చారిత్రిక నవల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
NannayyaBaTTu.jpg
తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
తెలుగు సాహిత్యం కాలరేఖ
నన్నయకు ముందు క్రీ.శ. 1000 వరకు
నన్నయ యుగము 1000 - 1100
శివకవి యుగము 1100 - 1225
తిక్కన యుగము 1225 - 1320
ఎఱ్ఱన యుగము 1320 – 1400
శ్రీనాధ యుగము 1400 - 1500
రాయల యుగము 1500 - 1600
దక్షిణాంధ్ర యుగము 1600 - 1775
క్షీణ యుగము 1775 - 1875
ఆధునిక యుగము 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

చారిత్రిక నవల అన్నది నవలా సాహిత్యంలోని ఒక విభాగం. నవలలోని కథాకాలం గతంలో ఉండి ఆనాటి స్థితిగతులను ప్రతిబింబించేదిగా ఉంటుంది. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, మహీధర రామమోహనరావు, తెన్నేటి సూరి, నోరి నరసింహశాస్త్రి తదితరులు చారిత్రిక నవలలు రచించి అవి ప్రత్యేకమైన విభాగంగా అభివృద్ధి చేశారు.

వ్యుత్పత్తి[మార్చు]

చారిత్రిక నవల అన్నది చరిత్ర, నవల అన్న పదాల నుంచి ఏర్పడిన సమాసం. నవల అన్న పదం ఇంగ్లీషు పదం "నావెల్" (novel) నుంచి స్వీకరించారు. తెలుగులో నవలా రచన ప్రారంభమయ్యాక నవల అన్న పేరు కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి పెట్టారు. చరిత్ర అన్న పదానికి మానవ నాగరికత, గత చరిత్ర సంఘటనలతో అవినాభావ సంబంధము కలిగి భవిష్యత్‌ మానవ సాంస్కృతికార్థిక, రాజకీయ, సాంఘిక, పురోగమమునకు దారిచూపు శాస్త్రము అని అర్థం.[1]

లక్షణాలు[మార్చు]

చారిత్రికాంశం బీజంగా కలిగిన నవలా సాహిత్యాన్ని చారిత్రిక నవలగా పేర్కొవచ్చు. పలువురు పాశ్చాత్య, ఆంధ్ర సాహిత్య విమర్శకులు చారిత్రిక నవల లక్షణాలను ప్రతిపాదించారు. చరిత్రను ఆయా విమర్శకులు అవగాహన చేసుకునే పద్ధతిని ఆధారంగా చేసుకుని అవి కొంతమేరకు విభేదిస్తూంటాయి. చరిత్రను భిన్నకోణాల్లో అర్థం చేసుకున్న పలువురు సాహిత్యకారులు కూడా తెలుగులో పలు విధాలుగా చారిత్రిక నవలలను రచించారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సాహితీవేత్త, సంపాదకుడు వేలూరి వెంకటేశ్వరరావు చారిత్రక నవల అనేది, నిర్వచన పరంగా చాలామటుకు రాజకీయానుగుణ్యంగా ఉంటుంది అంటారు[2].
చరిత్రాత్మక నవల అనేది రెండు విరుద్ధ శబ్దాల సమ్మేళనమనే భ్రాంతి కలిగిస్తుంది. జరిగినదంతా వ్రాసుకుంటూ పోతే చరిత్ర కాదు. లోకానికో, దేశానికో, సంఘానికో, వ్యక్తికో, మంచికో, చెడుకో ప్రభావం కలిగించే సంఘటనలు వ్రాస్తేనే చరిత్ర. దానితో అనుగుణమైన కల్పన జోడిస్తే చరిత్రాత్మక నవల అవుతుంది. దానికి చరిత్ర బీజముంటే చాలును.అంటారు పలు చారిత్రిక నవలలు రాసిన సాహిత్యవేత్త నోరి నరసింహశాస్త్రి. ఆయనే కొనసాగిస్తూ చారిత్రక నవలాకారులను ఎదుర్కొనే ప్రమాదమొకటి ఉంది. ఇప్పటి తమ ఆదర్శాలూ, భావాలూ పూర్వకాలాలవారికి అన్వయించి చరిత్రను తారుమారు చేయడము. అంటూ మన కావ్యాదులవల్ల ఆయా కాలాల సాంఘిక మతాచారాదులు తెలియవస్తున్నవి. వాటిని మాత్రము ఉల్లంఘించకుండా జాగ్రత్తపడితే చాలును. అని దానికి విరుగుడు సూచించారు.[3]
హంగరీకి చెందిన మార్క్సిస్ట్ సాహిత్య సిద్ధాంతకర్త లూనాచ్ (1885-1971) చారిత్రిక నవల గురించి చేసిన ప్రతిపాదనలు, సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా మార్క్సిస్ట్ సాహిత్యవేత్తలు అంగీకరిస్తారు. చారిత్రిక నవలపై లూనాచ్ చెప్పిన సూత్రీకరణలకు అనుగుణంగానే ప్రముఖ సాహిత్యవిమర్శకుడు రా.రా. కొల్లాయి గట్టిటే నేమి? నవలకున్న చారిత్రిక నవల లక్షణాలు పరిశీలించారు.[4] లూనాచ్ ప్రవచించిన సిద్ధాంతం ప్రకారం చారిత్రక నవలకి ముఖ్యంగా ఐదు ప్రధానమైన అర్హతలు (లక్షణాలు) ఉండాలి. అవి ఈ కింది క్రమంలో ఉంటాయి:

