తెలుగు పత్రికల ప్రచురణ 19 వ శతాబ్ది తొలి అర్ధ భాగంలో మొదలైంది. తొలి తెలుగు పత్రిక 1832 ప్రాంతంలో వెలువడింది. కర్నాటిక్ గెజెట్ అనే ప్రచురణ తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషల్లో వెలువడేది. ఇదే తెలుగులో వెలువడ్డ తొలి పత్రిక.[1] ఆ తరువాత సత్యదూత అనే పత్రిక మొదలైంది. 1837 లో వృత్తాంతి అనే పత్రిక మొదలైంది. ఆ తరువాత వర్తమాన తరంగిణి వెలువడింది.
తెలుగు పత్రికలు
1880 ల నుండి తెలుగు పత్రికలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. మద్రాసు నుండే కాక, ఆంధ్ర ప్రాంతం లోని పలు ప్రదేశాల నుండి పత్రికలు వెలిసాయి. రాజమహేంద్రవరం, మచిలీపట్నం కేంద్రాలుగా పలు పత్రికలు వచ్చాయి. పట్టణాల నుండే కాక, చిన్న చిన్న గ్రామాల నుండి కూడా పత్రికలు వెలువడ్డాయి.
రావటానికి ఎన్నో వచ్చినప్పటికీ, వాటిలో దీర్ఘకాలం మనగలిగిన పత్రికలు చాలా తక్కువ. 1875-1926 మధ్య కాలంలో 516 పత్రికలు వెలువడగా, వీటిలో చాలా పత్రికలు తక్కువ కాలంలోనే ఆగిపోయాయి. 1940 నాటికి 184 పత్రికలు ప్రచురణలో ఉన్నాయి.[2] 19 వ శతాబ్ది చివరి దశాబ్దాల్లో పత్రికల సర్క్యులేషను సాధారణంగా 100 నుండి 500 వరకు ఉండేది. వెయ్యికి పైన ప్రతులు ముద్రించిన తొలి రాజకీయ పత్రిక, కృష్ణాపత్రిక.
బ్రిటిషు పాలనలో, రాజకీయ వార్తలు ప్రచురించే పత్రికలపై ప్రభుత్వ నిఘా ఉండేది. ఆయా పత్రికలలో వచ్చిన వార్తలపై, వాటి సర్క్యులేషనుపై స్థానిక అధికారులు ప్రభుత్వానికి రహస్య నివేదికలు పంపేవారు.
తొలినాళ్ళలో తెలుగు పత్రికలను స్థాపించిన ప్రముఖులలో కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, ఎ.సి.పార్థసారథి నాయుడు, కొక్కొండ వెంకటరత్నం పంతులు, సత్తిరాజు సీతారామయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, రామోజీరావు మొదలైనవారున్నారు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ పత్రికలను ప్రచురించడం ఉండేది. చాలా పత్రికలకు స్వంత ముద్రణాలయాలుండేవి.
తెలుగు పత్రికల చరిత్ర 19 వ శతాబ్ది తొలి అర్ధ భాగంలో మొదలైంది. తొలి తెలుగు పత్రిక 1832 ప్రాంతంలో వెలువడింది. కర్నాటిక్ గెజెట్ అనే ప్రచురణ తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషల్లో వెలువడేది. ఇదే తెలుగులో వెలువడ్డ తొలి పత్రిక.[1] ఆ తరువాత సత్యదూత అనే పత్రిక మొదలైంది. ఈ రెంటిలో మొదటి పత్రిక ఏది అనే విషయమై కొంత వివాదం ఉన్నప్పటికీ కర్నాటిక్ గెజెట్ తొలి పత్రిక అని పరిశోధకులు తేల్చారు. 1837 లో వృత్తాంతి అనే తెలుగు పత్రిక మొదలైంది. ఆ తరువాత, 1842 లో వర్తమాన తరంగిణి వెలువడింది.
19 శతాబ్ది అంతానికే పలు పత్రికలు మొదలయ్యాయి. పత్రికల ప్రచురణ గురించి తిరుమల రామచంద్ర, "19 వ శతాబ్ది ఉత్తరార్థంలో కవులు పండితులు పలువురు వుండేవారు. అందరి వద్ద తాటాకు పుస్తకాలుండేవి. అప్పట్లో ప్రతి పండితుడు ఏదో ఒక పత్రిక నడపడం, దానిలో ఒక ప్రాచీన కావ్యం నాలుగు పుటలో ఎనిమిది పుటలో ప్రచురించడం పరిపాటైంది. వీటిలో కొన్నిటిలో వార్తలూ వుండేవి" అని రాసాడు.[3]
తొలిపత్రికల్లో క్రైస్తవ మత పత్రికలు ఎక్కువగా ఉండేవి. ఆ తరువాత హిందూ మత పత్రికలు, సాహిత్య పత్రికలు వచ్చాయి. 1885 లో ఆంధ్ర ప్రకాశిక రాకతో సామాజిక విషయాలను, పరిపాలన సంబంధ విషయాలనూ రాసే రాజకీయ వార్తా పత్రికల శకం మొదలైంది. స్వాతంత్ర్య పోరాట విశేషాలను రాస్తూ ప్రజలకు స్ఫూర్తినిస్తూ రాజకీయ పత్రికలు పనిచేసాయి. ఈ కోవలో దేశాభిమాని, దేశోపకారి, శశిలేఖ వంటి పత్రికలు వచ్చాయి. 1886 ప్రాంతంలో మొదలైన కృష్ణా వృత్తాంతిని, కృష్ణాన్యూస్ గా మారి చివరికి దేశాభిమానిగా పేరు మార్చుకుని 1901 లో దినపత్రికగా మారింది. ఇదే తెలుగులో మొట్టమొదటి దినపత్రిక.[4]
కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రికల ఆవిర్భావంతో 20 వ శతాబ్ది తెలుగు పత్రికల చరిత్ర మొదలైంది. 1902 లో కృష్ణాపత్రిక, 1908 లో ఆంధ్రపత్రికలు వెలువడ్డాయి. ఈ రెండూ రాజకీయ పత్రికలే. ఆంధ్రపత్రిక వారపత్రికగ మొదలై, 1914 లో దినపత్రికగా మారింది. అయితే వారపత్రిక కూడా కొనసాగింది. 1958 లో ఆంధ్ర సచిత్ర వారపత్రికగా పేరు మార్చుకుంది. 1902 లో స్త్రీల కోసం, స్త్రీలే నిర్వహించిన హిందూసుందరి పత్రిక వచ్చింది. 1943 లో మరో మహిళా పత్రిక ఆంధ్రమహిళ ను మద్రాసు ఆంధ్ర మహిళా సంఘం తీసుకువచ్చింది. ఈ రెండు పత్రికలను స్త్రీలే నిర్వహించేవారు. 1928 లో కె.ఎన్.కేసరి గృహలక్ష్మి అనే స్త్రీల మాసపత్రికను ప్రారంభించాడు.
