గ్రంథాలయ సర్వస్వము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రంథాలయ సర్వస్వము ఒక తెలుగు పత్రిక. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం గ్రంధాలయోద్యమాభివృద్ధి కోసం ఈ గ్రంథాలయ సర్వస్వం పత్రికను 1915 సంవత్సరం నుంచి ప్రచురణ నిర్వహిస్తొంది. ఇది దేశంలోనే పురాతనమైన ప్రాంతీయ భాషా పత్రిక. తొలినాటి సంపుటాలలో గ్రంధాలయాలకు సంబంధించిన వార్తలు, వ్యాసాలు, బాల భటోద్యమ విశేషాలు సాహిత్య చర్చలు, ఆధునిక కవుల పద్యాలు, గేయాలు, ప్రదేశాలకు చెందిన చారిత్రిక విశేషాలు, వైజ్ఞానిక రచనలు వెలువడేవి. క్రమంగా గాంధీజీ నిర్మాణ కార్యక్రమానికి చెందిన అంశాలతో పాటు, గ్రంధాలయాలు, గ్రంధ సమీక్షలను చేర్చారు.[1] ఆంధ్ర ప్రదేశ్ జిల్లా గ్రంధాలయ సంస్థ ఉద్యోగుల కొరకు పౌర గ్రంధాలయాధికారి జారీ చేసిన ఉత్తర్వులు కూడా ప్రచురించుతొంది.[2]

ప్రచురణ చరిత్ర

[మార్చు]

గ్రంధాలయ సర్వస్వం ప్రచురణకు పూర్వం గ్రంధాలయోద్యమం కొరకు పనిచేసే వారికి తమ వ్యాసాలు, వార్తలు, విశేషాలు, అభిప్రాయాలు ప్రచురించడానికి ఇతర పత్రికల మీద ఆధార పడవలసి రావడంతో సంఘం తమ స్వంత పత్రికను ఆరంభించింది. 20వ శతాబ్ది రెండవ దశకంలో 1915 లో త్రైమాసికగా ప్రారంభమైన ఈ పత్రిక రెండు సంవత్సరాల తరువాత ద్వైమాసిక పత్రికగా వెలువడింది. 6వ సంపుటము తరువాత మాస పత్రికగా ప్రచురించారు. మధ్యలో (1921) కొంతకాలం ఆగిపోయి 1928 జులైలో తిరిగి మాసపత్రికగా ప్రారంభమైంది. గ్రంధాలయ సర్వస్వం పత్రిక 1930-33 సంవత్సరాల మధ్య కాలంలో ప్రచురణ నిలచి కూడా 1934లో పునరుద్ధరించాక 11 సంపుటాలు పూర్తిచేసుకున్నది. పత్రికా ప్రచురణ కొంత ఒడుదుడులకు లోనైనప్పటికీ గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య పూనికతో తిరిగి 1948 జనవరి నుండి ప్రారంభమై ఇప్పటికీ నిర్విఘ్నంగా ప్రచురితమౌతున్నది.
1939 సెప్టెంబర్ - 1941 అక్టోబర్ ల మధ్య కాలంలో పత్రిక ఆంధ్రగ్రంధాలయం పేరుతో ఆంధ్రాంగ్ల భాషలలో త్రైమాసికగా నిర్వహించారు. ఆంగ్లంలో కూడా ప్రచురించుట వలన దీని ప్రచారం ఇతర రాష్ట్రాలకు, ఖండాంతరాలకు కూడా వ్యాపించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కాగితం కరవు ఏర్పడటంతో ప్రచురణ నిలచిపోయింది. దీనితో తెనాలి తాలుకా పెదపాలెం, అనంతపురం జిల్లా హిందూపురంలో వరుసగా జరిగిన 23,24 ఆంధ్రదేశ గ్రంధాలయ మహాసభల సంచికలను పత్రికకు బదులుగా ప్రచురించారు. అనుకూల పరిస్తితులు ఏర్పడంతో 1948 జనవరి లో ఈ సంఘ వ్యవస్థాపకులు అయ్యంకి వెంకట రమణయ్య అభీస్ఠానుసారం గ్రంధాలయ సర్వస్వంను అదే పేరుతో పునరుద్ధరించి 12వ సంపుటముగా ప్రారంభించారు. అప్పటినుంచి ఈ మాస పత్రిక క్రమంగా వెలువడుతున్నది.[1]

సంపాదకులు

[మార్చు]

