తుర్రేబాజ్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టర్ బెజ్ ఖాన్
జననం
బేగం బజార్, హైదరాబాదు రాష్ట్రం, భారతదేశ కంపెనీ పరిపాలన
(ప్రస్తుతం హైదరాబాదు, భారతదేశం)
మరణం1859, జనవరి 24
హైదరాబాదు, హైదరాబాదు రాష్ట్రం, భారతదేశ కంపెనీ పరిపాలన
(ప్రస్తుతం హైదరాబాదు, భారతదేశం)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హైదరాబాదులో 1857 తిరుగుబాటు కు నాయకత్వం వహించాడు

పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ (- 1859) - బ్రిటీషు రెసిడెన్సీ పై దాడిచేసిన పోరుబిడ్డల నేత.

ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ జ్వాలలు ఉత్తర భారతదేశంలో రగిలినప్పటికీ, అవి అక్కడికే పరిమితం కాలేదు. బానిస బంధనాల నుండి మాతృభూమిని విముక్తం చేయాలని ప్రజానీకంలో పెల్లుబికిన బలమైన కాంక్షకు జాతి, మతం, కులం, భాషలు, ఆచార సంప్రదాయాలు, ప్రాంతాలు అడ్డుగోడలు కాలేకపోయాయి. ఆయా ప్రాంతాలలోని బ్రిటీషర్ల తొత్తులైన రాజులు, నవాబులు, సంస్దానాధీశులు కూడా తిరుగుబాటును నిలువరించలేక పోయారు. ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిన తిరుగుబాటును ఆపడం ఎవరి తరం కాలేదు. చివరకు ఉరి కొయ్యలు, చెరసాలలు కూడా స్వేచ్ఛాపిపాసువులను ఆపలేక పోయాయి. ఆధునిక ఆయుధాలు కలిగి, అపారమైన సైనిక బలగాలున్న బ్రిటీష్‌ పాలకులను ఎదుర్కోవడం ఆత్మహత్యాసదృశ్యం కాగలదని స్పష్టంగా తెలుసు. పోరుబాటలో మరణం తధ్యమన్న చేదు నిజం తెలిసి కూడా పరాయిపాలకులను తరిమి కొట్టేందుకు నడుం కట్టారు. ఆయుధం చేతపట్టి కదన రంగాన అరివీర భయంకరులై పోరాడి అమరులయ్యారు. ఆ కోవకు చెందిన యోధులలో పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ ఒకరు.

పోరాటాలు[మార్చు]

పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ పరాక్రమాలకు పెట్టింది పేరైన రొహిల్లా సైనిక పటాలానికి చెందిన నాయకుడు. ప్రఖ్యాతి చెందిన అరబ్బులు, రొహిల్లాలు గల సైనిక దళానికి నాయకత్వం వహించిన తుర్రేబాజ్‌ ఖాన్‌, హైదరాబాద్‌ నివాసి పఠాన్‌ రుస్తుం ఖాన్‌ కుమారుడు. అతను బ్రిటిషు సైన్యంలో చేరి ఔరంగాబాదు బ్రిటీష్‌ కంటోన్మెంటులో జమేదారుగా పనిచేశారు.

భారత దేశమంతటా తిరుగుబాటు బావుటాలు ఆకాశవీధుల్లో రెపరెలాడుతున్న రోజులవి. ఆ రోజుల్లో ధార్మిక పెద్దలు కూడా బ్రిటిషు పాలకుల నుండి మాతృగడ్డను విముక్తి చేయమని యవతీ యువకులను, భారతీయ సైనికులను, స్వదేశీ పాలకులను ప్రోత్సహిస్తున్న వాతావరణం. ఆ సమయంలో బానిసత్వం నుండి విముక్తికై పోరాడమని మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌కు ఉద్బోధించారు. ఆ ధార్మిక పెద్దల ప్రభావంతో ఫిరంగీలను హతమార్చమంటూ, హైదరాబాద్‌ నగరంలోని గోడల మీద ప్రకటనలు వెలువడ్డాయి.