ఈ శతాబ్దిలో సాహిత్య పత్రికలు ఎక్కువగా వెలుగుచూసాయి. 1910 లో ఆంధ్రభారతి, 1912 లో ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, 1914 లో త్రిలింగ పత్రికలు వచ్చాయి. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక గ్రాంథిక భాషలో వెలువడేది. గ్రాంథికభాషా వాది అయిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వందేమాతరం, వజ్రాయుధం పత్రికలను ప్రచురించాడు. ఆంధ్రభారతిలో తొలి తెలుగు కథ దిద్దుబాటు ప్రచురితమైంది. 1920 లో దాదాపు ఒకే సమయంలో నీలగిరి, తెనుగు పత్రికలు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాదుకు బయట వెలువడ్డ తొలి పత్రికలు ఈ రెండూ. 1921 లో ప్రబుద్ధాంధ్ర, 1924 లో ఆంధ్రసర్వస్వము 1926 లో గోలకొండ పత్రిక వెలువడ్డాయి. అభినవ సరస్వతి, గ్రంథాలయ సర్వస్వం, ముక్త్యాల సరస్వతి వంటి సాహిత్య పత్రికలు ఉద్భవించాయి.
1920, 1930, 1940 సంవత్సరాల్లో మద్రాసు ప్రభుత్వం వద్ద నమోదైన పత్రికల సంఖ్య కింది విధంగా ఉంది.[5]
తెలుగు
ఇంగ్లీషు
తమిళం
1920
1930
1940
1920
1930
1940
1920
1930
1940
దినపత్రికలు
1
2
2
7
5
5
3
3
3
వారపత్రికలు
11
20
35
22
19
24
19
35
46
మాసపత్రికలు
20
18
88
29
21
92
30
52
74
ఇతరత్రా
6
7
59
17
13
132
4
11
87
మొత్తం
38
47
184
75
58
253
56
101
210
1934 లో తెనాల్లిలో చక్రపాణి, కొడవటిగంటి కుటుంబరావుల సారథ్యంలో యువ మాసపత్రిక మొదలైంది. తరువాత ఇది హైదరాబాదుకు మారింది. 1962 లో విజయవాడలో జ్యోతి మాసపత్రిక మొదలైంది.
1942 లో కమ్యూనిస్టు పత్రిక ప్రజాశక్తి మొదలైంది. దీనికి ఆద్యురాలు అనదగ్గ నవశక్తి అనే పత్రిక 1937 డిసెంబరు 15 న రాజమండ్రిలో ప్రారంభమైంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మూతపడింది. ఆ తరువాత దీన్ని ‘స్వతంత్ర భారత్’ పేరుతో రహస్యంగా ముద్రించారు. అదే 1942 లో ప్రజాశక్తిగా మారింది. 1945 లో ఇది దినపత్రికగా మారింది. 1948 లో ప్రభుత్వం దీన్ని నిషేధించింది. తిరిగి 1969 లో వారపత్రికగా మొదలై, 1981 లో దినపత్రికగా మారింది. కమ్యూనిస్టు పార్టీ చీలిన తరువాత ఇది మార్క్సిస్టు పార్టీ పత్రికగా మారింది. 1962 లో విశాలాంధ్ర పత్రిక మొదలైంది.
పిల్లల కోసమే ప్రత్యేకించిన తొలి పత్రిక బాలకేసరి 1940 లో వచ్చింది. 1945 లో న్యాపతి రాఘవరావుబాల పత్రికను ప్రారంభించాడు. 1946 లో చందమామ వచ్చి మంచి విజయం సాధించింది. తెలుగే కాక అనేక ఇతర భారతీయ భాషల్లో కూడా అది వెలువడింది. 1949 లో బాలమిత్ర, పాపాయి పత్రికలతో మొదలుకుని అనేక బాలల పత్రికలు వచ్చాయి.
1938 లో ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపులో భాగంగా ఆంధ్రప్రభ దినపత్రిక మద్రాసులో ప్రారంభమైంది. 1959 లో తాత్కాలికంగా మూతబడి మళ్ళీ 1960 లో విజయవాడలో మొదలైంది. 1960 లోనే విజయవాడలో కె.ఎల్.ఎన్.ప్రసాద్, నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో ఆంధ్రజ్యోతి దినపత్రికను ప్రారంభించాడు. అది 2000 లో మూతబడి మళ్ళీ 2002 లో వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మొదలైంది. 1960 లోనే మొదలైన మరొక పత్రిక ఆంధ్రభూమి. సికిందరాబాదు నుండి వెలువడే ఈ పత్రికకు కొన్నాళ్ళు గోరాశాస్త్రి సంపాదకీయం వహించాడు.