  1. చారిత్రిక నవల సాంప్రదాయక రూపం ఇతిహాసం. ఈ ఇతిహాసం, ప్రత్యమ్నాయులు, లేదా ప్రతినిధులు అని చెప్పబడే కొంతమందిపై సాంఘిక శక్తులు విస్తృతంగా వారి జీవితాలలో తెచ్చిన మార్పుల ద్వారా సాధారణ జనుల జీవితాల రూపాంతరీకరణం చిత్రిస్తుంది.
  2. ఈ ఇతిహాసంలో పేరుపొందిన చారిత్రిక వ్యక్తులు పాత్రధారులుగా వస్తారు; కాని వారి పాత్ర కేవలం నామమాత్రమే.
  3. కథ సామాన్యమైన మధ్యరకం వ్యక్తులతో అల్లబడుతుంది. రెండు విరుద్ధ శక్తుల ఘర్షణలో వీళ్ళు కథాగమనానికి వ్యక్తిగతమైన స్పష్టత ఇస్తారు.
  4. పతనమవుతున్న సాంఘిక రూపాలకి ప్రబలమవుతున్న సాంఘిక రూపాలకీ మధ్య జరిగే విషాదాంత పోటీకి నవల వేదిక అవుతుంది. ఓడిన రూపాలకి గౌరవం, విజయవంతమైన రూపాలకి సమర్థన లభిస్తాయి.
  5. వివిధ పోరాటాలతో సమాజాలని, ఆ సమాజాలలో వ్యక్తులనీ వేరుచేసి చూపించి, సాంప్రదాయక చారిత్రక నవల తుదిలో మానవ ప్రగతిని ధ్రువీకరిస్తుంది.

ఐతే అన్ని చారిత్రిక నవలలూ ఈ సూత్రాలకు అనుగుణంగా ఉండవని గమనించాలి. వేర్వేరు దృక్పథాలకు చెందిన సాహిత్యవేత్తలు చరిత్రను భిన్న కోణాల నుంచి అర్థం చేసుకుని వివిధ పద్ధతుల్లో వ్యక్తీకరించారని గ్రహించాల్సి ఉంటుంది.

చరిత్ర[మార్చు]

తెలుగులో మొట్టమొదటి చారిత్రిక నవలగా 1914లో దుగ్గిరాల రామచంద్రయ్య రాసిన విజయనగర సామ్రాజ్యము నవలను సాహిత్యవేత్తలు నోరి నరసింహశాస్త్రి, వేలూరి వెంకటేశ్వరరావు తదితరులు పేర్కొన్నారు. ఆంధ్ర చారిత్రిక నవలలకు 1932 ప్రాంతాల్లో వెలువడ్డ ఏకవీర చక్కని మలుపునిచ్చిందని నోరి అభిప్రాయపడ్డారు. ఈ నవలను విశ్వనాథ సత్యనారాయణ రచించారు. తమిళనాడు ప్రాంతం నాయకరాజుల యుగం నేపథ్యంగా తీసుకుని ఇద్దరు స్నేహితుల ప్రణయం గురించి చిత్రీకరించిన నవల ఏకవీర. ప్రధానగాథ ఇద్దరు మిత్రుల సాంసారిక జీవితానికి సంబంధించిందైనా సందర్భవశాత్తుగా అప్పటి సాంఘిక పరిస్థితులు, పోర్చుగీసువారి దుండగాలు-దోపిడులు, రాబర్టు నోబిలి తత్త్వబోధకస్వామి అనే సన్యాసి వేషంతో చేసిన దొంగమతబోధ, దేవాలయాలలోని శిల్పనైపుణ్యాదులు చక్కగా ప్రదర్శింపబడ్డాయి. తమిళ కవయిత్రి అవ్వయారు వ్రాసిన ‘అతిచ్చూడి’ లోని ఆరంజేవిరుంబు (ధర్మము చేయుము) ఆరవదు శివం (కోపపడకుము) ఇత్యాది బాలబోధలు ప్రౌఢబోధలై ప్రధాన పాత్రలను ధర్మపథాన నడిపించడము రమ్యంగా చిత్రింపబడ్డాయి. అనంతరం విశ్వనాథ సత్యనారాయణ బద్దన్న సేనాని వంటి చారిత్రిక నవలలు రాశారు. 1960ల్లో విశ్వనాథ పురాణవైర గ్రంథమాల రాశారు. పలువురు సాహిత్యవేత్తలు పురాణవైర గ్రంథమాలను చారిత్రిక నవలలుగా గుర్తించరు. ప్రధాన స్రవంతిలోని చరిత్ర రచనను విభేదించి పురాణవైర గ్రంథమాల రచించారని గమనించాలి.[5]

