Coordinates: 17°58′23″N 79°05′21″E / 17.973151°N 79.089289°E / 17.973151; 79.089289

బైరాన్‌పల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భైరాన్‌పల్లి, తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, ధూలిమిట్ట మండలం లోని గ్రామం.[1]

భైరాన్‌పల్లి
—  రెవిన్యూ గ్రామం  —
భైరాన్‌పల్లి is located in తెలంగాణ
భైరాన్‌పల్లి
భైరాన్‌పల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°58′23″N 79°05′21″E / 17.973151°N 79.089289°E / 17.973151; 79.089289
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట
మండలం దూళిమిట్ట
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,256
 - పురుషుల సంఖ్య 1,098
 - స్త్రీల సంఖ్య 1,158
 - గృహాల సంఖ్య 549
పిన్‌కోడ్ 506367
ఎస్.టి.డి కోడ్

ఇది సమీప పట్టణమైన జనగామ నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 549 ఇళ్లతో, 2256 జనాభాతో 785 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1098, ఆడవారి సంఖ్య 1158. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 230 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 27. గ్రామం జనగణన లొకేషన్ కోడ్ 577635[2].పిన్ కోడ్: 506367.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలోని మద్దూరు మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని మండలంతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన సిద్దిపేట జిల్లాలోకి చేర్చారు.[3] ఆ తరువాత, 2020 డిసెంబరులో, కొత్తగా ఏర్పాటుచేసిన ధూలిమిట్ట మండలంలో చేర్చారు.[4]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి దూల్‌మిట్టలో ఉంది.సమీప జూనియర్ కళాశాల మద్దూర్లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల చేర్యాలలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ వరంగల్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చేర్యాలలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు వరంగల్లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

బైరంపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

బైరంపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

బైరంపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 6 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 6 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 111 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 33 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 52 హెక్టార్లు
 • బంజరు భూమి: 248 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 325 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 530 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 95 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

బైరంపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 95 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

బైరంపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మొక్కజొన్న, ప్రత్తి

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బీడీలు

నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం చరిత్ర[మార్చు]

భైరాన్‌పల్లిలో ఒక బజారు

1947-48లో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ఈ గ్రామం పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. నిరంకుశ నిజాం పోలీసులు, నిజాంతొత్తులైన దాష్టీక రజాకార్లు గ్రామస్థులను విపరీతంగా భాధించేవారు. రజాకార్ల అకృత్యాలకు అంతు ఉండేది కాదు.[5] గ్రామస్థులు రక్షణ కోసం బురుజును నిర్మించుకుంటే రాజాకార్లు దానిని కూలగొట్టుటకు సిద్ధమయ్యారు. పలుమార్లు గ్రామస్థులు రాజాకార్లకు ఎదుర్కొనగా 1948 ఆగస్టు 27న 1200 మంది సైనికులు, రజాకార్లు ఆయుధాలతో వచ్చి గ్రామస్థులను పట్టుకొని సుమారు 118 మందిని వరసలో నిలబెట్టి కాల్చిచంపారు.[6] ఇది భైరాన్‌పల్లి సంఘటనగా ప్రసిద్ధిచెందినది. తర్వాత ఆ ప్రాంతంలో అమరవీరుల స్తూపం నిర్మించారు. అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ వలె ఇది కూడా దేశం కోసం స్ఫూర్తి పొందాల్సిన ప్రాంతమని 2008లో అప్పటి జిల్లా కలెక్టరు బి.జనార్థన్ రెడ్డి హయంలో కోటి రూపాయలతో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు.

1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో నరమేధం జరిగింది.సాయుధ పోరులో 118 మంది వీరమరణం పొందారు. భారత చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచినా... భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైంది.అది 1948 ఆగస్టు 27ఆ రోజు బైరాన్‌పల్లిలో ఉన్మాదం తాండవించింది. గ్రామ స్వరాజ్యం కోసం 92 మంది ఒకే రోజు నిజాం సేనల చేతుల్లో బలయ్యారు.