ప్రముఖ దినపత్రికలకు తోడుగా అదేపేరుతో వారపత్రికలు కూడా ఉండేవి. అవి - ఆంధ్రసచిత్ర వారపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి. 1967 లో విజయవాడ లోనే ఆంధ్రజ్యోతి వారపత్రిక ప్రారంభమైంది. ఆంధ్రప్రభ 1952 లో, ఆంధ్రభూమి 1977 లో మొదలయ్యాయి. దినపత్రికలతో సంబంధం లేని స్వాతి సపరివార పత్రికను 1984 లో వేమూరి బలరాం విజయవాడలో ప్రారంభించాడు. సర్క్యులేషనులో ఇది చరిత్ర సృష్టించింది.
1974 లో రామోజీరావు ఈనాడు దినపత్రికను ప్రారంభించాడు. భాష, సర్క్యులేషను, అనేక చోట్ల నుండి ప్రచురణలు, జిల్లా ఎడిషన్లు, ఆదివారం పుస్తకం వంటి కొత్త విశేషాలతో ఈ పత్రిక పలు విశేషాలకు నాంది పలికింది. సర్క్యులేషను పరంగా దేశంలో హిందీ, ఇంగ్లీషు పత్రికలతో పోటీ పడి నిలిచింది. ఈనాడు గ్రూపు కిందనే విపుల, చతుర, అన్నదాత, మార్గదర్శి 1984 లో ఉదయం, 1996 లో వార్త, 2008 లో సాక్షి దినపత్రికలు మొదలయ్యాయి.
మొదటి సినిమా పత్రిక చిత్రకళ, 1938 లో విడుదలైంది. తెలుగు సినిమా కేంద్రమైన మద్రాసు నుండే వెలువడింది. తర్వాత ప్రాచుర్యం పొందిన పత్రిక నటనను ఎం.ఎస్.రామాచారి ప్రారంభించాడు. రూపవాణి పత్రికను 1940 లో పి. సీతారామయ్య ప్ర్రారంభించాడు. ఆ సమయంలోనే కొమ్మూరి సాంబశివరావుతెలుగు సినిమా పత్రిక మొదలు పెట్టాడు. రెండవ ప్రపంచ యుద్ధం వలన చాలా పత్రికలు ఆగిపోయాయి. 1954 లో టి.వి.రామనాథన్ ఒకేసారి మూడు భాషలలో సినిమా పత్రికలు ప్రారంభించాడు. ఇవి ఇంగ్లీషులో పిక్చర్ పోస్ట్, తమిళంలో పేశుంపడమ్, తెలుగులో సినిమా రంగం. తెలుగు పత్రిక బాధ్యతలను జి.వి.జి.కృష్ణ చూసేవాడు. ప్రముఖ స్టుడియో అధిపతి నాగిరెడ్డి బి.ఎన్.కె.ప్రెస్ ప్రారంభించి సినిమా పేరుతో పత్రిక వెలువరించాడు. 1955 లో గౌతమి పత్రిక రాజమండ్రి నుండి ప్రారంబించి, కె.కె.శర్మ (కాగడా శర్మ) ప్రొద్బలంతో మద్రాసుకు తరలించారు. 1950-60 మధ్య ఎన్నో పత్రికలు వచ్చాయి. వాటిలో మధురవాణి, చిత్రాలయ, ధ్వని, కొరడా, చిత్ర, తుఫాన్, తరంగిణి, చిత్రజగత్ లు కొన్ని.
1966 లో విజయా నాగిరెడ్డి వారి విజయచిత్ర విడుదలైంది. దీనికి రావి కొండలరావు సారథ్యం వహించాడు. 1969 లో బి.ఎ.వి.శాండిల్య వెండి తెర ప్రారంభించాడు. 1975లో సినీ హెరాల్డ్ పత్రికను ఠాకూర్ వి.హరిప్రసాద్ హైదరాబాదు నుండి ప్రారంభించాడు. ఈనాడు రామోజీరావు సినీ వారపత్రిక సితారను 1976 లో మొదలు పెట్టాడు. ఆంధ్ర జ్యోతి వారి జ్యోతిచిత్ర 1977 లో మొదలయింది. శివరంజని, మేఘసందేశంలు ఆ తరువాత వచ్చాయి.
తొలినాళ్ళ పత్రికల్లో సాహిత్య వ్యాసాలు, అముద్రిత గ్రంథాల ప్రచురణ, రాజకీయ సామాజికాంశాల ప్రచురణ ఉండేది. క్రైస్తవ మత, హిందూమత సంబంధ పత్రికలు ప్రాచుర్యంలో ఉండేవి. 1871 లో మొదలైన ఆంధ్రభాషా సంజీవని సంపాదకీయం రాసే ఒరవడిని ప్రవేశపెట్టింది.[6] 1860 ల్లో వచ్చిన శ్రీ యక్షిణి, సుజనరంజని పత్రికలు సాహిత్య విషయాలకు ప్రాధాన్యత నిచ్చాయి. 1885 లో వచ్చిన అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక, పేరుకు తగినట్లు పలు అముద్రిత గ్రంథాలను ప్రచురించేది. చంద్రగిరిచరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానం, భోగినీదండకం, వసుంధరా విజయము, యాదవరాఘవ పాండవీయము, మిత్రవింద పరిణయము లాంటి గ్రంథాలను ఈ పత్రిక ప్రచురించింది.