ఈ గ్రంధాలయ సర్వస్వం పత్రికకు అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, గద్దె రామమూర్తి సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం పాతూరి నాగభూషణం కుమార్తె రావి శారద గ్రంథాలయ సర్వస్వం పత్రికకు 1989 వ సంవత్సరం నుండి సంపాదకులు, ముద్రణ, ప్రచురణకర్తగా కొనసాగిస్తున్నారు.వారి వివరాలు ఈ క్రింది పట్టికలో ఈయబడ్డాయి.[2]

సంపాదకులు సంపుటాలు సంవత్సరం
అయ్యంకి వెంకటరమణయ్య 1-11 1915-1938
పాతూరి నాగభూషణం 12-48 1948-1987
గద్దె రామమూర్తి 48-49 1987-1988
రావి శారద 49- 1989 -

ప్రత్యేక సంచికలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘ వివిధ సందర్భాలననుసరించి గ్రంధాలయ సర్వస్వం ప్రత్యేక సంచికలను ప్రచురిస్తొందిు. వాటిని ఒక నిర్దుష్ట విషయం లేదా సందర్భానికి సంబంధించిన సాహిత్యానికి, విశేషాలకు కేటాయిస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ సంచికలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని వివిధ ప్రభుత్వ ఇతర గ్రంథాలయాలలో "జాతీయ గ్రంధాలయ వారోత్సవాలకు సంబంధించిన అంశాలు, వార్తలు ప్రచురిస్తారు. 2010 నుండి ప్రచురించబడిన కొన్ని ప్రత్యేక సంచికలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  1. రవీంద్రుని 150వ జయంతి ప్రత్యేక సంచిక (2012 మే).[3].
  2. నాగినేని వెంకయ్య గ్రంధాలయోద్యమ రైతు నాయకులు శత జయంతి సంచిక (2013 జూలై).[4]
  3. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘ శత జయంతి ఉత్సవాల ప్రత్యేక సంచిక (2014 మే).[5]
  4. కోదాటి శత జయంతి సంచిక (2014 డిసెంబర్).[6]
  5. గ్రంధాలయ పితామహ పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, 125 వ జయంతి సంచిక (2015 జూలై).[7]
  6. రంగనాథన్ 125వ జయంతి ప్రత్యేక సంచిక (2017 ఆగస్టు).[8]
  7. వీరశలింగం శతవర్ధంతి సంచిక (2019 మే). [9]
  8. మహాత్మా గాంధీ 150వ జయంతి ప్రత్యేక సంచిక (2019 అక్టోబర్).[10]
  9. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు 60వ వర్ధంతి సంచిక (2020 మార్చి).[11]

పత్రికను ప్రచురిస్తున్న ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం 1939లో విజయవాడలో సొంత భవనాన్ని ఏర్పరచుకొని దానికి "సర్వోత్తమ భవనం" అని గాడిచెర్ల హరిసర్వోత్తమరావు పేరును పెట్టారు. రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించిన ఈ పత్రిక ప్రతులు ఇప్పుడు సర్వోత్తమ భవనంలో భద్రంగా ఉన్నాయి.

1956-57 సంవత్సరంలో ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం విశాలాంధ్ర అవతరణ అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం అయింది. భాషా పరిణామ క్రమంలో భాగంగా గ్రంథాలయ సర్వస్వము చివరి అక్షరాన్ని పూర్ణానుస్వారంగా మార్చుకొని గ్రంథాలయ సర్వస్వం అయింది.

బయటి లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 శారద, రావి. నూరేళ్ళ ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం. గ్రంధాలయ సర్వస్వం. 74/8, నవంబర్ 2013
  2. 2.0 2.1 "అంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘo.గ్రంథాలయ సర్వస్వము". Archived from the original on 2020-02-26. Retrieved 2020-04-03.
  3. గ్రంధాలయ సర్వస్వం. సంపుటి 73 సంచిక 2, మే 2012
  4. గ్రంధాలయ సర్వస్వం. సంపుటి 74 సంచిక 4, జూలై 2013.
  5. గ్రంధాలయ సర్వస్వం. సంపుటి 75 సంచిక 2,మే 2014.
  6. గ్రంధాలయ సర్వస్వం. సంపుటి 75 సంచిక 9, డిసెంబర్ 2014.
  7. గ్రంధాలయ సర్వస్వం. సంపుటి 76 సంచిక 4, జూలై 2015.
  8. గ్రంధాలయ సర్వస్వం. సంపుటి 78 సంచిక 5, అగస్ట్ 2017
  9. గ్రంధాలయ సర్వస్వం. సంపుటి 80 సంచిక 2, మే 2019
  10. గ్రంధాలయ సర్వస్వం. సంపుటి 80 సంచిక 7, అక్టోబర్ 2019.
  11. గ్రంధాలయ సర్వస్వం.సంపుటి 80 సంచిక 12,మార్చ్ 2020.