కోదాటి నారాయణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోదాటి నారాయణరావు (డిసెంబరు 15, 1914 - నవంబరు 11, 2002) గ్రంథాలయోద్యమం నేత, విశాలాంధ్ర ప్రచారకులు.

వీరు నల్గొండ జిల్లా రేపాల గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి రంగారావు గారు రేపాల కరణంగా చేసేవారు. తల్లి రంగమ్మ. రేపాలలోని శ్రీ లక్ష్మీనరసింహ మనోహర బాలభారతీ పుస్తక భాండాగారం బాల్యం నుండే అతన్ని ఆకర్షించింది. దాని కార్యకర్తగా గ్రంథాలయ మంచి చెడ్డలు చూసేవారు. ప్రాథమిక తర్వాత సూర్యాపేటలో మెట్రిక్ పూర్తిచేశారు. ఆర్థిక కారణాల వలన సాయం కళాశాలలో చేరి పట్టా పొందారు. ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. వీరు కొంతకాలం గోలకొండ పత్రికలో పనిచేసి, జర్నలిజంపై ఆసక్తి కలిగి మందుకుల నరసింగరావు సంపాదకత్వంలోని "రయ్యత్" పత్రికలో ఏజెంట్ గా పనిచేశారు. తర్వాత ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజన్సీ తీసుకోవడంతో ప్రజా జీవనంతో సంబంధంలో ఏర్పడింది.

ఉద్యమాలు, సంఘాలు[మార్చు]

వీరు అస్పృశ్యతా నివారణోద్యమం, గ్రంథాలయోద్యమం, జాతీయోద్యమం లలో ప్రముఖ పాత్ర పోషించారు. ఖమ్మంలో అస్పృశ్యతా నివారణ కోసం నిర్విరామంగా కృషిచేశారు. కోదాటి నాయకత్వంలో ఎందరో యువకులకు తిరుగుబాటు బీజాలు వేసి కనువిప్పు కలిగించారు. ఎం.ఎస్. రాజలింగం, కొమరగిరి నారాయణరావు, యల్లాప్రగడ కృష్ణమూర్తి, సుగ్గుల అక్షయలింగం గుప్తా, గెల్లా కేశవరావు మరెందరో హరిజజ హాస్టలులో విద్యార్థులకు చదువుచెప్పి జ్ఞానజ్యోతి వెలిగించారు. వర్తక సంఘం ఏర్పాటుచేసి వారిమధ్య తగాదాలను పరిష్కరించేవారు.

హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ లో 10వ ఆంధ్ర మహాసభ జరుగుతున్న సమయంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించారు. పోలీసు చర్య అనంతరం ఆలంపురంలో జరిగిన ఉత్సవాలలో పరిషత్తు పేరును ఆంధ్ర సారస్వత పరిషత్తుగా మార్చారు.

తెలంగాణా ఉద్యమంలో కోదాటి, కాళోజీ, కొమరగిరి నారాయణరావు గారలు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వీరిని నారాయణ త్రయం లేదా కకారత్రయం అనేవారు. కోదాటి నారాయణరావు పలువురు కవులు కళాకారులు రచయితలను ప్రోత్సహించేవారు. అనేక అవార్డులు సాధించిన నాటకకర్త కె.ఎల్.నరసింహారావు తాను తొలినాళ్ళలో రాసిన నాటకాన్ని చదివించుకున్న తొలిశ్రోత, తనకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తీ కోదాటియే అని వ్రాసుకున్నారు. [1] మాడపాటి హనుమంతు రావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణ రావు, మర్రి చెన్నారెడ్డి వంటి దేశభక్తుల తో కలసి పని చేసాడు.

ఆంధ్ర రాష్ట్ర, అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. కొంతకాలం రాష్ట్ర స్థాయి సహకార సంఘానిని అధ్యక్షులుగా పనిచేశారు. ఇవికాక గాంధీ స్మారక నిధి కార్యదర్శిగా, గాంధీ భవన్ మేనేజింగ్ ట్రస్టీగా, సర్వోత్తమ గ్రంథాలయానికి అధ్యక్షునిగా ఆయన వ్యవహరించారు. కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం అధ్యక్షులుగా, భాగ్యనగర ఖాదీ సమితి కార్యదర్శిగా కూడా పనిచేశారు.

