Jump to content

మహబూబ్​నగర్​ జిల్లా

వికీపీడియా నుండి
(పాలమూరు జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Mahabubnagar district
Mallela Theertham waterfall
Mallela Theertham waterfall
పటం
Mahabubnagar district
Location in Telangana
Country భారతదేశం
State Telangana
HeadquartersMahabubnagar
Mandalas16
Government
 • District collectorRavi Gugulothu IAS
విస్తీర్ణం
 • Total2,738 కి.మీ2 (1,057 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total9,19,903
 • జనసాంద్రత340/కి.మీ2 (870/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationTS–06[2]

మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒకటి. ఇది జిల్లా ముఖ్యపట్టణం.ఇది హైదరాబాదునుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లాను పాలమూర్ అని కూడా పిలుస్తారు.

పటం
మహబూబ్ నగర్ జిల్లా

జిల్లాకు దక్షిణాన వనపర్తి జిల్లా, తూర్పున రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలు, ఉత్తరమున రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు, పశ్చిమాన నారాయణపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైక ఏకైక ముఖ్యమంత్రిని అందించిన జిల్లా ఇది. ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించాడు.[3] రాష్ట్రంలోనే తొలి, దేశంలో రెండవ పంచాయతి సమితి జిల్లాలోనే స్థాపితమైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు విస్తీర్ణం దృష్ట్యా చూసిననూ, మండలాల సంఖ్యలోనూ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేది. కృష్ణా, తుంగభద్ర నదులు రాష్ట్రంలో ప్రవేశించేది కూడా ఈ జిల్లా నుంచే. దక్షిణ కాశీగా పేరుగాంచినఆలంపూర్[4], మన్యంకొండ, కురుమూర్తి,మల్దకల్ శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఊర్కొండపేట, శ్రీరంగాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలు, పిల్లలమర్రి, బీచుపల్లి, వరహాబాదు లాంటి పర్యాటక ప్రదేశాలు, జూరాల, కోయిలకొండకోయిల్ సాగర్, ఆర్డీఎస్, సరళాసాగర్ (సైఫర్ సిస్టంతో కట్టబడిన ఆసియాలోనే తొలి ప్రాజెక్టు[5]) లాంటి ప్రాజెక్టులు, చారిత్రకమైన గద్వాల కోట, కోయిలకొండ కోట, చంద్రగఢ్ కోట, పానగల్ కోట లాంటివి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకతలు. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పల్లెర్ల హనుమంతరావు లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, గడియారం రామకృష్ణ శర్మ లాంటి సాహితీవేత్తలు, సూదిని జైపాల్ రెడ్డి, సురవరం సుధాకరరెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. ఎన్.టి.రామారావును సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది. కెసిర్ ఈ జిల్లా మంత్రిగా ఉన్నపుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పట్టుచీరెలకు పేరొందిన చెందిన నారాయణపేట, చేనేత వస్త్రాలకు పేరుగాంచిన రాజోలి, కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, రాష్ట్రకూటులకు రాజధానిగా ఉండిన కోడూరు, రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు, మామిడిపండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్, రామాయణ కావ్యంలో పేర్కొనబడిన జఠాయువు పక్షి రావణాసురుడితో పోరాడి నేలకొరిగిన ప్రాంతం, దక్షిణభారతదేశ చరిత్రలో పేరొందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన తంగడి ప్రాంతం[6] ఈ జిల్లాలోనివే. ఉత్తర, దక్షిణాలుగా ప్రధాన పట్టణాలను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి. 2011, 2012లలో నూతనంగా ప్రకటించబడ్డ 7 పురపాలక/నగరపాలక సంఘాలతో కలిపి జిల్లాలో మొత్తం 11 పురపాలక/నగరపాలక సంఘాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 1546 రెవెన్యూ గ్రామాలు, 1348 గ్రామపంచాయతీలున్నాయి. ఈ జిల్లాలో ప్రధాన వ్యవసాయ పంట వరి.

భౌగోళికం

[మార్చు]
మహబూబ్‌నగర్ జిల్లా

భౌగోళికంగా ఈ జిల్లా తెలంగాణ ప్రాంతంలో దక్షిణాదిగా ఉంది. విస్తీర్ణం పరంగా తెలంగాణాలో ఇదే అతిపెద్దది. 16°-17° ఉత్తర అక్షాంశం, 77°-79° తూర్పు రేఖాంశంపై జిల్లా ఉపస్థితియై ఉంది.[7] 18432 చ.కి.మీ. విస్తీర్ణం కలిగిన ఈ జిల్లాకు దక్షిణంగా తుంగభద్ర నది సరిహద్దుగా ప్రవహిస్తున్నది. కృష్ణా నది కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి ఆలంపూర్ వద్ద తుంగభద్రను తనలో కలుపుకుంటుంది. ఈ జిల్లా గుండా ఉత్తర, దక్షిణంగా 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి, సికింద్రాబాదు-ద్రోణాచలం రైల్వే లైను, గద్వాల - రాయచూరు లైన్లు వెళ్ళుచున్నవి. అమ్రాబాదు గుట్టలుగా పిల్వబడే కొండల సమూహం జిల్లా ఆగ్నేయాన విస్తరించి ఉంది. 2001 జనాభా గణన ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35,13,934[8]. జిల్లా వాయవ్యంలో వర్షపాతం తక్కువగా ఉండి తరుచుగా కరువుకు గురైతుండగా, ఆగ్నేయాన పూర్తిగా దట్టమైన అడవులతో నిండి ఉంది. అమ్రాబాదు, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాలు నల్లమల అడవులలో భాగంగా ఉన్నాయి. నడిగడ్డగా పిల్వబడే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం కూడా నీటిపారుదల సమస్యతో ఉండగా, జూరాల, దిండి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు అని రుక్మమ్మపేట అని పిలిచేవారు. ఆ తరువాత 1890 డిసెంబరు 4నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా (1869 - 1911) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడింది. సా.శ. 1883నుండి జిల్లా కేంద్రానికి ఈ పట్టణం ప్రధానకేంద్రముగా ఉంది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చోళవాడి (చోళుల భూమి) అని పిలిచేవారు, గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.[9]

ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ చరిత్రను తెల్సుకోవడానికి ఇబ్బందే. అంతేకాకుండా ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. జిల్లాలోని ముఖ్య సంస్థానాలలో గద్వాల, వనపర్తి, జటప్రోలు, అమరచింత, కొల్లాపూర్ సంస్థానాలు ప్రముఖ మైనవి. ఇక్కడి ప్రజలు పేదరికంతోను, బానిసత్వంలోను ఉన్నందున చరిత్రకారులు కూడా ఈ ప్రాంతంపై అధిక శ్రద్ధ చూపలేరు. ఇప్పటికినీ ఈ ప్రాంతముధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు.