రాజకీయ, సామాజిక విషయాలను ప్రచురించే తొలి పత్రికల్లో చెప్పుకోదగ్గవి ఆంధ్ర ప్రకాశిక, శశిలేఖ, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, దేశోపకారి, దేశాభిమాని, వివేకవర్థని, రవి. 19 వ శతాబ్దం చివరి లోను, 20 వ శతాబ్ది తొలినాళ్ళలోనూ మొదలైన ఈ పత్రికలు ప్రధానంగా స్వాతంత్ర్యోద్యమానికి అనుకూలంగా ఉండేవి. ఆంధ్ర ప్రకాశిక కాంగ్రెసుకు అనుకూలంగా ఉండేది. కొన్నాళ్ళపాటు జస్టిస్ పార్టీకి అనుకూలంగా ఉండేది.
1894 లో రాయదుర్గం నుంచి యల్లమరాజు నారాయణమూర్తి ప్రచురించిన విజ్ఞానవర్ధిని పత్రికలో విజ్ఞానశాస్త్ర విషయాలను ప్రచురించేవారు. దాసు కేశవరావు సంపాదకత్వంలో 1893 లో వచ్చిన జ్ఞానోదయం పత్రిక వ్యవసాయం, పశుపోషణ, వర్తకం, తోటల పెంపకం వంటి విశేషాలను ప్రచురించేది.
తెలుగులో మొదటి కార్టూన్ని ఆంధ్రపత్రిక ప్రచురించింది. కార్టూనిస్టు తలిశెట్టి రామారావు. 1928 లో శ్లిష్టాక్షరపదబంధము పేరుతో ఆంధ్రభారతి గళ్ళనుడికట్టును ప్రచురించింది.
పత్రికల్లో పాఠకులు రాసే ఉత్తరాలకు ప్రాముఖ్యత ఉండేది. 1841 లో వృత్తాంతి పత్రికలో, ఆనాటి వివాహాల్లో జరుగుతున్న దుబారాఖర్చు, భోగం మేళాల పట్ల ఆవేదనతో ఒక పాఠకుడు రాసిన సుదీర్ఘమైన లేఖను ప్రచురించారు. ఈ లేఖ, ఆ తరువాతి కాలంలో వచ్చిన బ్రౌన్ సేకరణల్లో చోటుచేసుకుంది. చిన్నయసూరి, వర్తమాన తరంగిణికి ఒక లేఖలో ఒక పద్యం రాసి పంపిస్తూ దాన్ని ముద్రించి, పండితుల చేత దానికి అర్థం చెప్పించమని కోరాడు. ఆముద్రిత గ్రంథ చింతామణి పత్రికలో ప్రచురించిన సాహిత్య లేఖలు ఆ తర్వాతి కాలంలో "ఆముద్రిత గ్రంథ చింతామణి లేఖలు" అన్న పేరుతో పుస్తక రూపంగా వెలువడ్డాయి.
తొలినాళ్ళ పత్రికల్లో గ్రాంథికభాష వాడుక విస్తృతంగా ఉండేది. 1871 లో కొక్కొండ వెంకటరత్నం స్థాపించిన ఆంధ్రభాషా సంజీవని గ్రాంథిక భాషలో ఉండేది. 1872 లో వచ్చిన పురుషార్థ ప్రదాయిని వాడుకభాషలో వచ్చిన తొలి పత్రిక. ఆ తరువాత వీరేశలింగం స్థాపించిన పత్రికలు వాడుకభాషనే అనుసరించాయి. రాసేది వాడుక భాష అయినప్పటికీ కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక వంటి దినపత్రికలు 1940 ల వరకూ పూర్తిగా వాడుకభాష లోకి మారలేదు. సంపాదకీయాలు సరళ గ్రాంథికం లోనే ఉండేవి. దీన్ని ఎత్తిచూపుతూ 1938 లో ప్రబుద్ధాంధ్రలో గిడుగు రామమూర్తి "తెలుగు పత్రికల సంపాదకులకు" రాసిన బహిరంగ అభ్యర్థనలో ఇలా రాసాడు:[7]
గిడుగు రామమూర్తి
"ఇప్పుడు ఆంధ్రభారతిని ఆరాధించే గొప్ప సంస్థలలో గొప్పవి ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, భారతి, గృహలక్ష్మి మొదలయినవి. వీటి సంపాదకుల ప్రధానోద్దేశము ఆంధ్రులను అందరినీ అలరించడము."
"ఇంగ్లీషువారు ఇంగ్లీషు వార్తాపత్రికలు చదివినట్లు ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక మొదలయిన వార్తాపత్రికలలోని సంపాదకీయ వ్యాసములున్ను , గ్రాంథికమున రచించిన ఇతరవ్యాసములున్ను , జాబులున్ను తెలుగువారు చదవలేరు. ఈ విషయము అనేకసార్లు పరీక్షించి చూచినాను. ఇంగ్లీషు నేర్చిన తెలుగువారయినా ఇంగ్లీషు వారాపత్రికలు చదివినట్లు సుళువుగా తెలుగువార్తాపత్రికలు చదవలేరు. ఇందుకు కారణము తెలుగు అక్షరములు చదవడము వారికి అలవాటు లేకపోవడము కాదు, గ్రాంథికాంధ్రము సుపరిచతము కాక పోవడము."
"ఏనాడు ఆంధపత్రికలోను కృష్ణాపత్రికలోను సంపాదకీయ వ్యాసములు యథోచితమయిన వ్యావహారిక భాషలో రచితమవుతవో, అనాడు తెలుగువారికి పండిత పామర సామాన్యమైన దేశభాష కలదన్న మాట ప్రస్ఫుటముగా ప్రకటిత మవుతుంది, ప్రజాస్వా మిక పరిపాలనము నిర్వహించడణునకు తగినవారుగా తెలుగువారిని తర్చీయత్ చేసే సంస్థలు స్థాపిత మవుతవి."
