ఫరూఖ్‌నగర్

వికీపీడియా నుండి
(షాద్‌నగర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఫరూఖ్ నగర్
—  రెవిన్యూ గ్రామం  —
షాద్‌నగర్ పట్టణం (బస్టాండు ఎదుట)
షాద్‌నగర్ పట్టణం (బస్టాండు ఎదుట)
ఫరూఖ్ నగర్ is located in తెలంగాణ
ఫరూఖ్ నగర్
ఫరూఖ్ నగర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 17°04′05″N 78°12′20″E / 17.06807°N 78.20545°E / 17.06807; 78.20545
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం ఫరూఖ్ నగర్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఫరూఖ్‌నగర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] ఇది 2011, ఆగస్టు 24న షాద్‌నగర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

దీనిని షాద్‌నగర్ అని కూడా వ్యవహరిస్తారు. ఇది 44వ నెంబర్ జాతీయ రహదారి పై రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి 48 కి.మీ.దూరంలో దక్షిణంగా ఉంది. ఇది ఆర్థికంగా, విద్యాపరంగా మంచి అభివృద్ధి కొనసాగిస్తోంది. అనేక చారిత్రక ఘట్టాలకు నిలయమైన షాద్‌నగర్‌లో రాష్ట్రంలోని తొలి పంచాయతి సమితి ఇక్కడే ఏర్పాటైంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

గ్రామ చరిత్ర[మార్చు]

ఈ గ్రామం నిర్మాణానికి పూర్వం ఇక్కడ గ్రామం లేదు.ఈ గ్రామం దగ్గరలో 'వల్లభాపురం' అనే గ్రామం ఉండేది.నేటి పాపిరెడ్డి గూడా గ్రామ సమీపంలో గల హవాయి దుయ్యా పడకల్ గ్రామంలో నివసించే ప్రజాకంఠకుడయినటువంటి సుబ్బారాయుడు ఈ వల్లభాపురాన్ని దోచుకుంటుండే వాడు. అతడి దాడికి భయపడి ప్రజలు వనపర్తి ప్రభువైన సవై వెంకట్ రెడ్డి వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా ప్రభువు పడకల్‌కు వచ్చి సుబ్బారాయుడిని దండించి, ప్రజలను సుఖంగా జీవించమని తెలుపగా వల్లభాపురం ప్రజలు రాజుకు మంగళహారతులు పట్టారట. అప్పుడు రాజు తన తల్లి పేరిట నూతన గ్రామాన్ని నిర్మించి 'పెద్ద జానమ్మపేట' గా నామకరణం చేసారు. గ్రామానికి పడమర భాగాన ఒక చెరువును త్రవ్వించి దానికి జానమ్మ చెరువుగా నామకరణం చేసారు. 1719 సంవత్సరం వరకు దీనినే రాజధానిగా చేసుకొని పరిపాలించారు. నేటి మండల ప్రజా పరిషత్ వెనుక భాగంలో కల రైతు కాలనీ దగ్గర రాజభవనము నిర్మించు కున్నారు. అయితే హైదరాబాద్ సుబేదారుగా పనిచేసిన ముభారిజ్ ఖాన్ యుద్ధానికి వచ్చి సవై వెంకట్ రెడ్డిని ఓడించిన తరువాత పెద్దజానమ్మపేట గ్రామాన్ని ఢిల్లీ రాజైన ఫరూఖ్ షియార్ పేరిట 'ఫరూఖ్ నగర్ ' గా మార్చారు. ఆరవ నిజాం వద్ద దివాన్ గా పనిచేసిన కిషన్ పర్షాద్ కు ఈ ప్రాంతాన్ని జాగీరుగా ఇచ్చారు. కవిగా గుర్తింపు గాంచిన కిషన్ పర్షాద్ కలం పేరు 'షాద్ '.తన కలం పేరిట దీనిని 'షాద్ నగర్' గా మార్చారు.