పాలించిన రాజవంశాలు

[మార్చు]
  • మౌర్య సామ్రాజ్యం: సా.శ.పూ.250 లో అశోక చక్రవర్తి కాలంలో మౌర్య సామ్రాజ్యంలో ఈ ప్రాంతము దక్షిణ సరిహద్దుగా ఉండేది.
  • శాతవాహన రాజ్యం: సా.శ.పూ.221 నుంచి సా.శ. 218 వరకు పాలించిన శాతవాహన కాలంలో మహబూబ్ నగర్ ప్రాంతం భాగంగా ఉండేది.
  • చాళుక్య రాజ్యం: సా.శ. 5 వ శతాబ్దం నుంచి సా.శ.11 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం చాళుక్య రాజ్యంలో భాగంగా ఉంది.
  • రాష్ట్రకూట రాజ్యం: సా.శ. 9 వ శతాబ్దంలో కొద్ది కాలం ఇక్కడ రాష్ట్రకూటులు పాలించారు.
  • కాకతీయ రాజ్యం: సా.శ.1100 నుంచి సా.శ.1474 వరకు ఇక్కడ కాకతీయ రాజులు రాజ్యం చేశారు.
  • బహమనీ రాజ్యం: సా.శ.1347 నుంచి సా.శ.1518 వరకు ఇది బహమనీ రాజ్యంలో భాగంగా ఉండింది.
  • కుతుబ్ షాహి రాజ్యం: సా.శ.1518 నుంచి సా.శ.1687 వరకు ఈ ప్రాంతం కుతుబ్ షాహి రాజ్యంలో భాగం
  • మొఘల్ సామ్రాజ్యం: సా.శ. 1687 నుంచి దాదాపు 37 సం.ల పాటు మహబూబ్ నగర్ ప్రాంతాన్ని మొఘలులు పాలించారు.
  • నిజాం రాజ్యం: సా.శ. 1724 నుంచి ఇక్కడ నిజాం పాలన ప్రారంభమైంది. స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాదు సంస్థానం దేశంలో కల్సే వరకు నిజాం రాజ్యంలో భాగం గానే కొనసాగింది.

ఆధునిక చరిత్ర

[మార్చు]

హైదరాబాదు నిజాం ఆరవ నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ జిల్లాకు మహబూబ్ నగర్ అనే పేరు వచ్చింది. జిల్లాలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించడంతో పాలమూరు అనే పేరు కూడా ఉంది.

1870లో నిజాం ప్రభుత్వం 8 తాలుకాలతో నాగర్ కర్నూల్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసింది. 1881 నాటికి జిల్లాలో తాలుకాల సంఖ్య 10కి పెరిగింది. 1883లో జిల్లా కేంద్రాన్ని మహబూబ్ నగర్‌కు బదిలీ చేశారు. స్వాతంత్ర్యానంతరం సంస్థానాలుగా ఉన్న వనపర్తి, కొల్లాపూర్, షాద్‌నగర్ మొదలగు సంస్థానాలు తాలుకాలుగా ఏర్పడి విలీనమయ్యాయి.

స్వాతంత్ర్యానికి పూర్వం 1930 దశాబ్దిలో జరిగిన ఆంధ్రమహాసభలలో ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు అధ్యక్షత వహించారు. 1930లో మెదక్ జిల్లాలో జరిగిన తొలి ఆంధ్రమహాసభకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించగా, 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్రమహాసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించాడు. వీరిరువురూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖులే. 1936లో ఐదవ ఆంధ్రమహాసభ జిల్లాలోని షాద్‌నగర్ లోనే జరిగింది.

1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లానుంచి పలు ప్రాంతాలు విడదీసి, సరిహద్దు జిల్లాల నుంచి మరికొన్ని ప్రాంతాలు కలిపారు. జిల్లానుంచి పరిగి తాలుకాను విడదీసి హైదరాబాదు జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా)కు కలిపినారు. పశ్చిమాన ఉన్న రాయచూరు జిల్లా నుంచి గద్వాల, ఆలంపూర్ తాలుకాలను విడదీసి మహబూబ్ నగర్ జిల్లాకు జతచేశారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా నుంచి కోడంగల్‌ను ఇక్కడ విలీనం చేశారు.

1958లో కల్వకుర్తి తాలుకాలోని కొన్ని గ్రామాలు నల్గొండ జిల్లాకు బదిలీ చేయబడింది. 1959లో రంగారెడ్డి జిల్లా లోని కొన్ని గ్రామాలు షాద్‌నగర్‌కు బదిలీ చేయబడ్డాయి. 1959 నాటికి జిల్లాలో 11 తాలుకాలు ఏర్పడ్డాయి. 1986లో మండలాల వ్యవస్థ అమలులోకి రావడంతో 13 తాలుకాల స్థానంలో 64 మండలాలు ఏర్పడ్డాయి. జిల్లా భౌగోళికంగా పెద్దదిగా ఉన్నందున కోడంగల్ నియోజకవర్గంలోని మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది. జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో ఈ జిల్లాలో తెలంగాణలో అంతర్భాగంగా కొనసాగుతోంది. తెలంగాణ అవతరణ తర్వాత ఈ జిల్లా చాలా మార్పులకు లోనైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ జిల్ల్ 4 ముక్కలు కాగా తర్వాత పశ్చిమ భాగం నారాయణపేట పేరుతో మరో జిల్లా ఏర్పడి జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోవడమే కాకుండా నదులు, ప్రాజెక్టులు, చారిత్రక దేవాలయాలు కూడా ఇతర జిల్లాలలో విలీనమైనాయి.

నిజాం విమోచనోద్యమం

[మార్చు]

నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో పాలమూరు జిల్లా కూడా ఎంముఖ్య స్థానం పొందింది. ఎందరో పోరాటయోధులు తమప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి నిజాం ముష్కరుల చేతితో అమరులైనారు. మరికొందరు జైలుపాలయ్యారు. వందేమాతరం రామచంద్రారావు, వందేమాతరం వీరభద్రారావు, కె.అచ్యుతరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, సురభి వెంకటేశ్ శర్మ, పాగపుల్లారెడ్డి, ఏగూరు చెన్నప్ప, ఆర్.నారాయణరెడ్డి, కొత్త జంబులురెడ్డి, శ్రీహరి, బి.సత్యనారాయణరెడ్డి లాంటి ముఖ్యులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. అప్పంపల్లి, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ లలో పోరాటం ఉధృతం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిజాంపై తిరగబడిన ప్రధాన సంఘటన అప్పంపల్లి. మహబూబ్‌నగర్ పట్టణంలో తూర్పుకమాన్ ఉద్యమకారులకు వేదికగా నిలిచింది. నారాయణపేట ఆర్యసమాజ్ నాయకులు, సీతారామాంజనేయ గ్రంథాలయోద్యమ నాయకులు, జడ్చర్లలో ఖండేరావు, కోడంగల్‌లో గుండుమల్ గోపాలరావు. కల్వకుర్తిలో లింగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టణంలో పల్లర్ల హనుమంతరావు, అయిజలో దేశాయి నర్సింహారావు, గద్వాలలో పాగ పుల్లారెడ్డి, వనపర్తిలో శ్రీహరి తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తుర్రేబాజ్ ఖాన్ ఇతను హైదరాబాద్ బ్రిటీషు రెసిడెన్సీ ( ప్రస్తుత కోఠీ ఉమెన్స్ కాలేజీ) పై దాడి చేసినందుకు మొగిలిగిద్ద గ్రామంలోని పోలీస్ స్టేషనులో సమారు 1940 ప్రాంతంలో బంధించారు. తరువాత ఇతనిని రెసిడెన్సీ గుమ్మానికి ఉరితీసారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమాచారం

[మార్చు]

తెలంగాణలో భౌగోళికంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (పునర్య్వస్థీకరణకు ముందు) అతి పెద్ద జిల్లా. దీనిని పాలమూరు అని కూడా పిల్వబడే ఈ జిల్లాలో 1553 రెవెన్యూ గ్రామాలు, 1347 గ్రామ పంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 10 పురపాలక సంఘాలు (నగర పంచాయతీలతో కలిపి), 2 లోక్‌సభ నియోజక స్థానాలు, 14 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు ఉన్నాయి. కృష్ణా, తుంగభద్రలతొ పాటు దిండి, బీమా లాంటి చిన్న నదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు - ద్రోణాచలం రైల్వే మార్గం ప్రధాన రవాణా సౌకర్యాలు. పంచాయత్‌రాజ్ రహదారులలో మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉంది.

