Coordinates: 17°23′01″N 78°29′05″E / 17.3837248°N 78.4847522°E / 17.3837248; 78.4847522

బ్రిటీషు రెసిడెన్సీ, హైదరాబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రిటీషు రెసిడెన్సీ
సాధారణ సమాచారం
రకంఅంబాసిడర్ రెసిడెన్స్
నిర్మాణ శైలిజార్జియన్ పల్లాడియన్
ప్రదేశంకోఠి, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
భౌగోళికాంశాలు17°23′01″N 78°29′05″E / 17.3837248°N 78.4847522°E / 17.3837248; 78.4847522
పూర్తి చేయబడినదిసిర్కా 1798
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిశామ్యూల్ రస్సెల్

బ్రిటీషు రెసిడెన్సీ (హైదరాబాదు రెసిడెన్సీ, కోఠి రెసిడెన్సీ) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కోఠిలో ఉన్న భవనం. 1798లో నిర్మించబడిన ఈ భవనం, ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలగా మార్చబడింది.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

చరిత్ర[మార్చు]

తొలినాళ్ళలో బ్రిటీషు వారు నిజాం ప్రభువులు ఇచ్చిన భవనాల్లో ఉండేవారు. 1798-1805 మధ్యకాలంలో హైదరాబాదులో 5వ బ్రిటీషు రెసిడెంట్ గా ఉన్న జేమ్స్ ఆచిల్లెస్ కిర్క్ పాట్రిక్ తన హోదాకు సరిపడ భవన నిర్మాణంకోసం మూసీ నది సమీపంలో 60 ఎకరాల స్థలం కావాలని నిజాంను కొరాడు. ఆ కోరికను మన్నించి నిజాం ప్రభువు, తన సొంత ఖర్చుతో ఈ భవనాన్ని నిర్మించాడు. బ్రిటీషు రాయల్ ఇంజనీర్ లెఫ్టినెంట్ శామ్యూల్ రసెల్ రూపకల్పనలో 1803లో ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది.[2][3]

నిర్మాణం[మార్చు]

క్లాసికల్ పోర్టికోతో ఉన్న ఈ భవనం జార్జియన్ పల్లాడియన్ విల్లా శైలిలో, యునైటెడ్ స్టేట్స్ లోని వైట్ హౌజ్ ను పోలి ఉంది. రెసిడెన్సీలోని ప్రధాన హాలుకు ముందు సుమారు 60 అడుగుల పొడవు గల 22 పాలరాతి మెట్లు ఉన్నాయి. రెసిడెన్సీ పోర్టికో ముందుభాగంలో సుమారు 50 అడుగుల ఎత్తులో ఎనమిది పిల్లర్లు నిర్మించబడ్డాయి. అలాగే ప్రధాన ద్వారానికి ఇరువైపులా సింహాల విగ్రహాలు, దర్బార్ హాల్లో శిల్పాలు, 60 అడుగుల ఎత్తైన పైకప్పుపై చిత్రించిన తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి.

రెసిడెన్సీ భవనం ప్రక్కన బ్రిటీషు అధికారులకోసం ఆఫీసు గదులు, నివాస గృహాలు ఉన్నాయి. భారత స్వాతంత్ర్యోద్యమములో 1857 తిరుగుబాటు సందర్భంగా ఉద్యమకారులు రెసిడెన్సీపై దాడిచేయడంతో రెసిడెన్సీ చుట్టూ ఎత్తైన రాతిగోడను నిర్మించారు.

ఇతర వివరాలు[మార్చు]

1880లో లాలా దీన్ దయాళ్ తీసిన బ్రిటీషు రెసిడెన్సీ ఛాయాచిత్రం
  1. హైదరాబాద్ విప్లవకారుల్లో ఒకడైన తుర్రేబాజ్ ఖాన్ తన 500మంది రోహిల్లా వీరులతో కలిసి బ్రిటీషు రెసిడెన్సీపై దాడికి దిగగా, భవనంలోని బ్రిటీషు సైనికులు భయంతో తమ భవనం తలుపులు మూసేసుకున్నారు.[4]
  2. ఈ భవనాన్ని భారత పురాతత్వ సర్వే సంస్థ తన ఆధీనంలోకి తీసుకొని సంరక్షిస్తుంది.[5]
  3. 1949లో ఉస్మానియా విశ్వవిద్యాలయము యొక్క కోఠి మహిళా కళాశాలగా మార్చబడింది.

మూలాలు[మార్చు]

  1. Deccan Chronicle (2 మార్చి 2018). "Telangana : Proposal to name Koti varsity 'Khairunnisa'". Mahesh Avadhutha. Retrieved 30 ఏప్రిల్ 2019.
  2. బ్రిటీషు రెసిడెన్సీ, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 49
  3. వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 ఏప్రిల్ 2018. Retrieved 30 ఏప్రిల్ 2018.
  4. నమస్తే తెలంగాణ (6 అక్టోబరు 2015). "1857 తిరుగుబాటు నాయకుడు తుర్రెబాజ్‌ఖాన్". Archived from the original on 30 ఏప్రిల్ 2019. Retrieved 30 ఏప్రిల్ 2019.
  5. The Hindu (31 ఆగస్టు 2006). "Court directive to Archaeological Survey of India". Retrieved 30 ఏప్రిల్ 2019.