"ఇంగండు, ఫ్రాన్సు, జర్మనీ, రష్యా, తుర్మీ, చీనా, జసాను మొదలయిన దేశములలోని వార్తా పత్రిక సంపాదకులు తమ వాడుక భాషలోనే తమ వ్యాసములు రచిస్తున్నా రని ఆంధ్రపత్రిక, కృష్ణాపతికల సంపాదకులకు తెలుసుననుకొంటాను. తెలిసిన్ని ఆధ్రసాహిత్యపరిషత్ పత్రికాసంపాదకుల వలెనే వారున్ను తను వాడుకభాషను బహిష్కరించి, వ్యవహార భ్రష్టము అయిన ప్రాచీనాంధ్రశబ్దములు ఎందుకు తమ వ్యాసములలో వాడుతున్నారో నాకు బోధపడదు."
1938 లో వచ్చిన ఆంధ్రప్రభ దినపత్రిక, వాడుకభాషను మరింత సరళం చేసింది. దాని సంపాదకుడైన నార్ల వెంకటేశ్వరరావు సరళ గ్రాంథికభాష నుండి సరళమైన వ్యావహారిక భాషకు మార్చాడు.[8] 1970 లో ఈనాడు వచ్చాక భాష పూర్తిగా మారిపోయి, నేటి రూపానికి స్థిరపడింది. టీవీల్లో వార్తాఛానళ్ళు, అంతర్జాలంలో పత్రికల ప్రచురణ, సామాజిక మాధ్యమాలు మొదలైన తరువాత భాషలో మరింత మార్పు వచ్చింది. భాషలో ఇంగ్లీషు పదాలు హెచ్చడమే కాకుండా, భాష ఆంగ్లీకరణ చెందుతోంది.
19 వ శతాబ్దిలో వెలువడ్డ తెలుగు పత్రికలు ఎక్కువగా మద్రాసు, బందరు, జళ్ళారి, విశాఖపట్టణం, బరంపురం, శ్రీకాకుళం వంటి సరిహద్దుల వద్ద నున్న ప్రదేశాల నుండి వచ్చినవే. తెలుగు దేశం నడిబొడ్డు నుంచి వచ్చిన పత్రికల్లో ఎక్కువ భాగం రాజమండ్రి, కాకినాడ, పిఠాపురం, తుని వంటి గోదావరి నదికి రెండు పక్కల ఉన్న పట్టణాలలో పుట్టాయి. ఏలూరు, గుడివాడ, అత్తిలి పట్టణాలలో కూడా పత్రికలు అవతరించాయి, నెల్లూరు నుండి పత్రికల ప్రచురణ ఎక్కువగా జరిగేది. గుంటూరు, విజయవాడలలో పత్రికలు ఉద్భవించడం తరువాతి కాలంలో వచ్చింది గానీ, తొలినాళ్ళలో లేవు.[9]
తెలుగు పత్రికల పేర్లు సాధారణంగా వృత్తాంతిని, వర్తమాన తరంగిణి, హితవాది, దినవర్తమాని, చింతామణి, అముద్రితగ్రంథ చింతామణి, ఆంధ్ర భాషా సంజీవని వంటి 'ఇ'కారాంత పదాలతో కూడి ఉండేవి. సత్యదూత, మనోరమ, జనానా పత్రిక, శారద వంటి 'అ'కారాంతపు పేర్లు తక్కువగా ఉండేవి. 'స్వదేశ జనప్రసిద్ధ అభిపాయము', 'విద్యార్థి కల్పభూజము', 'నీతి దర్పణము' వంటి 'ము' తో అంతమయ్యే పేర్లు మరీ తక్కువ. బోధిని, దర్శిని, వర్థిని, మంజరి, రంజని వంటి పదాలతో అంతమయ్యే పేర్లతో పత్రికలు వచ్చేవి. 'అనల్ప జల్పితాకల్ప కల్పవల్లి' అనే పేరుతో ఒక పత్రిక వెలువడేది.[9] దీనికి అర్థం 'అద్భుతమైన మాటల యొక్క అలంకారాలకు, లేదా వైభవాలకు కల్పవృక్షం వంటిది' అని. దీన్ని దాసు శ్రీరాములు 1880 లో స్థాపించాడు.[10]
అనేక పత్రికల పేర్లు "ఆంధ్ర" పదంతో మొదలయ్యాయి. ఆంధ్ర ప్రకాశిక, ఆంధ్రభారతి, ఆంధ్రభాషాసంజీవని, ఆంధ్రకేసరి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి కొన్ని ఉదాహరణలు.