బైరాన్‌పల్లి పోరాటం కేవలం నిజాం వ్యతిరేక పోరాటమే కాదు.చరిత్రలోకి తొంగిచూస్తే అది బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటం.సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం.. నిజాం సేనలను తొలుత ఊరి పొలిమేరల్లోకి తరిమికొట్టిన సాహసం వారిది. గ్రామాలపై దాడులు చేసి ఊళ్లకు ఊళ్లే తగలబెట్టి వల్లకాడుగా మార్చారు రజాకార్లు. నిజాం రజాకార్ల అకృత్యాలకు ఎంతోమంది తమ మాన ప్రాణాలను కోల్పోయారు. వీరుల్ని నిరాయుధుల్ని చేసి ప్రాణాలు తీసిన పిరికిపందల చరిత్ర ఒక వైపు ఉంటే.. మరోవైపు త్యాగాల చరిత్ర.. వ్యక్తి స్వార్థం లేని ఒక సమూహ లక్ష్యం కలిగిన మహోన్నత చరిత్ర భైరాన్‌పల్లి పూర్వపు వరంగల్‌ జిల్లాలోని (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) బైరాన్‌పల్లి నేడు వీర బైరాన్‌పల్లిగా మారింది.

ఏనాటికీ బైరాన్‌పల్లి పోరాట చరిత్ర మరువనిది. అనేకసార్లు నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం.వీరోచిత పోరాట కేంద్రం. నిజాం మూకల తూటాలకు, సైన్యం వికృత క్రీడకు బలిపశువయినా శౌర్యాన్ని చూపింది. తిరుగుబాటుకు నెలవుగా మారింది. పోరాటకాలంలో భైరాన్‌పల్లి ప్రజలు ప్రక్క గ్రామాల ప్రజలకు అండగా నిలిచారు. రజాకార్లకు ఎదురొడ్డి త్యాగాలు చేశారు.

ఓ వైపు యావత్ భారతదేశం స్వాతంత్ర్య సంబురాల్లో మునిగితేలుతూ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుతుండగా మరో వైపు నిజాం రాజుల ఏలుబడిలో ఉన్న పల్లెలన్నీ రజాకారు మూకల ఆగడాలు, దుశ్చర్యలతో వణికిపోతున్నాయి. రజాకార్లను ఎదురించి పోరాడలేక పల్లె ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెల్లదీస్తున్నారు. రజాకార్ల దురాగతాలను భరించలేక వారిపై తొలిసారిగా తిరుగుబాటు ప్రకటించి జంగ్‌సైరన్ చేసిన గ్రామమే వీరబైరాన్‌పల్లి. ఈ గ్రామానికి ఉన్న చారిత్రక నేపథ్యం మరే గ్రామానికి లేదనడంలో సందేహం లేదు.బైరాన్‌పల్లి గ్రామంలో అడుగుపెట్టేందుకు నిజాం సైన్యాలు వణికిపోతాయి. పిల్లల నుంచి పడుచు యువతుల దాకా..అంతా ఒక్కటై హైదరాబాద్ సంస్థానాన్ని సవాల్ చేస్తున్న కాలమది. నిజాం చీకటిపాలన నుంచి బయటపడి భారత యూనియన్‌లో ప్రజాస్వామిక స్వేచ్ఛాగాలులు పీల్చాలని ప్రతి గుండె, ప్రతి గ్రామం తహతహలాడుతున్న సందర్భమది. వరంగల్ జిల్లా బైరాన్‌పల్లి (నాటి నల్లగొండ జిల్లా) ఈ ఆకాంక్షలకు నిలువెత్తు ఆకృతిగా నిలిచింది.