1830లో ఈ పట్టణంలో యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య విడిదిచేశారు. ఆ సందర్భంగా ఆయన ఈ పట్టణాన్ని అభివర్ణిస్తూ బస్తీ బజారువీధి కలిగివున్న గ్రామమని పేర్కొన్నారు. అప్పట్లో ఒక గోసాయి చావడి కలిగిన గుడి ఉండేదని, నీళ్ళకు చాలా ప్రయాస అని, మంచినీరు లేదని వ్రాశారు.[4]

శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం[మార్చు]

ఫరూఖ్ నగర్-షాద్ నగర్ గ్రామాలకు ముఖద్వారంగా వెలిసిన, పూర్వం 'జానంపేట గుళ్ళు'గా ప్రసిద్ధి చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయమును వనపర్తి రాజధానిగా పరిపాలన కొనసాగించిన సవాయి వెంకట్ రెడ్డి 1692-1719వ సంవత్సరం మధ్య కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతారు.[ఆధారం చూపాలి] శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో సప్త ఆలయ సముదాయాలు వెలిసాయి. ప్రధానంగా శ్రీ వేంకటేశ్వరాలయము ఉంది. ఈ ఆలయంలో వేంకటేశ్వరస్వామితో పాటు అలివేలుమంగా, పద్మావతి మాత విగ్రహాలు ఉన్నాయి. వేంకటేశ్వరాలయానికి కుడి వైపున రామాలయం ఉంది. గర్భ గుడిలో సీతారామచంద్రుల తోపాటు నరసింహ స్వామి, వరాహస్వామి, పాండురంగస్వామి కొలువై ఉన్నారు. ఒక వైపున రంగనాయక స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాలకు ఎడమ వైపున మరో మూడు గుళ్ళు ఉన్నాయి. ఒక దానిలో భవానిమాత గుడి ఉంది. ఇంకో ఆలయంలో శివ పంచలింగాలు కొలువై ఉన్నారు. మరో ఆలయంలో కాలభైరవుడు, ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు ఉన్నారు. అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి.

శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహము భిన్నమై ఉండగా బక్కని నర్సింహులు తిరుమల-తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడుగా ఉన్న సమయంలో తిరుపతి నుంచి వేంకటేశ్వరుని విగ్రహాన్ని తెప్పించాడు. భక్తుల సహకారంతో వేద పండితుల అధ్వర్యంలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ గావించారు. బక్కని నర్సింహులు అభివృద్ధి పనులను సమీక్షిస్తూ భక్తులకు సౌకర్యాలను సమకూరుస్తున్నాడు. సహకారంతో గర్భగుడులకు పాలిష్ బండలు వేయించి ఆధునీకరించాడు. గర్భగుడుల వెలుపల కూడా బండలు వేసి భక్తులకు సౌకర్యంగా మార్చాడు. దేవాలయ ముఖద్వారంలోకి అడుగు పెట్ట గానే దర్శనమిచ్చే పార్కులను కూడా భక్తులే సమకూర్చారు. వాస్తు ప్రకారం కోనేరును త్రవ్వించాడు. సాయంత్రం వేళలో కూడా భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా ఆలయ ప్రాంగణమంతా విద్యుద్దీకరణ చేయించాడు. ఓ పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చి ముఖద్వారం తలుపులు చేయించాడు. మరో భక్తుడు ముందుకు వచ్చి ద్వారాలకు ఇత్తడి తొడుగులు చేయించి అందంగా మలిచాడు. అలాగే రాజ గోపురం కూడా ఆధునీకరిస్తూ ఆలయాన్ని అభివృద్ధి పరుస్తున్నారు.

రవాణా సదుపాయాలు[మార్చు]

ఈ పట్టణమునకు రైలు సౌకర్యం కూడా ఉంది.షాద్‌నగర్ పట్టణం 7వ నెంబరు జాతీయ రహదారిపై ఉండుట వలన రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సమీపంలో ఉన్నందున మంచి రోడ్డు సౌకర్యం ఉంది. అలాగే హైదరాబాదు నుండి కర్నూలు వెళ్ళు రైలు మార్గములో ఉండుట వలన రైల్వే సౌకర్యం కూడా ఈ పట్టణ వాసులకు లభించింది. జాతీయ రహదారి మాత్రమే కాకుండా 7వ నెంబరు జాతీయ రహదారిని, 9వ నెంబరు జాతీయ రహదారిని కలిపే బైపాస్ రోడ్డు కూడా ఈ పట్టణం నుండి ప్రారంభమౌతుంది.

నీటిపారుదల[మార్చు]

మండలంలో 8 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 620 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[5]

ఆంధ్రమహాసభ[మార్చు]

1936లో 5వ ఆంధ్రమహాసభ ఇక్కడే జరిగింది. ఈ సభకు కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షత వహించాడు. రెండో ఆంధ్రమహాసభ నల్గొండ జిల్లా దేవరకొండలో జరగగా దానికి బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించాడు.

