్చు]

 • మతములను నిర్మింతురు. రాజ్యములను పాలింతురు. సంఘములను సంస్కరించుటకు బయలుదేరుతురు. వారి ఇష్టము వచ్చిన సిద్ధాంతముల నిర్మించుకొందురు. మానవునకు మతమిచ్చినను సంఘ లక్షణమిదియని నిర్ణయించినను మరి ఏది చేసినను చేయవలసిన పద్ధతి ఏదనగా మానవులున్నారు. వారి యలవాట్లున్నవి. వారి వాంఛలున్నవి. వారికి వ్యాధులున్నవి. మృత్యువున్నది. ఈ యన్నింటిని విచారించి సంఘమునో మతమునో రాజ్యమునో నిర్మింపవలయును. అట్లు నిర్మింపపడినవి చిరకాలముండును. లేనిచో నిర్మించినవాని కత్తికి పదు నెన్నాళ్ళుండునో యన్నాళ్ళుండును

ప్రాచుర్యం[మార్చు]

విమర్శనలు[మార్చు]

ఈ నవల గురించి (మొత్తంగా పురాణవైర గ్రంథమాల నవలలన్నిటికీ సామాన్యంగా) సాహిత్యవిమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరించారు. ఎవరు ఎవరికి శత్రువులు? ఎవరు ఎవరికి మిత్రులు? – వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ సులభంగా సమాధానం చెప్పలేని విధంగా పాత్రలనీ, సంఘటనలనీ, సన్నివేశాలనీ, సంభాషణలనీ సృష్టించి, నడిపించిన రచయిత మాయలో నిజంగా వూపిరయినా తీసుకోకుండా కొట్టుకుపోతాం. అని ప్రశంసించారు గ్రంథమాలను పాఠకులకు పరిచయం చేస్తూ రచయిత్రి టి.శ్రీవల్లీ రాధిక. ఆమె పురాణవైర గ్రంథమాలను పాఠకులకు పరిచయం చేస్తూ గ్రంథాన్ని రాశారు.[6] కమ్యూనిస్టు ఉద్యమంలో పాలుపంచుకున్న వ్యక్తి, విపుల, చతురల సంపాదకుడు చలసాని ప్రసాదరావు ఈ నవలల్ని తీవ్రంగా ఆక్షేపించారు.[7]. ఈ రెండు అభిప్రాయాలకు మధ్యేమార్గంగా ప్రముఖ చారిత్రిక నవలారచయిత నోరి నరసింహశాస్త్రి ఈ నవలల్లోని కల్పనను, విశ్వనాథ కనబరిచిన ప్రతిభను ప్రశంసిస్తూనే నవలల్లో చెప్పిన చారిత్రికాంశాలను మాత్రం అంగీకరించలేకున్నట్టు పేర్కొన్నారు. ఏమైనా పురాణవైరి గ్రంథమాలలోని శ్రీ విశ్వనాథ నవలలు చారిత్రక నవలా రచయితలకు, విమర్శకులకు ఒక సవాలువంటివని మాత్రము అంగీకరించక తప్పదు! అని తేల్చారు.[8] హేలీ ఈ నవల గురించి వివరిస్తూ ఈ పుస్తకం ఏ చరిత్రా ఏ పురాణం తెలియకుండా చదివినా కూడా ఒక political thriller గా అలరిస్తుంది. రాక్షసుడి రాజకీయ ఎత్తుగడలూ అప్పటి రాజులూ వారి వారి బలాలూ బలహీనతలు, వారి మతాలూ, ఆనాటి సాంఘిక పరిస్థితులూ ఇవన్నీ ఆగకుండా చదివిస్తాయి పుస్తకాన్ని అంటారు. అదే వ్యాసంలో మధ్యలో కొన్ని చోట్ల బాగా descriptive అయిపోయి, ఎంతకీ తెగని వర్ణనలు ఎంతకీ ఆగని పెద్ద పెద్ద పదాలు (ఈ పదాలని “సమాస రగడ” అనొచ్చు!) చదివినపుడు మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే మన తెలుగు పాండిత్యం ఇలా తగలడింది అని రచయితని కూడా ఆ స్థాయికి దిగివచ్చి రాసి ఉండవలసింది అని అడగలేం కాబట్టి ఈ విషయంలో విశ్వనాథ వారిపై ఫిర్యాదు చేయటం కూడా భావ్యం కాదు. ఇంకొక కంప్లైంటు! అని కూడా ప్రస్తావించారు.[9]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. నందోరాజా భవిష్యతి నవలకు "ఒకమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్
 2. http://eemaata.com/em/issues/201301/2040.html
 3. Radha Kumud Mookerji, Chandragupta Maurya and His Times, 4th ed. (Delhi: Motilal Banarsidass, 1988 [1966]), 31, 28–33.
 4. ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము లో బుద్ధునికాలమను విభాగము
 5. నందోరాజా భవిష్యతి నవలకు విశ్వనాథ సత్యనారాయణ రాసుకున్న పీఠిక
 6. విశ్వనాథ నవలా సాహిత్య పరిచయం (పురాణవైర గ్రంథమాల - 1):టి.శ్రీవల్లీరాధిక: ప్రమథ సంస్థ ప్రచురణ
 7. చలసాని ప్రసాదరావు ఇలా మిగిలేం పుస్తకం లో కవిసామ్రాట్టు...! వ్యాసం(గ్రంథ ప్రచురణ 1993, వ్యాసరచన 1971)
 8. సారస్వత వ్యాసములు, ఐదవ సంపుటము, కవి సమ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారి వ్యాసములు గ్రంథం(1979:ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురణ)లో ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల వ్యాసం
 9. నందోరాజా భవిష్యతి(పుస్తక పరిచయం):హేలీ:పుస్తకం.నెట్:మార్చి 13, 2014