ఇతర జిల్లాలలో చేరిన మండలాలు

[మార్చు]

ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 64 రెవెన్యూ మండలాలుగా ఉన్నాయి.[10].

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 64 మండలాలుకుగాను నూతనంగా ఏర్పాటైన వనపర్తి జిల్లా పరిధిలో 9 మండలాలు,[11] నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 16 మండలాలు,[12] జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో 9 మండలాలు,[13] వికారాబాద్ జిల్లా పరిధిలో 3 మండలాలు[14] చేరగా, రంగారెడ్డి జిల్లా (పాత జిల్లా) పరిధిలో 7 మండలాలు[15] చేరాయి.

వనపర్తి జిల్లాలో చేరిన మండలాలు

[మార్చు]

నాగర్‌కర్నూల్ జిల్లాలో చెేరిన మండలాలు

[మార్చు]

జోగులాంబ గద్వాల జిల్లాలో చెేరిన మండలాలు

[మార్చు]

1. గద్వాల మండలం, 2. ధరూర్ మండలం, 3. మల్దకల్ మండలం, 4. గట్టు మండలం, 5. అయిజ మండలం, 6. వడ్డేపల్లి మండలం, 7. ఇటిక్యాల మండలం, 8. మానవపాడ్ మండలం, 9. అలంపూర్ మండలం

వికారాబాద్ జిల్లాలో చెేరిన మండలాలు

[మార్చు]

1. కొడంగల్ మండలం, 2. బొంరాస్‌పేట్ మండలం, 3. దౌలతాబాద్ మండలం

రంగారెడ్డి జిల్లాలో చెేరిన మండలాలు

[మార్చు]

1.మాడ్గుల్ మండలం 2.షాద్‌నగర్ మండలం 3.కొత్తూరు మండలం 4.కేశంపేట మండలం 5.కొందుర్గు మండలం 6.ఆమన‌గల్ మండలం 7.తలకొండపల్లి మండలం

పునర్య్వస్థీకరణ తరువాత జిల్లాలో మండలాలు

[మార్చు]

పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట ఈ జిల్లాలో రంగారెడ్డి జిల్లానుండి చేరిన గండీడ్ మండలంతో కలిపి 21 పాతమండలాలు, 5 కొత్తగా ఏర్పడిన మండలాలు కలిపి 26 మండలాలు ఉన్నాయి.[16] ఆ తరువాత 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం మహబూబ్​నగర్​ జిల్లా నుండి (9 పాత మండలాలు + 2 కొత్త మండలాలు) 11 మండలాలను విడగొట్టి కొత్తగా నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసింది.[1][17]

గమనిక:2016 పునర్య్వస్థీకరణలో వ.నెం.2, 3, 8, సంఖ్యగల మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి.చివరి మహమ్మదాబాద్ మండలం గండీడ్ మండలంలోని 10 గ్రామాలను విడగొట్టి 2021 ఏప్రిల్ 24 నుండి అమలులోనికి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నారాయణపేట జిల్లాలో చేరిన మండలాలు

[మార్చు]

గమనిక:2016 పునర్య్వస్థీకరణలో వ.నెం.4, 11రు మండలాలు కొత్తగా ఏర్పడినవి

పట్టణ ప్రాంతాలు

[మార్చు]
పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా పురపాలక సంఘాలు
పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా పురపాలక సంఘాలు

మహబూబ్ నగర్ జిల్లాలో 11 మున్సీపాలిటీలతో పాటు (నగరపంచాయతీలతో కలిపి) అనేక పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి : మహబూబ్ నగర్ (స్పెషల్ గ్రేడ్ మున్సీపాలిటీ), గద్వాల (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), వనపర్తి (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), నారాయణపేట (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), షాద్‌నగర్ (థర్డ్ గ్రేడ్ మున్సీపాలటీ), కల్వకుర్తి (నగర పంచాయతి), కొల్లాపూర్ (నగర పంచాయతి), నాగర్ కర్నూల్ (నగర పంచాయతి), అయిజ (నగర పంచాయతి), జడ్చర్ల (నగరపంచాయతి), అచ్చంపేట్ (నగర పంచాయతి), ఆత్మకూర్ (మేజర్ గ్రామ పంచాయతి), 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో లక్ష జనాభా పైబడి ఉన్న ఏకైక పట్టణం మహబూబ్‌నగర్. జాతీయ రహదారిపై, రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పట్టణప్రాంత జనాభా అధికంగా ఉంది. రెవెన్యూ డివిజన్ల ప్రకారం చూస్తే పట్టణ జనాభా మహబూబ్‌నగర్ డివిజన్‌లో అత్యధికంగానూ, నారాయణపేట డివిజన్‌లో అత్యల్పంగానూ ఉంది.

జనాభా

[మార్చు]
మహబూబ్ నగర్ జిల్లా జనాభా పెరుగుదల గ్రాఫ్ (ఎడమ ప్రక్క ఉన్న అంకెలు లక్షలలో సూచిస్తాయి

1941 జనగణన ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా జనాభా 13.8 లక్షలు కాగా, 2011 జనగణన ప్రకారం 40,42,191. 1941 నుంచి 2001 వరకు ప్రతి 10 సంవత్సరాలకు సేకరించే జనాభా లెక్కల గణాంకాల ప్రకారం జిల్లా జనాభా ప్రక్క గ్రాఫ్‌లో చూపెట్టబడింది. 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 35,13,934 కాగా 2011 నాటికి పదేళ్ళలో 15% వృద్ధిచెంది 40,42,191కు చేరింది. 2011 జనాభా ప్రకారం ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో 9వ స్థానంలో, దేశంలో 55వ స్థానంలో ఉంది. జనసాంద్రత 2001లో 191 ఉండగా, 2011 నాటికి 219కు పెరిగింది. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న పట్టణాలు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, షాద్‌నగర్, జడ్చర్ల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్.

రవాణా సౌకర్యాలు

[మార్చు]
మహబూబ్ నగర్ రైల్వే స్టేషను
మహబూబ్ నగర్ బస్ స్టేషను

రైలు సౌకర్యం : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లాలో 195 కిలోమీటర్ల నిడివి కల ప్రధాన రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గం సికింద్రాబాదు నుంచి కర్నూలు గుండా తిరుపతి, బెంగుళూరు వెళ్ళు దారిలో ఉంది. ఉత్తరాన తిమ్మాపూర్ నుంచి దక్షిణ సరిహద్దున ఆలంపూర్ రైల్వేస్టేషను వరకు జిల్లాలో మొత్తం 30 రైల్వేస్టేషనులు ఉన్నాయి. అందులో మహబూబ్ నగర్, షాద్‌నగర్, గద్వాల, జడ్చర్ల ముఖ్యమైనవి. మహబూబ్ నగర్ పట్టణంలోనే 3 రైల్వేస్టేషనులు ఉన్నాయి. (మహబూబ్ నగర్ మెయిన్, మహబూబ్ నగర్ టౌన్, ఏనుగొండ). కర్ణాటకలోని వాడి, రాయచూరు మార్గం కూడా ఈ జిల్లాగుండా కొన్ని కిలోమీటర్లు వెళ్తుంది. మాగనూరు మండలంలోని కృష్ణా రైల్వేస్టేషను ఈ మార్గంలోనే ఉంది. గద్వాల నుంచి కర్ణాటక లోని రాయచూరుకు మరో రైలు మార్గము సైతం ప్రారంభం అయింది. మహబూబ్ నగర్ నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ లో భాగంగా రాయచూరు వరకు రైల్వే లైను పూర్తయింది. మిగతా పనులు ప్రారంభం కావల్సి ఉంది. జిల్లాలో రైల్వేలైన్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 0.57గా ఉంది.