రాష్ట్రంలో తొలి పంచాయతీ సమితి[మార్చు]

స్థానిక సంస్థల చరిత్రలో రాష్ట్రంలో ఈ పట్టణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా ఈ పట్టణమే ఎంపికైనది. 1959, అక్టోబర్ 14న అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడి సమితికి ప్రారంభోత్సవం చేసాడు. ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి. (మొదటి సమితిని రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు). బ్రిటీష్ ప్రభుత్వం, నిజాం రాచరికం అంతరించి ప్రజాపాలన ఏర్పడింది. అభివృద్ధి కార్యకలాపాలలో ఇక నుంచి ప్రజలే ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆనాటి సభలో నెహ్రూ చెప్పిన మాటలు ఇప్పటికినీ పట్టణ వాసులు తలుచుకుంటూ ఉంటారు.

తొలి పంచాయతి సమితి అధ్యక్షునిగా కొత్తూరు మండలం అప్పారెడ్డిగూడకు చెందిన రాందేవ్ రెడ్డి, అనంతరం బాలానగర్ మండలం పెద్దరేవల్లికి చెందిన అమర్నాత్ రెడ్డి, పిదప ఫరుఖ్ నగర్ మండలం రాయ్ కల్ కు చెందిన దామోదర్ రెడ్డిలు పదవిలో కొనసాగినారు. 1983లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చి మాండలిక వ్యవస్థ ఎర్పరచడంతో పంచాయతి సమితిని నాలుగు మండలాలు (ఫరుఖ్ నగర్,కొత్తుర్,కొందుర్గ్,కెశం పెట్ )గా విభజించారు. అనంతరం మండలాధ్యక్షులను ఎన్నుకుంటున్నారు.

రాష్ట్రంలో తొలి సారిగా ఎలెక్ట్రానిక్ ఓటింగ్[మార్చు]

1983లో జరిగిన శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోనే తొలిసారిగా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలను ఉపయోగించారు.

ఉపగ్రహ సమాచార సేకరణ కేంద్రం[మార్చు]

సముద్ర తీరానికి సుమారు 1100 మీటర్ల ఎత్తులో ఉన్న ఫరూఖ్ నగర్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న అన్నారం గ్రామ శివారులో జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీని ఏర్పాటు చేసారు. ఈ కేంద్రం అంతరిక్షానికి సంబంధించిన వివరాలతొ పాటు, వాతావరణం, భౌగొళిక సమాచారాన్ని ఉపగ్రహాల ద్వారా సేకరించి అందిస్తుంది.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

విద్యాసంస్థలు[మార్చు]

జూనియర్ కళాశాలలు

 • ప్రభుత్వ జూనియర్ కళాశాల ( స్థాపన : 1970-71)
 • విజ్ఞాన్ జూనియర్ కళాశాల ( స్థాపన : 1992-93)
 • నలందా జూనియర్ కళాశాల ( స్థాపన : 1995-96)
 • చైతన్య జూనియర్ కళాశాల ( స్థాపన : 1996-97)
 • విశ్వభారతి జూనియర్ కళాశాల,

డిగ్రీ కళాశాలలు

 • బి.ఎ.ఎమ్.డిగ్రీ కళాశాల,
 • ఎస్.వి.పి.డిగ్రీ కళాశాల,
 • జాగృతి డిగ్రీ కళాశాల,
 • 2008లో పట్టణానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైనది.[6]

బి.ఇ.డి కళాశాలలు

 • విశ్వవికాస్ కాలేజ్ ఆఫ్ ఎజుకేషన్,

గ్రంథాలయం[మార్చు]

షాద్‌నగర్ గ్రంథాలయం జిల్లాలోనే పేరుగాంచిన గ్రంథాలయం. దీనిని 1959లో ఏర్పాటుచేశారు. 1987లో ఇది రాష్ట్రంలోనే ఉత్తమ గ్రంథాలయంగా ఎంపికైనది. అప్పటి గ్రంథాలయాధికారి కృష్ణంరాజు జాతీయ స్థాయి ఉత్తమ గ్రంథాలయాధికారిగా అవార్డు పొందాడు.

సంగీత నృత్య శిక్షణా కేంద్రాలు[మార్చు]

 • నటరాజ కళానిలయం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-10.
 2. "Shadnagar Municipality". shadnagarmunicipality.telangana.gov.in. Retrieved 26 March 2021.
 3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01.
 4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
 5. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
 6. ఈనాడు, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 19.06.2008 పేజీ 7

వెలుపలి లింకులు[మార్చు]