Jump to content

శ్రీసాధన పత్రిక

వికీపీడియా నుండి
శ్రీ సాధన పత్రిక
రకంప్రతి శనివారం, వారపత్రిక
రూపం తీరుటాబ్లాయిడ్
యాజమాన్యంపప్పూరు రామాచార్యులు
ప్రచురణకర్తపప్పూరు రామాచార్యులు
సంపాదకులుపప్పూరు రామాచార్యులు
Staff writersకర్నమడకల రామకృష్ణమాచార్యులు - సహ సంపాదకుడు
స్థాపించినది1926-08-14
కేంద్రంఅనంతపురం

రాయలసీమ ప్రాంతంలో రాజకీయ చైతన్యం కలిగించే ఆశయంతో శ్రీసాధన పత్రిక[1] అనే రాజకీయ వారపత్రిక ప్రారంభించబడింది. ప్రతి శనివారం వెలువడే ఈ పత్రిక తొలి సంచిక 1926 ఆగస్టు 14వ తేదీ వెలువడింది. పప్పూరు రామాచార్యులు దీని వ్యవస్థాపకుడు. సంపాదకుడు.

చరిత్ర

[మార్చు]

ఈ పత్రిక ప్రారంభించడానికి ముందు 1922లో పప్పూరు రామాచార్యులు, కైప సుబ్రహ్మణ్యశర్మ, అతని తమ్ముడు మహానందయ్య, రామచంద్రశర్మ, ఐతరాజు నరసప్ప, ఆత్మారామప్పలతో కలిసి పినాకిని అనే పత్రికను ప్రారంభించాడు.[2] ఆ పత్రిక 1925వరకు చక్కగా సాగింది. అభిప్రాయభేదాల వల్ల పప్పూరు రామాచార్యులు పినాకిని నుండి బయటకు వచ్చి శ్రీసాధన పత్రికను స్థాపించాడు. పినాకిని కేవలము కాంగ్రెస్ పక్షపాతి అని సాధనపత్రిక అన్ని పక్షములవారి యెడల సానుభూతితో వ్యవహరిస్తుందని తొలి సంచికలో పేర్కొనబడింది. 1932లో సహాయనిరాకరణోద్యమము సందర్భంగా కొంతకాలం ఈ పత్రిక ఆగిపోయింది. తరువాత 1934 ఆగస్టు 18న పునఃప్రారంభమైంది. 1940 మార్చి నెలలో శ్రీసాధన పత్రిక, సాధన ముద్రణాలయాన్ని లిమిటెడ్ కంపెనీగా మార్చారు. డైరెక్టర్లుగా పప్పూరు రామాచార్యులు, కల్లూరు సుబ్బారావు, కె.ఎస్.రాఘవాచార్యులు తదితరులు ఉండేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పప్పూరు రామాచార్యులు జైలు జీవితం గడిపాడు. ఆ సమయంలో పత్రిక కొంతకాలం ఆగి తిరిగి ప్రారంభమైంది. ఈ పత్రిక పప్పూరు రామాచార్యులు మరణించేవరకు అంటే 1972వరకు పైన పేర్కొన్న సందర్భాలలో మినహా నిరాటంకంగా కొనసాగింది. తరువాత దీనిని పప్పూరు రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యులు 1996 -97 ప్రాంతాలవరకు నడిపాడు.

ఇతర విశేషాలు

[మార్చు]

12 పేజీల ఈ వారపత్రిక మొదటి పుట ప్రధాన శీర్షిక క్రింది భాగాన భారతంలోని

ఆ||వె|| కార్యగతుల తెఱగు కలరూపు చెప్పిన
నధికమతులు దాని నాదరింతు
రల్ప బుద్ధులైనయట్టి వారలకది
విరసకారణంబు విషమువోలె

అనే పద్యాన్ని ప్రచురించేవారు. 1927 సెప్టెంబరు 3 నుండి ప్రధాన శీర్షిక క్రింద వాయిస్ ఆఫ్ ది సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనే ఉపశీర్షికను చేర్చి ప్రచురించారు. దీనిని 1929 మార్చి 16 నుండి వాయిస్ ఆఫ్ ది రాయలసీమ గా సవరించారు.

అంశాలు

[మార్చు]

రాజకీయ వారపత్రిక కనుక దీనిలో ప్రధానంగా రాజకీయ వార్తలు ప్రచురించేవారు. మాండలిక వృత్తాంతాలు, సమగ్రమైన ప్రపంచ వృత్తాంతాలు, శాసనసభలోని చర్చలు, తీర్మానాలు, రాజకీయ వృత్తాంతాలు ప్రచురించేవారు. సహాయనిరాకరణ ఉద్యామానికి, మద్యపాన నిషేధానికి, హరిజనోద్ధరణకు చెందిన వార్తలు ప్రకటించారు. కేవలము రాజకీయ వార్తలు, విశ్లేషణలే కాకుండా సామాజిక, ఆర్థిక అంశాలు, కవిత్వము, కథలు, నాటికలు, నాటకవిమర్శలు, లేఖాసాహిత్యం, యాత్రాచరిత్ర, శాసనపరిశోధన, భాషా, సాహిత్యవిమర్శలు, పుస్తక సమీక్షలు, పుస్తక విమర్శలు, సాహిత్య సంస్థల కార్యకాలాపాలు మొదలైన సాహిత్యాంశాలు ఈ పత్రికలో ప్రచురింపబడినాయి. ముఖ్యంగా సామాజిక స్పృహ నింపిన తొలి నాటికలు అనదగిన ఓట్లనాటకం, కల్లుపెంట, స్త్రీవిద్య, ఆరోగ్య నాటకం, గంగా భాగీరథి మొదలైన నాటికలు ఈ పత్రికలో వెలువడ్డాయి.

