ఈమాట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈమాట
"ఈమాట" మార్చి 2009 సంచిక తెరపట్టు

ఎల్లలు లేని ప్రపంచానికి ఎలక్ట్రానిక్ తెలుగు పత్రిక
రకముద్వైపాక్షిక పత్రిక
ఫార్మాటుజాలపత్రిక

యాజమాన్యం:
ప్రధాన సంపాదకులు:మాధవ్ మాచవరం
సహ సంపాదకుడు:పాణిని శంఖవరం
స్థాపన
రాజకీయ పక్షమురాజకీయాలకు అతీతం
భాషతెలుగు
ప్రధాన కేంద్రము

వెబ్‌సైటు: http://eemaata.com/

ఈమాట ఒక తెలుగు అంతర్జాల పత్రిక. ఇది ఇంటర్నెట్లో ప్రచురించబడుతున్న మాసపత్రిక. ఇది ప్రధానంగా అమెరికాలోని ప్రవాసాంధ్రులచే నడుపబడుతున్నది. తెలుగులో అంతర్జాల పత్రికలు దాదాపుగా లేని 1998లోనే ప్రారంభమైన ఈమాట పత్రిక అప్పటి నుంచీ నడుస్తూనేవుంది. మొదట్లో మాసపత్రికగా ప్రారంభమైన ఈమాటను ప్రస్తుతం ద్వైమాసికంగా వెలువరిస్తున్నారు. పత్రికకు ప్రస్తుతం మాధవ్ మాచవరం, పాణిని శంఖవరం సంపాదక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పూర్వసంపాదకుల్లో ప్రముఖ రచయితలు, సాహిత్యవేత్తలు కె. వి. ఎస్. రామారావు, కొలిచాల సురేశ్, కొంపెల్ల భాస్కర్, విష్ణుభొట్ల లక్ష్మన్న, ఇంద్రగంటి పద్మ, వేలూరి వేంకటేశ్వర రావులు ఉన్నారు.

లక్ష్యాలు[మార్చు]

ఈ మాట గురించి సంపాదకులు తమ పత్రికలో ఇలా చెప్పారు -

సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం, ఒక మంచి సాహిత్య పత్రికను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్థాపించిన పత్రిక, ఈమాట. లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే ఈమాట లక్ష్యం. 1998 దీపావళి నాడు విడుదలైన మొదటి సంచిక నుంచి ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఈ పత్రిక ఇలా పెరగడానికి కారణం, ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే. పాఠకుల వెసులుబాటు కోసం ఈమాటని మూడు పద్ధతుల్లో ప్రచురిస్తున్నాం. యూనికోడ్‌లో చదవడం ఉత్తమమైన పద్ధతి. మీ కంప్యూటర్లపై యూనికోడ్ చదివే సదుపాయం లేకపోతే ఈమాటను తెలుగు లేదా రోమన్ లిపిలొ చదువుకునే వెసులుబాటు ఉంది. ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఈమాట ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన సహకారాన్ని కోరుతున్నాం.[1]

ప్రచురణా విధానం[మార్చు]

ఈమాట పత్రిక సంపాదకులు పేర్కొన్నదాన్ని అనుసరించి ఈమాట పత్రిక ప్రచురణా విధానం కింది విధంగా ఉంటుంది:

 • ప్రతి పేజీ నుంచీ ఈమాటలో రచనలనిని పూర్తిగా తెలుగులో కూడా వెతకగలిగే సౌకర్యం.
 • ప్రతి రచన గురించీ మీ అభిప్రాయం అదే పేజీలో తెలుగులో కూడా తెలియచేయగలిగే సౌకర్యం.
 • ఏ రచయిత రచనల నైనా ఒకే పేజీలో చదవగలిగే సౌకర్యం.
 • మరికొన్ని ఉపయోగ్యతా పెంపుదలలు (usability enhancements)
 • కంటికింపైన రంగులు, పాత సంచికల సూచిక, శీర్షికల సూచిక

సంపాదక వర్గం[మార్చు]

ప్రస్తుతం (2015లో) ఈమాట సంపాదక వర్గంలో మాచవరం మాధవ్, శంఖవరం పాణిని ఉన్నారు.