రోడ్డు సౌకర్యం : దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి అయిన 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారి కూడా ఇదొక్కటే. ఇది జిల్లాలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాదు నుంచి కర్నూలు గుండా బెంగుళూరు వెళ్ళు వాహనాలు జాతీయ రహదారిపై ఈ జిల్లా మొత్తం దాటాల్సిందే. జాతీయ రహదారిపై జిల్లాలోని ముఖ్య ప్రాంతాలు - షాద్‌నగర్, జడ్చర్ల, పెబ్బేర్, కొత్తకోట, ఎర్రవల్లి చౌరస్తా, ఆలంపూర్ చౌరస్తాలు. జిల్లా గుండా మూడు అంతర్రాష్ట్ర రహదారులు కూడా వెళుతున్నాయి. వాటిలో జడ్చర్ల-రాయిచూరు రహదారి ముఖ్యమైనది. ఈ రహదారి మహబూబ్ నగర్, మరికల్, మక్తల్, మాగనూరు గుండా రాయిచూర్ వెళ్తుంది. మరో అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాదు-శ్రీశైలం రహదారి. దీనికి జాతీయ రహదారిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ రహదారి కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తిల గుండా జిల్లానుంచి వెళుతుంది. హైదరాబాదు-బీజాపూర్ రహదారి కొడంగల్ గుండా వెళ్తుంది.

బస్ డిపోలు: మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 01బస్సు డిపో ఉంది - మహబూబ్ నగర్

జిల్లా రాజకీయాలు

[మార్చు]

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, సూదిని జైపాల్ రెడ్డి, మల్లు రవి, పాగపుల్లారెడ్డి, డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు, నాగం జనార్థన్ రెడ్డి, పి.శంకర్ రావు తదితరులు జిల్లా నుంచి ఎన్నికయ్యారు. వీరిలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి పొందగా, పలువులు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1989లో అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేయగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందినాడు.

పార్టీల బలాబలాలు చూస్తే 1983 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఆధిపత్యం వహించింది. 1983లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 6 స్థానాలలో విజయం సాధించాయి. 1985లో తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు పొందగా 1989లో ఒక్కస్థానం కూడా దక్కలేదు. 1994లో తెలుగుదేశం 11 స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీకి ఒక్కస్థానం కూడా ఇవ్వలేదు. 1999లో తెలుగుదేశం 8, కాంగ్రెస్ పార్టీ 4, భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ 7, తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటి, ఇతరులు 4 స్థానాలు పొందగా తెలుగుదేశంకు ఒక్కస్థానమే లభించింది. 2009లో తెలుగుదేశం పార్టీ 9, కాంగ్రెస్ పార్టీ 4, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా నాగర్‌కర్నూల్ నుంచి విజయం సాధించిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి విజయం సాధించిన జూపల్లి కృష్ణారావులు రాజీనామా చేశారు. మహబూబ్‌నగర్ నుంచి గెలుపొందిన రాజేశ్వర్ రెడ్డి మరణించడంతో మొత్తం 3 స్థానాలకు 2012 మార్చిలో ఎన్నికలు జరుగగా మహబూబ్ నగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీచేసిన జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. 2014 మార్చిలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 4, తెరాస 1, భారతీయ జనతా పార్టీ 1 పురపాలక సంఘాలలో మెజారిటీ సాధించాయి.

కొన్ని గణాంక వివరాలు

[మార్చు]

స్వాతంత్రానికి ముందు మహబూబ్‌నగర్ జిల్లాలో సంస్థానాలు

[మార్చు]

స్వాతంత్ర్యానికి పూర్వం మహబూబ్‌నగర్ జిల్లాలో 16 సంస్థానాలు ఉండేవి[9]. అందులో ముఖ్యమైన సంస్థానాలు :

జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు

[మార్చు]