ఆ వాతావరణానికి ప్రభావితులైన కొందరు నైజాం సంస్థానం పరగణాలోని బ్రిటీషు అధికారులను కాల్చివేశారు. ఈ విషయమై మాట్లాడేందుకు నిజాం అనుమతి కోరిన రొహిల్లాలను అతను బ్రిటీష్‌ అధికారులకు అప్పగించాడు. ఈ చర్యకు ఆగ్రహించిన మౌల్వీలు ధర్యపోరాటానికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపును అందుకున్న పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ మౌల్వీ అల్లావుద్ధీన్‌ సహకారంతో బ్రిటీష్ ఆధిపత్యానికి నిలయమైన హైదరాబాద్‌ రెసిడెన్సీ విూద ఐదువందల మంది సాహసికులతో 1857 జూలై 17న దాడి చేశారు. ఈ దాడిలో పలువురు సహచరులను కోల్పోయిన ఖాన్‌, బ్రిటీష్‌-నిజాం బలగాలకు 1857 జూలై 22న పట్టుబడ్డాడు. తిరుగుబాటుకు నాయకత్వం వహించి ప్రజలను రెచ్చగొడుతున్నాడన్న నేరారోపణ విూద అతనుకు ద్వీపాంతరవాస శిక్షను విధించి, అతను యావదాస్తిని బ్రిటీష్‌ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. తుర్రేబాజ్‌ ఖాన్‌ను బందిఖానాలో నిర్బంధించారు.

తుర్రేబాజ్ తల ఖరీదు[మార్చు]

బ్రిటీష్‌ పాలకులు విధించిన ఆ శిక్ష అమలు జరిగేలోగా సాహసవంతుడైన ఖాన్‌ తనకు కాపలాగా పెట్టిన సెంట్రీలలో కూడా మాతృభూమి పట్ల గౌరవాభిమానాలను ప్రోదిచేసి 1859 జనవరి 18న జైలు నుండి తప్పించుకున్నారు. అతను తప్పించుకునే సరికి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా ఖ్యాతిగాంచిన తిరుగుబాట్లను బ్రిటీష్‌ పాలకులు అణచివేశారు. అయినప్పటికి తిరుగుబాటు నాటి స్ఫూర్తిని గుండెల నిండా నింపుకుని ఖాన్‌ పోరు కొన సాగించేందుకు ఆయత్తమయ్యారు. అది పసికట్టిన నిజాం ప్రభుత్వం తుర్రేబాజ్‌ ఖాన్‌ను సజీవంగా గాని నిర్జీవంగా గాని పట్టితెచ్చిన వారికి, 1859 జనవరి 19న అయిదు వేల రూపాయల నజరానాను ప్రకటించింది. ( 'A reward of Rs.5000/- was proclaimed by the Nizam's Government on 19-1-1859 for his arrest ' - Who's who of Freedom Struggle In Andhra Pradesh, Vol.1, Ed., by Dr.Sarojini Regani, AP Govt. Publications 1978, P. 535).

ఆనాటి కాలంలో ఐదు వేల రూపాయలు చాలా విలువైన నగదు నజరానా. అంతటి నజరానాను తుర్రేబాజ్‌ ఖాన్‌ తలకు ఖరీదు కట్టారంటే, పాలకులకు అతను ఎంతగా సింహస్వప్నం అయ్యాడో ఊహించవచ్చు.

ఈ ప్రకటనతో అప్రమత్తుడై రహస్యంగా తిరుగుతూ, బ్రిటీష్‌ సేనలపై తిరిగి దాడులకు తుర్రేబాజ్‌ ఖాన్‌ శతవిధాల ప్రయత్నాలు చేయసాగారు. ఖైదు నుండి తప్పించుకున్న ఖాన్‌ను ఎలాగైనా పట్టుకుని అంతం చేయాలన్న పట్టుదలతో బ్రిటీషు సైన్యాలు-నిజాం సేనలు నిఘాను తీవ్రతరం చేశాయి.

కుర్బాన్ అలీ నమ్మక ద్రోహం[మార్చు]

చివరకు నిజాం నవాబు ప్రకటిం చిన నగదు బహుమతికి ఆశపడిన కుర్‌బాన్‌ అలీ అను నమ్మకద్రోహి తుర్రేబాజ్‌ ఖాన్‌ ఆచూకిని నిజాం సైనికులకు చేరవేశాడు. ఆ సమాచారంతో తుర్రేబాజ్‌ ఖాన్‌ మీద నిఘాను పెంచిన బ్రిటీష్‌ బలగాలకు 1859 జనవరి 24న మెదక్‌ జిల్లా పరిసర ప్రాంతాలలోని తూఫ్రాన్‌ గ్రామం వద్ద అతను ఉన్నాడని ఉప్పు అందింది. ఆ సమాచారంతో ఆఘ మేఘాల మీద తుఫ్రాన్‌ చేరుకున్న సైనికులు గ్రామం మీద విరుచుకు పడ్డారు.