విశ్రాంత సంపాదకులు
 • వేలూరి వేంకటేశ్వర రావు
 • ఇంద్రగంటి పద్మ
 • కె.వి.ఎస్.రామారావు
 • కొలిచాల సురేశ్
 • కొంపెల్ల భాస్కర్
 • విష్ణుభొట్ల లక్ష్మన్న

పాలసీలు[మార్చు]

ఈమాట పత్రిక రచనల స్వీకరణ, ప్రచురణల్లో సమీక్షా పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ పద్ధతిలో మొదట రచనలను సంపాదకులు పరిశీలిస్తుంటారు, ఆపైన అవసరమైతే తత్సంబంధిత రంగాల్లో నిపుణులైన ఇతర విమర్శకులు ఇద్దరితో సమీక్షింపజేస్తారు. ఆ సమీక్షావివరాలు రచయితలకు అందజేసి కొద్దిస్థాయిలో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మార్పులు లేకుండానే తమ రచనలు ప్రచురణ కావాలని రచయితలు భావిస్తే ఆ రచన ఈమాట వారు తిరస్కరించడమో, రచయిత ఉపసంహరించుకోవడమో జరుగుతుంది. రచయితలతో సంప్రదింపుల ఫలితంగా ప్రచురణార్హమైన రచనలను తుదిగా నిర్ణయిస్తారు. ఈ పద్ధతిని కొందరు రచయితలు, సాహిత్యవేత్తలు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానంగా రచనల్లో ఉన్నత విలువలు నెలకొల్పేందుకు ఉద్దేశించే తాము ఈ పీర్ రివ్యూ విధానం ప్రవేశపెట్టామని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన పద్ధతి అని తెలుగువారు అలవాటుపడితే సరిపోతుందని సమాధానమిస్తున్నారు. ఇతర పత్రికల్లో సంపాదకులదే నిర్ణయమంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈమాటలో మాత్రం ఈ విధమైన పీర్ రివ్యూ పద్ధతితో రచయితలు, సమీక్షకులు, సంపాదకులు సమష్టి నిర్ణయంతో వ్యవహరిస్తున్నామని వ్రాశారు.[2]

రచనలు[మార్చు]

ఈమాట పత్రికలో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలు ప్రచురిస్తారు. రచనల్లో ప్రవాసాంధ్రుల జీవితం, అనుభవాలు, అనుభూతులు వంటివాటికి ప్రాధాన్యత ఇచ్చినా తెలుగు సంస్కృతీ సమాజాలకు సంబంధించిన ఏ రచన అయినా ప్రచురణార్హమేనని స్పష్టంచేశారు. ఈమాట ఆశయాలుగా సంపాదకులు, ప్రచురణకర్తలు పేర్కొన్నవి: (1) తెలుగు వారి అనుభవాల్ని అనుభూతుల్నీ జీవనాన్నీ జీవితాన్నీ ప్రతిబింబించే రచనలకి, రచయితలకి ఒక వేదిక కల్పించటం (2) ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండడం. (3) ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం.