సందర్శనీయ ప్రదేశాలు

[మార్చు]
ఆలంపూర్‌లో చాళుక్యుల కాలం నాటి దేవాలయాలు
జూరాల ప్రాజెక్ట్
పిల్లల మర్రి వృక్షం
దేవరకద్ర సమీపంలోని ఒక దృశ్యం
రాజోలికోట ముఖద్వారం
రాజోలికోట లోపలి దేవాలయాలు
సంస్థానాధీశుల కాలం నాటి గద్వాల మట్టికోట
మహబూబ్ నగర్ జిల్లా పరిషత్తు కార్యాలయము
  • ఆలంపూర్ దేవాలయాలు : తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆలంపూర్ వద్ద ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. హైదరాబాదు-బెంగుళూరు 7 వ నెంబరు జాతీయ రహదారిపై కల ఆలంపుర్ చౌరస్తా నుంచి 15 కిలోమీటర్ల లోనికి ఆలంపూర్ లో ఈ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు చాళుక్యుల కాలంలో సా.శ.7, 8వ శతాబ్దాలలో నిర్మితమైనాయి[18]. జిల్లాలో వివిధ త్రవ్వకాలలో లభించిన పురాతన శిల్పాలు కూడా ఆలంపుర్ పురావస్యు మ్యూజియంలో ఉన్నాయి.
  • పిల్లలమర్రి : మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో సుమారు 700 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక మహావృక్షం ఊడలు ఊడలుగా అభివృద్ధిచెంది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిఉంది. మహబూబ్ నగర్ జిల్లాకే గుర్తుగా మారిన ఈ మహావృక్షాన్ని సందర్శించడాన్కి ఎందరో వస్తుంటారు. ఇక్కడే పురావస్తు మ్యూజియం, మినీ జూ పార్క్, అక్వేరియం, ఉద్యానవనం, పిల్లల క్రీడాస్థలం, జింకలపార్క్, దర్గా మొదలగునవి కూడా తనవితీరా చూడవచ్చు.
  • బీచుపల్లి : 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారిపై కృష్ణానది పై కల ఆనకట్ట వద్ద పుష్కర ప్రాంతమైన బీచుపల్లి ఉంది. ఇక్కడ కృష్ణవేణి ఆలయంతో పాటు సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై నుంచి వెళ్ళు వాహనాల నుండి కూడా ఇక్కడి అపురూపమైన దృష్యాలు కానవస్తాయి.
  • ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు : ధరూర్ మండలం రేవుల పల్లి వద్ద కర్ణాటక సరిహద్దు నుంచి 18 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిపై ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు ఉంది. కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత ఇదే మొదటి ప్రాజెక్టు. నీటిపారుదల ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఇటీవలే విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభించింది. ఇది గద్వాల నుంచి ఆత్మకూర్ మార్గంలో ఉంది.
  • మన్యంకొండ దేవాలయం : మహబూబ్ నగర్ జిల్లా లోనే అతిపెద్ద దేవాలయం మన్యంకొండ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఎత్తయిన కొండపై మహబూబ్ నగర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక లోని రాయచూరు వెళ్ళు మార్గంలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున జాతర జర్గుతుంది. కొండపై ఉన్న ఆహ్లాదకర వాతావరణం సందర్శకులను ఆకట్టుకొంటుంది.
  • కోయిల్‌సాగర్ ప్రాజెక్టు :50 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు దేవరకద్ర మండల పరిధిలో ఊకచెట్టువాగుపై నిర్మించారు. నిర్మాణం సమయంలో ఈ ప్రాజెక్టు సాగునీటి లక్ష్యం 12 వేల ఎకరాలు కాగా ప్రస్తుతం 50 వేల ఎకరాలకు పెంచి ప్రాజెక్టును అభివృద్ధి పరుస్తున్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టు సందర్శన కొరకు అనేక పర్యాటకులు వస్తుంటారు.
  • కురుమూర్తి దేవస్థానం : తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంతో పోలికలున్న కురుమూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం సా.శ.14 వ శతాబ్దానికి చెందినది. ఇది చిన్నచింతకుంట మండలంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరడానికి రైలుమార్గం కూడా ఉంది.
  • ఉమా మహేశ్వర క్షేత్రం : నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండలపై ఉమా మహేశ్వర క్షేత్రం ఉంది. ఇది శ్రీశైల క్షేత్రం ఉత్తర ద్వారంగా భాసిల్లుతోంది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు మార్గంలో ఉంది కాబట్టి శ్రీశైలం వెళ్ళు భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ వెళ్తారు. చుట్టూ ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉండటం కూడా భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు
  • గద్వాల కోట : సంస్థాన రాజుల కాలంనాటి గద్వాల కోట పట్టణం నడిబొడ్డున ఉంది. ఈ పురాతన కోటలో చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. కోట లోపలే ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. కోటలోని స్థలాన్ని కళాశాలకు ఇచ్చినందున కళాశాల పేరు కూడా మహారాణి ఆదిలక్ష్మీ డిగ్రీ కళాశాలగా చెలమణిలో ఉంది. కోట పరిసరాలలో గతంలో సినిమా షూటింగులు కూడా జర్గాయి.
  • శిర్సనగండ్ల దేవాలయం : అపరభద్రాద్రిగా పేరుగాంచిన సా.శ.14 వ శతాబ్ది కాలం నాటి శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయం వంగూరు మండలంలో ఉంది. ఇక్కడ ప్రతిఏటా చైత్రశుద్ధి పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు జర్గుతాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కూడా ప్రతియేటా దిగ్విజయంగా నిర్వహిస్తారు.
  • చంద్రగఢ్ కోట : ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు సమీపంలో ఎత్తయిన కొండపై 18 వ శతాబ్దంలో మొదటి బాజీరావు కాలం నాటి కోట పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇది ఆత్మకూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో నర్వ మండల పరిధిలో నిర్మించారు. జూరాల పాజెక్టు సందర్శించే పర్యాటకులకు ఇది విడిదిగా ఉపయోగపడుతుంది. 18 వ శతాబ్దం తొలి అర్థ భాగంలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో ఆత్మకూరు సంస్థానంలో పన్నుల వసూలు కొరకు నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను నిర్మించాడు.
  • రాజోలి కోట, దేవాలయాలు :పురాతనమైన రాజోలి కోట, కోటలోపలి దేవాలయాలు సందర్శించడానికి యోగ్యమైనవి. కోట ప్రక్కనే తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల డ్యాం కనిపిస్తుంది.
  • జహంగీర్ పీర్ దర్గా:కొత్తూర్ మండలం, ఇన్ముల్‌నర్వ గ్రామ సమీపంలో ఉన్న ఈ దర్గా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందింది. కులమతాలకతీతంగా భక్తులు ఇక్కడకు విచ్చేసి తమ ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయనాయకులు సైతం కోరిన కోరికలు తీర్చే దైవంగా భావిస్తుంటారు.

పాలమూరు మహనీయులు

[మార్చు]
  • బూర్గుల రామకృష్ణా రావు హైదరాబాదు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పోరాటయోధులలో ముఖ్యుడు. 1915 నుంచే ఈయన పోరాటం ప్రారంభమైంది.పలుమార్లు జైలుకు వెళ్ళినాడు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గేయాలు, రచనలు చేసి ప్రజలలో ఉత్తేజం కలిగించాడు. ఈయన స్వస్థలం షాద్‌నగర్ మండంలోని బూర్గుల గ్రామం. ఇంటిపేరు పుల్లంరాజు అయిననూ ఊరిపేరే ఇంటిపేరుగా మారిపోయింది. 1952లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ అవరతణకు వీలుగా ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు. ఆ తర్వాత కేరళ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశాడు.
  • సురవరం ప్రతాపరెడ్డి : న్యాయవాది, పత్రికా సంపాదకుడు, గ్రంథాలయోద్యమనేత, రాజకీయ నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సురవరం ప్రతాపరెడ్డి పాలమూరు జిల్లా మనోపాడ్ మండలంలోని ఇటిక్యాలపాడు గ్రామంలో 1896, మే 28న జన్మించాడు. 1926లో గోల్కొండ పత్రికను స్థాపించి నిజాం ప్రభుత్వపు లోపాలను ఎండగట్టాడు. మెదక్ జిల్లా లోని జొగిపేటలో జరిగిన నిజామ్ ఆంధ్ర మహాసబ ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహిన్చారు1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1952లో జరిగిన తొలి ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వనపర్తి నుంచి ఎన్నికయ్యాడు. 1953 ఆగష్టు 25న ఆయన మరణించాడు.
  • రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి : స్వాతంత్ర్య సమరయోధుడైన రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు. నిజాంకు కొత్వాల్‌గా పనిచేసిన అనుభవం ఉంది. తరువాత గోల్కొండ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. హైదరాబాదు . ప్రజాచైతన్యం కల్గించడానికి అనేక విద్యాసంస్థలను స్థాపించాడు.
  • వందేమాతరం రామచంద్రారావు : పాలమూరు జిల్లానుంచి స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్న ముఖ్య నేతలలో వందేమాతరం రామచంద్రారావు ఒకడు. ఇతని అసలు పేరు రామచంద్రయ్య. తొలుత గద్వాల సంస్థానంలో సబ్‌ఇన్స్‌పెక్టర్ ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హిందూమహాసభలో చేరినాడు. పలుసార్లు జైలుశిక్ష అనిభవించాడు. విచారణ సమయంలో ఊరు, తండ్రిపేరు అడగగా అన్నింటికీ వందేమాతరం అనే సమాధానం ఇచ్చాడు. అందుచే జైలునుంచి విడుదల అనంతరం అందరూ వందేమాతరం రామచంద్రారావు అని పిల్వడం ప్రారంభించారు.
  • బి.సత్యనారాయణరెడ్డి : 1927లో మహబూబ్‌నగర్ జిల్లా అన్నారంలో జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1990లో ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, ఆ తర్వాత ఒడిషా గవర్నరుగా పనిచేశాడు. ఇదే కాలంలో బీహార్, పశ్చిమ బెంగాల్ ఇంచార్జి గవర్నరుగా కూడా విధులు చేపట్టాడు. 2012 అక్టోబరు 6న మరణించాడు
  • హాస్టల్ రామారావు : స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని పాత్ర వహించిన పాలమూరు వ్యక్తి హాస్టల్ రామారావు అసలు పేరు సంతపూర్ రామారావు. కొల్లాపూర్ మండలం అతని స్వస్థలం. స్వతంత్ర భారతదేశంలో కలిసేందుకు హైదరాబాదు సంస్థానం నిరాకరించడంతో నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి1947లో అరెస్టు వారెంట్‌కు గురై రెండేళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళినాడు. స్వాతంత్ర్యం తరువాత నాగర్ కర్నూల్లో హరిజనుల కోసం హాస్టల్ ప్రారంభించి హరిజనోద్ధరణకు పాటుపడినందులకు అతని పేరు హాస్టల్ రామారావుగా స్థిరపడింది.
  • గడియారం రామకృష్ణ శర్మ : పాలమూరు జిల్లాకు చెందిన రచయితలలో గడియారం రామకృష్ణ శర్మ ఒకరు. ఆయన రచించిన శతపత్రం పుస్తక రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది [19]. ఇతడు 1919లో అనంతపురం జిల్లాలో జన్మించి పాలమూరు జిల్లాలోని ఆలంపూర్లో స్థిరపడ్డాడు. 2006 జూలైలో మరణించాడు. అతడు రచించిన పుస్తకాలలో మాధవిద్యారణ్య చరిత్ర ఒకటి.
  • రాజగిరి పరశురాములు : ఇతను సామాజిక కార్యకర్త. సర్వోదయం ఉద్యమంలో జాతీయ స్థాయిలో పనిచేసారు. అమ్రాబాద్ మండలం వంకేశ్వరంలో 1929లో జన్మించిన పరశురాములు భూదానోద్యమ రూపశిల్పి అయిన వినోభాబావే ప్రియశిష్యుడిగా చాలాకాలం పనిచేసారు.
  • రాజా రామేశ్వర్ రావు 1 : సంస్థానాధీశుడు, పరిపాలనదక్షుడు, సంస్కర్త. 19వ శతాబ్ది తొలిసంవత్సరాలలో వనపర్తి సంస్థానాధీశునిగా పరిపాలన ప్రారంభించిన రామేశ్వర్ రావు మరణించేంతవరకూ దాదాపుగా 43 సంవత్సరాల పాటు పరిపాలించారు. చుట్టుపక్కల బ్రిటీష్ ఇండియాలో జరుగుతున్న మార్పులను అనుసరించి వనపర్తి సంస్థానంలో వివిధ సంస్కరణలు, నూతన రాజ్యపాలన విధానాలు చేపట్టారు. సైన్యబలం వల్ల ఆయన సంస్థానంలో స్వతంత్రమైన పాలన చేపట్టేవారు.[20] హైదరాబాదీ బెటాలియన్‌ 1853 నవంబర్ 5 న సృష్టించారు. 1866లో ఆయన మరణము తర్వాత, ఈ బెటాలియన్‌ నిజాం సైన్యములో కలపబడి ఆ సైన్యానికి కేంద్రబిందువు అయ్యింది[21].

