Jump to content

వ్యాసతత్త్వజ్ఞులు

వికీపీడియా నుండి

వ్యాసతత్త్వజ్ఞులు మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాలకు దక్షిణాన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయిజ గ్రామానికి చెందిన విద్వాంసుడు. ఆంధ్ర, కన్నడ భాషా పండితుడు. తత్త్వజ్ఞుడు. అసలు పేరు వేంకటరామాచార్యులు. వీరి తండ్రిగారు వేంకటనరసింహాచార్యులు. గొప్ప పండితులు, విద్వాంసులు. వ్యాసతత్త్వజ్ఞులు అసంఖ్యాకులైన శిష్యులకు వేదశాస్త్రపాఠాలను బోధించారు. విష్ణుతీర్థులు అను పేర ప్రసిద్ధిగాంచి, ఎందరికో విద్యావ్యాసంగం చేసిన అరణ్యకాచార్యులు వీరి శిష్యులలో ముఖ్యులు. వ్యాసతత్త్వజ్ఞులు సంస్కృతమున ' మానస స్మృతి ' ఉపాసనాభాగాన్ని, సుధాటిప్పణి, విష్ణుతత్వ నిర్ణయ టిప్పణి, శరదాగమ ప్రమాణాధికరణం మొదలగు గ్రంథాలను రచించారు. వీరు 14 సుళాదులు, అనేకములగు పదములను కన్నడ భాషలో రచించి, వీరి వంశగురువులైన శ్రీగోపాలదాసులు వారిచే వాసుదేవ విఠల " అను బిరుదు నామాన్ని పొందారు. కొంతకాలం వీరు సంసార జీవితాన్ని కొనసాగించిన పిదప, గురువుల ఆజ్ఞచే మంత్రాలయంనకు వెళ్ళి, శ్రీభువనేంద్రుల వారిచే తురీయాశ్రమంను స్వీకరించారు. అప్పటి నుండే వీరికి వ్యాసతత్త్వజ్ఞులు అను పేరు స్థిరపడిపోయింది. గద్వాల ప్రభువులు వీరిని అనేక విధాల సత్కరించారు. వీరి పాండిత్యానికి మెచ్చి ఈ ప్రాంతమందలి తుంగభద్రా తీరమున ఉన్న వేణిసోంపురం అను గ్రామాన్ని వీరికి జాగీరుగా ఇచ్చారు.[1]. అక్కడే వీరు శ్రీలక్ష్మినరసింహస్వామి, శ్రీకృష్ణస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. వీరి సంతతివారు ఇప్పటికి ఈ గ్రామంలో అర్చకులుగా ఈ దేవాలయాలలో సేవలందిస్తున్నారు. శ్రీవ్యాసతత్త్వజ్ఞులు సా.శ. 1878 శ్రావణ బహుళ అష్టమినాడు పరమపదించారు.

మూలాలు

[మార్చు]
  1. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-32