రచయితలు

[మార్చు]

ఈ పత్రిక వెలువడిన కాలంలో ఉన్న రాయలసీమ ప్రాంతంలోని రచయితలందరూ దాదాపు దీనిలో రచనలు చేశారు. ఈ పత్రికకు తమ రచనలద్వారా తోడ్పడిన కొందరు రచయితలు - బేవినహళ్ళి కృష్ణారావు, కిరికెర రెడ్డి భీమరావు, పాదిరాజు కృష్ణారావు, విద్వాన్ విశ్వం, తలమర్ల కళానిధి, బత్తలపల్లి నరసింగరావు, రామకృష్ణ సీతారామ కవులు, కర్రా సుబ్బలక్ష్మమ్మ, టి.గురుమూర్తి, శొంఠి శ్రీనివాసమూర్తి, చిలుకూరు నారాయణరావు, కె.వి.రామకృష్ణారెడ్డి, గొట్టిపాటి సుబ్బరాయచౌదరి, కుంటిమద్ది శేషశర్మ, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, అనుముల వెంకటశేషకవి, కల్లూరు అహోబలరావు, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, చిట్టా రామకృష్ణారావు, అవ్వారి నారాయణ, కందాళ శేషాచార్యులు, హెచ్.నంజుండరావు, వి.ఖండేరావు, టి.శివశంకరం పిళ్లె, రాళ్ళపల్లి గోపాలకృష్ణశర్మ, వార్తకవి రామచంద్రరావు, కలచవీడు శ్రీనివాసాచార్యులు మొదలైనవారు.

శీర్షికలు

[మార్చు]

ఈ పత్రికలో నిర్వహింపబడిన కొన్ని శీర్షికలు

  • చినుకులు
  • విజ్ఞానతరంగిణి
  • విశ్వభావన[3]
  • మాటా-మంతి
  • వింత ప్రపంచం
  • జిజ్ఞాస

అభిప్రాయాలు

[మార్చు]
  • ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, శ్రీసాధనపత్రిక త్రిఫలరసాయనంగా మాకు బలవర్ధకమయ్యాయి - వావిలాల గోపాలకృష్ణయ్య
  • శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారు ఏర్పరచిన ఒరవడిలో పప్పూరు వారు పత్రికారచన సాగించారు. సత్యం కఠోరమైనది. కావున సత్యవాక్యరచన వలన ఆచార్యులవారికి కష్టనిష్టూరాలు తప్పలేదు - సర్దేశాయి తిరుమలరావు
  • పప్పూరు వారు శ్రీసాధన అతి సమర్థతతో చాకచక్యంగా తెనాలి రాముని చతురతతో సాగించారు. వారిదొక ప్రత్యేకమైన, చమత్కారమైన శైలి.సృష్టి కారకమైనది. ఉద్యోగులకే కాక వెర్రిపనులు చేయసాహసించు కాంగ్రెస్ వారిపై కూడా కొరడాగా వుండేది - ఆచార్య రంగా
  • సాధన పత్రిక సాధించిన విజయాలు ఘనమైనవి. సంఘంలోని కుళ్ళును, ప్రభుత్వ ఉద్యోగములలోని అవినీతిని సాధన తీవ్రంగా విమర్శించేది.ఉద్యోగులకు సాధన పత్రికంటే గుండె గుభేలుమనేది. - తిరుమల రామచంద్ర
  • మనజిల్లాలో మారుమూలలకు పోయే పత్రిక ఏదైనా ఉందీ అంటే అది సాధన పత్రిక మాత్రమే! గ్రామీణులకు ప్రపంచజ్ఞానం, రాజకీయ చైతన్యం కలిగించడానికి సాధన ద్వారా జరిగిన కృషి మహత్తరమైనది. ఆ రోజులలో సాధన పత్రిక ప్రజావాణిగా జాతీయ కాంగ్రెస్ సందేశాన్ని తెలిపేదిగా పనిచేసింది.రామాచార్యులు ఎవరేమనుకున్నా, ఎన్ని కష్టనిష్టూరాలు ఎదురైనా జానికి గొంకు లేకుండా సాధన ద్వారా నిజాలను బయటపెట్టేవారు - ఐదుకల్లు సదాశివన్

మూలాలు

[మార్చు]
  1. సీమ సాహితీస్వరం శ్రీ సాధనపత్రిక - డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి- జెన్నె మాణిక్యమ్మ పబ్లికేషన్స్, అనంతపురం
  2. వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక సంచిక అనంతనేత్రం - పుట 35-38
  3. వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక సంచిక అనంతనేత్రం - పుట 97