రాష్ట్రంలోనే తొలి పంచాయతీ సమితి

[మార్చు]

స్థానిక సంస్థల చరిత్రలో రాష్ట్రంలో జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం మూడంచెల పంచాయతీ వ్యవస్థ అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ లో ప్రారంభించారు. 1959, అక్టోబర్ 14న అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడి సమితికి ప్రారంభోత్సవం చేసాడు. ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి. (మొదటి సమితిని రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు). నెహ్రూ ప్రారంభించిన పంచాయతీ సమితి భవనం నేడు మండల పరిషత్తు కార్యాలయంగా సేవలందిస్తోంది.

విద్యారంగం

[మార్చు]
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల

మహబూబ్ నగర్ జిల్లాలో 1875 లోనే మొగిలిగిద్ద గ్రామంలో ప్రభుత్వ పాఠశాల స్థాపించబడింది. జిల్లాలో 1955-56 నాటికి 1160 ప్రాథమిక పాఠశాలలు, 20 ప్రాథమికోన్నత పాఠశాలలు, 5 ఉన్నత పాఠశాలలు ఉండగా, 2006-07 నాటికి ఈ సంఖ్య పెరిగి 2860 ప్రాథమిక, 987 ప్రాథమికోన్నత, 729 ఉన్నత పాఠశాలలు, 82 జూనియర్ కళాశాలకు చేరింది.[22] 2008-09 నాటికి ఈ సంఖ్య 3094 ప్రాథమిక, 890 ప్రాథమికోన్నత, 926 ఉన్నత పాఠశాలలు, 147 జూనియర్ కళాశాలకు చేరింది. ఇవే కాకుండా 45 డీగ్రీ కళాశాలలు, 9 పీజీ కళాశాలలు, 39 బీఎడ్ కళాశాలలు, 7 డైట్ కళాశాలలు, 19 ఐటీఐలు, 3 పాలిటెక్నిక్ కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు, 6 ఫార్మసీ కళాశాలలు, 3 ఎంబీఏ కళాశాలలు, 3 ఎంసీఏ కళాశాలలు, ఒక మెడికల్ కళాశాల, ఒక వ్యవసాయ కళాశాల ఉన్నాయి. 2008 లో పాలమూరు విశ్వవిద్యాలయం స్థాపించబడింది.పాలమూరు విశ్వవిద్యాలయం దేశంలోనే 'లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్'అనే అంశంలో గిన్నిస్ రికార్డు సాధించిన తొలి విశ్వవిద్యాలయంగా వాసికెక్కింది. జాతీయసేవాపథకం విభాగంలో ఈ రికార్డు ఆంగ్ల భాషలో గిన్నిస్ రికార్డు గ్రహీత అయిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఆధ్వర్యంలో 2010 నవంబర్ 12 న 2,500 మంది పాల్గొని నిర్వహించారు.ఈ రికార్డు సాధించడం ద్వారా రాష్ట్రానికి చెందిన ప్రశంస బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పాలమూరు విశ్వవిద్యాలయాన్ని 'మహా మహా'అనే బిరుదునిచ్చి గౌరవించారు.

సాహిత్యం

[మార్చు]

సంస్థానాల కాలంలోనే పాలమూరు జిల్లా సాహిత్యంలో పేరొందింది. గద్వాల సంస్థానాధీశులు ఎందరో సాహితీవేత్తలను పోషించుకున్నారు. స్వయంగా గద్వాల పాలకులు సాహిత్యం కూడా రచించారు. సంస్థానాధీశుల కాలంలో విద్వత్ గద్వాలగా పేరుగాంచింది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల పేరుతో గ్రంథాన్ని వెలువరించాడు. ఆలంపూర్ ప్రాంతానికి చెందిన గడియారం రామకృష్ణశర్మ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినాడు. తెలుగులో తొలి రామాయణం "రంగనాథ రామాయణం" రచించినది జిల్లాకు చెందిన గోనబుద్ధారెడ్డి.[23] హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కూడా అనేక కావ్యాలు, అనువాదాలు, కవితలు రచించారు.[24] గడియారం రామకృష్ణ శర్మ, కపిలవాయి లింగమూర్తి లాంటి సాహితీమూర్తులు పాలమూరు జిల్లాకు చెందినవారు. 2000 అక్టోబర్ 16 లో సీనియర్ జర్నలిస్ట్ కొటకొండ యెడ్ల విజయరాజు అధ్వర్యంలో నారాయణపేటలో వార్తాతరంగాలు తెలుగు పత్రిక ప్రారంబించడం జరిగింది.అప్పటి మంత్రి యెల్కొటి యల్లారెడ్ది, మాజీ యెమ్మెల్యే చిట్టం నర్సిరెడ్డి,కొడంగల్ యెమ్మెల్యే సుర్యనారాయణ,బిజెపి నాయకుడు నాగురవు నామజి,అప్పటి మునిసిపల్ చైర్మన్ గడ్డం సాయిబన్న తదితరులు పాల్గొన్నారు.2004 జనవరి 14 లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా వార్తాతరంగాలు పత్రికను దిన పత్రికగా మార్చడం జరిగింది.ప్రస్తుతం రాష్ట్ర రాజధాని నుండి కూడా పత్రిక ప్రింట్ అవుతుంది.మనకాలపు మహానీయుడు ప్రజాకవి గోరటి వేంకన్న పాలమూరు బిడ్డే అన్న సంగతి మరువొద్దు.

