Jump to content

ముష్టిపల్లి వేంకటభూపాలుడు

వికీపీడియా నుండి

ముష్టిపల్లి వేంకటభూపాలుడు మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల సంస్థానంలో విలీనమైన రాజవోలు (రాజోలి) ప్రాంతాన్ని ఏలిన ప్రభువు. రాజకవి. 17 వ శతాబ్దికి చెందినవాడు. పాకనాటివారు. మిడిమిళ్ళ గోత్రజులు. ముష్టిపల్లిని ఇంటిపేరుగా కలిగినవారు. గద్వాల సంస్థాన ప్రభువులకు బంధువులు. ఈ రాజకవి దివ్యదేశ మహాత్మ్య దీపిక, రాజవోలు వేంకటేశ్వర శతకం, వేంకటేశ్వర కీర్తనలు మొదలగు రచనలు చేశారు.

దివ్యదేశ మహాత్మ్య దీపిక

[మార్చు]

దివ్యదేశ మహాత్మ్య దీపిక నూట ఎనిమిది దివ్య స్థలాలను, వాటి మహాత్మ్యాలను తెలుపు ద్విపద కావ్యం. వేంకటభూపాలుడు దీనిని 23 తాళపత్రాలపై రచించాడు. ఈ గ్రంథంలో ఈ రాజకవి తన వంశ క్రమాన్ని వివరించాడు. ఈ గ్రంథాన్ని వీరి కుల ఇలవేల్పైన కేశవస్వామికి అంకితమిచ్చాడు.

రాజవోలు వేంకటేశ్వర శతకం

[మార్చు]

ముష్టిపల్లి వేంకటభూపాలుడు రచించిన మరో గ్రంథం రాజవోలు వేంకటేశ్వర శతకం. 109 కంద పద్యాలతో కవి దీనిని తాళపత్రాలలో రచించాడు. ఈ గ్రంథం రాజవోలు శ్రీవేంకటేశ్వరస్వామికి అంకితమివ్వబడింది. ఈ శతకాన్ని కవి ఈ పద్యంతో మొదలుపెట్టాడు.... కం. శ్రీరమణీ ప్రాణేశ్వర/ వారిజ లోచన మురారి.....నమ/ స్కారమిదె రాజవోలి వి/ హారుని వలె కరుణ వెంకటాచల రమణా! చివరి పద్యం నరవర యెప్పుడు చాలా/ నిరతము మది నమ్మినవాడ నీ దాసుని గన్/ మరువకుము రాజవోలీ/ హరిలీలను కరుణ వెంకటాచల రమణా!

శతకం యొక్క విశిష్టత

ఈ శతకంలో మొత్తం 109 కంద పద్యాలలో కవి మొదటి 56 పద్యాలను ' ర ' ప్రాసతో రాశాడు. తరువాత 57 పద్యాల నుండి 66 వరకు గల పద్యాలను ' న ' ప్రాసతోను, 67 నుండి 86 వరకు గల పద్యాలను 'ల ' ప్రాసతోను, 87 నుండి 106 వరకు గల పద్యాలను బిందు పూర్వక ' ద ' కార ప్రాసతోను, మిగిలిన మూడు పద్యాలను ' ర ' ప్రాసతోను పూర్తిచేశాడు.

వేంకటేశ్వర కీర్తనలు

[మార్చు]

ఈ రాజకవి శ్రీ వేంకటేశ్వరస్వామిని కీర్తిస్తూ మూడువేల నాలుగువందల డెబ్బైయారు సంకీర్తనలు రచించాడు[1]. ఇవి వేంకటేశ్వరుని కీర్తనలైనా అక్కడక్కడ శివ పరముగా కూడా రాయబడినవి. కారణం ఈ ప్రభువులు మొదట ప్రోల్గంటి సోమేశ్వరుని భక్తులు కావడం. ఈ కీర్తనలలో అక్కడక్కడ ద్విపద పంక్తులు కూడా ఉన్నాయి. ఈ కీర్తనలలో మొదటిది.... మారువ రాగం - ఆది తాళం రామ రామ మిము నమ్మిన దాసుల/ రక్షించగ ఇక ఎవరున్నారు/ స్వామి పరాకు............/ పై నేమి నేరములు గల్గిన నైన......

మూలాలు

[మార్చు]
  1. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-96