సురవరం ప్రతాపరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురవరం ప్రతాపరెడ్డి
సురవరం ప్రతాపరెడ్డి
జననంసురవరం ప్రతాపరెడ్డి
మే 28, 1896
మహబూబ్ నగర్ జిల్లా లోని ఇటిక్యాలపాడు గ్రామం
మరణంఆగష్టు 25, 1953
నివాస ప్రాంతంమహబూబ్ నగర్ జిల్లా లోని బోరవెళ్లి గ్రామం
ఇతర పేర్లుసురవరం ప్రతాపరెడ్డి
వృత్తిహైదరాబాద్ రాష్ట్రం శాసన సభ్యులు-వనపర్తి,(1952
పత్రికా సంపాదకుడు
పరిశోధకుడు
పండితుడు
రచయిత
ప్రేరకుడు
క్రియాశీల ఉద్యమకారుడు
ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడు(1944)
ప్రసిద్ధిఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత
అమూల్య గ్రంథ సూక్ష్మ వ్యాఖ్యాత

తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు.[1] నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు .[2] జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను "కేంద్ర సాహిత్య అకాడమి" అవార్డు లభించింది.

సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటం

జీవిత విశేషాలు[మార్చు]

సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో రంగమ్మ, నారాయణరెడ్డి దంపతులకు జన్మించాడు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనం లోనే మరణించారు. అతను చిన్నాన్న రామకృష్ణారెడ్డి వద్ద పెరిగి ఎబియం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను హైదరాబాద్‌ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్‌, మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఎ. చదివాడు. 1916లో మరదలు పద్మావతిని వివాహం చేసుకున్నాడు. సంతానం పదిమందికాగా, ఇద్దరు కుమారులు విగతజీవులు. నలుగురు కుమారులు, నలుగురుపుత్రికల సంతానం. సురవరం ప్రతాపరెడ్డి తన చదువు పూర్తికాగానే హైదరాబాద్‌ కొత్వాల్‌గా వున్న రాజబహదుర్‌ వేంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్‌కు అతను కోరికపై వచ్చాడు. ఇక్కడ అతను పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్‌ నిర్వహణను ఒక విద్యాలయంగా తీర్చిదిద్దాడు. నాటి నైవాసిక విద్యార్థులలో దేశభక్తి బీజాలను నాటారు. 1924 ప్రాంతంలో ఈ హాస్టల్‌ వదాన్యుల సహకారంతో స్థాపించబడింది. ఆ విధంగా హైదరాబాద్‌లో రెడ్డి సాంఘిక సేవా జీవితం పునాదులు వేసింది. మద్రాస్‌ కళాశాలలో చదువుతున్నప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం అతనుపై పడింది. నిజాం రాష్ట్రాంధ్ర దుస్థితి రూపురేఖలను మార్చాలన్న తపన ఆనాటి నుండే సురవరం మనస్సులో నాటుకొని పోయింది. హాస్టల్‌ కార్యదర్శిగా వచ్చాక, వేయి గ్రంథాలున్న హాస్టల్‌ లైబ్రరరీని 11వేల గ్రంథాల వరకు పెంచి, విద్యార్థులలో భాషాభివృద్ధికి కృషి చేశాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించిండు. మంచి పండితుడు. 1926లో అతను నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టిండు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించిండు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.

తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పాడు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు. 1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అతనుే అధ్యక్షుడు.

1951లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించాడు. 1952లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరపున వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. న్యాయవాదిగా అతను జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నాడు. 1953 ఆగష్టు 25న అతను దివంగతుడైనాడు.

రచనా వ్యాసంగం[మార్చు]

సురవరం రచించిన గ్రంథాలలో "గోల్కొండ కవుల సంచిక" ప్రఖ్యాతి చెందినది. నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యులు అనే నిందావాక్యాన్ని సవాలుగా తీసుకొని 354 కవులకు చెందిన రచనలు, జీవితాలతో కూడిన గ్రంథాన్ని ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు ప్రతాపరెడ్డి. ఇందులో అత్యధికంగా పాలమూరు జిల్లాకు చెందిన 87 కవుల వివరాలున్నాయి.[3] ప్రతాపరెడ్డి భావుకుడైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించిండు. అతను రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంస పొందింది. సురవరం ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. హైందవ ధర్మ వీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలను రచించిండు. భక్త తుకారాం, ఉచ్ఛల విషాదము అనే నాటకాలు రాసాడు. ఇతను రాసిన కథలు మొగలాయీ కథలు పేరుతో రెండు భాగాలుగా వెలువడ్డాయి. వీటిని అణా గ్రంథమాల 1940లో అచ్చువేసింది[4]. రాజకీయ సాంఘిక ఉద్యమంగా సంచలనం కలిగించిన ఆంధ్రమహాసభ మొట్టమొదటి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి.

రాజకీయాలు[మార్చు]

సురవరానికి రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయిననూ సన్నిహితుల ప్రోద్బలంతో 1952లో జరిగిన తొలి ఎన్నికలలో వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ప్రముఖ న్యాయవాది వి.రామచంద్రారెడ్డి పై విజయం సాధించి హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు. కాని ప్రారంభం నుంచి రాజకీయాలకు దూరంగా ఉండటం, గ్రూపు రాజకీయాలు చేయకపోవడంతో జిల్లా వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్ననూ ఇతనికి మంత్రిపదవి కూడా లభించలేదు. ఈ విషయంపై సురవరం స్వయంగా అతను ఆప్తుడైన రంగాచార్యులకు లేఖ వ్రాస్తూ "ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నా వంటివారు ఏమియును పనికి రారు" అని స్పష్టంగా పేర్కొన్నాడు.