వర్షపాతం, వాతావరణం

[మార్చు]

మహబూబ్ నగర్ జిల్లాలో వర్షపాతం తక్కువ. జిల్లా మొత్తంపై సగటు వార్షిక వర్షపాతం 60.44 సెంటీమీటర్లు. అందులో అధికభాగం నైరుతి రుతుపవనాల వల్ల జూన్, జూలై, ఆగస్టు నెలలలో కురుస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు వాయుగుండం ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదౌతుంది. జిల్లాలో సగటు వర్షపాతంలో ప్రాంతాల మధ్య తేడాలున్నాయి. దక్షిణవైపున తుంగభద్ర, కృష్ణానది తీరగ్రామాలు భారీ వర్షాల సమయంలో నీటమునిగితే, జిల్లా వాయవ్య ప్రాంతమైన నారాయణ పేట డివిజన్‌లో కరువు తాండవిస్తుంది.

జిల్లాలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. సముద్రతీరం చాలా దూరంలో ఉండుటవల్లనూ, సమీపంలో పెద్ద చెరువులు లేకపోవడం వల్లనూ, చుట్టూ కొండలు చుట్టబడి ఉండుటచే చల్లని గాలులకు అవకాశం తక్కువగా ఉంది. ఈ వాతావరణం ప్రత్తి వంటి పంటలకు చాలా అనువైనందున జిల్లాలో ప్రత్తి విస్తారంగా సాగుచేయబడుతున్నది. వేసవి కాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటుంది. శీతాకాలంలో నవంబర్, డిసెంబర్ మాసాలలో 15-18 డిగ్రీలకు చేరుకుంటుంది. మిగితా జిల్లాలతో పోలిస్తే శీతాకాలంలో చలి తక్కువగా ఉన్ననూ, వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి.

శీతోష్ణస్థితి డేటా - మహబూబ్‌నగర్
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 32.2
(90.0)
33.0
(91.4)
35.5
(95.9)
38.2
(100.8)
40.0
(104.0)
34.3
(93.7)
32.6
(90.7)
29.7
(85.5)
30.5
(86.9)
33.0
(91.4)
33.0
(91.4)
32.6
(90.7)
40.0
(104.0)
సగటు అల్ప °C (°F) 16.5
(61.7)
19.9
(67.8)
21.2
(70.2)
23.7
(74.7)
27.0
(80.6)
24.6
(76.3)
23.9
(75.0)
22.6
(72.7)
22.0
(71.6)
19.8
(67.6)
18.5
(65.3)
16.7
(62.1)
16.5
(61.7)
Source: [25]

అడవులు

[మార్చు]

జిల్లా మొత్తం విస్తీర్ణంలో దాదాపు 10.5% అడవులు ఉన్నాయి. దట్టమైన అడవులు 329 చ.కి.మీ.లతో కలిపి మొత్తం 1944 చ.కిమీ.ల అడవులున్నాయి. ఈ అడవులలో అధిక భాగం జిల్లా ఆగ్నేయాన ఉన్న శ్రీశైలం అడవీప్రాంతంలో ఉంది. జిల్లాలో కల దట్టమైన అరణ్యం కూడా ఇదే ప్రాంతంలో ఉంది. శ్రీశైలం సమీపంలో కర్నూలు జిల్లా సరిహద్దులో ఉన్న అమ్రాబాదు మండలంలో అధికశాతం అడవులున్నాయి. ఈ ప్రాంతంలోని అడవులలో పులులు, ఇతర వన్యప్రాణి జంతువులు సంచరిస్తుంటాయి. ఇది 5 జిల్లాలలో విస్తరించియున్న రాష్ట్రంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగము. జిల్లాలోని అడవులను రెండు డివిజన్ల క్రింద విభజించారు. అచ్చంపేట డివిజన్‌లో 209 హెక్టార్లు ఉండగా మహబూబ్‌నగర్ డివిజన్‌లో కొంత భాగం అడవులున్నాయి.

నీటిపారుదల సౌకర్యం

[మార్చు]

దేశంలోనే మూడవ పెద్దనది కృష్ణానది, దాని ప్రధాన ఉపనది తుంగభద్ర, చిన్న వాగులపై జిల్లాలో జూరాలా ప్రాజెక్టు, ఆర్డీఎస్, కోయిలకొండ ప్రాజెక్టు, సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించగా, సరళా సాగర్ ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, బీమా లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ తదితర ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉన్నాయి. పెద్దతరహా, మధ్యతరహా ప్రాజెక్టులు కలిపి జిల్లాలో 215000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇవి కాకుండా కాలువలు, చెరువులు, బోరుబావులు, ఊటబావులు తదితరాల ద్వారా మరో 212000 ఎకరాల భూమి సాగవుతుంది. పంటల వారీగా చూస్తే అత్యధికంగా వరి 145000 ఎకరాలు, వేరుశనగ 71000 నీటిపారుదల సాగు క్రింద ఉంది.

ఖనిజ వనరులు

[మార్చు]

పాలమూరు జిల్లాలో క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, గ్రానైట్ రాయి విరివిగా లభిస్తుంది. కోడంగల్ ప్రాంతంలో నాపరాయి, సున్నపురాయి లభ్యమౌతుంది. గట్టు ప్రాంతంలో బంగారం నిక్షేపాలున్నట్లు ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. ఇక్కడ ఇంకనూ పరిశోధనలు జరుగుతున్నాయి.

పరిశ్రమలు

[మార్చు]

రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న కొత్తూరు మండలంలో జిల్లాలోనే అత్యధిక పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. రసాయన, ఇంజనీరింగ్, ఫార్మా, డ్రగ్స్ తదితర 137 పరిశ్రమలతో కొత్తూరు మండలం ప్రథమస్థానంలో ఉంది. మహబూబ్‌నగర్ మండలంలో 92, షాద్‌నగర్ మండలంలో 69, జడ్చర్ల మండలంలో 67 పరిశ్రమలున్నాయి. రాష్ట్రంలోనే తొలి సెజ్ జడ్చర్ల సమీపంలోని పోలెపల్లిలో ప్రారంభమైంది. జాతీయ రహదారిపై ఉన్న కొత్తూరు, షాద్‌నగర్, బాలానగర్ మండలాలలో పరిశ్రమలు అధికంగా ఉండగా. నారాయణపేట డివినల్‌లో తక్కువగా ఉన్నాయి.

క్రీడలు

[మార్చు]

జిల్లాలో ప్రజాదరణ కలిగిన క్రీడ క్రికెట్. ఇది కాకుండా వాలీబాల్, బ్యాడ్మింటన్ ఎక్కువగా ఆడుతారు. హైదరాబాదు రంజీ జట్టులో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. మహబూబ్ నగర్ పట్టణంలో క్రీడా స్టేడియం ఉంది. ఇక్కడ జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయికి చెందిన వివిధ పోటీలు జరుగుతాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని స్పోర్ట్స్ పాఠశాల నుంచి పలువులు విద్యార్థులు జాతీయస్థాయిలో పతకాలు సాధించారు.