కాకతీయ విశ్వవిద్యాలయం కోదాటికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తన జీవితానుభవాలతో చిన్ననాటి జ్ఞాపకాలు, విద్యార్థి జీవితం అను పుస్తకాలను నారాయణీయం అనే పేరుతో మరొక గ్రంధం ప్రచురించాడు.[2]

తన 88వ ఏట నవంబర్ 19, 2002 న హైదరాబాద్ లో మరణించాడు[2].

గ్రంథాలయోద్యమం[మార్చు]

గ్రంథాలయోద్యమం ద్వారా విశాలాంధ్రకు నాందిపలికాడు. తన 9వ సంవత్సరం లో స్థానిక ప్రాధమిక పాఠశాల విద్యార్థుల కొరకై ప్రత్యేక గ్రంథాలయాన్ని స్థాపించాడు. 1924లో సూర్యాపేట స్థానిక గ్రంధాలయమైన ఆంద్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంధాలయానికి గౌరవ గ్రంథపాలకునిగా పనిచేసి ఆ గ్రంథాలయాన్ని వృద్ధి చేసాడు, స్వంత భవనాన్ని నిర్మింపచేసాడు తదుపరి దానిని జిల్లా గ్రంధాలయ సంస్థకు అప్పగించాడు. హైదరాబాద్ లో న్యాయవాద వృత్తిలో ఉండి, గౌలిగూడా చమన్ శ్రీ బాల సరస్వతీ ఆంధ్ర భాషా నిలయానికి ఉపాధ్యక్షుడుగా ఉంది దానిని నగర గ్రంధాలయ సంస్థకు అప్పగించాడు. ఖమ్మం లో పురాతన విద్యార్థి సంఘ గ్రంధాలయం పునరుద్ధరణ, విజ్ఞాన నికేతన గ్రంథాలయ స్థాపన అతని కృషి వలన జరిగింది. విజ్ఞాన నికేతనానికి జరిగే వార్షికోత్సవాల ద్వాతా నిజాం, బ్రిటిష్ వారిలో ప్రముఖులను కోదాటి సమావేశపరిచేవాడు. ఖమ్మం మదిర తాలూకాలో అనేక గ్రంధాలయాలు స్థాపించాడు. ఆంద్ర దేశ గ్రంధాలయ మహాసభలు తెలంగాణా లో జరిపి గ్రంథాలయోద్యమ ప్రగతికి తోడ్పడ్డాడు. 1944లో ఇల్లెందులో 25వ ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుండి అనేకమంది ప్రముఖులు విచ్చేశారు. విశాలాంధ్ర స్వరూపాన్ని ఆ సభ ప్రతిబింబించింది. గ్రంథాలయోద్యమం యావదాంధ్ర దేశానికి ప్రాతినిధ్యం వహించే ఉద్యమంగా మారింది. కోదాటి కి ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం తో 60 సంవత్సరాలు అనుబంధం ఉంది. గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు తరువాత 36 సంవత్సరాలు పాటు అధ్యక్ష్యుడుగా ఉన్నాడు. భారత గ్రంధాలయ సంఘానికి కొంత కాలం ఉపాధ్యక్షుడుగా కూడా ఉన్నాడు. హైదరాబాద్ శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయానికి చాలాకాలం అధ్యక్షుడుగా ఉండి, నగర గ్రంధాలయ సంస్థకు తొలి అధ్యక్షుడుగా పనిచేసాడు. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ చైర్మైన్ గా ప్రభుత్వం నియమించింది. కొవ్వూరు లో జరిగిన 35వ ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ మహాసభలకు అధ్యక్షత వహించారు. తెలంగాణలో గాడిచెర్ల తో గ్రంథాలయోద్యమం ప్రచారానికి కృషి చేసాడు[2].

మూలాలు[మార్చు]

  • నారాయణరావు, కోదాటి (1914-2002), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు 314-15.
  • ప్రచారం గిట్టని ప్రజా సేవకుడు: కోదాటి నారాయణరావు, తెలుగు వెలుగులు, ఆంధ్ర ప్రదేశ్ పత్రిక డిసెంబరు 2009 సంచికలో ప్రచురించిన వ్యాసం, పేజీ: 4.
  1. నరసింహారావు, కె.ఎల్. (9 నవంబరు 1956). అడుగుజాడలు (నమస్కారం వ్యాసం). Retrieved 5 March 2015.
  2. 2.0 2.1 2.2 "తెలంగాణా గ్రంథాలయోద్యమ రూప శిల్పి - శ్రీ కోదాటి నారాయణ రావు 15.12.14 - 19.11.2002". గ్రంధాలయ సర్వస్వము. విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంస్థ. 71 (8): 11. November 2014.