తుర్రేబాజ్ ఎదురుపోరాటం - వీరస్వర్గం[మార్చు]

బ్రిటీష్‌ సైన్యాలు, నిజాం బలగాలు తుర్రేబాజ్‌ ఖాన్‌ ఉంటున్న ప్రాంతాన్ని చుట్టు ముట్టాయి. గతంలో చిట్టెలుకలా సైనిక బలగాల కళ్ళల్లో మన్నుకొట్టి తప్పించుకున్న అతనుకు ఈసారి అది సాధ్యం కాలేదు. విజయమో-వీరస్వర్గమో తేల్చు కోవాల్సిన పరిస్థితి. చీమలదండులా వచ్చిపడిన శతృ సైనికులను ఒంటరిగా నిలువరించడం తుర్రేబాజ్‌ ఖాన్‌కు అసాధ్యమైంది. చివరకు బ్రిటీష్‌ సైనికులు అతనును చుట్టుముట్టి నిరాయుధుడ్ని చేశాయి. శత్రువు కళ్ళుగప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాలేదు. ఆ ప్రయత్నంలో జరిగిన పెనుగులాటలో పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ను జనవరి 24న శత్రుసైనికులు కాల్చి చంపారు. (Apprehended by British a week later and shot dead while he was resissting capture. - Who's who of Indian Martyrs Vol. 3, Edited by P.N Chopra, page 148 )..

స్వదేశీ పాలకుల మీద ఆంగ్లేయుల పెత్తనానికి చరమగీతం పాడాలన్న లక్ష్యంతో ఆంగ్ల-నైజాం సైనిక బలగాల మీద అవిశ్రాంత పోరాటాన్ని సాగించిన తుర్రేబాజ్‌ ఖాన్‌ మృతదేహాన్ని తూఫ్రాన్‌ నుండి హైదరాబాదుకు తరలించారు. ఆ తరువాత తుర్రేబాజ్‌ ఖాన్‌ భౌతికకాయాన్ని సంకెళ్ళతో కట్టేసి హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం సుల్తాన్‌ బజారు పోలీసు స్టేషను‌ ఉన్న చోట బహిరంగంగా వేలాడదీసారు.[1] ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారెవ్వరూ కూడా భవిష్యత్తులో ఇటువంటి తిరుగుబాటుకు సాహసించ కూడదని పాలకులు కలలగంటూ తమలోని క్రౌర్యాన్ని వెల్లడించుకున్నారు. ( His corpse was hung up by chains in a public place in Hyderabad as a warning against future anti-British rebellions, - ibid page 148 )

ఆంగ్లేయుల కిరాతకం[మార్చు]

బ్రిటీషు సైనికుల గుండెల్లో భయోత్పాతం సృష్టించిన పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ భౌతికకాయం పట్ల కూడా ఆంగ్లేయులు, ఆంగ్లేయుల తొత్తులు కిరాతకంగా, అవమానకరంగా వ్యవహరించారు. ఆనాడు పరాయి పాలకులు కన్న కలలను కల్లలు చేస్తూ, పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ లాంటి స్వాతంత్ర్యసంగ్రామయోధుల వారసత్వాన్ని స్వీకరించిన ప్రజలు, చివరకు ఆంగ్లేయ మూకలను మాతృభూమి నుండి తరిమిగొట్టి అలనాటి త్యాగధనుల ఆకాంక్షలను నిజంచేశారు.

తుర్రేబాజ్ స్మారకం[మార్చు]

ఈ క్రమంలో పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌, మౌల్వీ అల్లావుద్దీన్‌ తదితర యోధుల సాహసోపేత నాయకత్వంలో బ్రిటీషు రెసిడెన్సీ భవంతి విూద జరిగిన దాడి సంఘటనలకు గుర్తుగా, ఆ నాటి వీరయోధుల స్మారకార్థం, హైదరాబాదు నగరం నడి బొడ్డున గల కోటిలోని సిటీ బస్టాండు వద్ద (అది అనాటి రెసిడెన్సీ ప్రాంతం) స్వతంత్ర భారత ప్రభుత్వం 1957లో ఓ స్మారక స్థూపాన్ని నిర్మించింది. గ్రానైట్‌ స్తంభం, దాని నాలుగు దిశలా పహరా కాస్తున్నట్టుగా ఉన్న నాలుగు ఏనుగుల శిలా విగ్రహాలతో చక్కని స్మారక చిహ్నాం ఏర్పాటయ్యింది.[2]

మూలాలు[మార్చు]

  1. Daftuar, Swati (29 July 2016). "The tale of Turram Khan". The Hindu (in Indian English).
  2. "Rising at the Residency". The Hindu (in Indian English). 2007-03-14. ISSN 0971-751X. Retrieved 2016-08-28.

గ్రంథ పట్టిక[మార్చు]

  • Ali, Moulvie Syed Mahdi (1883), Hyderabad Affairs (Volume 3), The Times of India Steam Press, Bombay
  • Article from BHARATHA SWATHANTRODYAMAM ; ANDHRA PRADESH MUSLIMLU - by Syed Naseer Ahamed, Azad house of Publication, 2011.

బయటి లింకులు[మార్చు]