కొటికెలపూడి వీరరాఘవయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొటికెలపూడి వీరరాఘవయ్య (1663-1712) మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల సంస్థానపు ప్రభువైన పెద సోమనాద్రి ఆస్థాన కవి. రాఘవయ్య గారి పూర్వీకులది వినుకొండ. వీరిది పండిత కుటుంబం. వీరి ముత్తాత పేరు సూరకవి. రాయలవారి సభలో సత్కారాలు పొందినవాడు. పెద సోమన ప్రాభవాన్ని తెలుసుకొని వీరరాఘవయ్య గద్వాల సంస్థానానికి వచ్చాడు. తన రచనలను వినిపించి ప్రభువుల మెప్పు పొందాడు. నూతన తిక్కన సోమయాజి అను బిరుదును పొందాడు[1]. మహాభారతం, భీష్మపర్వంలో తిక్కన వదిలేసిన మూల శ్లోకాలను అనువాదం చేయమని సోమన ఆదేశిస్తే చేశాడు. కవిత్రయ భారతంలో ప్రక్షిప్తాలను ప్రవేశపెట్టాడు. గద్వాల సంస్థానంలో సాహిత్య పునర్నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిచేశాక గద్వాలలోనే ఉండిపొమ్మని ప్రభువు ఆదేశించాడు. మా ఊరికి వెళ్ళి వస్తాను అని చెప్పి వీరరాఘవయ్య వినుకొండకు వెళ్ళిపోయాడు. ఎంతకూ తిరిగిరాకపోతే సోమన కబురు పెట్టి తిరిగి పిలిపించాడు. ఉద్యోగపర్వం మొదలుకొని భారతాన్ని యథాశ్లోకానువాదం చేయమని ఆజ్ఞాపించాడు. కవి ఎనిమిది ఆశ్వాసాలుగా ఉద్యోగపర్వాన్ని అనువదించి పూడూరు కేశవస్వామికి అంకితమిచ్చాడు. ఈ ఉద్యోగపర్వాన్ని సా.శ.1899లో గద్వాల సంస్థానం వారు సాహిత్య విద్యాముకుర ముద్రాక్షరశాలలో అచ్చువేశారు. వీరు ఉద్యోగపర్వాన్నే కాకుండా నవీన ద్రోణపర్వాన్ని కూడా రచించారు.[2] వీరి ఉద్యోగపర్వం మీద కేతవరపు రామకోటిశాస్త్రి విపులమైన విమర్శనాత్మక వ్యాసాన్ని ప్రకటించారు.

మూలాలు

[మార్చు]
  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం,రచన:ఆరుద్ర, ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట-50
  2. సంబరాజు రవిప్రకాశరావు (2019). జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్య చరిత్ర (1 ed.). హైదరాబాదు: తెలంగాణా సాహిత్య అకాడమీ. pp. 60–61. Archived from the original on 28 మే 2020. Retrieved 25 May 2020.