1880 ల నుండి తెలుగు పత్రికలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. మద్రాసు నుండే కాక, ఆంధ్ర ప్రాంతం లోని పలు ప్రదేశాల నుండి పత్రికలు వెలిసాయి. అయితే వీటిలో దీర్ఘకాలం నడిచినవి చాలా తక్కువ. 1930 లో భారతిలో రాసిన వ్యాసంలో వావిలాల గోపాలకృష్ణయ్య, 1875-1926 మధ్య మొత్తం 516 పత్రికలు వెలువడ్డాయని రాసాడు. వీటిలో చాలా పత్రికలు తక్కువ కాలంలోనే ఆగిపోయాయి. 1940 లో వేసిన అంచనా ప్రకారం అప్పటికి 184 పత్రికలు ప్రచురణలో ఉన్నాయి.[2] 1926 ఉగాది నాటి ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచికలో 60 యేళ్ళ తెలుగు వార్తాపత్రికలపై రాసిన సమీక్షలో కొడాలి శివరామకృష్ణారావు, వందల కొలదిగా తెలుగు పత్రికలు పుట్టి, గిట్టాయని చెబుతూ, కొన్ని మొదటి సంచిక తోనూ, కొన్ని మొదటి మాసం తోనూ, కొన్ని మొదటి సంవత్సరము తోనూ అంతరించాయని రాసాడు.[11] పత్రికలు వేగంగా వెలుగు చూసి అంతే వేగంగా మూతబడుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ మల్లెల శ్రీరామమూర్తి, 'పత్రికలన్నీ ఒక మూసలో ఉండకుండా వివిధ రంగాలకు చెందిన విశేషాలను ప్రచురిస్తూ ఒకరికొకరు పోటీ కాకుండా ఉండాలని తద్వారా తమ అభిరుచుల కనుగుణంగా చందాదారులు లభిస్తార'ని 1941 లో త్రిలిఙ్గ పత్రిక రజతోత్సవ సంచికలో రాసాడు. "..అట్లుకాక అందరు అనుకరణముగ ఒకే మార్గమున పత్రికలు నడిపింప పూనుటచేతనే అనేక పత్రికలు పుట్టిన వెంటనే గిట్టుచున్నవి. మాసపత్రికయినచో తొలి సంచికలోను, పక్షపత్రికయినచో రెండవసంచికతోను, వారపత్రికయైనచో మూడుసంచికలతోను ఆగిపోవుచున్న విషయ మందరెరిగిందే కదా" అని ఆయన చమత్కరించాడు.[12]
"పత్రికా జీవనము ముఖ్యముగ నాంధ్రదేశములో దుర్భరము. విదేశములలో వేనకు వేలు పత్రిక లున్నవి, ఒక్కొక్క పత్రికకు లక్షలు లక్షలు చందాదారు లున్నారు. కాని మన దేశమునకట్టి యదృష్టము లేదు, కారణ మేమి? మన దేశములో చాలభాగము వ్యవసాయకులు, వారు పల్లెలలో నివసించు నుందురు. విద్యా సౌకర్యములు సున్న, చదువుకున్న వారు యే కొలదిమందియో యున్న యెడల నుద్యోగముల కొరకు పట్టణములకు పోవుచున్నారు. ఉద్యోగములలో నున్న వారికి సరిగా భార్యాబిడ్డల ముఖములనైనా చూచి యానందించుటకు సావకాశము చిక్కదు. ఈ పరిసితులలో బత్రికలు దీనదశ యందున్నవనిన వింతలేదు. ఇది యిటుండ ముద్రణాశాసనము, మాననష్టవు దావాలు, క్షమాపణలు స్వాతంత్య్య విహీనత, నిత్యము మన పత్రికల నెదుర్కొను చున్నవి. స్వేచ్భాజీవనము లేని దేశములో పత్రికలు సజీనములై మెట్లుండగలవు? వీటిని వారములు చేసి జీవించు విడ్యార్థికి బోల్చవచ్చును. ఏరోజున యెవరింట్లో భోజనమో నారి యిష్టాయిష్టముల ననుసరించి వర్తించుచు, వారు పెట్టినది తని సంతృప్తి చెందవలసిన స్ధితి వారములు చేసి జీవించు విద్యార్థిది"[13] - 1928 ఏప్రిల్ నాటి ఆంధ్రభారతి సంపాదకీయంలో రాసిన ఈ వాక్యాలు పత్రికల ఆర్థిక దుస్థితికీ, ప్రభుత్వ నిర్బంధానికీ అద్దం పడుతాయి.
అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ దశాబ్దాల తరబడి సాగిన పత్రికలు కొన్ని ఉన్నాయి.
బ్రిటిషు ప్రభుత్వం అనేక సందర్భాల్లో పత్రికలపై ఆంక్షలు విధిస్తూ వివిధ చట్టాలు చేసింది. 1823 లో తెచ్చిన నియంత్రణ చట్టంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దాని 1835 లో మరొక చట్టం తెచ్చింది. దీన్ని మెట్కాఫ్ చట్టం అంటారు. గత చట్టం తెచ్చిన అనేక ఆంక్షలను ఈ చట్టం తొలగించింది. ఈ కారణంగా పత్రికల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలుగు పత్రికల సంఖ్య కూడా బాగా పెరిగింది. 1957 లో మొదటి స్వాతంత్ర్య యుద్ధం తరువాత ప్రభుత్వం మళ్ళీ మరిన్ని ఆంక్షలు విధించింది. ఏ పత్రికనైనా, పుస్తకాన్నైనా ప్రచురణ కాకుండా నిలిపివేసే అధికారాన్ని ప్రభుత్వం తీసుకుంది. 1867 లో వచ్చిన మరో చట్టంతో, పత్రికలు ప్రతి సంచిక లోనూ ప్రచురణ కర్త పేరు, ముద్రాపకుని పేరు, ప్రచురణ ప్రదేశాలను తప్పనిసరిగా ప్రచురించాలని పేర్కొంది. అలాగే పుస్తకాన్ని ప్రచురించిన నెల లోపు ఒక కాపీని ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ చట్టం తరువాత, అధికారులు పత్రికలపై ప్రభుత్వానికి రహస్య నివేదికలు పంపడం మొదలైంది.
అ తరువాత 1878 లో బ్రిటిషు ప్రభుత్వం, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ పేరుతో ఒక చట్టం తెచ్చింది. ఇంగ్లీషేతర పత్రికలపై పలు ఆంక్షలు విధించింది. ప్రజల్లో జాతీయ భావనలను రేకెత్తించకుండా పత్రికల నోరు నొక్కేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉద్దేశించింది. ఈ చట్టం పట్ల వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత కారణంగా 1881 లో ప్రభుత్వం దీన్ని రద్దుచేసింది.
