వనపర్తి సంస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వనపర్తి రాజ భవనం
వనపర్తి రాజ భవనం

వనపర్తి సంస్థానం, పూర్వ హైదరాబాదు రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో నైఋతి దిక్కున ఉంది. ఈ సంస్థానంలోని 124 గ్రామాలు మహబూబ్ నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కల్వకుర్తి, అమ్రాబాద్ తాలూకాలలో విస్తరించి ఉన్నాయి. ఈ సంస్థానం 450 చ.కి.మీ.లలో విస్తరించింది. 1901లో సంస్థాన జనాభా 62,197. సంస్థానం రెవెన్యూ 1.5 లక్షలు, అందులో 76,883 రూపాయలు నిజాంకు కప్పంగా కట్టేవారు

చరిత్ర

[మార్చు]

విజయ నగర రాజుల కాలంలో రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన వీర కృష్ణారెడ్డి అను క్షత్రీయుడు పాతపల్లె, సూగూర్ గ్రామాలను కొని అభివృద్ధి చేసి ఈ సంస్థాన స్థాపనకు బీజాలు వేశాడు. వీరి మునిమనుమడు గోపాలరావు. గొప్ప పండితుడు. పాలకుడు. ఎనిమిది భాషలలో విద్వాంసుడు. అందుకే ఇతనిని అష్టభాషి బహిరీ గోపాలరావుగా పిలుస్తారు. ఇతనికి మొదట్లో సంతానం లేకపోవడంచే బంధువుల బిడ్డ వెంకటరెడ్డిని దత్తత తీసుకున్నాడు. తరువాత సంతానం కలిగినా ఈ దత్తపుత్రుడే పాలకుడయ్యాడు. వెంకటరెడ్డి తన దత్తుతల్లి పేర జానంపేట ను, దత్తుతండ్రి పేరిట గోపాలపేటను ఏర్పాటుచేశాడు. మొగలుల రాజ్యాధికారాన్ని ధిక్కరించాడు. తత్ఫలితంగా దక్కను సుబేదారు జానంపేటపై దండెత్తగా వీరోచితంగా తన సేనలతో పోరాడి, చివరకు సైన్యాన్ని కోల్పోయి, దిక్కుతోచని దుస్థితిలో అభిమానవంతుడై తప్పించుకునిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని వీరత్వాన్ని కీర్తిస్తూ ఈ ప్రాంతపు శారదగాండ్రు పాటలు కట్టి ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో పాడుతూనే ఉంటారు. వెంకటరెడ్డి అనంతరం అతని కుమారుడు బహిరీ చిన గోపాలరావు (తాత గారి పేరు) పాలకుడయ్యాడు. ఇతను కుతుబ్ షాహీ రాజులకు సన్నిహితముగా ఉండేవాడు. అసఫ్ జా అర్కాట్ మీదికి యుద్ధానికి వెళ్తూ, తన రాజధాని బాధ్యతలను గోపాలరావుకు అప్పగించాడంటే, వారికి ఇతనెంత విశ్వాసియో అర్థమవుతుంది. ఈ గోపాలరావు 1746 లో మరణించాడు. ఇతని అనంతరం ఇతని కుమారుడు సవై వెంకటరెడ్డి సూగూరు పాలకుడయ్యాడు. ఇతనే రాజధానిని సూగూరు నుండి శ్రీరంగపురం (నేటి శ్రీరంగాపురం) నకు మార్చాడు. ఇతని కాలం నుండి దాదాపు 50 సంవత్సరాల పాటు శ్రీరంగపురం రాజధానిగా భాసిల్లినది[1].. తరువాతి కాలంలో రాజధాని వనపర్తికి మార్చబడింది.తొలిదశలోని వనపర్తి రాజులు 2000 మంది పదాతి దళము, 2000 మంది అశ్విక దళాలు కల సైన్యమును నిర్వహించేవారు. 1727 వరకు సంస్థానానికి సుగూరు రాజధానిగా ఉండేది. దాని పేరు మీదుగా సంస్థానాన్ని సుగూరు సంస్థానము అని పిలిచేవారు. కానీ తర్వాత కాలంలో వనపర్తిని రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. పరిపాలనా సౌలభ్యము కొరకు సంస్థానాన్ని "సుగూరు", "కేశంపేట్‌‌" అను రెండు తాలూకాలుగా విభజించి, ఇద్దరు తహసీల్దారులను నియమించారు.

1823లో రాజా రామకృష్ణరావు తరువాత ఆయన దత్తపుత్రుడు మొదటి రామేశ్వరరావు సంస్థానాధీశుడయ్యాడు. ఆధునిక భావాలున్న రామేశ్వరరావు మంచి పరిపాలనదక్షుడు. తన రాజ్యపు చుట్టుపక్కల అమలులో ఉన్న బ్రిటీషు పాలనా విధానాలను అనుసరించే ప్రయత్నాలు చేశాడు.[2] 1830 కాలంలో కొల్లాపూరు సంస్థానానికి వనపర్తి సంస్థానానికీ తీవ్రమైన ఘర్షణ జరిగిందని యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య పేర్కొన్నారు. ఈ వివాదంలో ఒకరినొకరు సైన్యసహితంగా యుద్ధం చేయడమే కాక ఒకరి గ్రామాలను మరొకరు కొల్లగొట్టి, గ్రామస్తులను హింసించి పాడుచేస్తున్నారని [3].1843 మార్చి 17న నిజాం సికందర్‌ ఝా, రాజా రామేశ్వర రావు I కు గౌరవ చిహ్నంగా "బల్వంత్" అను బిరుదును ప్రధానము చేశారు.

