భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి
భీంరెడ్డి సత్యనారాయణ రెడ్డి (ఉత్తరప్రదేశ్, ఒడిషా మాజీ గవర్నరు) | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | ఆగష్టు 21, 1927 అన్నారం, షాద్‌నగర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా | ||
మరణం | అక్టోబరు 6, 2012 హైదరాబాదు | ||
జీవిత భాగస్వామి | అవివాహితుడు |
భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి (ఆగష్టు 21, 1927 - అక్టోబరు 6, 2012) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు.
జననం[మార్చు]
ఇతను షాద్‌నగర్ మండలం అన్నారం లో ఆగస్టు 21, 1927 న జన్మించి, మొగిలిగిద్ద, హైదరాబాదు లలో విద్య అభ్యసించాడు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఉత్తర ప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. అక్టోబరు 6, 2012 న హైదరాబాదులో మరణించాడు.[1]
బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]
బి.సత్యనారాయణ రెడ్డి 1927 ఆగస్టు 21న మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ మండలం అన్నారంలో భీంరెడ్డి నర్సిరెడ్డి, మాణిక్యమ్మ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ప్రాథమిక విద్య మొగిలిగిద్దలో ఆ తర్వాత హైదరాబాదు లోని వివేకవర్ధిని ఉన్నత పాఠశాల, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం లలో విద్యాభ్యాసం చేశాడు. విద్యార్థి దశలోనే సామ్యవాద భావాలు కలిగిన సత్యనారాయణరెడ్డి 14 ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యాడు.
రాజకీయాలు[మార్చు]
ఆచార్య నరేంద్రదేవ్, 'లోక్‌నాయక్' జయప్రకాశ్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియాల స్ఫూర్తితో తొలుత సోషలిస్టు పార్టీలో క్రియాశీలంగా పాల్గొన్నాడు. వినోబా భావే భూదాన ఉద్యమం లోనూ పాల్గొన్నాడు. ఎమర్జెన్సీ కాలంలో 'మీసా' చట్టం కింద అరెస్టయి 18 నెలలు జైల్లో ఉన్నాడు. జైల్లో 'పయామ్-ఇ-నవ్' అనే హిందీ పత్రిక నడిపి సహచరులకు పంచిపెట్టేవాడు. తర్వాత జనతా పార్టీలో చేరాడు. 1978లో జనతా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యాడు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1994లో రెండవసారి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పార్లమెంటుకు చెందిన కమిటీలలో వివిధ హోదాల్లో పనిచేశాడు. 1990-93 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా, 1993 నుంచి 1995 వరకు ఒడిషా గవర్నర్‌గా పనిచేశాడు. 1993లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఇన్‌ఛార్జి గవర్నరుగా కొద్దికాలం వ్యవహరించాడు. సత్యనారాయణరెడ్డి స్వగ్రామంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని కట్టించాడు. దళితులకు పక్కా ఇళ్లు మంజూరు చేయించారు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
ప్రజాసేవకే అంకితం కావాలన్న ఉద్దేశంతో ఆయన పెళ్ళి కూడా చేసుకోలేదు. ఆర్యసమాజ్ ఆదర్శాలను అమలులో పెట్టాడు.[2] తనకు సంక్రమించిన 25 ఎకరాల భూమిని అన్న కుమారుడైన రాంచంద్రారెడ్డికి ఇచ్చి, తన శేషజీవితాన్ని రాంచంద్రారెడ్డి వద్దే గడిపాడు. ఎమ్మెల్యేగా పనిచేసిన దామోదర్ రెడ్డి ఇతనికి సొంత పెద్దమ్మ కుమారుడు.
మరణం[మార్చు]
ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతూ 85 సంవత్సరాల వయస్సులో 2012 అక్టోబరు 6 న తుది శ్వాస విడిచాడు.
మూలాలు[మార్చు]
- తెలంగాణ విమోచనోద్యమం
- 1927 జననాలు
- 2012 మరణాలు
- తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా వ్యక్తులు
- ఉత్తర ప్రదేశ్ గవర్నర్లు
- రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు
- పశ్చిమ బెంగాల్ గవర్నర్లు
- తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులు
- రంగారెడ్డి జిల్లాకు చెందిన గవర్నర్లు
- రంగారెడ్డి జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) కు చెందిన రాజ్యసభ సభ్యులు