1908, 1910 సంవత్సరాల్లో తెచ్చిన రెండు చట్టాలు పత్రికలపై ఆంక్షలను తిరిగి తెచ్చాయి. 1921 లో ఈ రెంటినీ రద్దుచేసారు. 1931 లో మరొక చట్టం వచ్చింది. శాసనోల్లంఘన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బ్రిటిషు ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉద్దేశించింది.
హైదరాబాదు రాజ్యంలో కూడా పత్రికలపై ఆంక్షలు ఉండేవి. పత్రికలు, ఏడు షరతులతో కూడిన ఎకరార్ నామా అనే ఒక డిక్లరేషను ప్రభుత్వానికి ఇవ్వాల్సి వచ్చేది. నైజాం, బ్రిటిషు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏమీ రాయకూడదు, మత కలహాలను రెచ్చగొట్టే రాతలు రాయకూడదు, ప్రభుత్వాధుకారులను విమర్శించకూడదు వంటివి ఆ ఏడు ఆంక్షల్లో ఉన్నాయి. వీటిని ఉల్లంఘించే పత్రికలను మూయించే అధికారం పోలీసులకు ఇచ్చారు.
బ్రిటిషు పాలనా కాలంలో పరిపాలనకూ, రాజకీయాలకూ సంబంధించి వివిధ పత్రికలలో వెలువడ్డ వార్తలపై ప్రభుత్వానికి రహస్య నివేదికలు పంపే అధికారులుండేవారు. వివిధ భాషల పత్రికలలో వచ్చిన వార్తలను అనువదించి నెలవారీగా నివేదికలు పంపేందుకు అనువాదకులు ఉండేవారు. ఇలా నివేదికలు పంపడం 1868 లో మొదలైంది. తెలుగు పత్రికలపై తొలుత టి.జి.ఎం.లేన్ అనే అనువాదకుడు ఈ నివేదికలు పంపేవాడు. ఆ తరువాత గుస్టావ్ ఓపర్ట్ పంపేవాడు.
పరిపాలనపై పత్రికల్లో ఫిర్యాదులేమైనా వస్తే, వాటిలోని వాస్తవాలను నిర్థారిస్తూ, వాటిపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదిక ఉండాలి. ఒకవేళ ఆ వార్త అవాస్తవమైతే, దానికి మూలం ఏంటో, అసలు వాస్తవమేంటో తెలుపుతూ నివేదిక పంపాలి అని ప్రభుత్వం ఆదేశించింది.[14] స్థానికుల యాజమాన్యంలో నడిచే పత్రికల్లో రాజకీయ వార్తలను ప్రచురించే పత్రికలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టేది. ఆ పత్రికలలో జరిగే మార్పుల గురించి ఎప్పటికప్పుడు సి.ఐ.డి కి నివేదిక పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.[15]
ఈ రహస్య నివేదికలో ఆయా పత్రికల్లో పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన సామాజిక వార్తలు, విశేషాలతో పాటు ఆయా పత్రికల సర్క్యులేషను సంఖ్యలను కూడా పంపేవారు.[16]
19 వ శతాబ్ది చివరి సంవత్సరాల్లో వెలువడిన పత్రికలు ప్రధానంగా ఐదు - వివేకవర్థని, హిందూజన సంస్కారిణి, ఆంధ్ర ప్రకాశిక, సుజన మనోల్లాసిని, రసికోల్లాసిని. వీటి సర్క్యులేషను వందల్లోనే ఉండేది. 1877 లో పురుషార్థ ప్రదాయినికి 240, వివేకవర్థనికి 300, స్వధర్మప్రకాశినికి 360, ఆంధ్రభాషాసంజీవనికి 150, సకలవిద్యాభివర్థినికి 300, విశ్వకర్మకులసంప్రదాయప్రబోధినికి 40 సర్క్యులేషన్లు ఉన్నాయని ప్రభుత్వ రహస్య నివేదికలో రాసారు. 1884 జూలై నివేదికలో శ్రీ సన్మార్గదర్శిని, శ్రీ ప్రకాశిక అనే పత్రికలు చోటుచేసుకున్నాయి. 1885 లో మొదలైన ఆంధ్ర ప్రకాశికకు 1887 లో 500 ప్రతుల సర్క్యులేషనుండేది. వివేకవర్థిని 300, హిందూజన సంస్కారిణి 100, సుజన మనోల్లాసిని 64, రసికోల్లాసిని 200 ప్రతులతో వెలువడేవి. ఈ నివేదికల్లో 1879 లో వర్తమానరత్నాకరం అనే వారపత్రికలో వచ్చిన వార్తలు ఎక్కువగా ప్రస్తావనకు వచ్చేవి. ఇది మద్రాసు నుండి వెలువడేదని, దాని సర్క్యులేషను 100 అనీ 1879 జూలై నెల నివేదికలో రాసారు.[16]
1910 ల నాటికి పత్రికల సర్క్యులేషను వందల నుండి వేలకు చేరింది. 1911 జూలై నాటికి వెయ్యి సర్క్యులేషను దాటిన పత్రికలు మొత్తం 12 ఉండేవి. ఆనాటి ప్రభుత్వ నివేదికలో మొత్తం 50 వరకూ తెలుగు పత్రికలు చోటు చేసుకోగా వీటన్నిటి మొత్తం నెలవారీ సర్క్యులేషను 75 వేల వరకూ ఉంది.
తెలుగుతో పోలిస్తే, మిగతా దక్షిణ భారత భాషలైన తమిళం, మలయాళం, కన్నడంలలో పత్రికల సంఖ్య, వాటి సర్క్యులేషను రెండూ ఎక్కువగానే ఉండేవి.