నిజాము తన సైన్యానికి రాజా రామేశ్వర రావును ఇన్స్పెక్టర్‌గా నియమించాడు. రాజా రామేశ్వర రావు I, హైదరాబాదీ బెటాలియన్‌ 1853 నవంబర్ 5 న సృష్టించాడు. 1866లో ఆయన మరణము తర్వాత, ఈ బెటాలియన్‌ నిజాం సైన్యములో కలపబడి ఆ సైన్యానికి కేంద్రబిందువు అయ్యింది. మొదటి రామేశ్వర రావు తర్వాత ఆయన కుమారుడు రాజా కృష్ణ ప్రసాదరావు సంస్థానాధీశుడయ్యాడు.

1910లో రెండవ రాజా రామేశ్వరరావు, అబిస్సీనియులు, సొమాలీలు, ఐరోపా అధికారులతో కూడుకొన్న అశ్విక దళాన్ని నిజామ్‌ VI కి బహుకరించాడు. అదే ఆఫ్రికన్‌ క్యావలరీ గార్డ్స్ లేదా ఏ.సీ.గార్డ్స్ గా ప్రసిద్ధి చెందినది. ఈ ప్రత్యేక దళాన్ని అధికారిక లాంఛనాలలో నిజాం యొక్క భద్రత కొరకు ఉపయోగించేవారు.

"మహారాజ" రెండవ రాజా రామేశ్వరరావు, 1922 నవంబర్ 22 వ తేదీన మరణించాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, కృష్ణదేవరావు, రామదేవరావు. భారత దేశానికి స్వాతంత్ర్యము వచ్చిన తర్వాత ఈ కుటుంబము దేశ రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొన్నది.

వంశక్రమము

[మార్చు]
 • వీర కృష్ణారెడ్డి
 • అష్టభాషి బహిరీ గోపాలరావు (1676-)
 • వెంకటరెడ్డి (1691-)
 • బహిరీ చిన గోపాలరావు ( - 1746)
 • సవై వెంకటరెడ్డి ( 1746 -1763 )
 • రామకృష్ణరావు ( - 1823)
 • మొదటి రామేశ్వరరావు (1823 - 1866)
 • కృష్ణ ప్రసాదరావు (1866 - )
 • రెండవ రామేశ్వరరావు ( - 1922)
 • కృష్ణదేవరావు (1922 - 1944?)
 • మూడవ రామేశ్వరరావు (1923-1998)

విశేషాలు

[మార్చు]

ఈ సంస్థానము నైరుతీ భాగము గుండా కృష్ణా నది 16 మైళ్ల దూరము ప్రవహించేది. కానీ, నదీతలము చాలా అడుగున ఉండటము మూలాన దాని జలాలు వ్యవసాయపారుదల కొరకు ఉపయోగపడటము లేదు. వనపర్తి పట్టణములో ఆ రోజుల్లో ఆముదము తయారుచేయుటకు ఒక నూనె మిల్లు ఉండేది. ఇక్కడి తయారు చేసిన ఆముదము రాయచూరు, మద్రాసు ప్రెసిడెన్సీలోని కర్నూలుకు ఎగుమతి చేసేవారు. నూలు, పట్టు వస్త్రాలు, చీరలు ఇక్కడ నేసేవారు కానీ, వాటి అల్లిక అమరచింత, గద్వాలలో నేసిన వాటంత నాణ్యముగా లేదు.

సాహిత్యం

[మార్చు]

వనపర్తి సంస్థానంలో చాలామంది కవులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించి, సన్మాన సత్కారాలు పొందారు. వారిలో ఒక కవి అక్షింతల సింగర శాస్త్రి. ఇతడు అక్షింతల సుబ్బాశాస్త్రి రెండవ కుమారుడు. ఇతని స్వస్థలం రేపర్ల అనీ, జటప్రోలు వద్ద అయ్యవారిపల్లె అనీ వేరువేరు చోట్ల వ్రాయబడింది. ఇతను వనపర్తి స్థానాధీశుల ఆశ్రయంలో ఉండేవాడు. ఇతని రచనలు - అన్నపూర్ణాష్టకము, భాస్కర ఖండము, ద్వాదశ మంజరి, శ్రీశైల మల్లికార్జున పంచరత్నము మొదలగునవి. ఇతడు తర్క వేదాంత పండితుడు. వెంకటగిరి, గద్వాల, అనంతగిరి, ఆత్మకూరు ఆస్థానాలలో కూడా సన్మానాలు పొందాడు.[4].స్వయంగా పాలకులైన బహిరీ పెద్ద గోపాలరావే గొప్ప విద్వాంసుడు. ' రామచంద్రోదయం ' అను శ్లేషకావ్యాన్ని, 'శృంగార మంజరి' అను భాణాన్ని సంస్కృతంలో రచించాడు. ' చంద్రాంగదోపాఖ్యానం ' రచించిన చింతలపల్లి సంజీవి, ' యాదవ భారతీయం ' రచించిన చెన్న కృష్ణయ్య, ' జగన్నాటకం ' అను యక్షగానాన్ని రచించిన ఏదుట్ల శేషాచలం అను కవులు ఈ ఆస్థానానికి చెందినవారే.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటిరాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-32 & 33
 2. Andhra Pradesh District Gazetteers By Andhra Pradesh (India), K. Sukhender Reddy, Bh Sivasankaranarayana v.12 పేజీ.40 [1]
 3. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
 4. తెలుగు సాహిత్య కోశము. - తెలుగు అకాడమీ, హైదరాబాదు వారి ప్రచురణ http://www.archive.org/details/TeluguSahityaKosham