కల్లూరు సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్లూరు సుబ్బారావు
కల్లూరు సుబ్బారావు
జననంకల్లూరు సుబ్బారావు
1897 మే 25
మరణం1973
ఇతర పేర్లుకాంగ్రెస్ పులి
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధుడు,తెలుగు, కన్నడ పండితుడు, వక్త , కవి
తండ్రిసూరప్ప,
తల్లిపుట్టమ్మ

కల్లూరు సుబ్బారావు (1897 - 1973), అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త, కవి. వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920లలో స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు.

సుబ్బారావు, అనంతపురం జిల్లా, హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897, మే 25న సూరప్ప, పుట్టమ్మ దంపతులకు జన్మించాడు. మదనపల్లెలోని జాతీయ కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నాడు. 17 ఏళ్ల వయసులో అనీబిసెంట్ ప్రసంగాన్ని విని, ఉత్తేజితుడై, జాతీయోద్యమంలో పాల్గొనటం ప్రారంభించాడు. 1920లో జరిగిన ఆంధ్రమహాసభలో పాల్గొని, అయ్యదేవర కాళేశ్వరరావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య లతో స్నేహం పెంపొందించుకున్నాడు. 1921లో విజయవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు సమావేశాల్లో స్వచ్ఛందసేవకునిగా పనిచేశాడు. అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళి, మొత్తం ఏడేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాడు. ఆంగ్లేయులు ఈయన్ను కాంగ్రెస్ పులి అని అభివర్ణించారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈయన్ను జైలుపట్టభద్రుడుఅని కొనియాడాడు. సుబ్బారావు లోకమాన్య అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు.

స్వాతంత్ర్యం తర్వాత మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర శాసనసభకు, 1965లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. 1955లో శాసనసభ డిప్యూటీ స్పీకరుగా కూడా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 1967లో భారత ప్రభుత్వం ఈయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సుబ్బారావు 1973, డిసెంబరు 21న[1] మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 32