గ్రామరక్షణ దళం ఏర్పాటు:[మార్చు]

బైరాన్‌పల్లిలో ఇమ్మడి రాజిరెడ్డి, దుబ్బూరి రామిరెడ్డి, మోటం రామయ్యలాంటి యువకులు గ్రామరక్షణ దళాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. దొరలపై ధిక్కార స్వరం వినిపించి గ్రామమంతా ఒకేతాటిపై నిలిచేలా చేశారు. తమ పొరుగు గ్రామమైన లింగాపూర్‌పై దాడిచేసి ధాన్యాన్ని ఎత్తుకెళుతున్న క్రమంలో... బైరాన్‌పల్లి గ్రామరక్షక దళం నాయకులు, గ్రామస్తులంతా ఏకమై గొడ్డళ్లు, బరిసెలు, ఒడిసెలతో ఎదురుదాడికి దిగారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు బైరాన్‌పల్లిని విధ్వంసం చేయాలనే నిర్ణయానికొచ్చారు

1948 మే నెలలో బైరాన్‌పల్లిపై దాడికి విఫలయత్నం.[మార్చు]

1948 మే నెలలో 60 మంది రజాకార్లు తుపాకులతో బైరాన్‌పల్లిపై దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండోసారి 150 మంది రజాకార్లు పోరుగ్రామంపై దాడికి పాల్పడి ఓటమి చెందారు. ఇలా రెండుసార్లు ఘోరంగా విఫలమైన రజాకార్లు బైరాన్‌పల్లిపై ప్రతీకారం పెంచుకున్నారు. 1948 ఆగస్టు 27న రాక్షసులు పంజా విసిరారు. పారిపోవడానికి ప్రయత్నించిన ప్రజలందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

అవి రజాకార్లు గ్రామాలపై పడి ధన, మాన, ప్రాణాలను దోచుకుంటూ రాక్షస క్రీడలను కొనసాగిస్తున్న రోజులు. వారిని ఎదిరించి పోరాడేందుకు యువకులంతా కలిసి గ్రామ రక్షక దళంగా ఏర్పడ్డారు. దూళ్మిట్ట, కూటిగల్, లింగాపూర్, బైరాన్‌పల్లిలోని గ్రామ రక్షక దళాలు బైరాన్‌పల్లిని ముఖ్య కేంద్రంగా చేసుకొని రజాకార్ల ఆగడాలను తిప్పికొట్టసాగారు. దీనికి ప్రతిగా రజాకార్లు గ్రామాలపై మూకుమ్మడి దాడులు చేస్తూ ఇళ్లను తగులబెట్టి దోపిడీకి పాల్పడే వాళ్లు. గ్రామాలపై దాడులు చేసి దోచుకున్న సంపదతో తిరిగి రజాకార్లపై బైరాన్‌పల్లి వద్ద దూబూరి రాంరెడ్డి, ముకుందాడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలో గ్రామ రక్షణ, గెరిల్లా దళాలు దాడిచేసి దోపిడీ సంపదను స్వాధీనం చేసుకొని పంచిపెట్టాయి.

బురుజు నిర్మాణం.[మార్చు]

ఈ ఘటన తర్వాత బైరాన్‌పల్లిపై రజాకార్లు ఏ క్షణానైనా దాడికి పాల్పడే అవకాశముందనే అనుమానంతో గ్రామం నడిబొడ్డున ఎత్తైన బురుజు నిర్మించారు. బురుజుపైన మందుగుండు సామక్షిగిని నిల్వ చేసుకున్నారు. అనుమానితులు కనిపిస్తే బురుజుపై కాపాలా ఉండే ఇద్దరు వ్యక్తులు నగారా (బెజ్జాయి) మోగించడంతో ఆ శబ్దానికి సమీప గ్రామాలైన వల్లంపట్ల, కూటిగల్, బెక్కట్, కొండాపూర్, లింగాపూర్, దూళ్మిట్ట గ్రామాల ప్రజలు పరిగెత్తుకొంటూ వచ్చేవారు. రెండుసార్లు బైరాన్‌పల్లిపై దాడికి ప్రయత్నించిన రజాకార్లను గ్రామరక్షక దళాలు తిప్పికొట్టడంతో 40 మంది రజాకార్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు ఏరియా కమాండర్ ఆషీం ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి రప్పించిన 500 మంది నిజాం సైనికులతో 1948 ఆగస్టు 27 తెల్లవారుఝామున బైరాన్‌పల్లిపై మూకుమ్మడి దాడి చేసి ప్రతీ ఇంట్లోకి ప్రవేశించి యువకులను బంధించి ఊరిబయటకు తీసుకువచ్చి లెంకలుగట్టి 96 మందిని కాల్చి చంపారు.