1951లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంటర్మీడియెట్ కు ఉపవాచకాలుగా నిర్ణయించే నిమిత్తము ఆంధ్ర చరిత్రకు సంబంధించిన ఉత్తమ నవలకు ఒక్కొక్కదానికి వెయ్యి రూపాయలు బహుమతి ప్రకటించారు. మల్లాది వసుంధర రాసిన తంజావూరు పతనం, సప్తపర్ణి (నవల), ధూళిపాళ శ్రీరామమూర్తి రచించిన భువన విజయము, గృహరాజు మేడ, పాటిబండ మాధవ శర్మ రాసిన రాజశిల్పి నవలలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు బహుమతి ప్రదానం చేశారు. ప్రముఖ రచయిత, కళాకారుడు అడవి బాపిరాజు హిమబిందు, గోన గన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ నవలలను వేర్వేరు చారిత్రిక కాలాలను నేపథ్యాలుగా రచించారు.

నోరి నరసింహశాస్త్రి మూడు శతాబ్దాల సారస్వత చరిత్ర, సాంఘిక చరిత్ర ఆధారముగా తీసుకొని మూడు నవలలు నారాయణభట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి రాశారు. అవి కాక శ్రీనాథుని జీవితాన్ని, కవిత్వాన్ని గురించి కవి సార్వభౌముడు, ధూర్జటి జీవితాన్ని, కావ్యాలను ఆలంబనం చేసుకుని ధూర్జటి తదితర చారిత్రిక నవలలు రాశారు. ముదిగొండ శివప్రసాద్ పలు చారిత్రిక నవలలను రాశారు.
తెన్నేటి సూరి మంగోలు చరిత్రను ఆధారంగా చేసుకుని చెంఘిజ్ ఖాన్ చారిత్రిక నవలను రాశారు. వేదుల సూర్యనారాయణశర్మ ఆర్యచాణక్యుడు రచించారు. 1921లో ముంగండ అగ్రహారంలో సంప్రదాయ బ్రాహ్మణ యువకుడు చేసిన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆధారంగా తీసుకుని మహీధర రామమోహనరావు కొల్లాయి గట్టి తేనేమి? నవలను రాశారు.

మార్క్సిస్టు దృక్పథం ఉన్న రా.రా. వంటి విమర్శకులు కొల్లాయి గట్టి తేనేమీ?, చెంఘీజ్ ఖాన్ వంటి నవలలను తప్ప ఇతరమైన చాలా నవలలను చారిత్రిక నవలలుగా గుర్తించలేదు. కొల్లాయి గట్టి తేనేమీ? నవల గురించి రాసిన వ్యాసంలో ఆయన చెప్పుకోదగిన చారిత్రక నవల అంటూ లేని తెలుగు సాహిత్యంలో యీ నవలకున్న స్థానం అమూల్యమైనది. అంటారు రా.రా. అయితే నోరి నరసింహశాస్త్రి వంటి వారు మాత్రం చాలా నవలలను పేర్కొని మంచి చారిత్రిక నవలలు అని ప్రశంసించారు.

ప్రముఖ రచనలు[మార్చు]

రచయితలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. జి.ఎన్.రెడ్డి నిర్మించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారి నిఘంటువు
  2. [1] వేలూరి వెంకటేశ్వరరావు రాసిన చరిత్రాత్మక నవల అంటే? వ్యాసం(ఈమాట పత్రిక జూలై 2012 సంచిక సంపాదకీయం)
  3. [2]సారస్వత వ్యాసములు, ఐదవ సంపుటము, కవి సమ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారి వ్యాసములు గ్రంథం(1979:ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురణ)లో ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల వ్యాసం
  4. [3] కొల్లాయి గట్టితే నేమి? (ఒక ఉత్తమ చారిత్రక నవల) వ్యాసం(సంవేదన – ఏప్రిల్ 1968)
  5. భగవంతుని మీది పగ నవలలో విశ్వనాథ సత్యనారాయణ పురాణవైర గ్రంథమాలకు రాసిన ఉపోద్ఘాతం