20 వ శతాబ్దిలో తెలుగు పత్రికల సర్క్యులేషను బాగా పెరిగింది. 2013 జనవరి - జూన్ కాలానికి ఎబిసి విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికల ఉమ్మడి సర్క్యులేషను 35,30,263. ఇది అంతకు ముందరి ఆరు నెలల కాలంతో పోలిస్తే 4 శాతం ఎక్కువ. మిగతా పత్రికల సర్క్యులేషను 3,19,746. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 3,04,178 గా ఉంది.[17]
తొలినాళ్ళలో పత్రికల మధ్య సత్సంబంధాలుండేవి, వివాదాలూ ఉండేవి. ఒక పత్రిక గురించి మరొక పత్రికలో పరిచయ వ్యాసాలు, సమీక్షలూ ఉండేవి. కొత్తగా వచ్చిన గ్రంథాలనూ, పత్రికలనూ పరిచయం చేసేందుకు వివిధ పత్రికల్లో ప్రత్యేకంగా శీర్షికలుండేవి. ఉదాహరణకు 1912 అక్టోబరు హిందూజన సంస్కారిణి పత్రికలో ఆంధ్ర ప్రకాశిక గురించి వచ్చిన వార్తను చూడవచ్చు.[18]తెలుగు జనానా పత్రికలో గౌతమి అనే కొత్త దినపత్రిక గురించి సుదీర్ఘ పరిచయంలో, “ఈ యాగస్టు నెల మొదట గౌతమి యను పేరనొక యాంధ్రవారవత్రిక యనుదినమును రాజమహేంద్రవరమున బ్రచురమగుచున్నది. ఈ పత్రిక యొక్క 1,2,8 వ సంచికలు వందన పూర్వకముగా నందుకొన్నారము. పత్రిక అరఠావు కాగితము పరిమాణము గలది. ప్రతిసారినేదో యొక ముఖ్యవ్యాఖ్యానమును, కొన్ని చిన్న వ్యాసములను, వృత్తాంతములను ముద్రితములగుచున్నవి. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రహసనములు గూడ గలవు.” అని రాసారు.[19]
1934 లో ధర్మసాధని పత్రిక ప్రబుద్ధాంధ్ర గురించి “ఇది భాషాభిమానులకు సంతోషము కల్పించు చౌక పత్రిక” అని రాసింది. 1934 ఫిబ్రవరిలో ఆంధ్రభూమి "ప్రబుద్ధాంధ్ర చందాదారుల సంఖ్య 2700. నేడు 'వినోదిని' తప్ప అంతమంది చందాదారులు గల మాస పత్రిక మరి యొకటి లేదు...” అని రాసింది.[20]
ఒక్కో ప్రచురణకర్త లేదా సంపాదకుడు ఒకటి కంటే ఎక్కువ పత్రికలను ప్రచురించడం ఎక్కువగానే ఉండేది. ఉదాహరణకు కందుకూరి వీరేశలింగం వివేకవర్థని, శ్రీ చింతామణి, సతీహిత బోధిని, సత్యవాది అనే పత్రికలను నడిపాడు. సత్తిరాజు సీతారామయ్య ఏలూరు నుండి హిందూసుందరి, లావర్తమాని, దేశోపకారి అనే పత్రికలను ప్రచురించాడు.[2] సహజం గానే ఒకదాని గురించి మరొకదానిలో రాసేవారు.
పత్రికలు ప్రచురించే కాలాన్ని అనుసరించి దిన, వార, పక్ష, మాస పత్రికలుగా, పత్రికల్లో ప్రచురితమయే అంశాలను అనుసరించి వార్త, సాహిత్య, ఆర్థిక, సాంకేతికాది పత్రికలుగా, ప్రచురణ పొందే పద్ధతులను బట్టి అచ్చు, రాత, గోడ పత్రికలుగా విభజించుకోవచ్చు.
రోజుకు ఒక సంచికగా వెలువడే పత్రికలను దినపత్రికలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా వార్తా పత్రికలు దినపత్రికలుగా వెలువడుతూంటాయి. తెలుగులో మొట్టమొదటి దినపత్రిక దేశాభిమాని. ఇది బెజవాడ నుండి వెలువడేది. మొదట 'కృష్ణావృత్తాంతిని' అనే పేరుతో మొదలైంది. ఆ తరువాత 'కృష్ణాన్యూస్' అని పేరు మార్చుకుంది. చివరికి దేశాభిమానిగా మారింది. ప్రచురణ స్థలం కూడా గుంటూరుకు మారింది. మొదట ఇది వారపత్రికగా నడచి 1901 నాటికి దినపత్రికగా మారింది.[4]
సమాచార వ్యవస్థ వేగంగా లేని రోజుల్లో ఉదయం రావాల్సిన పత్రికలు మధ్యాహ్నం పాఠకుని చేతికి అందేవి. ఈ నేపథ్యంలో తెల్లవారేసరికల్లా పాఠకుని చేతికి అందడాన్ని సవాలుగా స్వీకరించిన పత్రికలు సర్క్యులేషన్లో ముందుకు వెళ్ళి ఇతర పత్రికల్ని వెనక్కి నెట్టాయి.
వారానికి ఒక సంచిక వెలువరించే పత్రికలను వారపత్రికలు అంటారు. ప్రస్తుతం ప్రముఖ వారపత్రికలుగా వెలుగొందుతున్నవి స్వాతి సపరివార పత్రిక, ఆంధ్రభూమి, నవ్య వారపత్రిక మొదలైనవి.
ఆంధ్రభూమి మాసపత్రిక, స్వాతి, తెలుగు వెలుగు, విపుల,చతుర,ధైవమ్ , దర్శనమ్, సన్నిధానమ్ ఆధ్యాత్మిక మాస పత్రిక,ప్రయోక్త తెలుగు జాతీయ మాసపత్రిక,రాయలసీమ జ్యోతి,వాయిస్ ఆఫ్ ఇండియా.