బైరాన్‌పల్లి మారణకాండ.[మార్చు]

1948 ఆగస్టు చివరి వారంలో అర్ధరాత్రి, ఆ ఊరికి కాళరాత్రి అయింది. నిరంకుశత్వం.. దానవరూపమెత్తి ఊరి మహిళలను చెరబట్టింది. దాదాపు వందమందిని నిలబెట్టి నిలువునా కాల్చిచంపింది

ఒకే రోజు 92 మంది గ్రామస్తులను రజాకార్లు పొట్టన పెట్టుకున్నారు. నాటి మారణకాండకు గ్రామం నడిబొడ్డులో ఉన్న బురుజు సాక్షీభూతంగా ప్రస్తుతం దర్శనమిస్తోంది. రజాకార్లను ఎదురించేందుకు బైరాన్‌పల్లి గ్రామంలోని యువకులంతా కలిసి గ్రామ రక్షక దళంగా ఏర్పడ్డారు. ఒక రోజు రజాకార్లు గ్రామానికి సమీపంలో ఉన్న ధూల్మిట్ట, లింగాపూర్ గ్రామాలను రజాకార్లు దోచుకొని, దోచుకున్న సొత్తుతో బైరాన్‌పల్లి మీదుగా తిరుగు ప్రయాణమయ్యారు. దీనిని గమనించిన గ్రామరక్షక దళాలు రజాకార్లకు అడ్డు తిరిగి వారి వద్ద నుండి సొమ్మును స్వాధీనం చేసుకొని హెచ్చరికలు జారిచేస్తూ రజాకార్లను వదిలి వేసారు.

దీంతో గ్రామంపై కక్ష పెట్టుకున్న రజాకారు మూకలు గ్రామంపై ఐదు సార్లు దాడి చేసి విఫలమయ్యారు. ఈ దాడులలో 20 మందికి పైగా రజాకార్లు మృతి చెందారు. దీంతో అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హసీం బైరాన్‌పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా ప్రకటించి, గ్రామాన్ని నేల కూలుస్తానని సవాలు చేశాడు. రజాకార్లు ఎదో ఒక రోజు గ్రామంపై దాడి చేసే అవకాశం ఉందని భావించి గ్రామస్థులు గ్రామం చుట్టూ కోట గోడ నిర్మించుకొని మధ్యలో ఎతైన బురుజును నిర్మించుకొని దానిని రక్షణ కేంద్రాంగా మలుచుకున్నారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే బురుజుపైన ఉన్న గ్రామ రక్షక దళ సభ్యులు నగారాను మోగించేవారు.

ఏరులై పారిన రక్తం.[మార్చు]

1947 ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. నిజాం రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు వీయలేదు. మద్దూరు మండలం బైరాన్ పల్లి గ్రామం సహా చాలా గ్రామాల్లో రజాకార్ల పాశవిక దాడులకు అంతులేకుండా పోయింది. అయితే. బైరాన్‌పల్లి.. గట్టిగా నిలబడింది. ఊళ్లోని బురుజును స్థావరం చేసుకొని గ్రామంలోకి వచ్చిన రజాకార్లను ప్రతిఘటించి తరిమికొట్టేది. గ్రామరక్షణ దళాలను ఏర్పాటుచేసుకొని రాత్రింబవళ్లూ కాపలా కాసేవారు. బైరాన్ పల్లి గ్రామంపై పట్టుకోసం రజాకార్లు ఐదుసార్లు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో సుమారు 24 మం దికిపైగా రజాకార్లు ప్రజల చేతుల్లో మరణించారు.దీంతో బైరాన్‌పల్లిపై నిజాం మూకలు కక్ష పెంచుకున్నాయి. చివరకు దొంగదాడికి పాల్పడ్డాయి.

