బాలభారతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాలభారతి అనేది ఒక పిల్లల మాసపత్రిక[1]. వెల్లంపల్లి వెంకట నరసింహారావుచే స్థాపింపబడింది.

విశేషాలు[మార్చు]

1975 నుండి బాలభారతి జానపద బాలల నవలలు ప్రచురిస్తూ 1978లో పత్రికను ప్రారంభించారు. అప్పటినుండి నేటి వరకు నిర్విరామంగా ప్రచురింపబడుతుంది. ఆయన 1994లో స్వర్గస్తులైనాడు. అనంతరం ఆయన సతీమణి శ్రీమతి వెల్లంపల్లి బాలభారతి, పుత్రుడు వెల్లంపల్లి ప్రేంకుమార్, వెల్లంపల్లి శ్రీహరి కొనసాగించడం జరిగింది. వీరు బాలభారతి పత్రికతోపాటు జ్ఞానమార్గం భక్తి టుడే, ఆయుర్వేదం టుడే, జ్యోతిష్యం టుడే, యోగ టుడే, హంగామా అనే పత్రికలను సైతం స్థాపించి ప్రచురించసాగారు. తెలుగు వారి పట్ల వీరి కృషిని గుర్తించి దక్షిణ భారత తెలుగు సంక్షేమ సంఘం వారు 2010 జూన్ 27న సన్మానం చేయడం గుర్తించదగిన విషయం.

బాలభారతి పత్రిక కార్యాలయం నెంబరు6 పద్మనాభం పిళ్లై వీధిలో ఉండేది. వి.వి.నరసింహారావు ఇల్లు కూడా అదే. బాలభారతికి సర్క్యులేషన్ మేనేజరుగా యామిజాల జగదీష్ ఉండేవాడు. డిటెక్టివ్, జానపద నవలల సర్క్యులేషన్ విభాగాన్ని శ్రీదేవి (హాస్యనటుడు పద్మనాభం కూతురు), కృష్ణకుమారి (తర్వాతి కాలంలో ఘంటసాల రత్నకుమార్‌ని పెళ్ళి చేసుకున్నారు) చూసేవారు. ఈ పత్రికకు కాళహస్తికి చెందిన శశిభూషణ్ ఎడిటర్ గా ఉండేవాడు. అతను బాలభారతి కథల ఎంపిక, ఎడిట్ చేయడంతో పాటు డిటెక్టివ్ నవలలుకూడా రాసేవాడు. కొన్ని కారణాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ( విజయవాడ, సినీగేయ రచయిత ) బాలభారతికి ఎడిటర్. ఆ తర్వాత ముంగర కోటేశ్వరరావు (తెనాలి) సంపాదకుడయ్యాడు.

డిటెక్టివ్, జానపద నవలల రచనలను కృష్ణమోహన్, శ్రీసాయిశ్రీ, ఎంఆర్ఎన్ ప్రసాదరావు, నారాయణ రెడ్డి (ఈయన కలం పేరు కిరణ్ కుమారి) లు చేసేవారు. అలాగే బాలభారతిలో ఒకప్పుడు హస్తసాముద్రిక రచన వేస్తుండేవారు. దీనిని వీరభద్రరావు గారు రాసేవారు. ఇక బొమ్మల విషయానికొస్తే జయ ( చందమామ ఆర్టిస్ట్), బాషా, దేవీ ప్రసాద్ , మురళీ, వీరా తదితరులు వేసేవారు. చిత్రకారులు గీసిచ్చిన బొమ్మలను యజమాని నరసింహారావుగారు క్షుణ్ణంగా పరిశీలించే వారు. ఏమాత్రం నచ్చకున్నా మార్చి ఇవ్వమని సూచనలు చేసేవారు. మ్యాగజైన్ తోపాటు ఇతర పుస్తకాల డెస్పాచ్ పనులన్నీ నరసింహారావుగారి తమ్ముడు వి. పూర్ణచంద్రరావు చూసుకునే వాడు. ఆ రోజుల్లో బాలభారతి సంచిక దాదాపు ఇరవై అయిదు వేల కాపీల దాకా సర్క్యులేషన్ ఉండేది. నరసింహారావుగారు "కాలం" చేసిన తర్వాత ఆయన కుమారులిద్దరూ (శ్రీహరి, ప్రేమ్ కుమార్) పట్టుగా బాలభారతిని ఇప్పటికీ నడిపిస్తున్నారు.[2]

మూలాలు[మార్చు]

  1. "పుస్తక లోకం – పుస్తకం.నెట్". pustakam.net. Retrieved 2023-07-16.
  2. "బాలభారతి నా మూడో సోపానం ----బాలభారతి....పిల్లల మాసపత్రిక". 2020-03-27. Retrieved 2023-07-16.
"https://te.wikipedia.org/w/index.php?title=బాలభారతి&oldid=3933480" నుండి వెలికితీశారు