జిల్లాలో ఇటీవలి ముఖ్య పరిణామాలు

[మార్చు]
  • 2016 జూలై 24: మామిడిపల్లి వద్ద సింబియాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీచే ప్రారంభించబడింది.[26]
  • 2016 ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మంత్రి హరీష్ రావుచే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థపన జరిగింది.[27]
  • 2014 నవంబరు 8: కొత్తూరులో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుచే ఆసరా పథకం ప్రారంభించబడింది.
  • 2014 మే 12: పురపాలక సంఘాల కౌంటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 4, భారతీయ జనతా పార్టీకు 1, తెరాసకు 2 పురపాలక సంఘాలలో మెజారిటి లభించింది. ఒకదానిలో హంగ్ ఏర్పడింది.[28]
  • 2014 ఏప్రిల్ 22:భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి యొక్క భారీ బహిరంగ సభ నిర్వహించబడింది.[29]
  • 2014 మార్చి 30: జిల్లాలో 11 పురపాలక సంఘాలకు గాను ఎనిమిదింటికి ఎన్నికలు జరిగాయి.
  • 2013 డిసెంబరు 14: అయిజ మండలానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు పెద్దసుంకన్న గౌడ్ (97 సం) మరణించాడు.[30]
  • 2013 అక్టోబరు 30: కొత్తకోట మండలం పాలెం వద్ద జాతీయ రహదారిపై బస్సుకు మంటలు చెలరేగి 45 మంది సజీవదహనం అయ్యారు.[31]
  • 2013 అక్టోబరు12: నూతనంగా నిర్మించిన గద్వాల- రాయచూర్ రైలుమార్గం ప్రారంభమైంది.
  • 2013 సెప్టెంబరు 27: మహబూబ్‌నగర్ పట్టణంలో సుష్మా స్వరాజ్ యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" సదస్సు నిర్వహించబడింది.[32]
  • 2013 మార్చి 22: కల్వకుర్తి మేజర్ పంచాయతిని నగరపంచాయతీగా అప్‌గ్రేడ్ చేశారు.[33]
  • 2012 డిసెంబరు 21: కడ్తాల్ (ఆమన‌గల్)లో ప్రపంచ ధ్యానమహాసభలు ప్రారంభమై 10 రోజులపాటు జరిగాయి.
  • 2012 డిసెంబరు 18, 19: జిల్లా కేంద్రంలో తెలుగు మహాసభలు నిర్వహించబడ్డాయి.
  • 2012 అక్టోబరు 7: ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి మరణం.[34]
  • 2012 మే 27: మహబూబ్ నగర్ పురపాలక సంఘంలో పరిసరాలలోని 10 గ్రామపంచాయతీలను విలీనం చేశారు.[35]
  • 2012 మార్చి 31: కంచుపాడు గ్రామానికి చెందిన సురవరం సుధాకరరెడ్డి సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
  • 2012 మార్చి 17: అందుగుల ప్రాంతంలో క్రీ.పూ.1000 కాలం నాటి పురాతన వస్తువులు లభ్యమయ్యాయి.
  • 2012 ఫిబ్రవరి 10: మాడ్గుల ప్రాంతంలో ఇనుపయుగం కాలం నాటి ఆనవాళ్ళు బయటపడ్డాయి.[36]
  • 2012 జనవరి 7: మహబూబ్‌నగర్ పట్టణంలో టివి నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.
  • 2011 అక్టోబరు 30: మహబూబ్ నగర్ శాసన సభ్యులు ఎన్ రాజేష్వర్ రెడ్డి మృతిచెందాడు.
  • 2010 అక్టోబరు 20 : స్వాతంత్ర్య సమరయోధుడు, గద్వాల నియోజకవర్గ శాసనసభ్యుడిగా, గద్వాల పురపాలక సంఘం చైర్మెన్‌గా, గద్వాల మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పనిచేసిన పాగపుల్లారెడ్డి మరణం.[37]
  • 2009 అక్టోబరు 2: తుంగభద్ర నది వరదల వల్ల నదీతీర గ్రామాలు నీటమునిగాయి.[38]
  • 2008 జనవరి, 4 : నారాయణపేట మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ లలితాబాయి నామాజీ మృతి.
  • 2007 డిసెంబర్, 27 : గడియారం రామకృష్ణశర్మ రచించిన శతపత్రం ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది
  • 2007 డిసెంబర్, 2 : ఆమనగల్ మండలాధ్యక్షుడు పంతూనాయక్ హత్య.
  • 2007 జూన్, 24 : భారీ వర్షపాతం వల్ల ఆలంపూర్ జోగుళాంబ దేవాలయం నీట మునిగింది.
  • 2007 జనవరి,19 : కృష్ణానదిలో పుట్టి మునిగి 60 మంది మృతిచెందారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "At A Glance | Mahabubnagar District,Telangana | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-15. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Vehicle Registration Codes For New Districts In Telangana". Sakshipost. Retrieved 16 February 2019.
  3. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ,తొలి ముద్రణ 2006, పేజీ 233
  4. ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ముద్రణ, పేజీ 133
  5. నా దక్షిణ భారత యాత్రా విశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 247
  6. పాలమూరు వైజయంతి, 2013
  7. http://mahabubnagar.nic.in/nic/nic/index.php
  8. Handbook of Statistics, Mahabubnagar Dist-2009, published by CPO Mahabubnagar
  9. 9.0 9.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-23. Retrieved 2009-01-25.
  10. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో మహబూబ్ నగర్ జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-30 at the Wayback Machine. జూలై 26, 2007న సేకరించారు.
  11. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  12. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  13. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  14. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 248, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  15. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 250, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  16. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 241, Revenue (DA-CMRF) Department, Date: 11.01.2016
  17. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 19, Revenue (DA-CMRF) Department, Date: 16.02.2019
  18. శ్రీసాయిధాత్రి పర్యాటకాంధ్ర, దాసరి ధాత్రి రచన, 2009 ముద్రణ, పేజీ 295
  19. http://www.eenadu.net/district/districtshow1.asp?dis=mahaboobnagar#1 Archived 2007-12-31 at the Wayback Machine తీసుకున్న తేది 27.12.2007
  20. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  21. K, Sukhender Reddy; Bh, Sivasankaranarayana. Andhra Pradesh District Gazetteers (12 ed.). p. 40. Retrieved 28 November 2014.
  22. ఈనాడు దినపత్రిక జిల్లా ఎడిషన్ తేది 26.01.2008 పేజీ సంఖ్య 8
  23. పాలమూరు సాహితీ వైభవం, రచన ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2010, పేజీ 8
  24. పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, రచన ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ సెప్టెంబరు 2012, పేజీ 14
  25. Handbook of Statistics, Mahabubnagar District, 2009, Page No 35Published by The Chief Planning Officer, Mahabubnagar DIst
  26. ఈనాడు దినపత్రిక, తేది 25-07-2016
  27. ఈనాడు దినపత్రిక, తేది 30-04-2016
  28. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 13-05-2014
  29. ఈనాడు దినపత్రిక, తేది 23-04-2014
  30. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 15-12-2013
  31. ఈనాడు దినపత్రిక, తేది 31-10-2013
  32. ఈనాడు దినపత్రిక, తేది 22-09-2013
  33. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 118, తేది 22-3-2013
  34. ఈనాడు దినపత్రిక, తేది 07-10-2012
  35. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 215, తేది 29-05-2012
  36. సాక్షి దినపత్రిక, తేది 11-02-2012
  37. ఈనాడు దినపత్రిక, తేది 21.10.2010
  38. ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]