శీర్షికలు[మార్చు]

ఈ మాటలో వచ్చే శీర్షికలు - సంపాదకీయం, సమీక్షలు, సంప్రదాయ సాహిత్యం, కథలు, కవితలు, వ్యాసాలు, అనువాదాలు, శబ్ద తరంగాలు, ఈ-పుస్తకాలు, ప్రకటనలు, ధారావాహికలు/నవలలు, జిగిరీ, తోలుబొమ్మలాట వంటివి. ఇవే కాకుండా "గ్రంథాలయం" విభాగంలో అనేక పుస్తకాలు పాఠకులకు అందించే ప్రయత్నం జరుగుతున్నది. మార్చి 2009నాటికి ఈ గ్రంథాలయంలో లభిస్తున్న పుస్తకాలు : ATA 2006, కరుణ ముఖ్యం, కళాపూర్ణోదయం, కుండీలో మర్రిచెట్టు, క్రీడాభిరామం, నిశ్శబ్దంలో నీ నవ్వులు, ప్రభావతీ ప్రద్యుమ్నం, భాషాశాస్త్రానికి మరోపేరు భద్రిరాజు, మనుచరిత్ర, మేఘదూతః, వ్యవహారికోద్యమ చరిత్ర, శిలాలోలిత, సూర్యశతకం, స్వప్నవాసవదత్తం

పాఠకుల అభిప్రాయాలు[మార్చు]

 • విష్ణుభొట్ల లక్ష్మన్న (2006 మే 2) : ఈమాట మే 2006 సంచిక చదివాను. చాలా అనందపడ్డాను! ఈమాట మెదటి సంచిక నుండి చూపిన వైవిధ్యం, ప్రవాసాంధ్రుల రచనాశక్తిని ప్రోత్సాహపరిచే ఆదర్శం, ఎటువంటి వ్యాపార, రాజకీయ, కుల, మత వర్గాల ఇజాలకు లొంగకుండా, ప్రవాసాంధ్రుల అనుభవాలు, ఆలోచనలు పంచుకునే వేదికగా నిబడి ఉండటం సామాన్యమైన విషయం కాదు! ఇందుకు కారకులైన వారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా మూడు మాటలు: (1) ప్రవాసాంధ్రులు, ప్రత్యేకంగా అమెరికాలోని తెలుగు వారు, వాసిలోనూ రాసిలోనూ వృత్తి పరంగా మాత్రమే కాకుండా, తెలుగు సాహిత్యపరంగా కూడా గమనించదగ్గ ప్రతిభ కనపరుస్తున్నారనటానికి ఈమాట ఒక నిదర్శనం. (2) ఇంటర్నెట్లో వచ్చిన, వస్తున్న మార్పుల్ని తెలుగు సాహిత్యవికాసానికి (సాహిత్యం అంటే మంచి హితం అన్న అర్ధంలో అయితే తెలుగు ప్రజల వికాసానికి) ఉపయోగించవచ్చు అన్న ఆలోచనలను అమలుచేసి చూపెట్టటం ఈమాట ద్వారా నిరూపించబడింది. (3) ఫిజిక్స్ లో చెప్పినట్లు న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా శక్తిని తయారు చెయ్యటానికి ఒక క్రిటికల్ మాస్ అవసరం. ఇప్పుడు ఈమాట ద్వారా, ప్రవాసాంధ్రుల సంఖ్య క్రిటికల్ మాస్ కి చేరుకోటం వల్ల, ప్రవాసాంధ్రుల శక్తి ఈమాట వల్ల తెలుస్తోంది. - ఇందుకు కారకులైన వారందరికీ ధన్యవాదాలు.
 • సాయిరామ్ రాజు (2009 జనవరి 9) : ఏమాటకామాటే చెప్పుకొవాలి. ఈమాట నిజంగా చాలా బాగుంది. మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈమాటలో మన మాటలు కలుపుకోవచ్చు.. మంచిచెడులు చెప్పుకోవచ్చు.

విశేషాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "మా గురించి". ఈమాట. ఈమాట బృందం. Retrieved 15 January 2015. CS1 maint: discouraged parameter (link)
 2. వెంకటేశ్వరరావు, వేలూరి (2008-11-01). "ఈమాట – నామాట". ఈమాట. 10 (నవంబర్ 2008). Retrieved 15 January 2015. CS1 maint: discouraged parameter (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ఈమాట&oldid=3006701" నుండి వెలికితీశారు