విశేషాలు[మార్చు]

  • 1926లో తెలంగాణలో తెలుగు భాషా వికాసానికి దోహదపడే విధంగా ‘గోల్కొండ పత్రిక’ను తీసుకొచ్చారు. అప్పుడు రాజభాషగా,పాలనా భాషగా,వ్యవహారభాషగా ఉర్దూ ఉన్నది.అప్పటి రాజభాష ఉర్దూ భాషలోనే మీజాన్, జామీన్, రయ్యత్ పత్రికలు వచ్చేవి.అప్పటికి రెండు తెలుగు వార పత్రికలు మాత్రమే ‘నీలగిరి’నల్లగొండ జిల్లా నుండి,‘తెలుగు’ వరంగల్ జిల్లా నుంచి వెలువడుతుండేవి.
  • 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ‘ఆంధ్ర మహాసభ’కు అధ్యక్షత వహించారు.ఆంధ్ర మహాసభ కార్యాకలాపాలన్ని తెలుగులోనే జరగాలంటూ తీర్మానం చేయించారు.
  • తెలంగాణలో కవులే లేరన్న ముడంబ వెంకట రాఘవాచార్యుల ప్రశ్నకు సమాధానంగా ‘గోల్కొండ పత్రిక’ ద్వారా 354 మంది తెలంగాణ కవుల శ్లోకాలను, పద్యాల ను సేకరించి ‘గోల్కొండ కవుల సంచిక’ పేరుతో వెలువరించారు.

జీవిత చరిత్ర[మార్చు]

  • శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితాన్ని, వారి సర్వతోముఖ సాంఫిుక సాహిత్యోద్యమ కృషిని, రాజకీయ, సాంఫిుక, సాహిత్య సేవ, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ సామాజికోద్యమాలను, వంశచరిత్రనూ, వారి జీవిత సంగ్రహాన్ని, అంతరంగాన్నీ, విద్యాభ్యాసం, బహుభాషా పాండిత్యం, కవితా నైపుణి, పత్రికా రచన వ్యాసంగం, కవి పండిత మైత్రి, పత్రికా సంపాదకునిగా, వివిధ వ్యాసరచయితగా, గోలకొండ పత్రిక ఆవిర్భావం, తెలంగాణా ప్రాంత సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని డా. ఇందుర్తి ప్రభాకర్ రావు గారు పరిశోధించి, పరిశ్రమించి "శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితం రచనలపై సమగ్ర పరిశీలన" అనే గ్రంథం రచించారు. శ్రీ సురవరం గారి చరిత్రను అధ్యయనం చేయదలచిన భావి తరాలు తప్పకుండా చదవాల్సిన చారిత్రాత్మక గ్రంథం. తెలంగాణ రాష్ట్ర అవతరణ సంవత్సరం 2014 లో తెలంగాణా వైతాళికులు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి స్మారకార్థం నిర్వహించిన సభలో ఈ గ్రంథం ఆవిష్కృతమైంది. సురవరం ప్రతాప రెడ్డి జీవితం - సాహిత్యాలపై ఎల్లూరి శివారెడ్డి, ముద్ధసాని రామిరెడ్డి గారలు రచించిన గ్రంథాలు చాలా విలువైనవి . ఇవి 1972 లో ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంథాలు .

జయంతి ఉత్సవాలు[మార్చు]

సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2022 మే 28న హైదరాబాదులోని రవీంద్రభారతిలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. వివిధ రంగాలకు చెందిన పద్మభూషణ్‌ డాక్టర్‌ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి, డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్‌ ఆర్‌. శేషశాస్త్రి, డాక్టర్‌ జుర్రు చెన్నయ్యలకు సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాలు, నగదు అందజేయబడ్డాయి. ప్రతాపరెడ్డి రాసిన కథల ఆధారంగా రూపొందించిన లఘుచిత్రాల విజేతలకు కూడా బహుమతులు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్‌ సభ్యులు సురవరం కృష్ణవర్ధన్‌, సురవరం పుష్పలత తదితరులు పాల్గొన్నారు.[5][6]

వనరులు, మూలాలు[మార్చు]

  • అమరావతి పబ్లికేషన్సు వారి తెలుగు వెలుగులు పుస్తకం

బయటి లింకులు[మార్చు]

గ్రంథముల ఎలెక్ట్రానిక్ ప్రతులకు వలయములు

మూలాలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. తెలుగు సాహితీవేత్తల చరిత్ర, మువ్వల సుబ్బరామయ్య, 2012 పేజీ 144
  2. తెలుగు పెద్దలు, మల్లాది కృష్ణానంద్, ఆరవ ముద్రణ 2010, పేజీ 202
  3. పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, ఆచార్య ఎస్వీ రామారావు రచన, సెప్టెంబరు 2012, పేజీ 10
  4. అక్షర నక్షత్రాలు, రచన:నియోగి, సెప్టెంబర్ 2019, పేజీలు 1-3
  5. telugu, NT News (2022-05-29). "తెలంగాణ తేజోమూర్తి ప్రతాపరెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-05-29. Retrieved 2022-05-29.
  6. "స్ఫూర్తిప్రదాత సురవరం". EENADU. 2022-05-29. Archived from the original on 2022-05-29. Retrieved 2022-05-29.