భారత పురాతత్వ సర్వేక్షణ

వికీపీడియా నుండి
(భారత పురాతత్వ సర్వే సంస్థ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భారత పురాతత్వ సర్వేక్షణ
సంకేతాక్షరంASI
లక్ష్యంप्रत्नकीर्त्तिमपावृणु
(గత వైభవాన్ని వెలికితీద్దాం)
అవతరణ1861
స్థాపకులుఅలెగ్జాండర్ కన్నింగాం
రకంప్రభుత్వ సంస్థ
కేంద్రస్థానం24-తిలక్ మార్గ్, న్యూఢిల్లీ
సేవలందించే ప్రాంతంభారతదేశం
అధికార భాషఇంగ్లీషు
హిందీ
డైరెక్టర్ జనరల్వి. విద్యావతి, ఐ.ఎ.ఎస్
Parent organisationకేంద్ర సాంస్కృతిక శాఖ
బడ్జెట్1,042.63 crore (US$130 million)[1]
వెబ్‌సైటుhttps://asi.nic.in/

భారత పురాతత్వ సర్వేక్షణ (Archaeological Survey of India) పురాతత్వ పరిశోధనలకై భారత కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. దీన్ని 1861 లో అలెగ్జాండర్ కన్నింగాం అనే ఆంగ్లేయుడు స్థాపించాడు. దీని మొదటి డైరెక్టర్ జనరల్ కూడా ఆయనే. 1958 భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశంలోని అన్ని పురావస్తు కార్యకలాపాలను ఈ సంస్థ నియంత్రిస్తుంది. పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు ఇంకా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అవశేషాల నిర్వహణ కోసం దేశం మొత్తం 37 మండలాలుగా విభజించబడింది.[2]

చరిత్ర[మార్చు]

భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థను ఆంగ్లేయుడైన అలెగ్జాండర్ కన్నింగ్‌హాం 1861లో స్థాపించి దానికి వ్యవస్థాపక డైరెక్టర్ జనరల్ గా పనిచేశాడు. తూర్పు ఆసియా చరిత్ర మీద ఒక క్రమపద్ధతిలో పరిశోధనలు మొదలుపెట్టింది ఏషియాటిక్ సొసైటీ అనే సంస్థ. దీన్ని బ్రిటిష్ ఇండాలజిస్టు అయిన విలియం జోన్స్, 1784 జనవరి 15 న స్థాపించాడు. కలకత్తాలో ప్రధాన నగరంగా చేసుకున్న ఈ సంస్థ పురాతన సంస్కృత, పర్షియన్ రచనలను అధ్యయనం చేసి ఏషియాటిక్ రీసెర్చెస్ అనే పేరుతో సంవత్సరానికోసారి జర్నల్ ప్రచురించేది. 1785 లో మొట్టమొదటి సారిగా భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించిన చార్లెస్ విల్కిన్స్ లాంటి చరిత్రకారులు ఇందులో సభ్యులుగా ఉండేవారు. ఈయనకు అప్పటి బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ సహకారం అందించాడు. 1837లో బ్రాహ్మీ లిపిని అర్థం చేసుకోవడం ఈ సొసైటీ సభ్యుడు జేమ్స్ ప్రిన్సెప్ చేపట్టిన ముఖ్యమైన పనుల్లో ఒకటి.

బ్రాహ్మీ లిపిని అర్థం చేసుకున్న ఉత్సాహంలో ప్రిన్సెప్ సహాయకుడైన అలెగ్జాండర్ కన్నింగ్‌హాం సుమారు యాభై సంవత్సరాల పాటు భారతదేశం నలుమూలలా ఉన్న బౌద్ధ స్మారక చిహ్నాలను నిశితంగా సర్వే చేశాడు. మొదట్లో ఈ తవ్వకాలకు తన సొంత ధనమే వాడినా తర్వాత పెద్ద స్థాయిలో జరుగుతున్న తవ్వకాలను పర్యవేక్షించడానికి, బయట పడిన స్మారకాలను భద్రపరచడానికి, పరిశోధనలు చేయడానికి ఒక ప్రత్యేక సంస్థ ఉంటే బాగుంటుందని ఆయనకు తోచింది. ఆంగ్ల ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి పురాతత్వ సర్వేక్షణ సంస్థ కోసం ప్రతిపాదనలు పంపాడు. 1848లో ఈ ప్రతిపాదన పని చేయలేదు కానీ ఈ కృషి ఫలితంగానే లార్డ్ కేనింగ్ చట్టం చేయడంతో 1861 లో సంస్థకు బీజం పడింది. కన్నింగ్‌హాం నే ఈ సంస్థకు మొదటి సర్వే అధికారిగా నియమించారు. 1865-1871 మధ్యలో నిధులు లేక తవ్వకాలు ఆగిపోయాయి కానీ తర్వాత అప్పటి వైస్రాయి లార్డ్ లారెన్స్ చొరవతో మళ్ళీ నిధులు సమకూరాయి. 1871 లో దీన్ని ప్రత్యేక విభాగంగా గుర్తించి కన్నింగ్‌హాం ని మొదటి డైరెక్టర్ జనరల్ గా నియమించారు.

భారత పురాతత్వ సర్వే సంస్థ సర్కిల్‌లు[మార్చు]

  1. ఆగ్రా
  2. ఐజ్వాల్
  3. అమరావతి
  4. ఔరంగాబాద్
  5. బెంగళూరు
  6. భోపాల్
  7. భువనేశ్వర్
  8. చండీగఢ్
  9. చెన్నై
  10. డెహ్రాడూన్
  11. ఢిల్లీ
  12. ధార్వాడ్
  13. గోవా
  14. గౌహతి
  15. హంపి
  16. హైదరాబాద్
  17. జబల్పూర్
  18. జైపూర్
  19. ఝాన్సీ
  20. జోధ్‌పూర్
  21. కోల్‌కతా
  22. లక్నో
  23. ముంబై
  24. మీరట్
  25. నాగ్‌పూర్
  26. పాట్నా
  27. రాయ్‌పూర్
  28. రాయ్‌గంజ్
  29. రాజ్‌కోట్
  30. రాంచీ
  31. సారనాథ్
  32. సిమ్లా
  33. శ్రీనగర్
  34. తిరుచిరాపల్లి
  35. త్రిసూర్
  36. వడోదర
  37. లేహ్, లద్దాఖ్ (మినీ సర్కిల్ )

జాతీయ స్మారక కట్టడాలు[మార్చు]

భారత పురాతత్వ సర్వే సంస్థ వెబ్‌సైట్ ద్వారా అధికారికంగా గుర్తించబడిన స్మారక కట్టడాలను జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడాలు అంటారు.

మూలాలు[మార్చు]

  1. "Union Budget 2021: Culture Ministry budget cut by nearly 15%". Retrieved 25 April 2021.
  2. "ABOUT US « Archaeological Survey of India". asi.nic.in. Retrieved 2022-04-14.