రాంజీ గోండు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాంజీగోండ్‌...

భారత ప్రథమ స్వాతంత్ర్య పోరాటం అంటేనే సహజంగా స్ఫురించేది 1857 సిపాయిల తిరుగుబాటు. ఆ పోరులో తెలంగాణ నేల కూడా భాగమైంది. అందులోనూ నిర్మల్‌ ప్రాంతం ప్రముఖంగా నిలిచింది. ఇక్కడ జరిగిన ఓ మహత్తర ఘటన.. చరిత్రపుటల్లో ఎక్కడా లేకపోవడం శోచనీయం. రాంజీగోండు సహా వెయ్యిమంది వీరులను నిర్మల్‌లో ఒకే మర్రిచెట్టుకు ఉరితీయడం దేశ చరిత్రలోనే ఎక్కడా.. జరగని ఓ అతిపెద్ద ఘటన. అలాంటి వీరుడైన రాంజీని, ఆ వెయ్యిమందికి ఇప్పటికీ గుర్తింపు లేదు.

1836–60 కాలంలో మధ్య భారతదేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలకు మర్సికోల్ల రాంజీగోండు నాయకత్వం వహించేవాడు. మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో నివసించే అనేకమంది గిరిజన తెగల సమూహాలతో గోండ్వానా రాజ్యం ఉండేది. ఇది బ్రిటిష్‌ పాలకులు రాక పూర్వమే ఏర్పడింది. గోండుల పాలన సా.శ. 1240–1750 వరకు సుమారు 5శతాబ్దాలపాటు కొనసాగింది. 9మంది గోండురాజులలో చివరివాడైన నీల్‌కంఠ్‌షా (సా.శ. 1735– 49) ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాంతం మరాఠీల ఆధీనమైంది. అనంతర కాలంలో ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులు దక్కించుకున్నారు. అప్పటి నుంచి గోండులపాలన అంతమై, ఆంగ్లేయులు, హైదరాబాద్‌ నైజాం పాలన ఆరంభమైంది. వీరి దౌర్జన్యాలు ఊర్లను దాటి

అడవుల్లోకి చొచ్చుకువచ్చాయి.

1836–1860 మధ్యకాలంలో నాటి జనగాం (ఆసిఫాబాద్‌) కేంద్రంగా చేసుకుని రాంజీగోండు బ్రిటిష్‌ సైన్యాలను దీటుగా ఎదుర్కొనేవాడు. ఆంగ్లేయులను ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు కూడా రాంజీనే. అదేసమయంలో ఉత్తర భారతదేశంలో ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఉవ్వెత్తున ఎగిసింది. బ్రిటిష్‌ సైన్యంతో ఝాన్సీ లక్ష్మిబాయి, నానాసాహెబ్, తాంతియాతోపే, రావు సాహెబ్‌లు పోరాడారు. అయితే ఆంగ్లేయుల బలగాల ముందు వారు నిలువలేక తలోదిక్కు తమ బలగాలతో విడిపోయారు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లాలు (రోహిల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందినవారు) పెద్దసంఖ్యలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించారు. అప్పట్లో వీరు మహారాష్ట్రలోని అజంతా, బస్మత్, లాతూర్, మఖ్తల్, తెలంగాణలోని నిర్మల్‌ తాలూకాలను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. అదే సమయంలో నిర్మల్‌ తాలూకాలో ఉంటున్న ఆంగ్లేయ కలెక్టర్, ఇక్కడి తాలూక్‌దార్‌ ఆగడాలు పెరిగిపోవడంతో రాంజీగోండు ఈప్రాంతంపై దృష్టిపెట్టాడు. తన గిరిసైన్యానికి, రోహిల్లా దండు తోడైంది. వారంతా రాంజీ సారథ్యంలో తిరుగుబాటు లేవదీశారు.

రాంజీ నాయకత్వంలో వెయ్యిమంది రోహిల్లాలు, గోండులు కలిసి నిర్మల్‌ సమీపంలోని అడవులు, కొండలు, చెరువులను ఆధారంగా  చేసుకుని బ్రిటిష్, నైజాం పాలకులను ముప్పతిప్పలు పెట్టి, గొలుసుకట్టు చెరువుల నీళ్లు తాగించారు. నిర్మల్‌ కలెక్టర్‌ హైదరాబాద్‌లోని రెసిడెంట్‌కు సమాచారం ఇచ్చాడు. అతను ఆదేశాల మేరకు కర్ణాటక ప్రాంతంలోని బల్లారిలో గల స్వదేశీదళం కల్నల్‌ రాబర్ట్‌ ఆధ్వర్యంలో నిర్మల్‌ ప్రాంతానికి చేరుకుంది. వారు ఆధునిక ఆయుధాలతో వచ్చినా రెండుసార్లు ఆదివాసీ వీరులు ఇక్కడి భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఓడించారు. ఈప్రాంతంలో వీరిని ఓడించడం కష్టమని ఆనాటి పాలకులు దొంగదెబ్బతీసి, గోదావరినది సమీపంలోని సోన్‌ ప్రాంతంలో రాంజీగోండుతో సహా వెయ్యిమందిని పట్టుకున్నారు. వారందరినీ ఈడ్చుకుంటూ తీసుకువచ్చి, నిర్మల్‌ శివారులో ఉన్న ఊడలదిగిన మహా మర్రిచెట్టుకు ఉరితీశారు. ఈఘటన 1860 ఏప్రిల్‌ 9న జరిగినట్లు చెబుతారు. అలా.. వెయ్యిమందిని ఉరితీసినందునే ఆ మర్రిచెట్టు వెయ్యిఉరుల మర్రిగా పేరొందింది. ఆచెట్టు 1995లో గాలివానకు నేలకొరిగింది. కొన్ని శతాబ్దాలుగా రాంజీగోండ్‌ పోరాటాన్ని, వెయ్యిమంది అమరుల త్యాగాల్ని ఏ పాలకుడూ గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో పలు సంఘాల నాయకులు కలిసి నిర్మల్‌ పట్టణంలో చైన్‌గేట్‌ వద్ద రాంజీగోండు విగ్రహం, వెయ్యిఉరుల మర్రి సమీపంలో ఓ అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు. గతంలో నిర్మల్‌లో రాంజీగోండు పేరిట మ్యూజియం, అమరుల స్మారకార్థం ఓ అమరధామం నిర్మిస్తామని చెప్పినా.. అమలుకు నోచుకోలేదు. 2021 సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా నిర్మల్‌ వచ్చారు. ఇక్కడి రాంజీగోండు సహా వెయ్యిమంది అమరులకు నివాళులర్పించారు. దీంతో రాంజీసహా వెయ్యిమంది అమరుల ప్రాణత్యాగాల చరిత్ర ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ.. ఇప్పటికీ వారి స్మారకార్థం ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. చరిత్ర పుటల్లో, పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా.. వారికి చోటివ్వకపోవడం శోచనీయం.