1948 ఆగస్టు చివరి వారంలో రజాకార్లు, పోలీసులు..నిజాం సైన్యం సాయంతో 12 వందల మంది దాడికి దిగారు. జనగామలో రాత్రి 12గంటలకు పది బస్సులలో బయలుదేరారు. లద్దునూరు మీదుగా బైరాన్‌పల్లి చేరుకున్నారు. గ్రామం చుట్టూ డేరాలు వేశారు. ఉదయం నాలుగు గంటలకు బహిర్భూమికి వెళ్లిన వడ్ల నర్సయ్యను అదుపులోకి తీసుకున్నా రు. అతనును వెంటబెట్టుకొని గ్రామంలోకి వస్తుండగా, వారిని నెట్టివేసి నర్సయ్య ఊళ్లోకి పరుగుపెట్టాడు. రజాకార్లు గ్రామంలోకి చొరబడ్డారంటూ ప్రజలను అప్రమత్తం చేశాడు. నగారా మోగించాడు. దాంతో ఊళ్లో జనమంతా గ్రామ బురుజుపైకి వెళ్లి తలదాచుకున్నారు. వారికి రక్షణగా గ్రామరక్షక దళాలు నిలిచా యి. బురుజుపై నుంచి రజాకార్లపైకి కాల్పులు జరిపాయి. 1948 ఆగస్టు 27న వేకువజామున గ్రామంలో తుపాకీ మోతలు వినిపించాయి. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసీం నాయకత్వంలోని రజాకారు సైన్యం గ్రామంలో తమకు జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకునేందుకు 12వందల మంది బలగంతో భారీ మందు గుండు సామగ్రి, తుపాకులతో దొంగచాటున గ్రామపొలిమేర్లకు చేరుకున్నారు. గ్రామపొలిమేర్లలో కాపలాగా ఉండి రజాకార్ల కదలికలను గ్రామ రక్షక దళాలకు అందించే విశ్వనాథ్‌భట్‌జోషిని రజాకార్లు పట్టుకొని బంధించారు. తెల్లవారుజామున బహిర్భూమికి వచ్చిన ఉల్లెంగల వెంకటనర్లయ్యను రజాకార్లు పట్టుకోగా వారి నుండి తప్పించుకొని గ్రామాన్ని చేరుకొని రజాకార్లు గ్రామంలో చొరబడ్డారు అని కేకలు వేశాడు.

గ్రామానికి రక్షణ కేంద్రంగా ఉన్న బరుజుపైనున్న దళ కమాండర్ రాజిరెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు నగారా మోగించాడు. బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య, మోటం పోచయ్య, బలిజ భూమయ్య నిద్ర మత్తు వదిలించుకునే లోపుగానే రజాకార్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగుల నుంచి వచ్చి పడ్డ నిప్పు రవ్వలతో బురుజుపై నిల్వ చేసిన మందుగుండు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా మట్టుపెట్టారు.

అంతటితో ఆగకుండా రజాకార్లు ఇంటింటికీ తిరిగి 92మందిని పట్టుకొని పెడరెక్కలు విరిచి జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపి వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రలుగా చేసి బతుకమ్మలను ఆడించారు. ఈ దాడులలో ఈ దాడులలో 118మంది అమాయకులు బలికాగా 25మంది రజాకార్లు చనిపోయినట్లు రికార్డులలో ఉంది.

బైరాన్‌పల్లితో పాటు కూటిగల్ గ్రామంలో రజాకార్లు దాడులు చేసి 30మందిని పొట్టన పెట్టుకున్నారు. బైరాన్‌పల్లి పోరాట స్ఫూర్తితో హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. భారత సర్కార్ నిజాం ప్రభుత్వంపై సైనిక చర్యకు దిగేందుకు సిద్ధం కాగా నిజాం ప్రభువు దిగివచ్చి అఖండ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగింది.

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 3. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
 4. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-18. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
 5. ఆంధ్రజ్యోతి దినపత్రిక, వరంగల్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2009
 6. నమస్తే తెలంగాణ పత్రిక, పేజీ 3, తేది 29-07-2011

వెలుపలి లింకులు[మార్చు]